బ్రిటన్ సంస్థలైన జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీలను టాటా కొనడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

రతన్ టాటా, టాటా గ్రూప్, టాటా సన్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిఖిల్ ఇనాందార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మానవతావాది, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా 86 ఏళ్ల వయసులో బుధవారం రాత్రి మరణించారు. గురువారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.

భారత్‌లోని పురాతన వ్యాపార సంస్థల్లో ఒకటైన ‘టాటా గ్రూప్’ గ్లోబలైజేషన్, ఆధునీకరణలో ఈయన కీలక పాత్ర పోషించారు.

1990 తరువాత భారత్‌లో వచ్చిన ఆర్థిక సరళీకరణ విధానాలను అందిపుచ్చుకుంటూ, సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రఖ్యాత సంస్థలను కొనుగోలు చేసే స్థాయిలో టాటా గ్రూప్‌ను నిలబెట్టారు రతన్ టాటా. 155 ఏళ్ల చరిత్ర గల టాటా గ్రూప్‌.. సాల్ట్ నుంచి స్టీల్ వరకు అనేక రంగాల్లో తన వ్యాపారాలను విస్తరించింది.

2000 సంవత్సరం ప్రారంభంలో ‘టెట్లీ టీ’ సంస్థను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. అది భారతీయ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద క్రాస్- బోర్డర్ కొనుగోలుగా నిలిచింది. ఆ సమయానికి ‘టెట్లీ టీ’ సంస్థ ప్రపంచంలో రెండవ అతిపెద్ద టీ బ్యాగ్స్ ఉత్పత్తిదారు.

ఆ తరువాతి కాలంలోనూ రతన్ టాటా భారీ లక్ష్యాలను పెట్టుకున్నారు.

అందుకు నిదర్శనమే.. బ్రిటీష్ దిగ్గజ సంస్థలైన స్టీల్ తయారు చేసే కోరస్, లగ్జరీ కార్లు తయారు చేసే జాగ్వార్‌ ల్యాండ్ రోవర్‌ (జేఎల్ఆర్)లను కొనుగోలు చేశారు.

అయితే, కొనుగోలు చేసిన కంపెనీలన్నీ లాభాలు ఇవ్వలేదు.

చాలా కాలంగా టాటా స్టీల్స్ పనితీరు గొప్పగా లేకపోయినప్పటికీ, 2007 ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లోనూ భారీ మొత్తంలో వెచ్చించి కోరస్‌ను కొనుగోలు చేశారు.

“ఏ వలసవాదుల పాలనలో ఓ కంపెనీ (టాటా) ప్రస్థానం మొదలుపెట్టిందో, ఇప్పుడు ఆ వలసపాలకుల దేశమైన బ్రిటన్ సంస్థలను కొనుగోలు చేసే స్థాయికి ఆ కంపెనీ ఎదిగింది” అని చరిత్రకారుడు మిర్సెయా రయాను చెప్పారు. ఈయన ‘టాటా: ది గ్లోబల్ కార్పొరేషన్ దట్ బిల్ట్ ఇండియన్ క్యాపిటలిజం’ అనే పుస్తకం రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు, తెలుగు న్యూస్, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టాటా స్టీల్, సాల్ట్, జేఆర్‌డీ టాటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిటన్‌లోని ఈ భారీ ఉక్కు కర్మాగారం టాటా గ్రూప్ ఆధీనంలో ఉంది.

ట్రాక్టర్ నుంచి జాగ్వార్ ల్యాండ్ రోవర్ వరకు ప్రస్థానం

మొదటి నుంచి కూడా బయటి వైపు దృష్టి పెట్టడమే టాటా గ్రూప్ ప్రత్యేకత అని ఆర్థికవేత్త ఆండ్రియా గోల్డ్ స్టీన్ చెప్పారు.

అంతర్జాతీయ సంస్థలుగా మారుతున్న భారతీయ వ్యాపార సంస్థలపై ఆయన 2008లో అధ్యయనం చేశారు. అందులో ప్రధానంగా టాటా గ్రూప్‌ను నిశితంగా పరిశీలించారు.

