కళ్లకు కాటుక, ఐ లైనర్ వాడితే సమస్యలు వస్తాయా? వైద్యులు ఏమంటున్నారు?

మేకప్, సౌందర్య ఉత్పత్తులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమ్రిత ప్రసాద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కొన్నేళ్ల కిందట చారులత కాలేజీకి వెళ్లేటప్పుడు ప్రతి రోజూ తన కళ్లకు కాటుక, ఐ లైనర్ లాంటివి వాడేవారు. అయితే కొన్నాళ్ల తర్వాత ఆమెకు కంటి సమస్యలు వచ్చాయి. కళ్లు దురదగా అనిపించడంతోపాటు ఓ కంటి లోపల గుండ్రని కణితి లాంటిది ఏర్పడింది.

ఈ సమస్యలను ఆమె మొదట ఇంట్లోనే తగ్గించుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఇంట్లో చేసుకునే చికిత్సలతో ఆమెకు ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఆరు నెలల తర్వాత ఆమె డాక్టర్‌కు చూపించారు. అక్కడ ఆమెకు శస్త్రచికిత్స చేసి కంట్లోని కణితి తొలగించారు.

కొన్ని రోజుల తర్వాత మరో కంటిలో కూడా కణితి కనిపించింది.

ఆ సమస్య అలాగే కొనసాగుతూ ఉండడంతో, ‘‘కాటుక, ఐ లైనర్ లాంటివి వాడుతుంటారా?’’ అని ఆమెను డాక్టర్ అడిగారు.

చారులత చెప్పిన సమాధానం విన్న తర్వాత ఆమె కంటి సమస్యలకు కాటుక/ఐ లైనర్ కారణమని డాక్టర్ తేల్చారు.

‘‘ఇప్పటిదాకా నేను కళ్లల్లో ఉన్న కణితులు తొలగించుకోవడానికి మూడు సర్జరీలు చేయించుకున్నాను. నా కళ్లల్లో కణితులు ఏర్పడడానికి కారణం తెలుసుకున్న తర్వాత, చాలా సంవత్సరాలుగా నేను అవి వాడడం ఆపేశాను. ఆ తర్వాత నా కళ్లల్లో ఇలాంటి కణితులు ఎప్పుడూ ఏర్పడలేదు’’ అని చారులత బీబీసీ తమిళ్‌తో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కళ్లు ఎంత మృదువుగా ఉంటాయి?

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఒక ఎపిసోడ్ సోషల్ మీడియా పేజీల్లో వైరల్‌గా మారింది. ఐ లైనర్‌ను నిరంతరం ఉపయోగించడం ప్రమాదకరమని కంటి వైద్యుడు అశ్విన్ అగర్వాల్ అందులో చెప్పారు.

“మనిషి శరీరంలో కళ్లు అత్యంత సున్నితమైనవి, అత్యంత ముఖ్యమైనవి. వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కళ్లల్లో దుమ్ము ఎక్కువగా చేరినప్పడు దురద కలగడంతో పాటు కణితి ఏర్పడే ప్రమాదముంది” అని కంటి వైద్య నిపుణులు వహీదా నసీర్ చెప్పారు.

"కళ్ల అంచున ఉండే అశ్రు గ్రంథులు, మెబోమియన్ గ్రంథులు ఉంటాయి. కళ్ల నుంచి కన్నీళ్లను బయటకు పంపించడం ద్వారా ఈ గ్రంథులు నూనె, ఇతర పదార్థాల వల్ల కళ్లు పొడిబారకుండా అడ్డుకుంటాయి. కాటుక, ఐ లైనర్ వేయడం వల్ల అక్కడ ఉండే సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో కళ్లల్లో స్రవాలు బయటకురాలేక లోపలే ఉండిపోతాయి. అవి కణితిగా మారతాయి’’ అని డాక్టర్ వహీదా వివరించారు.

“సౌందర్య ఉత్పత్తుల తయారీలో, ముఖ్యంగా ఐ లైనర్ల తయారీలో సీసం ఉపయోగిస్తారు. ఐ లైనర్ లేదా కాటుక నల్లగా మారడానికి కార్బన్ బ్లాక్, సింథటిక్ రంగులు కలుపుతారు" అని డాక్టర్ శివకుమార్ చెప్పారు.

ఉత్పత్తులు ఎక్కువ సంవత్సరాల పాటు పాడుకాకుండా ఉండడానికి ఇలాంటి ఫార్ములాలతో వాటిని తయారు చేస్తున్నారని ఆయన చెప్పారు.

మేకప్, సౌందర్య ఉత్పత్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కళ్లకు లోపలా, బయటా ఇలాంటి కణితులు కనిపిస్తాయి

ఎలాంటి దుష్ప్రభాలుంటాయి?

కళ్లు అందంగా కనిపించాలన్న ఉద్దేశంతో కాటుక, ఐ లైనర్, మస్కారా, ఐ షాడో వంటివి ఉపయోగిస్తుంటారు. అయితే ఇలాంటి వాటిని నిరంతరంగా వాడడం వల్ల కళ్లు దురద పెట్టడంతో పాటు కళ్లకలకలు, కంటి కురుపులు, కళ్లల్లో కణితులు ఏర్పడటం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదముందని డాక్టర్ వహీదా హెచ్చరించారు.

ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రత మరింత పెరిగి అది క్యాన్సర్‌గా మారే ప్రమాదం కూడా ఉందని ఆమె హెచ్చరించారు.

‘‘కనురెప్పల లోపల లేదా వెలుపల ఈ కణితులు కనిపిస్తాయి. అయితే మన చూపుపై ఇవి పెద్దగా ప్రభావం చూపవు. కానీ సరైన సమయంలో చికిత్స చేయకపోతే, ఈ కణితుల ప్రభావం కనుగుడ్లపై పడి దృష్టి సమస్యలకు కారణమవుతుంది’’ అని ఆమె వివరించారు.

