#BeingDalit: హైదరాబాద్- 'ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నా కులంతో పనేంటి?'

ఓరోజు మా ఇంటి ఓనర్ బంధువు మా ఇంట్లోకి రాబోతూ, గుమ్మం దగ్గర ఆగిపోయారు. ''మీ కులం ఏమిటి'' అని ఆమె అడిగారు. నేనూ, మా ఆవిడ ఉలిక్కిపడ్డాం. మా కులం చెబితే మాకు ఎదురయ్యే అవమానం కళ్ల ముందు కదలాడింది. మరో దారి లేక అబద్ధం చెప్పాం.
హైదరాబాద్‌లో దాదాపు పదేళ్లుగా ఉంటున్నాను. ఉద్యోగ రీత్యా ఇక్కడకు వచ్చాను. వచ్చిన కొత్తలో సెంట్రల్ హైదరాబాద్‌లో ఉన్నాను. పెళ్లయ్యాక అక్కడే ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఓనరు ముస్లిం. ఇరుగుపొరుగు దాదాపు అందరూ నాలాగా మీడియావాళ్లే. మాతో బాగా కలిసిపోయారు.
మూడేళ్ల క్రితం నా అవసరం కొద్దీ ఇల్లు మారాల్సి వచ్చింది. ఎల్‌బీ నగర్ సర్కిల్ తర్వాత, విజయవాడ వెళ్లే రహదారికి ఇరు వైపుల వేట మొదలుపెట్టాను.
'ఓన్లీ ఫర్ వెజిటేరియన్స్' అని రాసి ఉన్న టు-లెట్ బోర్డులు అక్కడక్కడా కనిపించాయి. అడిగి లేదనిపించుకోవడం ఎందుకని ఆ గడపలు తొక్కలేదు.
ఇంకో 'టు-లెట్' బోర్డు చూసి లోపలకు వెళ్లాను. పెద్దాయన ఒకరు ఇల్లంతా చూపించారు. ఇల్లు నచ్చింది. ఇంట్లోంచి వస్తుంటే - ''మీరు ఏమిట్లూ'' అని దీర్ఘం తీశారు. నాకు కోపం వచ్చింది. అందులో నా నిస్సహాయత, బాధ, ఆక్రోశం కూడా ఉన్నాయి.

''ఈ లొకాలిటీలో, నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో కొందరు కొన్ని కులాల వారిని, ముస్లింలను దూరం పెడతారు. ఒకే కులం వాళ్లందరూ కలిసి కట్టుకునే అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు కూడా ఉంటాయి'' అన్న స్నేహితుడి మాటలు విన్నాక నాలో ఆందోళన మొదలైంది.
ఇంత చక్కటి ప్లానింగ్, మంచి పార్కులు ఉన్న ప్రాంతం దగ్గర్లో ఎక్కడా లేదు. నా ఉద్యోగం, కుటుంబ అవసరాలు, సదుపాయాలు, పరిసరాల దృష్ట్యా ఈ లొకాలిటీ మాకు బాగా అనువైనది. అందుకే వెతుకులాట మానలేదు.
ఓ ఇల్లు చూడటానికి వెళ్తే వయసు 30లలో ఉన్న ఒక గృహిణి చాలా ప్రశ్నలు అడిగారు. ''ఉద్యోగం ఏమిటి, ఎక్కడ? జీతమెంత? వెజ్జా, నాన్ వెజ్జా? ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు? అమ్మానాన్నలు ఎక్కడుంటారు'' అంటూ వివరాలన్నీ ఆరా తీశారు. చివర్లో వారి కులం చెప్పి, నా కులం అడిగారు. మనసు చివుక్కుమంది.
''అది ఎందుకులెండి'' అన్నాను.
''అరె... చెప్పడానికేమి?'' అన్నారామె.
ఆమె కేవలం తెలుసుకోవడానికి అడిగినట్లు అనిపించలేదు.
''ఇల్లు వద్దులెండి'' అని చెప్పి, వచ్చేశాను.
అద్దె ఎంతివ్వాలి, ఎప్పట్లోగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి- నగదు ఇవ్వాలా, బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయాలా, ఇల్లు, పరిసరాలు ఎలా పెట్టుకోవాలి, నీళ్లు ఎలా వాడుకోవాలి - ఇలాంటి విషయాల్లో కావాలంటే వంద కండిషన్లు పెట్టుకోవచ్చు. నేరచరిత్ర ఏమైనా ఉందా అని ఆరా తీసుకోవచ్చు. ఆధార్ కార్డో, పాన్ కార్డో అడిగితే ఇవ్వడానికి సిద్ధమే. కానీ అంతిమంగా కులాన్ని బట్టి ఇల్లు ఇవ్వాలో వద్దో నిర్ణయించడం ఏమిటి?
