భారతీయ చమురు కంపెనీపై యూరోపియన్ యూనియన్ నిషేధం, భారత్‌పై దీని ప్రభావమెంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీష్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌లోని నాయరా ఎనర్జీ లిమిటెడ్‌కు చెందిన వాడీనార్ రిఫైనరీ(శుద్ధి కర్మాగారం)పై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించింది.
రష్యా ఇంధన రంగం లక్ష్యంగా శుక్రవారం ఈయూ కొత్త ఆంక్షలను ప్రకటించింది. గుజరాత్‌లోని వాడీనార్ రిఫైనరీని కూడా ఈ నిషేధిత జాబితాలో చేర్చింది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై కఠిన ఆంక్షలు విధించే విషయంపై అమెరికన్ కాంగ్రెస్‌లో చర్చలు జరుగుతున్న తరుణంలో, యూరోపియన్ యూనియన్ ఈ ప్రకటన చేసింది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 500 శాతం సుంకం విధించేందుకు కొంతమంది అమెరికా సెనేటర్లు బిల్లును సిద్ధం చేస్తున్నారు.
ఇదేకాకుండా ఈ వారం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) అధిపతి మార్క్ రుట్టే, యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేలా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని చైనా, బ్రెజిల్, భారత్‌లను కోరారు. లేకుంటే అమెరికా ఆంక్షలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
"యూరోపియన్ యూనియన్ నిషేధం విధించడం నాయరా ఎనర్జీకి ఎదురుదెబ్బే. అలాగే, రష్యా ముడిచమురు నుంచి తయారైన పెట్రోలియం ఉత్పత్తులపైనా నిషేధం విధించడం రిలయెన్స్ ఇండస్ట్రీస్‌కు కూడా సవాల్ కానుంది" అని ఇంగ్లిస్ న్యూస్‌పేపర్ ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో రాసింది.

ఈ రెండు కంపెనీలను ఈయూ మార్కెట్ నుంచి బహిష్కరించే ప్రమాముందని ఆ విశ్లేషణలో పేర్కొంది.
రష్యన్ ఇంధన సంస్థ "రోస్నెఫ్ట్".. నాయరాలోని తన 49 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమైనట్లు కూడా మీడియా కథనాలు వచ్చాయి.
అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈయూ నిషేధం కారణంగా ఈ ఒప్పందంపై అనిశ్చితి నెలకొంది.
భారత్‌లో ఈ రెండు సంస్థలు రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నాయరా ప్రముఖ ఇంధన ఎగుమతి కంపెనీలుగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర కంపెనీలపై ప్రభావం పడుతుందా?
"రష్యన్ ఇంధన సంస్థ రోస్నెఫ్ట్ నుంచి ముడిచమురు కొనుగోలు చేసేందుకు రిలయెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, ఇప్పుడు ఈయూ విధించిన ఆంక్షలు రిలయెన్స్‌కు సంక్లిష్టమే. రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ కొనడమైనా మానేయాలి, లేదంటే లాభదాయకమైన యూరప్ డీజిల్ మార్కెట్ నుంచి వైదొలగాలి. ఈ రెండింటిలో ఏ నిర్ణయమైనా రిఫైనింగ్ ఆదాయంపై ప్రభావం చూపవచ్చు" అని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.
యూరోపియన్ యూనియన్ నిషేధం కేవలం నాయరాపైనే ఉండబోతోందా? లేక ఇతర రిఫైనరీ కంపెనీలపై కూడా పడనుందా? అని గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవను బీబీసీ అడిగింది.
