హార్ముజ్: ఓడల కింద ఇరాన్ బాంబులు, మిసైళ్లు పెట్టి పేల్చేసే అవకాశమున్న ఈ జలసంధి మూతపడితే జరిగే పరిణామాలేంటి? పెట్రోలు ధరలు పెరుగుతాయా?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, డేనియల్ థామస్, బెన్ హట్టన్, పీటర్ హాస్కిన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- చదివే సమయం: 6 నిమిషాలు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిడిల్ ఈస్ట్ దేశాల మీద దాడులు చేస్తూ ఉండటంతో ముడి చమురు ధరలు పెరిగాయి.
బ్యారెల్ ముడి చమురు ధర 3.2 శాతం పెరిగి 80 డాలర్లకు చేరుకుంది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ( ఎల్ఎన్‌జీ) ధరలు 30శాతం పెరిగాయి.
గత వారాంతంలో హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తున్న మూడు చమురు నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో చమురు ధరలు భగ్గుమన్నాయి.
మిడిల్ ఈస్ట్‌లో కార్యకలాపాలు ఆగిపోవడంతో బ్రిటిష్ ఎయిర్‌వేస్ షేర్లు భారీ నష్టాలను చవి చూశాయి.
తమ దేశానికి దక్షిణాన ఉన్న హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల్ని పోనిచ్చేది లేదని ఇరాన్ హెచ్చరించింది. ఈ జల మార్గం ద్వారా ప్రపంచంలో 20 శాతం చమురు, సహజవాయువు రవాణా అవుతోంది.


ఫొటో సోర్స్, Reuters
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, బంగారానికి గిరాకీ
హార్ముజ్ జలసంధి ప్రవేశ మార్గం వద్ద అంతర్జాతీయ నౌకలన్నీ నిలిచి పోయాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
ఇటు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్లను ప్రభావితం చేసింది. అమెరికాలో స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
చమురు ధరలు పెరిగితే బ్యాంక్ వడ్డీ రేట్లపైనా ప్రభావం చూపుతుందనే ఆందోళన మార్కెట్లలో పెరిగింది. బ్రిటన్‌లోని ఎఫ్‌టీఎస్ఈ 100 సూచీ 1.4 శాతం నష్టాలతో మొదలైంది. జర్మనీ స్టాక్ మార్కెట్ డాక్స్ ఇండెక్స్ కూడా 1.7 శాతం నష్టపోయింది.
గ్యాస్ ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. షేర్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతూ ఉండటంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
ఖతార్‌లోని రస్ లఫ్ఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఎల్‌ఎన్‌జీ కేంద్రాన్ని మూసివేయాలని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
సౌదీ అరేబియాలోనని రస్ తనూరా వద్ద ఆరామ్‌కో సంస్థకు చెందిన చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి జరగడంతో ఈ రిఫైనరీని మూసివేశారు.
హార్ముజ్ జలసంధి వద్ద అంతర్జాతీయ నౌకా రవాణా దాదాపుగా స్థంభించిపోయింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటే చమురు ధరలు పెరుగుతాయని విశ్లేషకులు హెచ్చరించారు.
"హార్ముజ్ జలసంధి వద్ద పరిస్థితుల్ని మార్కెట్ గమనిస్తోంది. నౌకల రాకపోకలు మళ్లీ మొదలైతే ముడి చమురు ధరలు తగ్గుతాయి" అని ఇంధన పరిశోధన సంస్థ ఎంఎస్‌టీ మార్కీ అధిపతి సౌల్ కవోనిక్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Gallo Images via Getty Images
యుద్ధం ఇలాగే కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటవచ్చని, అదే జరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
"చమురు వ్యాపారులు కూడా యుద్ధాన్ని గమనిస్తున్నారు కాబట్టి ధరలు పెంచాల్సి వస్తే అందుకు ఎక్కువ సమయం పట్టదు" అని దుబాయ్‌కి చెందిన కన్సల్టెన్సీ సంస్థ కమర్ ఎనర్జీ సీఈఓ రాబిన్ మిల్స్ చెప్పారు.
"ప్రస్తుతం చమురు ధరలు అంత ఎక్కువగా ఏమీ లేవు. రెండేళ్ల క్రితం ఉన్న ధరలతో పోల్చితే అవి ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. మనం ఇంకా చమురు సంక్షోభంలో చిక్కుకోలేదు" అని రాబిన్స్ తెలిపారు.
