చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు10 జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శిరీష పాటిబండ్ల
    • హోదా, బీబీసీ కోసం

చప్పున చుట్టేసింది చలి పులి. చలి ప్రభావం మొదట తెలిసేది చర్మానికే. ఈ కాలంలో జుట్టు, చర్మానికి సంబంధించి పాత సమస్యలు తిరగబెట్టడం లేదా ఎప్పుడూ లేని కొత్త సమస్యలు ఉత్పన్నమవడం సహజం.

అలాగే, తాగే నీళ్ల మోతాదు, తినే ఆహారం లాంటి వాటిలో తెలియకుండానే చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. మనం దక్షిణ భారతీయులం కాబట్టి మనకు తీవ్రమైన చలి రుచి తెలియదు. అయినప్పటికీ వాడే సబ్బులు, క్రీములు, షాంపూలతో పాటు వేసుకునే దుస్తుల విషయంలో కూడా కొద్దిపాటి మార్పులు చేసుకోవడం అవసరం.

శీతాకాలంలో పిల్లలకు ప్రత్యేకంగా కొన్ని సమస్యలు రావచ్చు. అవేమిటో చూద్దాం.

చలికాలంలో చర్మ సంరక్షణ

ఫొటో సోర్స్, Getty Images

చలికాలంలో పిల్లలను బాధించే సమస్యలు

ఎటోపిక్ డెర్మటైటిస్ - ఎక్కువగా చర్మం పొడి బారినట్లయి ఒక్కోసారి పెట్లిపోతుంది. విపరీతమైన దురద కలుగుతుంది. ముఖ్యంగా బయటకు కనిపించే శరీర భాగాల్లో, అందునా రాత్రి వేళల్లో ఈ దురద ఎక్కువవుతుంది. ఒక్కోసారి పిల్లలు నిద్రలో విపరీతంగా గోక్కోవడం వలన చర్మం చెక్కులు కడుతుంది కూడా. పెదవులు సైతం ఎండిపోయి చిట్లుతాయి. పిల్లలు ఎండిన చర్మాన్ని గిల్లడం లాంటివి చేసి సమస్యను తీవ్రతరం చేసుకుంటారు. ఆ తరువాత మంట వల్ల ఆహారం తినడానికి నిరాకరిస్తారు.

సోరియాసిస్, కోల్డ్ అర్టికేరియా వంటి సమస్యలు కూడా ప్రతి చలికాలం విపరీతంగా బాధిస్తాయి.

హ్యాండ్-ఫుట్ ఎగ్జిమాచలికాలంలో ఎక్కువ. అరిచేతులు, అరికాళ్ళు పొడి బారి, పగుళ్లు రావడం, పగుళ్లు ఎక్కువైతే రక్తం కారడం, వాటిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చి చేరటం జరగవచ్చు.

తలలో చుండ్రు, దురద చలికాలంలో అధికమవుతుంది. తెల్లటి పొట్టు రాలినట్లు మనం గమనించవచ్చు కూడా. కొంతమందిలో ఇది నుదురు, చెంపలు, వీపు, భుజాల వరకూ వ్యాపించవచ్చు.విపరీతమైన దురద, కుదుళ్లతో సహా జుట్టు రాలడం కూడా ఉంటుంది.

చలికాలంలో చర్మ సంరక్షణ

ఫొటో సోర్స్, Getty Images

పెద్దలకు వచ్చే సమస్యలు

పిల్లలకే కాకుండా పెద్దవాళ్లకు కూడా చుండ్రు, జుట్టు రాలడం సమస్యలు వస్తాయి. చలికాలంలో జుట్టు రాలడానికి మరొక ముఖ్య కారణం మాడుకు సరైనంత తేమ లభించకపోవడం. చలికాలం ఎక్కువ దాహం అనిపించక నీరు తాగడం తక్కువై తలెత్తే సమస్య ఇది.

వింటర్ క్సిరోసెస్ (చలి కాలపు పొడి చర్మం) బారిన పడేది మరీ ముఖ్యంగా థైరాయిడ్ లోపంతో బాధపడేవాళ్లు, నెలలు ఆగిపోయే వయసు స్త్రీలు. హార్మోన్ల అసమతుల్యత ప్రభావం చలికాలంలో చర్మం విషయంలో మరీ ప్రస్ఫుటంగా తెలుస్తుంది.

బాగా వయసు పైబడిన వారిలో, చర్మం ద్వారా అధికంగా తేమ కోల్పోవడం వల్ల ఎస్టియాటోటిక్ డెర్మటైటిస్ వస్తుంది. చర్మంపై ఏదో కత్తితో కోసినట్టుగా ఫిషర్లు (పగుళ్లు) వస్తాయి. అధిక వయసు, ఆపైన డయాబెటిస్ లాంటివి ఉండటం వలన ఈ పగుళ్లలో ఇన్ఫెక్షన్లు వచ్చి చేరతాయి.

ఇలాంటి చలికాల చర్మ సంబంధిత సమస్యల్ని ఎదుర్కోవడానికి మన పరిధిలో పాటించగల కొన్ని చిట్కాలేమిటో చూద్దాం.

చలికాలంలో చర్మ సంరక్షణ

ఫొటో సోర్స్, Getty Images

పది జాగ్రత్తలు

1. దాహమున్నా లేకున్నా కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగండి. చలికాలంలో సహజంగానే ఆకలి ఎక్కువగా ఉంటుంది. అధికంగా నూనెలు, స్వీట్లు వాడకం కూడా ఈ కాలం ఎక్కువే. అందుకే ఆకలి అని అనిపించినప్పుడు ముందుగా తాగలిగినన్ని నీళ్లు తాగండి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తినండి.