"యూరోపియన్ యూనియన్ నిషేధం కారణంగా ఏయే కంపెనీలపై ప్రభావం పడబోతుందనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 40 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. కానీ, ఏ కంపెనీలు ఎంత చమురు కొనుగోలు చేస్తున్నాయో స్పష్టంగా తెలియదు. రష్యన్ చమురు కంపెనీ రోస్నెఫ్ట్‌కు ఇందులో 49 శాతం వాటా ఉన్నందున నాయరా పేరు తెరపైకి వస్తోంది. రష్యన్ సంస్థలు ఇతర కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టాయి. అంతేకాకుండా, ప్రైవేట్ ఈక్విటీ కూడా ఉంది" అని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
"రష్యా నుంచి ఏ కంపెనీ ఎంత చమురును దిగుమతి చేసుకుంటోంది, శుద్ధి చేసిన తర్వాత ఎంత మొత్తాన్ని, ఎక్కడికి ఎగుమతి చేస్తోంది అనే విషయాలను ప్రభుత్వం వెల్లడిస్తేనే ఈ విషయంలో మనకు కచ్చితమైన సమాధానం దొరుకుతుంది. దీనికి సంబంధించిన డేటా అందుబాటులో లేదు" అని ఆయన అంటున్నారు.
గత నెలలో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది జూన్ వరకు సముద్ర మార్గం ద్వారా ఎగుమతి చేసిన మొత్తం రష్యన్ క్రూడ్ ఆయిల్‌లో 80 శాతం భారతదేశానికి వచ్చింది.
కెప్లర్ డేటా ప్రకారం, ఈ సంవత్సరం జూన్ 24 వరకు, భారత్ 231 మిలియన్ బారెల్స్ రష్యన్ ముడి చమురు కొనుగోలు చేసింది. దీనిలో రిలయెన్స్ ఇండస్ట్రీస్, నాయరా ఎనర్జీ లిమిటెడ్‌కు కలిపి 45 శాతం వాటా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
యూరోపియన్ మార్కెట్లలో ప్రవేశంపై పరిమితులు
"రష్యా నుంచి ఎంత చమురు భారత్‌కు వచ్చిందన్నదే భారత ప్రభుత్వం చెబుతుంది. కానీ, రష్యన్ ఆయిల్‌ను శుద్ధి చేసిన తర్వాత ఎంతమొత్తంలో యూరప్‌కు ఎగుమతి చేస్తున్నారనే వివరాలు లేవు. భారత ప్రభుత్వం ఏ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన డేటాను వెల్లడించదు. అయితే, రష్యన్ చమురును భారత్‌లో శుద్ధి చేసి యూరప్‌కు పెద్దయెత్తున పంపుతున్నారన్నది నిజం. కానీ, ఏ కంపెనీకి చెందిన చమురు ఎంత అనే సమాచారం అందుబాటులో లేదు" అని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
యూరోపియన్ యూనియన్ నిషేధంతో, రష్యన్ ముడిచమురును భారత్‌లో శుద్ధి చేసి యూరప్‌కు పంపడం ఇకపై సాధ్యం కాదు.
"ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇప్పుడు రష్యన్ ముడి చమురును భారత్‌లో శుద్ధి చేసి యూరోపియన్ యూనియన్ దేశాలకు పంపలేరు. భారత మొత్తం చమురు దిగుమతుల్లో మూడింట ఒక వంతు రష్యా నుంచే వస్తున్నాయి. దానిలో ఎక్కువ భాగం శుద్ధి చేసి యూరోపియన్ మార్కెట్‌కు వెళ్తోంది. ఈయూ నిషేధంతో, యూరప్‌కు భారత పెట్రోలియం ఎగుమతులపై తీవ్రప్రభావం పడుతుంది" అని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
"రష్యన్ ఇంధన సంస్థ రోస్నెఫ్ట్ భారత్‌కు చెందిన నాయరా ఎనర్జీ లిమిటెడ్‌లో తన వాటాను విక్రయించాలని యోచిస్తోంది. కానీ, ఈయూ నిషేధంతో ఈ ప్రణాళికలో అనిశ్చితి ఏర్పడవచ్చు" అని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది.
నాయరాలో తన వాటాను విక్రయించడానికి ముకేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్‌తో రోస్నెఫ్ట్ చర్చలు జరుపుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.
