‘‘టాయ్‌లెట్‌కు వెళతాను అంటే పని నుంచి తీసేస్తారని భయం’’

దిల్లీ, భవన నిర్మాణ కార్మికులు, మహిళలు, టాయిలెట్లు, అనారోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, షతాలి షెడ్‌మేక్, అషాయ్ ఎడ్గే
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

దిల్లీ...భారతదేశ రాజధాని అయిన ఈ నగరం అనేక విధాలుగా ముఖ్యమైనది. భారతదేశంలో నివసించే వారికి, ఇది రాజకీయ, సామాజిక, ఆర్థిక, చారిత్రక శక్తికి కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు భారత్ నిజమైన గుర్తింపు దిల్లీ.

శతాబ్దాలుగా ఈ నగరం భారత్‌కు గుండెకాయలా ఉంది. దిల్లీలో రెండు నగరాలున్నాయని చెప్పొచ్చు. ఒకటి ఇక్కడ నివసించేవారికి చెందే నగరమయితే, ఇంకొకటి బయటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వలసదారులకు చెందినది.

'దిల్‌వాలే కి దిల్లీ'ని రూపొందించడానికి చాలా చేతులు కష్టపడ్డాయి. కార్మికులు తమ చెమటతో నిర్మించిన అందమైన రాజధాని ప్రపంచాన్ని కట్టిపడేస్తోంది.

ముఖ్యంగా ఈ నగరాన్ని నిర్మించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ వారి సమస్యలపై పెద్దగా చర్చ జరగదు.

నిర్మాణ ప్రదేశాలలో పనిచేసే మహిళలకు మరుగుదొడ్లు, మంచినీళ్లు, ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో లేవు. అంతేకాదు..ఇవి కావాలని కోరితే తమ ఉపాధి పోతుందని కూడా వారు భయపడుతుంటారు. ఉపాధిని వెతుక్కోవడం వారికి అతిపెద్ద సవాలు.

''అనేక పెద్ద ప్రాజెక్టులలో పనిచేసే మహిళల సంఖ్య తక్కువగా ఉన్నందున, మహిళా నిర్మాణ కార్మికులకు టాయిలెట్లకు సంబంధించి మాకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పొచ్చు. నిర్మాణ బోర్డు చట్టం ప్రకారం మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉండాలి. కానీ చాలా చోట్ల బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఆ సౌకర్యాన్ని కల్పించడంపై శ్రద్ధ చూపడం లేదు'' అని దిల్లీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్క్ బోర్డ్(డీబీఓసీడబ్ల్యుడబ్ల్యుబీ) సభ్యుడు థానేశ్వర్ దయాల్ అడిగోర్ చెప్పారు.

''మహిళలకు సౌకర్యాలు కల్పించాల్సిఉంటుందన్న ఉద్దేశంతో చాలా సార్లు వారికి పనులు ఇవ్వరు. దీల్లీలో కాకుండా చుట్టుపక్కల నగరాల్లో పెద్ద ప్రదేశాలలో టాయిలెట్ సౌకర్యాలు ఉన్నాయి. కానీ అక్కడ కూడా పరిశుభ్రత సమస్య ఉంది'' అని ఆయనన్నారు.

మిగతా సమస్యలన్నీ పక్కనపెడితే కడుపునొప్పి అన్నింటికన్నా పెద్ద సమస్య. ఇది వారి కల్లోల జీవితాలకు సంబంధించిన కథ.

వారి ప్రశ్నలకు సమాధానం వెతికే ఓ ప్రయత్నం ఇది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దిల్లీ, భవన నిర్మాణ కార్మికులు, మహిళలు, టాయిలెట్లు, అనారోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టాయిలెట్‌కు వెళ్లకుండా ఉండేందుకు నీళ్లు తాగడం మానుకుంటామని నిర్మాణ కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు.

'పని చేస్తే చెమట పడుతుంది, మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఉండదు'

ఉత్తరప్రదేశ్ నుంచి తన భర్తతో కలిసి ఉపాధి వెతుక్కుంటూ దిల్లీకి వచ్చినప్పటి నుంచి దేవికా కుమారి (అసలు పేరు కాదు) ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె కుటుంబం వాయవ్య దిల్లీలోని బవానా ప్రాంతంలో అద్దె గదిలో నివసిస్తున్నారు. కొన్నేళ్ల కిందట ఆమె భర్త పని ప్రదేశంలో ప్రమాదానికి గురయ్యారు. అప్పటి నుంచి కుటుంబబాధ్యత మొత్తం దేవికా కుమారిపై పడింది.

