ఇథియోపియా టిగ్రే సంక్షోభం: సైనిక నిర్బంధం నుంచి బీబీసీ రిపోర్టర్ విడుదల

జిర్మే జేబ్రూ

ఇథియోపియాలోని సంక్షుభిత ప్రాంతం టిగ్రేలో సైనిక నిర్బంధానికి గురైన బీబీసీ రిపోర్టర్ జిర్మే జేబ్రూను విడిచిపెట్టారు.

'బీబీసీ టిగ్రిన్యా' కోసం పనిచేసే జేబ్రూను సోమవారం టిగ్రేలోని మెకిల్ ప్రాంతంలోని ఒక కేఫ్ నుంచి సైన్యం తీసుకెళ్లింది.

బుధవారం ఆయన్ను ఎలాంటి అభియోగాలు లేకుండానే విడిచిపెట్టారు.

జేబ్రూతో పాటు నిర్బంధానికి గురైన స్థానిక జర్నలిస్ట్, మరో ఇద్దరు అనువాదకులను కూడా విడిచిపెట్టారు.

సోమవారం ఏం జరిగింది?

బీబీసీ టిగ్రిన్యాలో పనిచేస్తున్న జిర్మే జేబ్రూతో పాటు మరో నలుగురు వ్యక్తులను ప్రాంతీయ రాజధాని మెకిల్‌లో ఒక కేఫ్ నుంచి పట్టుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

మెకిల్‌లోని ఒక సైనిక శిబిరానికి జిర్మేను తీసుకెళ్లినట్లు చెప్పారు.

ఆయనను నిర్బంధించడంపై తన ఆందోళనను ఇథియోపియా ప్రభుత్వానికి బీబీసీ తెలియజేసింది.

స్థానిక పాత్రికేయుడు టామిరట్ యెమానీ, ఫైనాన్షియల్ టైమ్స్, ఏఎఫ్‌పీ వార్తా సంస్థల కోసం పనిచేస్తున్న అనువాదకులు అలులా అకాలు, ఫిట్సుమ్ బెర్హానీలను కూడా కొద్ది రోజుల కిందట సైన్యం నిర్బంధించింది.

టిగ్రేలోని బాలలు

ఫొటో సోర్స్, Getty Images

ఇథియోపియా ప్రభుత్వం గత నవంబరు నుంచీ టిగ్రేలో తిరుగుబాటు బలగాలతో పోరాడుతోంది. టిగ్రేలో ఘర్షణ మొదలైనప్పటి నుంచీ కొన్ని నెలల పాటు మీడియాను పూర్తిగా దూరం పెట్టిన ప్రభుత్వం.. గత వారంలో కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలకు అనుమతి ఇచ్చింది.

ఈ ఘర్షణను కవర్ చేయటానికి ఏఎఫ్‌పీ, ఫైనాన్షియల్ టైమ్స్ సంస్థలకు అనుమతి మంజూరు చేసింది.

జిర్మేను నిర్బంధించటానికి చేపట్టిన ఆపరేషన్‌ను మిలటరీ యూనిఫాంలో ఉన్న సైనికులు నిర్వహించారని ప్రత్యక్ష సాక్షులు బీబీసీకి తెలిపారు.

‘‘మేం ఇథియోపియా ప్రభుత్వానికి మా ఆందోళన తెలియజేశాం. వారి నుంచి స్పందన కోసం వేచి చూస్తున్నాం’’ అని బీబీసీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

టిగ్రే సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ మీద విజయం సాధించామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. టిగ్రేలో సైన్యానికి, తిరుగుబాటు బలగాలకు మధ్య పోరాటం కొనసాగుతూనే ఉంది.

ఈ ఘర్షణలో ఇప్పటివరకూ వందలాది మంది చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

అన్నిపక్షాల వారూ తీవ్ర అకృత్యాలకు పాల్పడుతున్నారన్న కథనాలు పెరుగుతుండటం, మానవ సంక్షోభం తీవ్రమవుతుండటంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

అంతర్జాతీయ మీడియాను కొందరు తప్పుదోవపట్టిస్తున్నారంటూ.. వారిపై చర్యలు చేపడతామని ఇథియోపియా అధికార పార్టీ ప్రతినిధి ఒకరు ఇటీవల హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)