తన పోటీ కంపెనీలో రిలయెన్స్ వాటాల కొనుగోలును ఈయూ తాజా ఆంక్షలు కష్టతరం చేసే అవకాశముంది. ఎందుకంటే, ఇది డీజిల్‌తో పాటు ఇతర ఉత్పత్తులు బాగా అమ్ముడవుతున్న యూరప్‌లో రిలయెన్స్ వ్యాపారాన్ని ప్రమాదంలో పడేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా విషయంలో భారత్‌పై ఒత్తిడి
"నాయరా రోజుకు 4 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి సామర్థ్యమున్న రిఫైనరీని నిర్వహిస్తోంది. దీనికి దేశవ్యాప్తంగా సుమారు 7,000 ఇంధన అవుట్‌లెట్లు ఉన్నాయి. ఇది తన రిఫైనరీ పక్కనే ఒక పెట్రోకెమికల్ ప్లాంటును కూడా అభివృద్ధి చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ అయిన రిలయెన్స్ జామ్‌నగర్ ప్రాసెసర్, నాయరా వాడీనార్ యూనిట్‌కు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది" అని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది.
ఈ అంశంపై ఇప్పటివరకు నాయరా కానీ, రిలయెన్స్ కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం యూరోపియన్ యూనియన్ నిర్ణయాన్ని విమర్శించింది.
"భారత్ ఎలాంటి, ఏకపక్ష నిషేధాన్నీ అంగీకరించదు. మాది బాధ్యతాయుతమైన దేశం, మా చట్టాలకు కట్టుబడి ఉంటాం. ఇంధన భద్రతను చాలా ముఖ్యమైన బాధ్యతగా భారత ప్రభుత్వం భావిస్తుంది, అది మా పౌరుల ప్రాథమిక అవసరం. ఇంధన వాణిజ్యం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు అవలంబించకూడదని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం'' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
"భారత్ ఐక్యరాజ్యసమితి ఆంక్షలను గౌరవిస్తుంది, అందువల్ల దీనిని ఏకపక్ష నిషేధంగా చెబుతోంది. అయితే, విమర్శించడం మినహా భారత్ ఏమీ చేయలేకపోతోంది. భారత్ విషయంలో, యూరప్ నిరంతరం తన మార్కెట్‌ను మూసేస్తూనే ఉంది. ఉక్కు విషయంలో కూడా అదే జరిగింది. యూరప్‌కు భారత్ చేసే ఇంధన ఎగుమతులు కూడా నిరంతరం తగ్గుతున్నాయి" అని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
ఆంక్షల కారణంగా, తన ఆదాయాన్ని తిరిగి రష్యాకు పంపలేకపోవడంతో రోస్నెఫ్ట్ సంస్థ భారత్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు స్థానిక మీడియాను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ రాసింది.
ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, ''ఇప్పటికే సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని అరాంకో కంపెనీతో సహా అనేక మంది కొనుగోలుదారులతో రోస్నెఫ్ట్ చర్చలు జరుపుతోంది. రోస్నెఫ్ట్, తన భాగస్వాములతో కలిసి 2017లో ఎస్సార్ గ్రూప్ నుంచి నాయరాను $12.9 బిలియన్ల (సుమారుగా 1.07 లక్షల కోట్ల రూపాయలు )కు కొనుగోలు చేసింది."
ఏదైనా మూడో దేశం ద్వారా రష్యా చమురు దిగుమతులను యూరోపియన్ యూనియన్ నిషేధించింది. ఈ నిర్ణయం వల్ల భారత్ నుంచి యూరప్‌కు జరిగే ఇంధన ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడుతుంది.
కెప్లర్ డేటా ప్రకారం, 2023లో భారత్ నుంచి యూరోపియన్ యూనియన్‌కి రిఫైన్ చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే రెట్టింపయ్యాయి. 2023లో, సగటున ప్రతి నెలా రెండు లక్షల బ్యారెళ్లకు పైగా పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతయ్యాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














