‘లిప్‌స్టిక్ వేసుకున్నానని ట్రాన్స్‌ఫర్ చేశారు’

చెన్నైలో లిప్‌స్టిక్ వివాదం
ఫొటో క్యాప్షన్, మాధవి మహిళా మార్షల్‌గా పని చేస్తున్నారు.
    • రచయిత, నిత్యా పాండ్యన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లిప్‌స్టిక్ వేసుకుని తీరతానని పట్టుబట్టినందుకు తనను బదిలి చేశారని చెన్నైలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆరోపించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తోంది.

ఈ వ్యవహారంపై మహిళా హక్కుల కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మాధవి అనే మహిళ చెన్నై కార్పొరేషన్‌లో 15 ఏళ్లగా ఉద్యోగం చేస్తున్నారు.

మూడేళ్ల కిందట ప్రియా రాజన్ చెన్నైకు తొలి దళిత మహిళా మేయర్‌ అయ్యాక, నగరంలో తొలి మహిళా మార్షల్‌గా మాధవి నియమితులయ్యారు.

ప్రజల్లోకి వెళ్లినప్పుడు గుంపులు గుంపులుగా ఉండే జనం నుంచి మేయర్‌కు రక్షణ కల్పించడమే మాధవి చేయాల్సిన పని.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘క్యాట్‌వాక్‌తో వివాదం మొదలైంది’

మార్చిలో మేయర్ కార్యాలయం నిర్వహించిన విమెన్స్ డే సెలబ్రేషన్‌లో తాను పాల్గొన్న తర్వాత వివాదం మొదలయిందని మాధవి అన్నారు.

‘‘వాళ్లు ఫ్యాషన్ షో నిర్వహించారు. అందులో నేను క్యాట్‌వాక్ చేశాను’’ అని మాధవి బీబీసీతో చెప్పారు.

షో నుంచి మేయర్ అర్ధాంతరంగా వెళ్లిపోయారని మాధవి అన్నారు. ఆ తర్వాత మేయర్ తనతో గొడవపడ్డారని మాధవి చెప్పారు.

‘‘స్టేజ్ మీద క్యాట్‌వాక్ ఎందుకు చేశావని ఆమె నన్ను అడిగారు. అది తప్ప ఈవెంట్‌కు సంబంధించిన ఇతర విషయాలేమీ మాట్లాడలేదు’’ అని మాధవి చెప్పారు.

‘‘అప్పటినుంచి నేను వేసుకునే లిప్‌స్టిక్స్ షేడ్స్ నన్ను వేధించడానికి ఉపయోగించే ఆయుధాలయ్యాయి’’ అని మాధవి అన్నారు.

ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆఫీసులో సిబ్బంది ఎవరూ బ్రైట్ లిప్‌స్టిక్ వేసుకోవద్దని మేయర్ వ్యక్తిగత సహాయకులు హెచ్చరించారని మాధవి ఆరోపించారు. ఇది మాధవికి కోపం తెప్పించింది.

‘‘ఇది నా శరీరం. నేనేం ధరించాలి, ఎలాంటి లిప్‌స్టిక్ వేసుకోవాలి అన్నది నా ఇష్టం. ఈ విషయంలో ఆదేశాలివ్వడానికి వాళ్లెవరు?’’ అని మాధవి అన్నారు.

లిప్‌స్టిక్ వేసుకోవడంపై వివాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేశంలో చాలామంది మహిళలు లిప్‌స్టిక్ వేసుకుంటుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)

ఆలస్యంగా రావడంపై వివరణ కోరిన ఆఫీసు

ఆగస్టు 6న తాను ఆఫీసుకు ఆలస్యంగా వచ్చానని, ఆ రోజు తన ప్రవర్తనపై వివరణ ఇవ్వాల్సిందిగా తనకో నోటీసు వచ్చిందని మాధవి చెప్పారు.

బీబీసీ ఆ నోటీసును పరిశీలించింది. విధినిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణ లేకపోవడం, సీనియర్ల ఆదేశాలను గౌరవించకపోవడం, ఆఫీసు మార్గదర్శకాలను ఉల్లంఘించడం వంటివాటి గురించి ఆ లెటర్‌లో రాసి ఉంది.