''ఎనిమిదేళ్లగా నేను దినసరి కూలీగా పనిచేస్తున్నాను. పెద్ద భవనాలు, రోడ్లు, డ్రెయిన్లు, ఫ్లైఓవర్లు వంటి ప్రదేశాలలో పనిచేశాను. ఈ ప్రదేశాలన్నింటిలో ఒకే ఒక్క చోట మాత్రమే టాయిలెట్ సౌకర్యం ఉంది" అని ఆమె చెప్పారు.

'పనిలో ఉన్నప్పుడు మూత్ర విసర్జనకు వెళ్లడానికి నేను చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడా అవకాశం ఉండదు. అందుకే మూత్రం రాకుండా ఉండడానికి నేను మంచినీళ్లు తాగడం ఆపేస్తా. చెమట పట్టడం వల్ల శరీరంలో నీటి పరిమాణం తగ్గుతుంది, కాబట్టి నేను ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్లను. కానీ అది గుండెల్లో మంట, కడుపు నొప్పికి కారణమవుతోంది'' అని దేవికా కుమారి చెప్పారు.

''పీరియడ్స్ సమయంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఆ సమయంలో నేను ప్యాడ్(పాత వస్త్రం) మార్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే పీరియడ్స్ సమయంలో మందపాటి క్లాత్ ఉపయోగిస్తాను. ఇంటికి వచ్చినప్పుడు దానిని మారుస్తాను. కానీ ఒకటే క్లాత్ చాలా గంటల పాటు ఉంచుకోవడం వల్ల చికాకు కలుగుతుంది. దద్దుర్లు, దురద వంటివి వస్తుంటాయి. అప్పుడు ప్రతిదీ భరించలేనిదిగా మారుతుంది'' అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

దేవికా కుమారి లాంటి చాలా మంది మహిళలు అనేక నిర్మాణ ప్రదేశాలలో కార్మికులుగా పనిచేస్తున్నారు. వారు పని చేసే చోట టాయిలెట్ సౌకర్యాలు లేవని, ఏవైనా ప్రమాదాలు జరిగితే తక్షణమే చికిత్స అందించడానికి వీలుగా ఫస్ట్ ఎయిడ్ కిట్‌లు ఉండవని, ఎలాంటి భద్రతాపరమైన ఏర్పాట్లు లేవని వారి మాటలను బట్టి అర్ధమవుతోంది.

ఈ సమస్యలన్నింటినీ చెబితే కాంట్రాక్టర్‌ తమను పని నుంచి తొలగిస్తారని చాలామంది భయపడుతున్నారు. అందుకే వారు తమ పేర్లు వెల్లడించడానికి నిరాకరించారు.

''ఉదయం 9 గంటలకు పని ప్రారంభమై సాయంత్రం 5:30గంటల వరకు పని కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఓ గంటపాటు భోజన విరామం ఉంటుంది. అక్కడ టాయిలెట్ లేకపోతే మలవిసర్జనకు వెళ్లాలంటే ఏదో ఓ స్థలాన్ని వెతుక్కోవాలి. లేకపోతే అలాగే ఉండిపోవాలి'' అని బిహార్‌కు చెందిన 34 ఏళ్ల రోష్ని(పేరు మార్చాం)చెప్పారు.

దేవిక కుమారి, రోష్ని ఇద్దరికీ చెరో బిడ్డ ఉన్నారు. తమకు సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగిందని వారు చెప్పారు. కొడుకు పుట్టిన తర్వాత తనకు గర్భాశయంలో కణితి కనిపించిందని, ఈ కణితికి చికిత్స పొందుతున్నప్పుడు, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వచ్చేదని ఆమె అన్నారు. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉందని, కానీ పనిలో తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం కుదరదని దేవికా కుమారి చెప్పారు.

