పామును పట్టుకుని మెడలో దండలా వేసుకున్న వ్యక్తి, భారీ మూల్యం చెల్లించాడు

ఫొటో సోర్స్, Shuraih Niyazi
- రచయిత, శురేహ్ నియాజీ
- హోదా, బీబీసీ కోసం
అతి నిర్లక్ష్యం కారణంగా సర్ప మిత్రగా పనిచేస్తున్న వ్యక్తి పాముకాటుకే బలయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా రఘోగఢ్‌లో జరిగింది.
పామును పట్టుకున్న దీపక్ మహావర్ అనే వ్యక్తి దానిని జాగ్రత్తగా అడవిలో వదిలిపెట్టకుండా, తన మెడలో వేసుకున్నారు. అదే పాముకాటుకు గురై చనిపోయారు.
పాముకాటును ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. అయితే, క్రమంగా విషం ప్రభావం చూపించడంతో రాత్రయ్యేసరికి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. అనంతరం, ఆసుపత్రికి తీసుకెళ్లప్పటికే ఆయన మరణించారు.
పాములను పట్టడంలో సిద్ధహస్తుడిగా ఆ ప్రాంతంలో దీపక్‌కు పేరుంది. పాములు పట్టడం కోసమే ఆయనకు జేపీ కాలేజీలో ఉద్యోగమిచ్చారు.
సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రఘోగఢ్‌లోని ఒక ఇంట్లో పాము కనిపించిందని ఆయనకి కాల్ వచ్చింది. దీపక్ వెంటనే అక్కడికి వెళ్లి పామును సురక్షితంగా పట్టుకున్నారు.
ఇంతలోనే తన 12 ఏళ్ల కొడుకు చదువుతున్న పాఠశాల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. స్కూల్ వదిలిపెట్టారని, పిల్లాడిని తీసుకెళ్లాలన్నది ఆ కాల్ సారాంశం.
ఆ తొందరలో పామును డబ్బాలో బంధించకుండానే.. తన మెడలో వేసుకుని నిర్లక్ష్యంగా పాఠశాల వద్దకు వెళ్లిపోయారు దీపక్.
తన కుమారుడిని వెనుక కూర్చోబెట్టుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా మెడలో ఉన్న పాము ఆయన కుడి చేతిపై కాటు వేసింది.


ఫొటో సోర్స్, Shuraih Niyazi
పాముకాటుకు గురైన వెంటనే ఆసుపత్రికి..
పాము కాటు వేసిన వెంటనే దీపక్ తన స్నేహితుడికి కాల్ చేశారు. ఆయన దీపక్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు గుణ ఆసుపత్రికి పంపించారు.
ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో, ఆసుపత్రి నుంచి సాయంత్రానికి ఇంటికి వచ్చేశారు దీపక్. భోజనం చేసి నిద్రపోయారు. కానీ, రాత్రికి పరిస్థితి విషమించి తెల్లవారేసరికి ఆయన మరణించారు.
"మా దగ్గరికి వచ్చినప్పుడు, దీపక్ పరిస్థితి నిలకడగానే ఉంది. ఆయన ముఖ్యమైన అవయవాలు బాగానే ఉన్నాయి. స్పృహలోనే ఉన్నారు, మామూలుగానే మాట్లాడుతున్నారు" అని రఘోగఢ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్ దేవేంద్ర సోనీ బీబీసీతో చెప్పారు.
"మేం వెంటనే ఆయనకి ప్రామాణిక ప్రోటోకాల్స్ ప్రకారం చికిత్స మొదలుపెట్టాం. ఆయనకి ఐవీ ఫ్లూయిడ్స్, విషానికి విరుగుడు ఇతర అవసరమైన మందులు ఇచ్చాం. ఆపై ఇక్కడ తగిన సౌకర్యాలు అందుబాటులో లేనందున గుణకు వెళ్లాల్సిందిగా సూచించాం" అని ఆయన చెప్పారు.
గుణలో కొన్ని గంటలు ఉన్న తర్వాత, దీపక్ ఆరోగ్యం బాగానే ఉండటంతో ఇంటికి వెళ్లిపోయారని డాక్టర్ సోనీ చెప్పారు.
"కాటు వేసిన పాము.. నాగుపాములా ఉంది. దాని విషం నెమ్మదిగా పనిచేస్తుంది. అలాంటి సందర్భాలలో, రోగి కనీసం 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండటం అవసరం. రిఫరల్ సెంటర్‌లో, పరిశీలనలో ఉండి ఉంటే ఆయన ప్రాణాలతో ఉండేవారు" అని డాక్టర్ సోనీ అన్నారు.

