పశ్చిమాసియా వివాదం: చివరికి ఎలా ముగుస్తుంది?

పశ్చిమాసియా వివాదం
    • రచయిత, పాల్ ఆడమ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పశ్చిమాసియాలో చెలరేగిన మంటలు ఏడాది గడిచినా చల్లారేలా కనిపించడం లేదు. ఈ పోరులో ఇప్పటివరకు 41,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. 20 లక్షల మంది గాజావాసులు చెల్లాచెదురై పోయారు.

వెస్ట్ బ్యాంక్‌లో మరో 600 మంది పాలస్తీనియన్లు మరణించారు. లెబనాన్‌లో, పది లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు కాగా, 2 వేల మందికి పైగా మరణించారు.

పోరు మొదటి రోజు 1,200 మందికి పైగా ఇజ్రాయెలీలు మరణించారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాలో మరో 350 మంది సైనికులను కోల్పోయింది.

గాజాకు దగ్గరగా, లెబనాన్‌ ఉత్తర సరిహద్దు వెంబడి రెండు లక్షల మంది ఇజ్రాయెలీలను వారి ఇళ్ల నుంచి బలవంతంగా తరలించారు. హిజ్బుల్లా రాకెట్ల దాడిలో దాదాపు 50 మంది సైనికులు, పౌరులు మరణించారు. పశ్చిమాసియాలోని కొన్ని దేశాలు కూడా ఈ పోరులోకి దిగాల్సి వచ్చింది.

అధ్యక్ష పర్యటనలు, లెక్కలేనన్ని దౌత్య కార్యకలాపాలు, సైనిక వనరులను మోహరించడం, సంక్షోభం తీవ్రతరం కాకుండా నిరోధించడానికి అమెరికా చేసిన ప్రయత్నాలు ఇవేవీ ఫలించలేదు.

ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకున్నాయి, అవి ఇంకా దాడులు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలోవాషింగ్టన్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నెతన్యాహుకు పెరుగుతున్న మద్దతు

పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉందని మీడియా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, అక్టోబరు 7కి ముందు, తర్వాత గాజా ప్రజల జీవితాలను దాదాపుగా మరిచిపోయారు.

అదే విధంగా జీవితాలను తలకిందులు చేసిన ఆ భయంకరమైన రోజును తల్చుకుంటూ కొంతమంది ఇజ్రాయెలీలు తమను నిర్లక్ష్యం చేసినట్లు భావిస్తున్నారు.

‘‘మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేశారు’’ అని బందీగా ఉన్న నిమ్రోడ్ కోహెన్ తండ్రి యెహుదా కోహెన్ గత వారం ఇజ్రాయెల్‌కు చెందిన కాన్ న్యూస్‌తో అన్నారు. ఈ అర్ధంలేని యుద్ధానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బాధ్యత వహించాలని కోహెన్ డిమాండ్ చేశారు.

అయితే మరికొందరు ఇజ్రాయెలీల దృక్పథం మాత్రం భిన్నంగా ఉంది. ఏడాది కిందట హమాస్ చేసిన దాడులను చాలామంది యూదు రాజ్యాన్ని నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ శత్రువులు చేసిన విస్తృత ప్రచారానికి నాందిగా భావిస్తున్నారు.

పేజర్ల పేలుళ్లు, టార్గెటెడ్ హత్యలు, దీర్ఘ శ్రేణి బాంబు దాడులు, ఇంటెలిజెన్స్ కార్యకలాపాలతో ఇజ్రాయెల్‌ ఒక సంవత్సరం క్రితం కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందిందని వారు భావిస్తున్నారు.

గత వారం నెతన్యాహు, ‘‘ఇజ్రాయెల్‌ పశ్చిమాసియాలో ఎక్కడికైనా చేరుకోగలదు’’ అని చాలా ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు.

అక్టోబరు 7వ తేదీ తర్వాత ప్రధానమంత్రి పోల్ రేటింగ్‌లు అట్టడుగు స్థాయికి చేరుకోగా, ఇప్పుడు అవి మళ్లీ పుంజుకుంటున్నాయి. దీన్ని మరిన్ని సాహసోపేతమైన చర్యలకు లైసెన్స్ అనుకోవచ్చా?