1950 తొలినాళ్లలో విదేశీ భాగస్వాములతో కలిసి టాటా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండేవి.

కానీ, రతన్ టాటా మాత్రం అంతర్జాతీయకరణ పెద్ద ఎత్తున జరగాలనే భావనలో ఉండేవారని గోల్డ్ స్టీన్ చెప్పారు.

రతన్ టాటాలో విస్తరణ కాంక్ష పెరగడంలో, రెగ్యులర్ కోర్సులు కాకుండా ఆర్కిటెక్చర్ చదవడం, తన కుటుంబం నిర్వహించే సంస్థలను దగ్గరి నుంచి చూడటం వంటివి కీలక పాత్ర పోషించాయని రచయిత రయాను అన్నారు.

టాటా గ్రూప్‌లోని నిర్మాణాత్మకమైన వ్యవస్థ వల్లే ప్రపంచ మార్కెట్‌పై రతన్ టాటా బలమైన ముద్ర వేయగలిగారు.

భారత్ ఆర్థిక సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టడం, 1991లో టాటా సన్స్ గ్రూప్ చైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టడం ఏక కాలంలో జరిగాయి. ఆ సమయంలో టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్‌లో అసాధారణమైన కార్పొరేట్ యుద్ధం చేయాల్సి వచ్చింది.

టాటా గ్రూప్ సంస్థల్లో ప్రక్షాళన మొదలుపెట్టారు. మాతృ సంస్థ పర్యవేక్షణ ఎక్కువగా లేకుండానే టాటా స్టీల్, టాటా మోటార్స్, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహించేలా తీర్చిదిద్దారు.

అలాగే, గ్రూప్ విస్తరణ కొరకు ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు కలిగి ఉన్న విదేశీయులు, ఎన్ఆర్ఐలు, ఎగ్జిక్యూటివ్స్‌ను మేనేజ్‌మెంట్ టీమ్‌లో నియమించారు.

గ్రూప్‌లోని కంపెనీలకు మార్గనిర్దేశం చేసేందుకు గ్రూప్ కార్పొరేట్ సెంటర్-జీసీసీ ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా సంస్థల కొనుగోలు, అమ్మకాలపై సూచనలు ఇస్తుంది.

అంతకుముందు టాటా మోటార్స్ అంటే ట్రాక్టర్లు తయారు చేసే సంస్థ అనే పేరు ఉండేది. కానీ, బ్రిటన్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థను కొనుగోలు చేసిన తరువాత ప్రపంచ మార్కెట్‌లో ‘టాటా గ్రూప్‌’ను చూసే కోణమే మారిపోయింది. ఈ నిర్ణయం తీసుకోవడంలో జీసీసీ సహకారం అందించింది.

“1990ల్లో టాటా మోటార్స్‌ను కొనుగోలు చేయడానికి ఫోర్డ్ కంపెనీ నిరాకరించింది. అయితే, తర్వాత 2008లో అదే ఫోర్డ్‌ గ్రూప్‌కు చెందిన బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌‌ను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. దీనిని ప్రతీకారంగా చూడొచ్చు. వృద్ధి రేట్లు పెరగడంతో పాటు ఆర్థిక సరళీకరణ విధానాలు ఫలించడంతో భారతీయ కార్పొరేట్లు ప్రపంచ వేదికపైగా సగర్వంగా నిలబడగలిగారు” అని రయాను వివరించారు.

ప్రస్తుతం 128 బిలియన్ డాలర్ల విలువ గల టాటా గ్రూప్ 100 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ గ్రూపు ఆదాయంలో గణనీయమైన వాటా విదేశాల నుంచి వస్తోంది.

టాటా నానో కారు, నానో కారు, టాటా మోటార్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రతన్ టాటా ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు 'టాటా నానో'

కలల ప్రాజెక్ట్ 'నానో కారు'

2000 తొలినాళ్లలో ‘టాటా గ్రూప్’ భారత్ వెలుపల గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, దేశీయంగా ‘టాటా నానో’తో దెబ్బతింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా దీనిని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు.