దిల్లీ, భవన నిర్మాణ కార్మికులు, మహిళలు, టాయిలెట్లు, అనారోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పని ప్రదేశాల్లో టాయిలెట్లు లేకపోవడంతో మహిళా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

‘పబ్లిక్ టాయిలెట్లకు డబ్బు చెల్లించే స్థోమత లేదు’

పబ్లిక్ టాయిలెట్లను ఎందుకు ఉపయోగించరు అని అడిగినప్పుడు రోష్ని ఇలా సమాధానమిచ్చారు

''అక్కడ ఒకసారి మూత్ర విసర్జనకు వెళ్లడానికి 10 రూపాయలు చెల్లించాలి. అవి శుభ్రంగా కూడా ఉండవు. రోజుకు రెండు లేదా మూడు సార్లు టాయిలెట్‌కి వెళ్లాల్సి వస్తే, 20-30రూపాయలు ఖర్చవుతుంది'' అని రోష్ని అన్నారు.

రోజుకు వచ్చే 300రూపాయల్లో 30రూపాయలు టాయిలెట్ కోసం ఖర్చు చేయాల్సి రావడం చాలా పెద్ద విషయం.

"నేను పీరియడ్స్ సమయంలో వస్త్రాన్ని ఉపయోగిస్తాను. ఎందుకంటే శానిటరీ ప్యాడ్ కోసం 40 రూపాయలు ఖర్చు చేయాలి. నేనీ డబ్బు ఆదా చేస్తే, ఇంట్లో ఇంకేదైనా కొనగలను అనే ఆలోచనే ఎప్పుడూ వస్తుంటుంది'' అని రోష్ని చెప్పారు. చాలా మంది మహిళలదీ ఇలాంటి పరిస్థితే.

నిర్మాణ రంగంలో పనిచేసే మహిళలకు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మల్టీడిసిప్లినరీ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో ప్రచురితమైన ఒక నివేదిక తెలిపింది. అధ్యయనంలో పాల్గొన్న మొత్తం మహిళల్లో 95.5% మంది తమకు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు చెప్పారు. దీంతో పాటు, చాలామంది జ్వరం, ఒళ్లు నొప్పులు, ఎముకలు పెళుసుగా మారడం వంటి అనారోగ్యాలతో కూడా బాధపడుతున్నారు.

"మహిళలు ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకుంటే, మూత్రాశయంలో మూత్రం పేరుకుపోతుంది, ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాన్ని పెంచుతుంది'' అని ముంబైలోని సైఫీ హాస్పిటల్‌లో యూరాలజిస్ట్ డాక్టర్ మంగేష్ పాటిల్ చెప్పారు.

మహిళలు ఇలా మూత్రం ఆపుకోవడం నిరంతరంగా జరిగితే, మూత్రాశయ సామర్థ్యం తగ్గుతుంది. దీని చికిత్స చాలా ఖరీదైనది. పని చేసే మహిళలు వారి ఆర్థిక పరిస్థితి కారణంగా ఈ సమస్యను ముందుగానే గుర్తించి చికిత్స పొందరు. దీని వల్ల ఇన్ఫెక్షన్ నిర్థరణ ఆలస్యం అవుతుంది, ఇది వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది.

దిల్లీ, భవన నిర్మాణ కార్మికులు, మహిళలు, టాయిలెట్లు, అనారోగ్యం

ఫొటో సోర్స్, Ashay Yedge

ఫొటో క్యాప్షన్, పనిచేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి అని ఓ కార్మికురాలు చెప్పారు.

‘సగం రోజు సెలవుపెడితే, రోజు జీతం కట్ చేస్తారు’

మహిళా కార్మికులు రోజుకు 300 నుంచి 350 వరకు వేతనం పొందుతారు. చాలా ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేస్‌వి. ఈ తాత్కాలిక ఉపాధి ముగిసిన తర్వాత మరో పని దొరుకుతుందన్న గ్యారంటీ ఉండదు.

భార్యాభర్తలిద్దరూ పనికి వెళ్తే రోజుకు 700-850రూపాయలు సంపాదిస్తారు. ఈ డబ్బును ఇంటి రోజువారీ ఖర్చులు, పిల్లల ఖర్చులు, గది అద్దె, విద్యుత్ బిల్లులు మొదలైనవాటికి ఖర్చు చేస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత చేతిలో ఏమీ మిగలదు. అందుకే సెలవులు, విశ్రాంతి, ఎక్కడికైనా వెళ్లిరావడం వంటి పదాలు వారి జీవితంలో ఉండవు.