2. స్నానానికి, తలస్నానానికి మరీ ఎక్కువ వేడి నీటిని వాడకండి. ఎటోపీసంబంధిత దురదలు వేడినీటి స్నానాల వల్ల మరింత ఎక్కువవుతాయి. తల వెంట్రుకల కుదుళ్లకు సైతం అధిక వేడి మంచిది కాదు.

3. స్నానం చేసి తడి చర్మం పైననే మాయిశ్చరైజర్ రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఒకంత నీటి పొర ఉండగానే రాసుకోవడం వల్ల మాయిశ్చరైజర్ ఉత్తమ ఫలితాన్నిస్తుంది. కృత్రిమ పరిమళాలు లేని (Fragrance Free) మాయిశ్చరైజర్లు ఎంపిక చేసుకోండి. వాసన కోసం వాడే రసాయనాలు చర్మంపై దురద, మంట పుట్టడానికి కారణం కావచ్చు. చర్మం ఎప్పుడు పొడిగా అనిపిస్తే అప్పుడు రాసుకోవడం కాకుండా, రోజూ మాయిశ్చరైజర్ రాసుకోవడం మంచిది.

4. చలికాలంలోనే కాదు, ఏ కాలమైనా సబ్బుతో ముఖం కడుక్కున్నాక చర్మం బిగుతుగా పట్టేసినట్లుగా ఉండకుండా మెత్తగా మృదువుగా అనిపించాలి. తదనుగుణంగా సబ్బు ఎంపిక ఉండాలి. ఎక్కువ క్షారగుణం కలిగిన సబ్బులు మంచివి.

5. సన్ స్క్రీన్ లోషన్లు వాడే వారిలో కొన్ని అనుమానాలు ఉంటాయి. ఇది ఎండాకాలం కాదు కాబట్టి అసలు సన్ స్క్రీన్ అవసరం లేదనుకుంటారు. చలికాలంలో ఎండ చుర్రుమనేలాంటి తీక్షణతో ఉంటుంది. ఇందులో UV -A రకం కిరణాలు ఎక్కువ. అందువల్ల సన్ స్క్రీన్ వాడాల్సిందే. ఏదైనా మాయిశ్చరైసర్ లేదా కోకో ఆయిల్ వంటివి రాసుకున్న పిమ్మట సన్ స్క్రీన్లు రాసుకోవడం మంచిది.

6. పెదవులు పొడిబారకుండా ఉండటానికి పెట్రోలియం సంబంధిత జెల్ లేదా బామ్‌లను వాడకండి. దీనివల్ల పెదవులు నల్లబడే అవకాశం ఉంది. వాటి బదులు సహజ సిద్ధమైన పదార్థాలు వాడండి. నెయ్యి, మీగడ, వెన్న, కొబ్బరినూనె వాడి చూడండి. వీటిని అరచేతులు, పాదాలకు కూడా రాసుకుంటే పొడిబారకుండా ఉంటాయి. మెత్తని కాటన్‌తో చేసిన తొడుగులు చేతులకు, కాళ్లకు ధరించవచ్చు

7. ఎటోపిక్ డెర్మటైటిస్‌తో బాధపడే పిల్లల్లో బట్టల ఎంపిక మరింత జాగ్రత్తగా ఉండాలి. ఊలుతో చేసిన బట్టల వల్ల సమస్య జఠిలమవుతుంది. శరీరాన్ని కప్పే విధంగా కాస్త మందమైన నూలు బట్టల్ని, రెండు మూడు పొరలుగా ధరించటం మంచిది.

8. చుండ్రు కోసం టీవీ ప్రకటనలలో చూసినవి కాకుండా, చర్మ వైద్యులు సూచించిన షాంపూలనే వాడండి. సరాసరి మాడుపై నిమ్మరసం రుద్దటం వలన చుండ్రు తగ్గుతుందనుకోవటం అపోహ.

9. రూమ్ హీటర్లు, కుంపటి లాంటివి గదిలో వెచ్చదనం కోసం వాడేవారు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వేడికి మరీ దగ్గరగా ఉండటం వల్ల ఎటోపీ, కోల్డ్ ఆర్టికేరియా వంటివి మరింత ఎక్కువవుతాయి. అందువల్ల హీటర్లను తగినంత దూరంలో, తగినంత సమయం వరకే వాడండి. అర్టికేరియా విషయంలో వైద్యులు సూచించిన యాంటీ హిస్టమిన్ మందులు వాడండి.

10. వీలైనంత వరకూ చర్మానికి సంబంధించిన కాస్మెటిక్ ట్రీట్‌మెంట్లకు చలికాలంలో దూరంగా ఉండండి. సహజమైన నూనెలు (కొబ్బరినూనె, ఆలివ్ నూనె, ఆవనూనె, కుసుమ నూనె) చర్మానికి వాడండి. కోకో బటర్, షియా బటర్‌తో కూడిన పరిమళ రహిత మాయిశ్చరైజర్లే వాడండి. వ్యాక్సింగ్, యాస్ట్రింజెంట్ రాయటం లాంటివి వీలైనంత తగ్గించండి.

చలికాలం చర్మ సంరక్షణ దాదాపు మన చేతుల్లో ఉన్నదే. సమస్య జఠిలమైనప్పుడు చేతికి దొరికిన స్టెరాయిడ్ క్రీములు రాసి కొత్త సమస్యలు తెచ్చుకోకండి. నిపుణుల సలహా తీసుకోండి. హేమంత శరదృతువుల్ని ఆస్వాదించండి.

వీడియో క్యాప్షన్, ఆందోళనగా ఉన్నప్పుడు ఏం చేయాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)