ఇది రతన్ టాటా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. కానీ, అప్పట్లో భారత మార్కెట్‌ను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారు.

ఎన్నో ఆశలతో ఎదుగుతున్న భారత్ ‘చీపర్ ట్యాగ్‌లైన్‌’తో వచ్చిన కారును ఇష్టపడలేదని నిపుణలు అంటారు. దీనిని ‘పేదవారి కారు’గా అభివర్ణించడం సరికాదని రతన్ టాటానే స్వయంగా ఒప్పుకున్నారు.

అయితే, క్రమంగా ఈ కార్లు ఆదరణకు నోచుకుంటాయని రతన్ టాటా విశ్వసించారు. కానీ, ‘టాటా నానో’ అమ్మకాలు ఏటికేడు పడిపోతుండటంతో చివరికి ఉత్పత్తి నిలిపివేశారు.

‘టాటా గ్రూప్‌’లో వారసత్వం కూడా ఒక కఠినమైన సమస్యగా మారింది.

రతన్ టాటా 2012లో పదవీ విరమణ చేసిన తరువాత, టాటా సన్స్ సంస్థలో మూడింట రెండొంతుల వాటా కలిగిన ‘టాటా ట్రస్ట్’ను నడపడంలో నిమగ్నమై ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.

సైరస్ మిస్త్రీతో వారసత్వ వివాదం కారణంగా టాటా గ్రూప్ ప్రతిష్ఠ దెబ్బతిందని రయాను చెప్పారు.

2022లో జరిగిన కారు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ మరణించారు. ఆయనను 2016లో చైర్మన్ పదవి నుంచి తొలగించారు. ఇది బోర్డ్ రూమ్ తిరుగుబాటుకు దారితీసింది. సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారి తీసినప్పటికీ, చివరికి టాటాలే విజయం సాధించారు.

జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ టీ, రతన్ టాటా, కార్పొరేట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ సంస్థను కొనుగోలు చేసిన 'టాటా గ్రూప్'

టాటా గ్రూప్‌ కల్పతరువుగా టీసీఎస్

తన ప్రయాణంలో చాలా తప్పటడుగులు వేసినప్పటికీ, 2012లో తాను పదవీ విరమణ పొందే సమయానికి దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ‘టాటా గ్రూప్‌’ను బలమైన స్థానంలో రతన్ టాటా ఉంచారు.

పెద్ద పెద్ద సంస్థలను కొనుగోలు చేయడంతో పాటు ఐటీ రంగంపై దృష్టిసారించి గ్రూప్‌ను ఆధునీకరించారు.

తన పెద్ద పెద్ద పందేలు చాలా వరకు విఫలమైనప్పటికీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మాత్రం లాభాల పంట పండించింది. ‘జేఎల్ఆర్’తో పాటు కష్టాల్లో ఉన్న ఇతర కంపెనీల భారాన్ని టీసీఎస్ మోసిందని రయాను చెప్పారు.

ప్రస్తుతం భారత దేశ అతిపెద్ద ఐటీ సంస్థగా టీసీఎస్ ఉంది. ఇది ‘టాటా గ్రూప్’కు కల్పతరువు లాంటిది.

టాటా గ్రూప్ స్థాపించిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సుమారు 69 ఏళ్ల పాటు భారత ప్రభుత్వ నియంత్రణలో ఉంది. 2022లో తిరిగి దానిని తమ గ్రూప్‌లోకి రతన్ టాటా తీసుకువచ్చారు. పైలట్‌గా శిక్షణ పొందిన రతన్ టాటాకు ఈ కొనుగోలుతో ఓ కల నిజమైనట్లే. ఎయిర్‌లైన్స్‌ను నడపడం ఎంతో పెట్టుబడితో కూడుకున్నది. అయినప్పటికీ రతన్ టాటా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

ఎయిర్ లైన్స్ నుంచి సెమీ కండక్టర్ల వరకు ఎంతటి భారీ పందెం వేయడానికి అయినా సరే మునుపెన్నడూ లేనంత బలమైన స్థితిలో ప్రస్తుతం టాటా గ్రూప్ ఉన్నట్లు కనిపిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)