''20 ఏళ్ల క్రితం నేను హరియాణా నుంచి దిల్లీకి వచ్చినప్పటి నుంచి కూలీగా పనిచేస్తున్నాను. ఒకసారి, అనారోగ్యం కారణంగా సగం రోజు సెలవు తీసుకుంటే, నాకు ఒక రోజు జీతం మొత్తం కట్ చేశారు. కాబట్టి, ఏమీ చెప్పకపోవడమే మంచిది అనిపిస్తుంది. పనిలో ఒక రోజు కూడా వృధా అయినా, ఇంట్లో ఏం తినాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. మాకు 'సెలవు' అనేదే లేదు'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కార్మికురాలు ఆవేదన చెందారు.

దిల్లీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు దిల్లీలోని నిర్మాణ కార్మికుల కోసం పనిచేస్తుంది. భవన, ఇతర నిర్మాణ కార్మికుల (ఉపాధి, సేవా నిబంధనల నియంత్రణ) చట్టం, 1996 ప్రకారం, కార్మికులకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వడం తప్పనిసరి.

ఈ చట్టం ప్రకారం కాంట్రాక్టర్లు లేదా యజమానులు నిర్మాణ కార్మికులకు క్రమం తప్పకుండా వేతనాలు, సురక్షితమైన తాగునీరు, సరైన మరుగుదొడ్లు, ప్రత్యేక వంటశాలలు, బాత్రూమ్‌లతో తాత్కాలిక వసతి, నర్సరీలు, ప్రాథమిక చికిత్సా వస్తు సామగ్రి, క్యాంటీన్లు వంటివి కల్పించాలి. భద్రతా మార్గదర్శకాలను అనుసరించాలి. కానీ చాలా చోట్ల, ఈ నియమాలేవీ పాటించడం లేదు.

ఈ చట్టం ప్రకారం, 10 కంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న ఏ నిర్మాణ స్థలంలోనైనా ఈ మార్గదర్శకాలను పాటించడం తప్పనిసరి. కార్మికులు రాష్ట్ర సంక్షేమ బోర్డులలో నమోదు చేసుకోవాలి, ఆ తర్వాత వారికి గుర్తింపు కార్డు అంటే లేబర్ కార్డ్ ఇస్తారు.

కానీ మేం కలిసిన చాలా మంది మహిళలకు లేబర్ కార్డు ప్రయోజనాల గురించి తెలియదు. నిర్మాణ కార్మికుల పిల్లలకు అందించే ప్రయోజనాలు, లేబర్ కార్డు పొందే ప్రక్రియ, ఇతర పథకాల కోసం తమ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని వారు చెప్పారు.

ఈ మహిళలు దిల్లీని నిర్మిస్తారు. కానీ వారు నిర్మించే దిల్లీలో వారు నివసించలేరు. మరుగుదొడ్లు, నీళ్లు, ఆరోగ్యం, గౌరవం..ఇవి ప్రాథమిక హక్కులు. కానీ ఈ ప్రాథమిక అవసరాలను 'సౌకర్యాలు'గా చూస్తున్నారు.

దిల్లీ, భవన నిర్మాణ కార్మికులు, మహిళలు, టాయిలెట్లు, అనారోగ్యం

ఫొటో సోర్స్, Ashay Yedge

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని కార్మిక సంక్షేమ కార్యాలయం

'దిల్లీ పేదల కోసం కాదు'

మదన్ లాల్, ప్రేమా దేవి గత పదిహేనేళ్లగా దిల్లీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ప్రేమా దేవి భవన నిర్మాణ కార్మికురాలు. మదన్ లాల్ గత పది సంవత్సరాలుగా ఒంటి చేత్తో చేయగలిగిన పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారి కూతురు పదో తరగతి చదువుతోంది. మేం వారిని వాయవ్య దిల్లీలోని లేబర్ కోర్టులో కలిశాం

మేము మహిళా కార్మికులతో చర్చిస్తున్నప్పుడు, మదన్ లాల్ పక్కన నిలబడి చాలాసేపు మా మాటలు విన్నారు. చివరికి, ఆగలేక, ఆయన '' మహిళలకు టాయిలెట్లు లేవన్నది నిజమే, కానీ మా సంగతి ఏంటి? మాకు కూడా ఏమీ లేవు'' అని చెప్పారు.