వరుసగా ఎదురైన చేదు అనుభవాల తర్వాత ఇంకో ఇంటిని చూశాను. మా స్వస్థలం దక్షిణాదిలోని మరో మహానగరం. కొన్ని తరాల కిందట ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్లి స్థిరపడ్డాం.
మా స్వస్థలం గురించి చెప్పగానే- ''అవునా.. మేమూ అక్కడే పదేళ్లు ఉన్నాం'' అంటూ ఇల్లుగలవారు బాగా కలివిడిగా మాట్లాడారు. వాళ్లింట్లో భోజనం చేసే వరకు వదల్లేదు. తర్వాత కొద్ది రోజులకు అక్కడ కుటుంబంతో దిగాను.
ఇరుగుపొరుగు పలకరింపులు చూస్తే మంచివారనే అనిపించింది. పక్కింట్లో ఓ చిన్నపాప ఉండేది. నా బిడ్డకు ఆడుకోవడానికి తోడు దొరికిందని సంతోషపడ్డా. ఓ రోజు ఆ ఇంటావిడ అడిగితే నా భార్య మా కులమేంటో చెప్పింది.
మరుసటి రోజు నుంచి వాళ్ల పాప మా ఇంటికి రావడం ఆగిపోయింది. వాళ్ల అమ్మ మా ఆవిడతో ముభావంగా ఉండటం మొదలైంది. ఆడుకొనే తోడు దొరక్క మా అమ్మాయి ఒకటే ఏడుపు. ''పక్కింటికి వెళ్తాను...'' అంటూ మారాం చేసేది. కానీ ఆ ఇల్లు ఎప్పుడూ మూసే ఉండేది.
మేం ఎస్సీలమనే విషయం తర్వాత వీధిలో మిగతా వారికీ తెలిసింది. ''ఇల్లు అడగడానికి వచ్చినప్పుడు అతడు ఎస్సీలమనే మాటే చెప్పలేదు'' అని ఓనర్ పెద్దకోడలు మిగతావాళ్ల వద్ద అన్నారు. వాస్తవానికి నేను ఏ కులం పేరూ చెప్పలేదు.
మాకు ఏదైనా అత్యవసరమైతే సాయం అడగడానికి కూడా వెనకాడే వాతావరణం ఏర్పడింది. మమ్మల్ని ఇలా చూడటం ఇంట్లో అందరినీ కుమిలిపోయేలా చేసింది. నా భార్య వేదనకైతే అంతే లేదు. ఏంచేద్దామని నేనూ, నా భార్య మాట్లాడుకున్నాం.
చివరికి ఆ ఇల్లు ఖాళీ చేశాం, చేరిన కొన్ని వారాలకే.
ఇలాంటి అవమానాలు ఎదురైనప్పుడు కలిగే బాధ భరించేవారికే తెలుస్తుంది.
అన్ని చోట్లా అందరూ ఇలా చేస్తున్నారని నేను అనడం లేదు. నా అనుభవంలోకి వచ్చింది చెబుతున్నాను. నేను పుట్టి పెరిగిన చోట ఇంత వివక్ష నాకు ఎదురుకాలేదు.
కులం పేరిట వివక్ష చూపడం చట్ట ప్రకారం నేరమని అందరికీ తెలియకపోవచ్చు. కానీ కొందరు తెలిసినా ఇలా చేస్తున్నారనిపిస్తోంది. విషయం చట్టం వరకు ఎందుకు వెళ్తుందిలే, ఎవరేం చేస్తారులే అన్న ధీమా కాబోలు. నాకున్న పరిమితుల కారణంగా నేను కూడా చట్టపరంగా ముందుకు వెళ్లడానికి వెనకాడాను.

వరుస అవమానాల తర్వాత, ఇకపై ముస్లింల ఇంట్లోనే అద్దెకు దిగాలనుకున్నాం.
ఒక ఇల్లు చూశాం. నచ్చలేదు. మళ్లీ ఆలోచనలో పడ్డాం.
''ఇల్లు బాగుండాలి, ఓనరు కులం ప్రస్తావన తేకూడదు, తెచ్చినా మేం నిజమే చెప్పాలి, చెప్పినా మమ్మల్నీ అందరిలాగే చూసే ఇరుగూపొరుగూ ఉండాలి'' అని కోరుకున్నాం. ఇవన్నీ కావాలంటే సాధ్యం కాదని, ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదని అర్థమైంది. కులం అడిగితే అబద్ధం చెప్పాలనుకున్నాం.. మా ఐడెంటిటీని దాచిపెట్టడం ఇష్టం లేకపోయినా!
ఒక ఇల్లు చూశాం.. బాగుంది. ఓనర్ దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. కులం ప్రస్తావన తేలేదు. ఇంట్లో చేరిపోయాం.