ఫొటో సోర్స్, Shuraih Niyazi
పాములను పట్టే నైపుణ్యంతోనే ఉద్యోగం
గత కొన్ని సంవత్సరాలుగా దీపక్ మహావర్ రఘోగఢ్‌లోని జేపీ కాలేజీలో 'సర్ప మిత్ర'గా పని చేస్తున్నారు. పాము కనిపించిందని సమాచారం అందినప్పుడు దాన్ని పట్టుకోవడానికి సమీప గ్రామాలకు కూడా వెళ్లేవారు.
ఆయనకు ఇద్దరు కుమారులు. ఒకరికి 14 సంవత్సరాలు, మరొకరికి 12. సుమారు పదేళ్ల కిందట ఆయన భార్య మరణించారు.
ఈ ఘటన జరిగిన సమయంలో, దీపక్ తన చిన్న కొడుకును స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్లారు.
"దీపక్ చాలా ఏళ్లుగా ఈ పని చేస్తున్నాడు, ఆయన ఎవరి దగ్గరో పాములు పట్టడం నేర్చుకున్నాడు. కొన్నేళ్లుగా ఈ పనిలో నైపుణ్యం సంపాదించాడు. ఆ కారణంగానే జేపీ కాలేజీలో ఉద్యోగం వచ్చింది. ఆ కాలేజీ ఊరి శివారులో ఉంది. అక్కడ తరచూ పాములు కనిపిస్తాయి" అని దీపక్ తమ్ముడు నరేశ్ మహావర్ బీబీసీతో చెప్పారు.
"దీనికి ముందు కూడా చాలాసార్లు పాముకాటుకు గురయ్యాడు. తన సొంత మూలికలతో వైద్యం చేసుకునేవాడు. ఒకసారి ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఈసారి కూడా అది ఒక చిన్న వాపు అని, త్వరగా తగ్గిపోతుందని అనుకున్నాడు. అందుకే, దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు" అని నరేశ్ చెప్పారు.
"ఈ కథనాన్ని మానవీయ కోణంలో రాయాలని మా విన్నపం. మా అన్నయ్య చనిపోయాడు. ఇద్దరు చిన్నపిల్లలు. ప్రభుత్వం ఈ విషయాన్ని మానవీయ కోణంలో చూస్తే, బహుశా ప్రభుత్వం కొంతసాయం చేయొచ్చు. ఆ సాయం పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది" అని ఆయన కోరారు.
"చిన్నచిన్న అపార్థాలు పక్కనపెడితే, మా అన్నయ్య చాలా మంచి వ్యక్తి. తన ప్రాణాలను పణంగా పెట్టి కూడా చాలాసార్లు ఇతరులకు సాయం చేశాడు" అని నరేశ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో ఏటా లక్షమంది చనిపోతున్నారు..
భారతదేశంలో పాముకాటు మరణాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌వో) డేటా ప్రకారం , దేశంలో ఏటా దాదాపు 50 లక్షల పాముకాటు కేసులు నమోదవుతున్నాయి.
వీటిలో దాదాపు 25 లక్షల కేసుల్లో, ప్రజలు పాము విష ప్రభావానికి గురయ్యారు.
డబ్యూహెచ్‌వో ప్రకారం, భారత్‌లో ఏటా సుమారు లక్ష మంది పాముకాటు కారణంగా చనిపోతున్నారు. దాదాపు నాలుగు లక్షల మందిలో (విషం ప్రభావం కారణంగా) తమ శరీరంలోని కొంతభాగం పనిచేయకుండా పోవడం, లేదా శరీరం మొత్తం పనిచేయకుండా చచ్చుబడిపోవడం వంటివి నమోదవుతున్నాయి.
బీబీసీ 2020 రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో ఏటా లక్షమందికి పైగా పాముకాటు వల్ల మరణిస్తున్నారు.
ప్రజలు తరచుగా పాముకాటుకు గురయ్యే ప్రాంతాలలో ఒకటి మధ్యప్రదేశ్. ఆసుపత్రి, పోస్ట్‌మార్టం నివేదికల ఆధారంగా సదరు వ్యక్తి పాముకాటు వల్ల మరణించినట్లు తేలితే, వారి కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పరిహారం అందిస్తుంది.
2024లో 'ది రాయల్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజీన్' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో పాముకాటు మరణాలకు ఇచ్చే పరిహారాన్ని విశ్లేషించారు. ఇందులో మధ్యప్రదేశ్ ఆరోగ్య విభాగం 2020-21, 2021-22 సంవత్సరాలకు అందించిన డేటాను సమీక్షించారు.
ఈ రెండు సంవత్సరాలలో మొత్తం 5,728 కుటుంబాలకు పరిహారం అందించినట్లు ఆ విశ్లేషణలో గుర్తించారు. పాముకాటు మృతుల కుటుంబాలకు మొత్తం రూ.229 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పరిహారంగా అందజేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














