స్విగ్గీ : ఈ కంపెనీ ఉద్యోగులు కోటీశ్వరులు ఎలా అయ్యారు, ఈసాప్స్ అంటే ఏమిటి?

Swiggy IPO

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐపీఓ ద్వారా స్విగ్గీ తన కంపెనీలోని ఎంతోమంది ఉద్యోగుల జీవితాలను మార్చేసింది.
    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఫుడ్ ఆర్డర్ కోసం ప్రతి ఒక్కరూ ఆశ్రయించే ఆన్‌లైన్ వేదికలలో స్విగ్గీ ఒకటి.

ఫుడ్ డెలివరీ మార్కెట్‌లోకి 2014లో ప్రవేశించిన ఈ కంపెనీ.. తన వ్యాపార విస్తరణ కోసం స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.

స్విగ్గీ ఇటీవలే తన ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ను పూర్తి చేసుకుంది.

గతవారం బీఎస్ఇ, ఎన్ఎస్ఇ ప్లాట్‌ఫామ్‌లపై కూడా లిస్ట్ అయింది.

వ్యాపార సంస్థలు మూలధన సమీకరణ, వ్యాపార విస్తరణ అవసరాల కోసం నిధుల సేకరణకు ఎంచుకునే మార్గంలో భాగంగా తొలిసారి స్టాక్‌ మార్కెట్‌లో నమోదవడాన్నే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు.

ఈ విధానంలో ప్రజలకు (డీమ్యాట్ ఖాతాలు ఉండి దరఖాస్తు చేసుకున్నవారికి) తమ సంస్థ షేర్లను విక్రయించడం ద్వారా నిధులు సమీకరిస్తారు. కాబట్టి దీన్ని పబ్లిక్ ఆఫర్ అని కూడా పిలుస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఐదువందలమంది కోటీశ్వరులు

ఐపీఓ ద్వారా స్విగ్గీ తన కంపెనీలోని ఎంతోమంది ఉద్యోగుల జీవితాలను మార్చేసింది. స్విగ్గీలో పనిచేసే ఉద్యోగులలో ఐదువందల మంది వరకు ఒక్కసారిగా కోటీశ్వరులు అయ్యారని మనీ కంట్రోల్ రిపోర్టు తెలిపింది.

ఇదంతా స్విగ్గీ తన ఉద్యోగులకు ఆఫర్ చేసిన ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్(ESOPs) వల్లనేనని ఆ రిపోర్టు పేర్కొంది.

2024 సెప్టెంబర్ నాటికి 23 కోట్ల 19 లక్షల 65 వేల 392 ESOPs(షేర్లను) ఆఫర్ చేసినట్లు తెలిపింది.స్విగ్గీ ఐపీఓకు వచ్చినప్పుడు ఒక్కో షేరు ధర రూ.371 నుంచి రూ.390 మధ్యలో నిర్ణయించింది. ఇక్కడ గరిష్ట ధర రూ.390ను లెక్కలోకి తీసుకుంటే, మొత్తంగా కంపెనీ ఇచ్చిన 23 కోట్లకు పైబడిన ESOPs(షేర్ల) విలువ రూ.9,046.65 కోట్లుగా ఉంది.

ఇదే ఇప్పుడు సుమారు 500 మంది స్విగ్గీ ఉద్యోగులను కోటీశ్వరుల క్లబ్‌లో చేర్చింది. వారి వద్దనున్న ఈసాప్‌లు కోట్లలో పలుకుతున్నాయి.

అసలు ఇంతకీ ఈసాప్స్ అంటే ఏమిటి?వాటినెప్పుడు ఆఫర్ చేస్తారు? ఎవరెవరికి ఇస్తారు? తదితర విషయాలను తెలుసుకుందాం..

స్విగ్గీ

ఫొటో సోర్స్, BSE

ESOP అంటే ఏమిటి?

ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్ (ESOPs) అంటే ఉద్యోగులకు కంపెనీ స్టాక్స్ కొనుగోలు చేసే హక్కు ఇవ్వడం. సంస్థ ఉద్యోగుల సంక్షేమంతోపాటు వారి పనితీరు ప్రోత్సాహక సంకేతంగా దీన్ని చూస్తారు.

ఉద్యోగులకు ప్రయోజనాన్ని చేకూర్చే ప్రణాళిక ఇది. వీటిని నేరుగా గానీ, లేదా ట్రస్ట్ ద్వారా గానీ ఉద్యోగులకు ఇస్తారు. ఈ ప్లాన్ కింద రాయితీ ధరల్లో ఉద్యోగులకు కంపెనీ షేర్లు లభిస్తుంటాయి.

ఏ కంపెనీ అయినా ఈసాప్ జారీ చేసుకోవచ్చని క్లియర్ ట్యాక్స్ తన రిపోర్టులో పేర్కొంది. లిస్టెడ్ కంపెనీలు మినహా మిగిలిన అన్ని కంపెనీలు కంపెనీస్ యాక్ట్ 2013, కంపెనీస్(షేర్ క్యాపిటల్, డిబెంచర్స్) రూల్స్ 2014 అనుగుణంగా ESOPsను జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

లిస్టెడ్ కంపెనీలు అయితే, సెక్యూరిటీస్,ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) జారీ చేసిన ESOP మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది.

రాజ్‌కుమార్ రేండ్ల, ఎస్‌ఎస్‌ఇఎల్‌ గ్రూప్‌

ఫొటో సోర్స్, Rajkumar

ఫొటో క్యాప్షన్, ఎస్ఎస్ఇఎల్ గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్ రాజ్‌కుమార్ రేండ్ల

ESOPs ను ఎందుకు ఇస్తాయి?

కంపెనీలు ESOPs ను ఉద్యోగులకు కొన్ని ముఖ్యకారణాలతో ఇస్తుంటాయని ఎస్‌ఎస్‌ఇఎల్‌ గ్రూప్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ హెడ్‌ రాజ్‌కుమార్‌ రేండ్ల చెప్పారు. ఆ కారణాలేమిటో ఆయన వివరించారు.

1. ప్రోత్సాహం:

  • ఉద్యోగులను తమ వ్యక్తిగత కృషితో సంస్థ ప్రగతిలో భాగస్వాములు అయ్యేలా ప్రేరేపిస్తారు.
  • కంపెనీ విజయంతో ఉద్యోగుల సంపద పెరుగుతుంది. ఇది వారి పనితీరును మెరుగుపరిచేలా చేస్తుంది.

2. కంపెనీని విడిచిపెట్టేవారి సంఖ్యను తగ్గించడానికి

  • ESOPs ను పొందిన తరువాత ఉద్యోగులు మరింత కాలం పనిచేయాలనుకుంటారు. ఇది సంస్థకు ఉద్యోగులను నిలబెట్టుకోవడంలో సహాయపడుతుంది.
  • స్టాక్ ఆప్షన్స్ సాధారణంగా కొన్ని సంవత్సరాల తర్వాత వాడుకలోకి రావడం వల్ల ఉద్యోగులకు ఎక్కువ కాలం పనిచేయడానికి ప్రేరణగా ఉంటుంది. ఇది కంపెనీ ఉత్పాదకత పెంచేందుకు తోడ్పడుతుంది.

3. ఆర్థిక ప్రయోజనాలు:

  • ఉద్యోగులు కంపెనీ వాటాలను కొంటే, వాటి విలువ పెరిగితే వారి ఆర్థిక ప్రయోజనాలు కూడా పెరుగుతాయి.

4. భాధ్యత పెరుగుతుంది :

  • ESOPs వల్ల ఉద్యోగులు సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు, లేదా కంపెనీ అభివృద్ధిని వ్యక్తిగత అభివృద్ధిగా భావించి మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు.
  • కంపెనీ విజయంలో వారూ భాగస్వాములు అవుతారు.