ఆరు నెలలు గడిచాయి. ఇంతలో వాళ్ల ఇంటికి దగ్గరి బంధువు వచ్చారు. ఆవిడ ఓ రోజు మా ఇంట్లోకి రాబోతూ గుమ్మం వద్దే ఆగిపోయి, ''మీరు ఏమిటి'' అని అడిగారు. మా కులం దాచి పెట్టి వేరే కులం పేరు చెప్పాం. 'ఓకే.. ఓకే..'' అంటూ ఆమె లోపలకు వచ్చారు. వచ్చాక కులం గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. ప్రతి ప్రశ్నా మమ్మల్నిపరీక్షించేదిగానే అనిపించింది.
మా అమ్మానాన్న వచ్చినప్పుడు ఓనర్ దంపతులు, ఇరుగుపొరుగు పరీక్షగా చూస్తుంటారు. నా తల్లిదండ్రుల ముతక తెలుగు యాస వారికి అనుమానం కలిగిస్తుందేమో!
ఈ మధ్యే ఇంటి ఓనర్‌షిప్ మారింది. వేరేవాళ్లు కొన్నారు. మేం అబద్ధాన్ని కొనసాగించక తప్పడం లేదు. మా యాస, సంప్రదాయాల విషయంలోనూ అనుక్షణం జాగ్రత్త పడాల్సి వస్తోంది.
కేవలం మా నేపథ్యం కారణంగా మాకు లేనిపోని సమస్యలు వస్తాయేమోననే ఆందోళన వెంటాడుతోంది. ఈ అభద్రతా భావాన్ని, అంతకుమించి అపరాధ భావాన్ని ఎంత కాలం తట్టుకోగలం? ఈ పరిస్థితులు నా పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోననే ఆలోచన నన్నూ, నా భార్యను కలవరపెడుతోంది.
సొంత ఇల్లు కొనడం 'పిచ్చితనం' అని ప్రముఖ రచయిత ఆరుద్ర అంటుండేవారని విన్నాను. మంచి ఇల్లూ, మంచి యజమానీ దొరికితే ఎన్నేళ్లైనా అద్దెకొంపలో ఉండొచ్చనేవారంట ఆయన. చెన్నై పనగల్ పార్కు దగ్గర అలా పాతికేళ్లు ఉన్నారంట ఆయన! కానీ ఎంత మందికి దక్కుతుంది ఈ అవకాశం?
మొన్నటివరకు 'సొంతింటి కల'పై నాకు నిశ్చితాభిప్రాయాలు ఉండేవి. జీతంలో సగం నెలవారీ వాయిదాలు కట్టుకుంటూ, ఇల్లు గడవడానికి అగచాట్లు పడటం తెలివైన పని కాదనుకొనేవాణ్ని.
కానీ మా ఐడెంటిటీ విషయంలో ఇక అవమానాలు పాలవకుండా ఉండాలంటే, కులం గురించి అబద్ధమాడుతున్నామనే అపరాధ భావం మమ్మల్ని వేధించకుండా ఉండాలంటే ఇల్లు కొనడమే ఉత్తమమనిపించింది.
ఏడాది పాటు తిప్పలు పడి స్నేహితుల వద్ద, తెలిసినవాళ్ల వద్ద కొంత అప్పు చేసి, మిగతాది బ్యాంకు నుంచి రుణం తీసుకొని ఈ మధ్యే ఇల్లు కొన్నాను. అది ఇంకా నిర్మాణం పూర్తికాలేదు. అందులోకి వెళ్లడానికి చాలా కాలమే పడుతుంది. అప్పటివరకు, నేనున్న పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చు.
ఇలాంటి విషయాల్లో ఓనర్లకు ఇరుగుపొరుగు తీసిపోరు. ''ఇరుగుపొరుగును మనం ఎంచుకోలేం'' అంటారు. నా అనుభవం ప్రకారమైతే- కొందరు కులం ప్రాతిపదికగా ఇరుగుపొరుగును ఎంచుకోగలరు. మమ్మల్ని అలాగే తిరస్కరించారు, తిరస్కరిస్తున్నారు!
(హైదరాబాద్‌లో నివసించే ఒక వ్యక్తి బీబీసీ ప్రతినిధి రవిశంకర్ లింగుట్లతో పంచుకున్న నిజజీవితగాథఇది. ఆయన విజ్ఞప్తి మేరకు వివరాలు వెల్లడించడం లేదు.)
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- ఎమర్జెన్సీ: ‘అక్రమ నిర్బంధానికి బలైన’ స్నేహలతారెడ్డి జైలు డైరీ
- చరిత్ర: ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ ఎలా సాధించుకున్నారు?
- దేశ భాషలందు తెలుగు: 50 ఏళ్లలో 2 నుంచి 4వ స్థానానికి
- మీ వేలిముద్రలు ఎవరూ దొంగిలించకుండా కాపాడుకోండి
- దేశంలో 'వాట్సప్ హత్యలను' ఎవరు ఆపగలరు?
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- రష్యా ఉద్యోగులు: 'పింఛను అందే వరకు బతికే ఉంటామా'
- చే గువేరా భారత్ గురించి ఏమన్నారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








