‘నువ్వు ఎలా ఉంటావు?’.. ఫుడ్ డెలివరీ ఉమన్‌తో కస్టమర్ల అసభ్య ప్రవర్తన

ఫుడ్ డెలివరీ గర్ల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, శారద. వి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఫుడ్ డెలివరీ, హోం బ్యూటీ సర్వీసులు, సామగ్రి డోర్ డెలివరీ వంటి అనేక రకాల పనుల్లో మహిళలు భాగమవుతున్నారు. ఈ ఉద్యోగాలకు నిర్దిష్ట పని స్థానం లేదా సమయమంటూ లేదు. అందుకే మహిళలకు అవకాశాలు దొరకడంతో పాటు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి.

పని సమయంలో కొంతమంది మహిళా ఉద్యోగులు కస్టమర్లు, బాటసారులు, కొన్నిసార్లు సహోద్యోగుల నుంచి కూడా వేధింపులను ఎదుర్కొంటున్నారు.

చెన్నైలో ఫుడ్ డెలివరీ చేస్తున్న 32 ఏళ్ల మహిళపై ఇలాగే లైంగిక వేధింపులు జరిగాయి.

ఆమె ఫిర్యాదు ఆధారంగా మనుకృష్ణ (28)అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను, విష్ణు(26) అనే ఫొటోగ్రాఫర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫుడ్ డెలివరీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

అసలేం జరిగింది?

తమిళనాడులోని కొలత్తూరు ప్రాంతం నుంచి గత ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ వచ్చింది. ప్రైవేట్ యాప్ ద్వారా ఫుడ్ డెలివరీ చేసే మహిళ ఆ ఆర్డర్ తీసుకున్నారు.

డెలివరీ లొకేషన్‌ని నిర్ధరించుకోవడానికి కస్టమర్‌కు కాల్ చేశారు మహిళ. అవతలి వైపు ఉన్న వారు ఆమెతో అసభ్యంగా మాట్లాడారు. సందేహపడిన ఆ మహిళ భయంతో సమీపంలోనే ఉన్న తన భర్తను సాయంగా తీసుకెళ్లారు.

భార్యభర్తలు డెలివరీ ఇచ్చే అడ్రస్‌కు చేరుకున్నారు. అయితే, భర్తను ఇంటి బయటే ఉంచి ఆ మహిళ ఫుడ్ పార్శిల్‌తో డోర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఫుడ్ డెలివరీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో రాజమంగళం పోలీస్‌ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేశారు.

పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్డర్ ఇవ్వడానికి వారు ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు, ఇద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఫుడ్ డెలివరీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగంలో ఉన్నప్పుడు తనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెన్నైలో ఫుడ్ డెలివరీ చేసే లత (పేరు మార్చాం) బీబీసీతో చెప్పారు.

"రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెడితే డెలివరీ ఏజెంట్ ఎవరో కస్టమర్‌కు తెలుస్తుంది. డెలివరీ ఇవ్వడానికి మహిళ వస్తున్నట్లు తెలిస్తే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడతారు" అని అన్నారు.

"ఒకసారి కస్టమర్ నాకు ఫోన్ చేసి.. ఎక్కడ ఉన్నావు? రావడానికి ఎంత సమయం పడుతుందని అడిగారు. నాకు ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడారు. నా రూపం ఎలా ఉంటుంది? ఏ రంగు దుస్తులు ధరించానో అడిగారు. నేను ఫుడ్‌ను ఆయన ఇంటి దగ్గర వదిలి వచ్చాను" అని ఆమె చెప్పారు.

చెన్నైకు చెందిన 36 ఏళ్ల ప్రియ (పేరు మార్చాం) పరిస్థితి కూడా ఇలాంటిదే. ఆఫీసులకు కాకుండా ఇళ్లకు ఆహారాన్ని డెలివరీ చేయడం కొంచెం ఇబ్బందికరమని ఆమె చెప్పారు.

"చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తుంటారు. వారికి లంచ్ ఆర్డర్‌లు వెళతాయి. ఒకసారి నేను కస్టమర్‌కు కాల్ చేసి చిరునామాను ధ్రువీకరించుకొని, రెండు నిమిషాల తర్వాత అక్కడికి వెళ్లాను. అతను షర్ట్ లేకుండా వచ్చి ఫుడ్ తీసుకున్నారు. కస్టమర్ ఉద్దేశపూర్వకంగా చేశాడో లేదో నాకు తెలియదు. కానీ అతన్ని అలా చూడటం నాకు అసౌకర్యంగా అనిపించింది" అని ప్రియ అన్నారు.

తన ఇద్దరు పిల్లలను చదివించడానికి డెలివరీల నుంచి వచ్చే సంపాదన చాలా ముఖ్యమన్నారు ప్రియ.

''ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఆఫీసుకు వెళ్లలేను. ఇంటి పనులు చూసుకుంటూ ఆ పనులు చేయలేను. పిల్లలను స్కూల్‌కి పంపి, ఖాళీ సమయాల్లో కొన్ని ఆర్డర్లు డెలివరీ చేస్తే కొంత ఆదాయం వస్తుంది. నా సంపాదన తక్కువే, కుటుంబ అవసరాలకు నా భర్త ఆటో నడుపుతారు'' అని ప్రియ చెప్పారు.

ఫుడ్ డెలివరీ పనిలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరిగినట్లు రిపోర్టులు లేవు. అయితే, దేశంలో డెలివరీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళల సంఖ్య పెరుగుతుండటంతో వారి భద్రతకు చర్యలు తీసుకోవడం చాలా అవసరం.

ఫుడ్ డెలివరీ, మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

కంపెనీలు ఏం చేస్తున్నాయి?

జొమాటో తన మహిళా డెలివరీ సిబ్బందికి ఆత్మరక్షణ శిక్షణను తప్పనిసరి చేసినట్లు తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. సాయంత్రం పూట ఆర్డర్‌లను డెలివరీ చేసేటప్పుడు నేరుగా కస్టమర్‌కు అందజేయాల్సిన అవసరం లేదని, వారి చిరునామాకు డెలివరీ చేస్తే సరిపోతుందని తెలిపింది.

"మహిళా డెలివరీ వర్కర్ల కోసం ప్రత్యేక రెస్ట్‌రూమ్ సౌకర్యాలను అందించే రెస్టారెంట్‌లను ప్రత్యేకంగా హైలైట్ చేయడం, మహిళా డెలివరీ వర్కర్లు ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కినప్పుడు వారి లొకేషన్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు షేర్ చేయడం" వంటి చర్యలు తీసుకున్నట్లు జొమాటో తెలిపింది.

2016 నుంచి మహిళలను డెలివరీ వర్కర్లుగా నియమించుకుంటోంది స్విగ్గీ. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులను పరిష్కరించడానికి 2022లో ఆ సంస్థ ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, కంపెనీలో ఒక ఉద్యోగి లైంగిక వేధింపులకు గురైతే అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకురావొచ్చు. వర్క్‌ప్లేస్‌లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద ఆ ఫిర్యాదును తీసుకోనున్నట్లు స్విగ్గీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

రెస్టారెంట్లు, కస్టమర్లు, డెలివరీ సిబ్బంది నుంచి మహిళా ఉద్యోగి ఏదైనా వేధింపులను ఎదుర్కొంటే, దానిపై ఎలా ముందుకెళ్లాలనే విషయంలో చట్టపరమైన మార్గదర్శకాలు అందిస్తామని పేర్కొంది. కస్టమర్ ఫోన్ నంబర్ రికార్డ్ అవుతుందని, భవిష్యత్తులో ఆ వ్యక్తికి ఫుడ్ డెలివరీ చేయడానికి మహిళా ఉద్యోగిని పంపబోమని స్విగ్గీ స్పష్టంచేసింది

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

చట్టపరంగా..

గిగ్ వర్కర్ల (తాత్కాలిక, ఫ్రీలాన్స్) కోసం సమగ్ర చట్టాలు అవసరమని నిపుణులు అంటున్నారు.

"వర్క్‌ప్లేస్‌లో లైంగిక వేధింపులు (లైంగిక వేధింపుల నివారణ) చట్టం 2013 ప్రకారం.. ఆఫీసులో కాకుండా ఇతర ప్రదేశాలలో జరిగే లైంగిక వేధింపులను కూడా పరిష్కరించవచ్చు. ఉదాహరణకు, ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్లే ప్రదేశంలో వేధింపులకు గురైతే తన ఆఫీసులోని ఫిర్యాదుల కమిటీకి కంప్లైంట్ ఇవ్వొచ్చు. నిందితుడు మరో కంపెనీలో పనిచేస్తుంటే సదరు 'సంస్థ ఫిర్యాదుల కమిటీ'ని సంప్రదించి సంయుక్తంగా విచారణ చేయవచ్చు" అని న్యాయవాది జయంతి చెప్పారు.

అయితే డెలివరీ వర్కర్లతో సహా గిగ్ వర్కర్ల విషయంలో చట్టం 'యజమాని-ఉద్యోగి' సంబంధం ఉన్నట్లు పరిగణించనందున వారికి చట్టపరమైన రక్షణ కల్పించడం సవాలుగా మారిందని జయంతి అభిప్రాయపడ్డారు.

"ఉద్యోగిగా చట్టపరమైన గుర్తింపు లేకపోతే ఆ మహిళా ఉద్యోగుల భద్రత కోసం కంపెనీలు ఎంత బాధ్యత తీసుకోవాలో స్పష్టంగా లేదు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం అన్ని కంపెనీలు వారి అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీలు మహిళా ఉద్యోగులకు మార్గనిర్దేశం చేయాలి" అని జయంతి అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)