5. ఉద్యోగులకు పెట్టుబడిగా:

  • కంపెనీ స్టాక్ ఆప్షన్లు పెట్టుబడి రూపంలో వాడుకోవచ్చు. ఇది వారికి కొత్త ఆర్థిక అవకాశాలను కల్పిస్తుంది.
  • ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ తర్వాత మరింత ఆర్ధికదన్నుగా నిలుస్తుంది. అంతేకాదు ఉద్యోగులకు సినియారిటీ పెరిగిన కొద్దీ వారి పిల్లల చదువులు, పెళ్లిళ్లకు పనికి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారితోపాటు వారి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని రాజ్‌కుమార్ వివరించారు.
స్విగ్గీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రతిభావంతులను నిలుపుకునేందుకు..

స్టార్టప్ కంపెనీలు తమ ఉద్యోగులను ఆకర్షించడానికి, వారు కంపెనీలోనే ఉండేలా ESOPs ను ఇస్తాయని రాజ్‌కుమార్ వివరించారు.

‘‘పని భారం పెరిగిన సమయంలో పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ESOPs ఇస్తాయి. కంపెనీ వ్యూహాత్మక మార్పుల కారణంగానూ, లేదంటే పెద్ద కంపెనీలు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టినపుడు ఉద్యోగులకు ESOPsను ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. ఈ విధంగా, ESOPs కంపెనీ, ఉద్యోగుల మధ్య గట్టి సంబంధాన్ని పెంచే ఒక ముఖ్యమైన సాధనంగా ఉంటున్నాయి’’ అని రాజ్‌కుమార్ వివరించారు.

మొత్తం మీద ESOPsను కేటాయించడం ఇటు ఉద్యోగులకే కాదు కంపెనీ భవిష్యత్తుకు కూడా మంచిదనే చెప్పారు.

ఇటీవల కాలంలో, ప్రైవేట్ కంపెనీలు ఉన్నతస్థానంలోని ప్రతిభావంతులైన ఉద్యోగులను సంస్థలోనే ఉంచుకునేందుకు ESOPsను ఆఫర్ చేస్తున్నట్లు కేపీఎంజీ కూడా తన రిపోర్టులో పేర్కొంది.

ప్రైవేట్ కంపెనీలు ఎక్కువగా ESOPsను జారీ చేస్తున్నట్లు 2021లో విడుదల చేసిన తన రిపోర్టులో వెల్లడించింది. ఉద్యోగుల కోసం కంపెనీలు ఆఫర్ చేస్తోన్న వాటిల్లో స్టాక్ ఆప్షన్ ప్లాన్ కూడా ఉంటుందని తెలిపింది.

ఏ సమయంలో ఇస్తారు?

ESOPs ఉద్యోగులకు ఇవ్వడంలో కొన్ని కీలక గడువులు ఉంటాయి.అంటే ఉద్యోగి వీటిని పొందడానికి ఎంతకాలం సంస్థ కోసం పనిచేయాలనే గడువు (vesting periods) ఉండవచ్చు. ఉద్యోగికి ESOPs పొందడానికి వాటిని విక్రయించడానికి కొన్ని రోజుల లేదా సంవత్సరాల గడువు ఉంటుంది.

ఈ గడువు కంపెనీ పాలసీ, ఉద్యోగి ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా 3-5 సంవత్సరాలు:

ESOPs నిర్ధేశిత గడువు సాధారణంగా 3 నుండి 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే, ఉద్యోగి ఆ సంస్థలో కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు పనిచేయాలి.

లీనియర్ గడువు : ప్రతి సంవత్సరం కొంత మొత్తం స్టాక్స్ ఉద్యోగికి అందిస్తారు. ఇలా 3 నుంచి 5 సంవత్సరాలలో ఉద్యోగికి పూర్తి ESOPs లభిస్తాయి.