మదన్ లాల్ ఎడమ చేతిలో మూడు వేళ్లు లేవు. ఇంకో వేలు విరిగిపోయింది. బొటనవేలు మాత్రమే బాగుంది.

"2016లో, నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. యజమాని ప్రాథమిక చికిత్సకు మాత్రమే డబ్బు చెల్లించారు. ఇప్పుడు నేను ఒక చేత్తో నాకు వీలైన పని చేస్తున్నాను. నేను 2016 నుంచి ఈ కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పటివరకు ఒక్క రూపాయి సాయం కూడా అందలేదు'' అన్నారు ఆయన.

''నిర్మాణ పనులు నేను చేయడం ఆపివేసినప్పటి నుంచి నా భార్య చేస్తున్నారు. మగవాళ్లమయితే మూత్ర విసర్జనకు దూరంగా వెళ్తాం. కానీ నా భార్యకు రోజంతా మూత్ర విసర్జనకు వీలుండదు. నాకు రెండు చేతులు ఉన్నప్పుడు, పెద్ద భవనాలు నిర్మించా. కానీ ఇప్పుడు ఒక చేత్తో నేను ముగ్గురికి ఎలా ఆహారం అందించగలను? మరుగుదొడ్లు, ఆరోగ్యం వంటి సమస్యలు అధిగమించలేనివిగా కనిపిస్తాయి, ప్రాణాలను కాపాడే పోరాటం ఇంకా చాలా పెద్దది'' అని ఆయన చెప్పారు.

''నాకు నిర్మాణ పని ఎలా చేయాలో తెలియదు. కాబట్టి లోడ్ ఎత్తడం, కార్మికులకు వంట చేయడం వంటి ఉపాధి నాకు దొరుకుతుంది. మగవాళ్లతో పోలిస్తే నాకు తక్కువ డబ్బులిస్తారు. నిర్మాణ స్థలంలో మరుగుదొడ్లు ఉండవు. ఏదన్నా పొదలాంటిది ఉంటే అక్కడకు వెళ్లాలి, లేదంటే పొట్టంతా భారంగా ఉంటుంది. దాంతోనే గంటల తరబడి పని చేయాల్సి ఉంటుంది. నేను ఒక రోజు సెలవు పెడితే, యజమాని, ఆ రోజుకు డబ్బులు కట్ చేసుకుంటారు'' అని మదనల్ లాల్ భార్య ప్రేమాదేవి చెప్పారు.

దిల్లీ, భవన నిర్మాణ కార్మికులు, మహిళలు, టాయిలెట్లు, అనారోగ్యం

ఫొటో సోర్స్, Ashay Yedge

ఫొటో క్యాప్షన్, దిల్లీలో ప్రజల అవసరాలకు సరిపడా ప్రభుత్వ టాయిలెట్లు లేవు.
దిల్లీ, భవన నిర్మాణ కార్మికులు, మహిళలు, టాయిలెట్లు, అనారోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారీ నగరాలు నిర్మిస్తున్నా కార్మికుల జేబులు ఖాళీగా ఉంటున్నాయి.

'ప్రభుత్వం మా గురించి కూడా ఆలోచించాలి'

నగరాల ఆధునీకీకరణలో పగలూ రాత్రీ తేడా లేకుండా తెరవెనుక పని చేస్తున్న వారికి పథకాల పేరుతో ప్రభుత్వం కేవలం ఒక చిన్న ప్రతిఫలం అందిస్తోందని ఈ కార్మికులు అభిప్రాయపడ్డారు.

దిల్లీలాగే, దేశంలోని వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో తమ ఇళ్లను, గ్రామాలను, రాష్ట్రాలను విడిచిపెట్టి కడుపు నింపుకుంటున్న వేలాది మంది పరిస్థితి ఇది. కొందరు తమ జీవితంలో 20-30 సంవత్సరాలు ఈ మహానగరాల సేవలో గడిపారు. కానీ వారి జేబులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి.

''కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఎప్పుడూ చదువుతూనే ఉంటాం. అయితే అవి అవసరమైనవారికి..చేరుతున్నాయా? అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ప్రభుత్వం కనీసం మా ప్రాథమిక అవసరాలను విస్మరించకూడదు. మా గురించి కూడా ఆలోచించాలి'' అని మదన్‌లాల్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)