తన కాలుకు గాయమైందని, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయంలో ప్రయాణం చేయడం తనకు కష్టమని, అందుకే ఆ రోజు ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లానని మాధవి బీబీసీతో చెప్పారు.

ఆ లెటర్‌కు మాధవి సమాధానమిచ్చారు. ‘‘లిప్‌స్టిక్ వేసుకోవద్దని మీరు నాకు చెప్పారు. కానీ నేనది పట్టించుకోలేదు. ఒకవేళ అది నేరమైతే..నేను లిప్‌స్టిక్ వేసుకోవడాన్ని నిషేధించే ప్రభుత్వ ఉత్తర్వు నాకు చూపించండి’’ అని తాను రాసినట్టు మాధవి బీబీసీతో చెప్పారు.

అయితే తన లెటర్‌కు రిప్లై రాలేదని ఆమె తెలిపారు.

తనకు సమాధానం ఇవ్వడానికి బదులు మరుసటిరోజు తనను ఉత్తర చెన్నైలోని మరో ఆఫీసుకు బదిలీ చేశారని మాధవి చెప్పారు.

తనపైన, చెన్నై కార్పొరేషన్‌పైనా వచ్చిన ఆరోపణలను మేయర్ ఖండించారు. లిప్‌స్టిక్ వేసుకోవడం గురించి తన ఆఫీసులో ఎవరూ మాధవితో మాట్లాడలేదని ఆమె అన్నారు.

ఆఫీసులో మాధవి క్రమశిక్షణతో ఉండరని మేయర్ బీబీసీతో చెప్పారు.

‘‘ఆమెకు రెండుసార్లు హెచ్చరికలు చేశాం. కానీ ఆమె వాటిని పట్టించుకోలేదు’’ అన్నారు మేయర్.

‘ఇది మోరల్ పోలీసింగ్’

చెన్నైలో 70 లక్షలమంది నివసిస్తుంటారు. ఇక్కడ అన్నిరంగాల ఆర్ధిక కార్యకాలపాల్లో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి సుదీర్ఘ చరిత్ర ఉంది.

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తమను తాము ప్రగతీశీల రాజకీయ శక్తిగా అభివర్ణించుకుంటుంది. మేయర్ ప్రియ రాజన్ కూడా డీఎంకే సభ్యురాలే.

అయితే ఈ తాజా ఘటన, మహిళల పట్ల ఆ పార్టీ వైఖరి మీద అనేక సందేహాలకు తావిచ్చింది.

మాధవిని బదిలీ చేయడంపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా మహిళా హక్కుల కార్యకర్తలు కూడా ఈ చర్యను విమర్శించారు.

‘‘మాధవి ఆరోపణలు నిజమైతే, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలపై ఇలాంటి మోరల్ పోలీసింగ్ నిబంధనలను రుద్దుతున్న వ్యక్తులు ఎవరు అని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది’’ అని చెన్నైకి చెందిన మహిళా హక్కుల కార్యకర్త నివేదిత లూయిస్ అన్నారు.

ఈ చర్యను ‘తీవ్రమైనది’గా ఆమె అభివర్ణించారు.

‘లిప్‌స్టిక్‌ వదిలేయను’

చెన్నై కార్పోరేషన్ హెడ్డాఫీసులో మళ్లీ తన పోస్టు తనకు ఇవ్వాలంటూ కోర్టుకెళ్లే ఉద్దేశం తనకు లేదని మాధవి అన్నారు. ప్రజల మద్దతు, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఈ సమస్యను పరిష్కరించగలవని ఆమె భావిస్తున్నారు. ఈ వ్యవహారం తర్వాత ఆమె లిప్‌‌స్టిక్ వేసుకోవడం మానేయలేదు.

స్థానికంగా చౌకలో దొరికే లిప్‌స్టిక్స్‌ను ఆమె వాడుతుంటారు. "నేనొక ఫ్యాషనబుల్ పర్సన్‌గా కనిపించాలనుకుంటాను. కానీ, బ్రాండెడ్ లిప్‌స్టిక్స్ కొనలేను. అలాగే పార్లర్‌కు వెళ్లను. నాకు నచ్చిన లిప్‌స్టిక్ కలర్ పింక్’’ అన్నారామె.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)