షార్ట్-టర్మ్ (1-2 సంవత్సరాలు): కొన్ని కంపెనీలు కొత్త ఉద్యోగులకు ఎక్కువ సులభతరంగా ESOPs ను ఇవ్వడానికి 1 నుంచి 2 సంవత్సరాల స్వల్ప గడువును నిర్ణయించవచ్చు.

ప్రమోషన్లకు సంబంధించి: ఉద్యోగి ప్రొమోషన్ పొందిన తరువాత ESOPs ఇస్తే, కొంత భాగం మొదటి వర్షన్‌తో ఇస్తారు. మరి కొంత భాగం ఉద్యోగి నిర్ణీత కాలం పూర్తి చేసిన తర్వాత ఇస్తారు.

స్విగ్గీ ఉద్యోగులు

ఫొటో సోర్స్, Getty Images

సెబీ మినహాయింపుతో..

స్విగ్గీ సుమారు 5 వేల మందికి ఈసాప్‌లను జారీ చేసింది. వారిలో 500 మంది ఉద్యోగులు ప్రస్తుతం కంపెనీ ఐపీఓ షేరు ధర ప్రకారం కోటీశ్వరులుగా మారారని తెలిసింది.

స్విగ్గీ డీఆర్‌హెచ్‌పీ రిపోర్టు ప్రకారం, ఇప్పటి వరకు మూడు ఈసాప్ ప్లాన్లను ఇది ప్రవేశపెట్టింది. 2015, 2021,2024లలో ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది.

ఈ ఏడాది జూలైలో సెబీ నుంచి స్విగ్గీ పొందిన మినహాయింపుతో ఐపీఓ తర్వాత నెలలోనే ఈసాప్ షేర్లను ఉద్యోగులు అమ్మకునే వెసులుబాటు ఉందని లైవ్‌మింట్ రిపోర్టు చేసింది.

స్విగ్గీ ఈసాప్ చెల్లింపులు భారత స్టార్టప్ రంగంలో అత్యధిక చెల్లింపుల్లో ఒకటని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతకుముందు వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ 1.4 బిలియన్ డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్ల వరకు చెల్లింపులు చేసింది.

ESOPs ఎలా లెక్కిస్తారు?

ESOPs విలువ లెక్కింపు చాలా క్లిష్టంగా ఉంటుంది. దీనిలో కంపెనీ విలువ, ఎన్ని షేర్లు కేటాయించారు, ఎంప్లాయీస్ వెస్టింగ్ షెడ్యూల్ ఏమిటి అనే అంశాలపై దీని లెక్కింపు ఆధారపడి ఉంటుంది. వీటిని ఆర్థిక నిపుణులు, ట్రస్టీలే చేపడతారు.

అయితే, ESOPsను ఆఫర్ చేసిన కంపెనీ మార్కెట్లో ఐపీఓకి వెళ్లి, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు, వారి ESOP షేర్లు కూడా పబ్లిక్ మార్కెట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, విలువలో మార్పులు, చట్టప్రమాణాల పాటింపు, పాలనా విధానాల్లో మార్పులకు ఆ ఉద్యోగులు సిద్ధమై ఉండాలి.

స్విగ్గీ, జొమాటో

ఫొటో సోర్స్, Insta/Zomato

‘‘నువ్వు, నేను.. ఈ అద్భుతమైన ప్రపంచంలో..’’

స్విగ్గీ ప్రత్యర్థి జొమాటో 2021లోనే ఐపీఓకి వచ్చింది. ఈ కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు బంపర్ లిస్టింగ్ అయింది. ప్రస్తుతం స్విగ్గీకి కూడా మంచిగానే స్పందన వచ్చింది.

స్విగ్గీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సందర్భంగా జొమాటో ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది.

‘‘నువ్వు, నేను.. ఈ అద్భుతమైన ప్రపంచంలో..’’ అనే క్యాప్షన్‌తో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ స్టాక్ మార్కెట్‌ను చూస్తున్న ఫోటోను షేర్ చేసింది.

ఈ ఇన్‌స్టా పోస్టుకు లైక్‌ల వెల్లువ కొనసాగుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)