ధరలు పెరిగే పరిస్థితి ఏర్పడితే తాము రోజుకు 2లక్షల 6వేల బ్యారెళ్లు అదనంగా ఉత్పత్తి చేస్తామని ఒపెక్‌తో పాటు మరి కొన్ని దేశాలు ఆదివారం ప్రకటించాయి. అయితే దీని వల్ల అంతగా ఉపయోగం ఉండక పోవచ్చని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.
హార్ముజ్ జలసంధిలో చమురు నౌకల రవాణాకు అంతరాయం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు ధరలు పెరుగుతాయని ఆటోమొబైల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎడ్మండ్ కింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
"మిడిల్ ఈస్ట్‌లో బాంబు దాడులు, గందరగోళ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఇది అంతిమంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది" అని ఆయన చెప్పారు.
"యుద్ధం ఎంత కాలం కొనసాగుతుంది అనేదాన్ని బట్టి ధరలు ఎంత పెరుగుతాయి, ఎంత కాలం అలా కొనసాగుతాయనేది ఆధారపడి ఉంది" అని ఆయన అన్నారు.

"పెట్రోలు ధరలు పెరిగితే దాని ప్రభావం ఆహారం, వ్యవసాయం, పారిశ్రామిక ముడి పదార్ధాలు, ఇంకా అనేక వాటిపై పడుతుంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది" అని సారాసిన్ అండ్ పార్ట్‌నర్స్‌లో చీఫ్ ఎకనమిస్ట్ సుబితా సుబ్రమణియం చెప్పారు.
బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం తగ్గుతోంది. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను తగ్గించింది.
వడ్డీ రేట్లను ఇంకా తగ్గిస్తామని ఇటీవల సంకేతాలు ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతమున్న 3.75 శాతాన్ని మార్చకపోవచ్చని సుబితా సుబ్రమణియం భావిస్తున్నారు.
"యుద్ధం రెండు లేదా మూడు వారాల్లో అగిపోతుందా లేదా అనేది మనకు తెలియదు. అలాగే ముడి చమురు నౌకల రవాణా ప్రభావం ఇంధన మార్కెట్లపై ఉంటుందా లేదా అనేది కూడా మనకు తెలియదు" అని ఆమె వివరించారు.
అమెరికా, బ్రిటన్‌కు చెందిన 3 ట్యాంకర్లు "తమ క్షిపణి దాడుల్లో చిక్కుకున్నాయని, అవి కాలిపోయాయని" ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఆదివారం ప్రకటించింది. అయితే దీనిపై అమెరికా, బ్రిటన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
అరేబియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో అనేక 'భద్రతాపరమైన సంఘటనలు' జరిగాయని, 'రవాణాలో జాగ్రత్తలు' పాటించాలని సూచించినట్లు యూకేఎంటీవో తెలిపింది.
హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు బయల్దేరిన 150 ట్యాంకర్లు గల్ఫ్ జలాల్లో నిలిచిపోయాయి. చైనా, ఇరాన్ నౌకలు మాత్రమే ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్నాయని నౌకల రాకపోకల్ని ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ కెప్లెర్ తెలిపింది.
"ఇరాన్ బెదిరింపుల కారణంగా హార్ముజ్ జలసంధిని మూసివేశారు" అని కెప్లెర్ సంస్థ ప్రతినిధి హొమయోన్ ఫాలక్‌షాహి బీబీసీకి చెప్పారు.
"ప్రమాదాలు ఎక్కువగా ఉండటం, ఇన్సూరెన్స్ ఖర్చులు ఆకాశాన్ని తాకుతూ ఉండటంతో నౌకలు హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి" అని ఫాలక్‌షాహి వివరించారు.
చమురు రవాణా మార్గాలను రక్షించేందుకు అమెరికా ప్రయత్నిస్తే చమురు ధరలు పెరగకపోవచ్చు. అయితే హార్ముజ్ జలసంధి మార్గాన్ని ఎక్కువ రోజులు మూసేస్తే పెట్రోల్ ధరలు 'మరింత ఎక్కువగా' పెరుగుతాయని ఆయన చెప్పారు.

హార్ముజ్ జలసంధి ఎలా ఉంటుంది?
