ఇథియోపియా - ఎరిట్రియాల మధ్య ముగిసిన యుద్ధం.. ఇరవయ్యేళ్ల వివాదానికి తెర

ఫొటో సోర్స్, @Fitsumaregaa
ఇథియోపియా, ఎరిట్రియాల మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం ముగిసింది. సరిహద్దు విషయంలో ఇరవయ్యేళ్లుగా ఉన్న వివాదానికి ముగింపు పలుకుతూ ఇరు దేశాల అధ్యక్షులు అంగీకారానికి వస్తూ ఒక సంయుక్త ఒడంబడికపై సంతకం చేశారు.
రెండు దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాల పునరుద్ధరణకూ అంగీకరించారు.
ఎరిత్రియా అధ్యక్షుడు ఇసాయిస్ అఫెవెర్కి, ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌ల మధ్య ఎరిట్రియా రాజధాని అస్మారాలో ఈ కీలక సమావేశం జరిగింది.
ఈ రెండు దేశాల అధినేతలు భేటీ కావడం గత రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారి.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకీ యుద్ధం
సుదీర్ఘ సంగ్రామం తరువాత ఎరిట్రియా 1993లో ఇథియోపియా నుంచి స్వాతంత్ర్యం పొందింది.
అయితే... ఆ తర్వాత అయిదేళ్లకే రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది. బాద్మి పట్టణం సహా వివిధ సరిహద్దు ప్రాంతాల విషయంలో ఈ వివాదం మొదలైంది.
1998 నుంచి 2000 సంవత్సరం మధ్య రెండేళ్ల పాటు భీకరంగా సాగిన పోరులో వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
సమస్య పరిష్కారం కోసం చర్చలు జరిగి కొన్ని ప్రాంతాలను ఎరిత్రియాకు ఇచ్చేలా 2002లో 'ఎరిట్రియా-ఇథియోపియా బోర్డర్ కమిషన్' ఆదేశాలిచ్చింది. అయితే, ఇథియోపియా దానికి అంగీకరించలేదు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల నుంచి తన బలగాలను ఏమాత్రం ఉపసంహరించలేదు. అప్పటి నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది.
ఈ యుద్ధం కారణంగా ఎరిట్రియా బాగా నష్టపోయింది. చిన్నదేశం కావడంతో నిత్యం సాగుతున్న యుద్ధం కోసం దేశంలో నిర్బంధ సైనిక శిక్షణ అమలు చేసింది. దీంతో అనేకమంది ఎరిట్రియాను విడిచి వెళ్లిపోయారు. వేలాది మంది యుద్ధంలో మృత్యువాతపడ్డారు.

ఫొటో సోర్స్, AFP
ఎలా పరిష్కారమైంది..
ఇథియోపియన్ పీపుల్స్ రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన అబియ్ అహ్మద్ ఈ ఏడాది ఏప్రిల్‌లో అధికారం చేపట్టారు.
అక్కడికి కొద్ది రోజుల్లోనే ఆయన 2002 నాటి 'ఎరిత్రియా-ఇథియోపియా బోర్డర్ కమిషన్' ఆదేశాలను అమలు చేస్తామంటూ ఎరిత్రియాకు ప్రతిపాదించారు. బాద్మి పట్టణాన్ని ఎరిత్రియాకు ఇచ్చేందుకు అంగీకరించారు.
అంతకుముందు కూడా పలువురు అధ్యక్షులు ఆ ఒప్పందాన్ని అంగీకరిస్తామని చెప్పినా అమలు మాత్రం చేయలేదు.
అందుకు భిన్నంగా అబియ్ ఎరిట్రియాతో శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు.
ఈ ప్రకటనకు ముందు ఇథియోపియా జైళ్లలో మగ్గుతున్న వేలాది మంది ఎరిట్రియా రాజకీయ నేతలు, నిరసకారులను, యుద్ధ ఖైదీలను విడుదల చేశారు.
ఆర్థిక సంస్కరణలు ప్రకటించి ఎరిత్రియాకు ఉపశమనం కలిగించారు.
అనంతరం తాజాగా జరిగిన సమావేశంలో రెండు దేశాలు సరిహద్దు సమస్యను పరిష్కరించుకుని యుద్ధానికి ముగింపు పలికాయి.

ఫొటో సోర్స్, fitsum arega/twitter
ఇకపై భాయీభాయీ
* తాజా ఒడంబడికతో రెండు దేశాలూ పరస్పర సహకారంతో సాగనున్నాయి.
* ఆయా దేశాల రాయబార కార్యాలయాలను తిరిగి తెరవనున్నారు.
* సముద్ర తీరం లేని ఇథియోపియా ఇకపై ఎరిట్రియా ఓడరేవులను రవాణా కోసం ఉపయోగించుకోనుంది.
* రెండు దేశాల మధ్య విమాన సేవలు పునరుద్ధరిస్తారు.
* ఇంతవరకు నిలిచిపోయిన టెలిఫోన్ సేవలనూ పునరుద్ధరిస్తారు.

ఫొటో సోర్స్, AFP
ఎప్పుడేం జరిగింది..
1993 మే 24: ఇథియోపియా నుంచి ఎరిట్రియా స్వాతంత్ర్యం పొందింది.
1998 మే 6: సరిహద్దు సమస్య రాజుకుని యుద్ధం ఆరంభమైంది.
2000 డిసెంబరు 12: శాంతి ఒప్పందం
2002 ఏప్రిల్ 13: వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను ఎరిట్రియాకు కేటాయిస్తూ 'ఎరిత్రియా-ఇథియోపియా బోర్డర్ కమిషన్' ఆదేశాలు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: 'ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నా కులంతో పనేంటి?'
- మోదీ బుల్లెట్ ట్రైన్‌పై గుజరాత్ రైతులు ఏమంటున్నారు?
- సోషల్ మీడియా: మీరు లైక్ చేస్తే వాళ్లు లాక్ చేస్తారు.. యూజర్లను వ్యసనపరుల్ని చేస్తున్న కంపెనీలు
- అప్పట్లో ఫుట్‌బాల్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ఫుట్‌బాల్
- మహాభారత యుద్ధానికి ద్రౌపది పట్టుదలే కారణమా?
- సిరియా: ఎనిమిదేళ్ళ యుద్ధం.. ఎడతెగని విషాదం
- ఇరాక్: ఐఎస్‌పై గెలిచాం, యుద్ధం సమాప్తం
- భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
- శ్రీలంకలో భారత్, చైనా వ్యాపార యుద్ధం!
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- శ్రీలంకలో భారత్ నేర్చుకున్న పాఠమేంటి?
- 1967 యుద్ధం: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
- సిరియా యుద్ధంలో ఎవరు ఎవరి వైపున్నారు? అక్కడ అసలేం జరుగుతోంది?
- రష్యా వర్సెస్ పశ్చిమ దేశాలు.. ‘ఇది నూతన ప్రచ్ఛన్న యుద్ధం’
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












