డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలంతోపాటు మరో శకలమూ భూమిని ఢీకొట్టిందా, దానివల్ల ఏం జరిగింది?

గ్రహశకలం

ఫొటో సోర్స్, Getty Images

6.6 కోట్ల సంవత్సరాల కిందట భూమిని ఢీ కొట్టి, డైనోసార్లు తుడిచిపెట్టుకుపోవడానికి కారణమైన ఓ భారీ గ్రహశకలంతోపాటు మరో చిన్న గ్రహశకలం కూడా భూమిని తాకిందని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఈ చిన్న అంతరిక్ష శిల పశ్చిమ ఆఫ్రికా తీరంలోని సముద్రంలో పడడంతో పెద్ద బిలం ఏర్పడిందని గుర్తించారు.

దీని వల్ల అట్లాంటిక్ మహాసముద్రంలో కనీసం 800 మీటర్ల ఎత్తులో సునామీ ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ కారణంగానే నాదిర్ బిలం ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు.

హెరియట్-వాట్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఉయిస్‌డియన్ నికల్సన్ 2022లో మొదటిసారిగా నాదిర్ బిలాన్ని కనుగొన్నారు, అది ఎలా ఏర్పడిందనే విషయమై ఇప్పటివరకు అనిశ్చితి ఉండేది.

అయితే గ్రహశకలం సముద్రగర్భాన్ని ఢీ కొట్టడం వల్లే 9కిలోమీటర్ల ఆ బిలం ఏర్పడి ఉంటుందని వారు కచ్చితంగా చెబుతున్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎప్పుడు ఢీ కొట్టింది?

గ్రహశకలం

ఫొటో సోర్స్, Getty Images

అయితే ఈ గ్రహశకలం సముద్రగర్భాన్ని ఎప్పుడు ఢీ కొట్టిందనే కచ్చితమైన సమాచారాన్ని శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు.

మెక్సికోలో 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న చిక్సులబ్ బిలం ఏర్పడటానికి కూడా ఓ గ్రహశకలం ఢీకొనడమే కారణం. అయితే నాదిర్ బిలం ఏర్పడటానికి కారణమైన గ్రహశకలం చిక్సులబ్ బిలం ఏర్పడటానికి ముందు ఢీకొట్టిందా, తరువాతనా అనే సంశయానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. చిక్సులబ్ బిలం ఏర్పడానికి కారణమైన గ్రహశకలంతో డైనోసార్లు అంతరించిపోయాయి.

డైనోసార్లు అంతరించిపోయిన (క్రెటాషియస్ పిరీయడ్) సమయంలోనే ఈ చిన్న గ్రహశకలం భూమిని తాకిందని వారు చెబుతున్నారు. ఈ శకలం భూవాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, అది అగ్నిగోళంగా మారి ఉండొచ్చు.

‘‘ఉదాహరణకు ఆ గ్రహశకలం గ్లాస్గోను తాకినట్లు, ఆ సమయంలో మీరు 50 కిలోమీటర్ల దూరంలోని ఎడిన్‌బర్గ్‌లో ఉన్నట్లు ఊహించుకోండి. ఆ అగ్నిగోళం పరిమాణంలో సూర్యుడి కంటే 24 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ వేడి ఎడిన్‌బర్గ్‌లో చెట్లు, మొక్కలను మాడ్చేస్తుంది,’’ అని డాక్టర్ నికల్సన్ చెప్పారు.

భారీ శబ్దంతో గ్రహశకలం సముద్రగర్భాన్ని తాకింది. దీంతో భూకంపం సంభవించి ఉంటుంది. సముద్రగర్భం నుంచి పెద్ద మొత్తంలో నీరు బయటికి వెళ్లి, తిరిగి మళ్లీ అదే ప్రదేశానికి చేరి, అక్కడ ప్రత్యేకమైన గుర్తులు ఏర్పడి ఉండొచ్చు.

ఇంత పెద్ద గ్రహశకలాలు అతి తక్కువ విరామంలో మన గ్రహాన్ని ఢీ కొట్టడం చాలా అసాధారణం. కానీ ఈ రెండూ ఇంత తక్కువ విరామంలో ఎందుకు భూమిని ఢీకొన్నాయో పరిశోధకులు వివరించలేకపోతున్నారు.

గ్రహశకలం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాదిర్ బిలం ఫొటోలు లేకున్నా, ఆస్ట్రేలియాలోని గోసెస్ బ్లఫ్ బిలం అలాంటిదే

గంటకు 72వేల కి.మీ వేగంతో

నాదిర్ బిలం ఏర్పడడానికి కారణమైన గ్రహశకలం 450-500 మీటర్ల వెడల్పు ఉంది, ఇది సుమారు గంటకు 72వేల కిలోమీటర్ల వేగంతో భూమిని తాకి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

నాదిర్ గ్రహశకలం, ప్రస్తుతం భూమికి సమీపంలో పరిభ్రమిస్తున్న అత్యంత ప్రమాదకరమైన బెన్నూ గ్రహశకల పరిమాణంలో ఉంది.

నాసా ప్రకారం, బెన్నూ భూమిని 24 సెప్టెంబర్ 2182లో ఢీకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఇలా జరగడానికి 2700 పాళ్లలో ఒక పాలే అవకాశం ఉంది.

చిక్సులబ్ బిలం

ఫొటో సోర్స్, Reinhard Dirscherl / Alamy

మానవ చరిత్రలో గ్రహశకల ప్రభావం ఈ పరిమాణంలో ఎప్పుడూ లేదు, శాస్త్రవేత్తలు సాధారణంగా భూమిపై నశించిపోయిన మిగతా బిలాలు లేదా ఇతర గ్రహాలపై ఉన్న బిలాలను అధ్యయనం చేస్తుంటారు.

నాదిర్ బిలం గురించి మరింత అర్థం చేసుకోవడానికి డాక్టర్ నికల్సన్, ఆయన బృందం టీజీఎస్ అనే జియోఫిజికల్ కంపెనీకి చెందిన హై-రిజల్యూషన్ 3డీ డేటాను విశ్లేషించారు.

చాలా బిలాలు నశించిపోయినా, దీన్ని మాత్రంసంరక్షించడం వల్ల శాస్త్రవేత్తలకు దానిని మరింత బాగా పరిశీలించే అవకాశం లభించింది.

‘‘మనం ఒక బిలం లోపల, ఒక గ్రహశకల ప్రభావాన్ని చూడటం ఇదే మొదటిసారి. ప్రపంచంలో కేవలం 20 సముద్ర బిలాలు మాత్రమే ఉన్నాయి, అయితే దేనినీ ఇంత వివరంగా అధ్యయనం చేయలేదు,’’ అని డాక్టర్ నికల్సన్ చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)