మృతులకు నివాళులు అర్పిస్తున్న ఇజ్రాయెలీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అక్టోబరు 7 దాడులు జరిగి ఏడాదైన సందర్భంగా మృతులకు నివాళులు అర్పిస్తున్న ఇజ్రాయెలీలు

కిం కర్తవ్యం?

కానీ ఇదంతా ఎక్కడికి దారి తీస్తోంది?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం నాలుగు వారాల సమయం ఉండడంతో, పశ్చిమాసియా రాజకీయాలు ఇప్పుడు మునుపెన్నడూ లేనంత అస్థిరంగా ఉన్నాయి. అందువల్ల ఈ పోరాటానికి సంబంధించి, అమెరికా ఏవైనా సాహసోపేత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు.

ఇప్పుడున్న తక్షణ సవాలు విస్తృత ప్రాంతీయ ఘర్షణను నిరోధించడమే.

గత వారం ఇరాన్ చేసిన బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందించే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని దాని మిత్రదేశాలు భావిస్తున్నాయి.

ఈ దాడిలో ఇజ్రాయెలీలు ఎవరూ చనిపోలేదు. ఇరాన్ కేవలం సైనిక, ఇంటెలిజెన్స్ వర్గాలను లక్ష్యం చేసుకున్నట్లు కనిపించింది, అయినా నెతన్యాహు తమ ప్రతిస్పందన కఠినంగా ఉంటుందని హెచ్చరించారు.

ఇరాన్ ప్రజలను ఉద్దేశించి నేరుగా ప్రసంగిస్తూ, టెహ్రాన్‌ పాలనలో మార్పు జరగబోతోందని నెతన్యాహు సూచించారు. ‘‘చివరికి ఇరాన్ స్వేచ్ఛను పొందినప్పుడు, ప్రతిదీ భిన్నంగా ఉంటుంది. ఆ క్షణం ప్రజలు అనుకున్నదానికంటే చాలా త్వరగా వస్తుంది,’’ అని ఆయన అన్నారు.

కొంతమంది పరిశీలకులకు, ఇవి 2003లో ఇరాక్‌పై అమెరికా నేతృత్వంలోని దాడికి ముందు అమెరికన్ నియోకన్జర్వేటివ్‌లు చేసిన వ్యాఖ్యల మాదిరి ఉన్నాయంటున్నారు.

అటు ఇరాన్ పాలకులు ఇజ్రాయెల్ లేని ప్రపంచం గురించి కలలు కంటున్నారు. కానీ హిజ్బుల్లా, హమాస్ తీవ్రంగా దెబ్బ తిన్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై విజయం సాధించడం చాలా కష్టమని ఆ దేశానికి తెలుసు.

అలాగే ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి బయటపడాలని భావిస్తున్న ఇజ్రాయెల్‌కు, ఇటీవల కొన్ని విజయాలు సాధించినా, ఒంటరిగా తాను దాన్ని సాధించలేనని తెలుసు.

గాజా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అక్టోబరు 7 దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందనతో 20 లక్షల మంది గాజావాసులు నిరాశ్రయులయ్యారు

ఆశలన్నీ ఆవిరేనా?

ఒక ఏడాది కిందట పశ్చిమాసియా అత్యంత ప్రమాదకరమైన స్థితికి చేరుతోందని చాలా కొద్దిమందే ఊహించి ఉంటారు.

గాజాలో చెలరేగిన సంఘర్షణ రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో, ఈ పోరాటం ముగిసిన తర్వాత గాజా పునరావాసం ఎలా, దాన్ని ఎవరు పరిపాలిస్తారు అనే ప్రశ్నలన్నీ ఈ సమరభేరీలో వినిపించకుండా పోతున్నాయి.

అలాగే ఈ పోరాటం వల్ల, పాలస్తీనియన్లతో ఇజ్రాయెల్ సంఘర్షణకు పరిష్కారం గురించి అర్ధవంతమైన చర్చల సంగతి కూడా వినిపించడం లేదు.

ఏదో ఒక సమయంలో ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లాలకు తగినంత నష్టం కలిగించిందని అనుకున్నప్పుడు, ఇజ్రాయెల్, ఇరాన్ రెండూ తమ లక్ష్యాలను సాధించామని భావించినప్పుడు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన అనంతరం, దౌత్యానికి అవకాశం లభించవచ్చు.

అయితే ప్రస్తుతానికి, అవన్నీ చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)