‘‘కంటి లోపల ఇలా కణితి ఏర్పడితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కణితి ప్రభావం ఎక్కువగా ఉంటే శస్త్రచికిత్స ద్వారా అందులోని చీమును తొలగించి వైద్యం అందిస్తారు’’ అని డాక్టర్ వహీదా వివరించారు.

కాటుక, ఐ లైనర్లలో ప్రస్తుతం వాడుతున్న రసాయనాల వల్ల కళ్లు పొడిబారుతున్నాయని, కళ్లపై ఒత్తిడి పెరుగుతోందని, కార్నియా అల్సర్లు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నేత్ర వైద్య నిపుణులు శివకుమార్ హెచ్చరిస్తున్నారు.

ఐ లైనర్లు, ఐ షాడోలు, కాటుక వంటివి వాడటం వల్లనే ఈ సమస్యలు వస్తాయా అన్న ప్రశ్నకు... "కళ్లలో ఇలాంటి సమస్యలు రావడానికి ఐ లైనర్లు, కాటుక కూడా ఓ కారణం. రసాయనాలు కలిపిన సౌందర్య ఉత్పత్తులను కళ్లకు తరచుగా వాడడంతో పాటు కళ్లకు కలిగిన సమస్యలకు చికిత్స తీసుకోకపోవడం వల్ల ఇలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి’’ అని డాక్టర్లు చెప్పారు.

మేకప్, సౌందర్య ఉత్పత్తులు

ఫొటో సోర్స్, Getty Images

'ఐ మేకప్' - ఒక ఫ్యాషన్ ట్రెండ్

కళ్లకు కాటుక పెట్టుకునే ఆచారం చాలా కాలం నుంచి ఉంది. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఐ లైనర్, కాటుక లాంటివి ఉపయోగిస్తారు.

ఇంతకు ముందు కిరోసిన్‌తో తయారు చేసిన కాటుక వాడేవారు. కానీ ఇప్పుడు అనేక రంగుల్లో, వివిధ రకాల కాటుకలు లభిస్తున్నాయి.

"ఐ లైనర్ ఎప్పుడూ ఫ్యాషన్ ట్రెండే. ఇప్పుడు ఐ లైనర్‌లు రసాయనాలతో నిండిపోతున్నాయి. సీసం, సింథటిక్స్ వంటి రసాయనాలు అవి ఎక్కువ కాలం ఉండేలా, నల్లగా ఉండేలా చేస్తాయి’’ అని మేకప్ ఆర్టిస్ట్ అకిల చెప్పారు.

అలాగే, ఇలాంటి రసాయనాలు కలిసిన సౌందర్య ఉత్పత్తులు కొందరిలో దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అందుకే వీటిని వాడటం మొదలుపెట్టే ముందు 'ప్యాచ్ టెస్ట్ ' చేయించుకోవాలని అఖిల సూచిస్తున్నారు.

అంటే ఎలాంటి సౌందర్య ఉత్పత్ని అయినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధరించుకోవడానికి, ముందుగా శరీరంలోని చిన్న భాగంపై చాలా తక్కువ మోతాదులో వాడాలని ఆమె సూచించారు.

నష్టాన్ని నివారించడం ఎలా?

కళ్లు వాపు, కళ్లు దురదపెట్టడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదనే దానిపై బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) కొన్ని సూచనలు చేసింది.

అవి...

కంటి వాపు, దురద వంటి సమస్యలు ఉన్నప్పుడు రోజుకు రెండుసార్లు కనురెప్పలను శుభ్రం చేసుకోవాలి. ఆ లక్షణాలు తగ్గుముఖం పట్టినా కళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఆ లక్షణాలు ఉంటే కాంటాక్ట్ లెన్స్‌లు ధరించకూడదు.

ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కళ్లకు అలంకరణలు చేయకూడదు. ముఖ్యంగా ఐ లైనర్, మస్కరా వంటివి ఉపయోగించకూడదు.

కళ్లకు కలిగే నష్టాన్ని నివారించడానికి పాటించాల్సన కొన్ని చిట్కాల గురించి కంటి వైద్య నిపుణురాలు వహీదా బీబీసీకి వివరించారు.

కళ్లలోకి దుమ్ము పడకుండా చూసుకోవాలి.

రసాయనాలు కలిగిన సౌందర్య ఉత్పత్తులను కళ్లకు ఉపయోగించడం మానుకోవాలి.

తప్పనిసరి పరిస్థితుల్లో ఐ లైనర్ వంటివి ఉపయోగించాల్సి వస్తే, కంటి రెప్పలు సహా కళ్ల భాగం మొత్తాన్ని శుభ్రపరుచుకోవాలి. ఐ లైనర్‌ను కళ్ల పైనుంచి పూర్తిగా తొలగించకపోతే, అది కంటికి తీవ్రనష్టం కలిగిస్తాయి.

ఒకరు వాడే సౌందర్య సాధనాలను మరొకరు వాడకూడదు. సబ్బు, ఫేస్ వాష్ వంటివి కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లను పైన, లోపలా నీళ్లతో మాత్రమే శుభ్రం చేసుకోవాలి.

కళ్ల పైన లేదా లోపల కణితి వస్తే, చందనం, ఆముదం వంటివాటిని ఉపయోగించకూడదు.

కళ్లు ఎర్రగా మారిన, దురద కలిగిస్తున్నా వెంటనే నేత్ర వైద్యులను సంప్రదించాలి. పరీక్షల తర్వాత అవసరమైన చికిత్స తీసుకోవాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)