ఇరాన్, ఒమన్ సముద్ర సరిహద్దుల మధ్యలో ఈ జలసంధి ఉంటుంది. ఇది ఒక ఇరుకైన జలమార్గం.
ఈ మార్గంలోకి ప్రవేశించే, బయటకు వచ్చే దగ్గర సుమారు 50 కి.మీ.ల వెడల్పు మాత్రమే ఉంటుంది. మధ్యలో ఒక దగ్గర అత్యంత ఇరుకైనచోట కేవలం 40 కి.మీల వెడల్పే ఉంది.
అయితే, ఈ జలసంధి మధ్య భాగంలో మాత్రమే పెద్ద నౌకలు ప్రయాణించేందుకు వీలుగా సరిపడినంత లోతు ఉంటుంది.
మారిటైమ్ నేవిగేషన్ చార్ట్‌లు (సముద్రయాన పటాలు) భారీ చమురు నౌకల కోసం సురక్షితమైన ఇన్‌బౌండ్ లేన్‌ను, అవుట్‌బౌండ్ లేన్‌ను, ఈ రెండింటి మధ్య బఫర్ జోన్‌ను నిర్దేశించాయి.
మొత్తంగా చూస్తే, కేవలం 10 కి.మీ వెడల్పు ఉండే మార్గం గుండానే భారీ నౌకలు ప్రయాణించాల్సి ఉంది.
పర్షియన్ గల్ఫ్‌లోకి ఈ ట్యాంకర్లు ప్రవేశిస్తున్నప్పుడు ఇరాన్, అరబ్ దేశాలకు మధ్య వివాదాస్పద ప్రాంతాలైన గ్రేటర్, లెస్సర్ తుంబ్ దీవులకు సమీపంగా వెళ్తాయి.
మిలిటరీ యాక్షన్ అనేది సముద్ర రవాణాకు అంతరాయం కలిగించే చర్యగా చాలా మంది నిపుణులు పరిగణిస్తారు.
ఇరాన్-ఇరాక్ యుద్ధం 1980 నుంచి 1988 వరకు కొనసాగిన సమయంలో, రెండు దేశాలు ఈ జలమార్గం ద్వారా ఒకదానికొకటి చమురు సరఫరాకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించాయి.

ఫొటో సోర్స్, Reuters
హార్ముజ్ జలసంధికి ఇరాన్ ఎంత సమీపంలో ఉంది?
అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ 2012లో సమర్పించిన నివేదికలో ఇరాన్ ఈ విషయంలో మెల్లగా తన వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉందని చెప్పింది. దానిలో కొన్నింటిని పేర్కొంది. అవేమిటంటే...
హార్ముజ్ జలసంధిలో నౌకాయాన నిషేధాన్ని ప్రకటిస్తూనే.. దాన్ని ఉల్లంఘిస్తే జరిగే పర్యవసనాలను స్పష్టంగా చెప్పకపోవడం.
దీని గుండా వెళ్లే నౌకలను సీజ్ చేయడం లేదా తనిఖీలు చేయడం.
నౌకలపై హెచ్చరికగా కాల్పులు జరపడం
సైనిక దళాలతో కొన్ని నిర్దిష్ట నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం
ఈ జలసంధి మార్గంలో, పర్షియన్ గల్ఫ్‌లో నేవల్ మైన్లు ఉపయోగించడం
వాణిజ్య, సముద్ర నౌకలను లక్ష్యంగా చేసుకునేందుకు జలాంతర్గాములను, క్షిపణులను వాడటం
ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో.. చమురు ట్యాంకర్లపై దాడి చేసేందుకు ఇరాన్ సిల్క్‌వార్మ్ మిసైళ్లను మోహరించింది. గల్ఫ్ జలాల్లో నేవల్ మైన్లను వేసింది.
ఈ మైన్లలో ఒకటి యూఎస్ఎస్ సామ్యూల్ బీ రాబర్ట్స్‌ను అడ్డుకుంది. దీంతో, అమెరికా ప్రతీకార సైనిక చర్యలను దిగాల్సి వచ్చింది.
హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేయడంలో ఇరాన్ విఫలమైంది. కానీ, దీనివల్ల సరుకు రవాణా, బీమా ప్రీమియాలు విపరీతంగా పెరిగాయి. గల్ఫ్ నిష్క్రమణ మార్గం వద్ద నౌకల రద్దీ నెలకొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













