చౌఖంబా పర్వతం: 20 వేల అడుగుల ఎత్తున అన్నీ పోగొట్టుకుని మంచులో చిక్కుకుపోయిన ఇద్దరు మహిళలు.. ఎలా బతికారంటే

ఫొటో సోర్స్, Fay Manners
- రచయిత, రాచెల్ మెక్‌మెనెమీ, ఓర్లా మూర్
- హోదా, బీబీసీ న్యూస్, బెడ్‌ఫోర్డ్‌షైర్
హిమాలయాల్లో తప్పిపోయిన ఇద్దరు మహిళలు, తాము రెండు రోజుల పాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎలా బతికామో వెల్లడించారు.
బెడ్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన ఫే మ్యానర్స్, ఆమె పర్వతారోహణ భాగస్వామి, అమెరికాకు చెందిన మిషెల్ డ్వోరాక్ రెండు రోజుల పాటు ఉత్తర భారతదేశంలోని చౌఖంబ పర్వతంపై చిక్కుకుపోయారు.
ఆహారం, టెంట్, పర్వతాలను అధిరోహించే సామగ్రిని పట్టి ఉంచే తాడు తెగిపోవడంతో వాళ్లు అన్నిటినీ కోల్పోయారు.
దీంతో ఈ జంట 6,096 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు(సుమారు 20,000 అడుగుల ఎత్తు) నుంచి అత్యవసర సందేశాన్ని పంపారు, అయితే రెస్క్యూ బృందాలు మొదట్లో వాళ్లని కనుగొనలేకపోయాయి.
తమను రక్షించడానికి వచ్చిన వాళ్లను కలవడానికి ముందు.. ఆ పర్వతాల పైనుంచి దిగే ప్రయత్నంలో తాము చాలా భయపడిపోయామని మ్యానర్స్ తెలిపారు.

సామగ్రి అంతటినీ కట్టి ఉంచిన తాడును ఓ రాయికి కట్టగా.. ఆ తాడు తెగిపోయి బ్యాగులన్నీ కిందకు దొర్లుకుంటూ పడిపోయాయి. దీంతో జరగబోయే పరిణామాలను తల్చుకుని తాను చాలా భయపడిపోయినట్లు మ్యానర్స్ తెలిపారు.
‘మా వద్ద భద్రతా పరికరాలు ఏవీ లేవు. టెంట్ లేదు. నీళ్ల కోసం మంచును కరిగించే స్టవ్ లేదు. బేస్‌క్యాంప్‌కు తిరిగి వెళ్లడానికి మంచు గొడ్డలి, రాత్రి నడవడానికి హెడ్ టార్చ్ ఏవీ లేవు"
ఈ జంట ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు టెక్ట్స్ మెసేజ్ పంపడంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.
ఈ ఇద్దరు పర్వతారోహకులు తమ వద్ద ఉన్న ఒకే ఒక్క స్లీపింగ్ బ్యాగ్‌ని షేర్ చేసుకుంటూ కాలం గడిపారు.
‘‘నా శరీర ఉష్ణోగ్రత తగ్గింది, నేను వణుకుతూనే ఉన్నాను, ఆహారం లేకపోవడంతో నా శరీరాన్ని వెచ్చగా ఉంచే శక్తి కూడా లేకుండా పోయింది’’ అని మ్యానర్స్ తెలిపారు.
మరుసటి రోజు ఉదయం ఒక హెలికాప్టర్ వాళ్లను వెతకడానికి వచ్చింది, కానీ వాళ్లను గుర్తించలేకపోయింది. దీంతో వాళ్లు మరో 24 గంటలు ఆ పర్వతంపైనే ఉండాల్సి వచ్చింది.
"వాళ్లు మమ్మల్ని రక్షించడానికి ప్రయత్నించారు, కానీ వాతావరణం సరిగా లేకపోవడం, పొగమంచు, మేం ఎత్తైన ప్రదేశంలో ఉండడంతో వాళ్లు మమ్మల్ని కనుగొనలేకపోయారు’’ అని ఆమె వివరించారు.
వాళ్లిద్దరూ కరుగుతున్న మంచు నుంచి నీటిని సీసాలతో పట్టుకుని తాగారు.

ఫొటో సోర్స్, Reuters
ఎలాంటి ఆహారం లేకుండా కేవలం కొన్ని నీళ్లతో, ఆ చలిని తట్టుకుని రెండో రోజు రాత్రి మంచుతుపాను నుంచి ప్రాణాలతో బయటపడ్డామని మ్యానర్స్ తెలిపారు.
"హెలికాప్టర్ మళ్లీ మమ్మల్ని చూడకుండా వెళ్లిపోయింది. హెలికాప్టర్ మాకు సహాయం చేయకపోవడంతో మేమే కిందికి దిగే ప్రయత్నం చేశాం"
ఆహారం లేక బలహీనంగా ఉండడంతో ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యం తప్పదని గ్రహించి రెండో రోజు ఉదయం చాలా జాగ్రత్తగా కిందికి దిగడం ప్రారంభించారు ఇద్దరూ.
అదృష్టవశాత్తూ వాళ్లు అదే సమయంలో తమకు ఎదురుగా వస్తున్న ఫ్రెంచ్ పర్వతారోహక బృందాన్ని గుర్తించారు. వాళ్లు తమ వద్ద ఉన్న సామగ్రిని, ఆహారాన్ని, స్లీపింగ్ బ్యాగ్‌లను ఈ ఇద్దరు మహిళా పర్వతారోహకులకు ఇచ్చారు.
అదే సమయంలో రెస్క్యూ సిబ్బందికి తామున్న ప్రదేశం గురించి ఖచ్చితమైన సమాచారం కూడా పంపించగలిగారు.
‘‘వాళ్లే కనుక లేకుంటే మేం మా పరికరాలు లేకుండా, నిటారుగా ఉన్న ఒక గ్లేసియర్‌ను దాటడం అసాధ్యమయ్యేది. మేం గడ్డకట్టి చనిపోయేవాళ్లం లేదా ఆ గ్లేసియర్‌ను దాటే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయేవాళ్లం’’ అని మ్యానర్స్ తెలిపారు.
2022లో, మోంట్ బ్లాంక్‌లోని గ్రాండ్ జోరాసెస్‌కు దక్షిణం వైపు ఉన్న ఫాంటమ్ డైరెక్ట్ రూట్‌ను అధిరోహించిన మొదటి మహిళ మ్యానర్స్. గత ఏడాది ఆమె పాకిస్తాన్, గ్రీన్‌లాండ్‌లలోనూ విజయవంతంగా శిఖరాలను అధిరోహించారు.
తాడు తెగిన ఘటన దురదృష్టకరమని, ఇది చాలా అరుదుగా జరుగుతుందని ఆమె అన్నారు.
ఇప్పుడు ఈ జంట ఫ్లైట్‌లో తమ ఇళ్లకు వెళ్లే ముందు స్థానిక భారతీయ వంటకాలను రుచి చూడాలనుకుంటున్నట్లు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








