మహిళల ఆరోగ్యం: గర్భకోశం, పెద్ద పేగులు, చిన్న పేగులు, యోని.. అన్ని అవయవాలనూ దెబ్బతీసే, చికిత్స కూడా లేని డేంజరస్ పొర

క్లెయిర్ నికోల్స్
ఫొటో క్యాప్షన్, క్లెయిర్ నికోల్స్
    • రచయిత, మేరీ-లూయిస్ కనాలీ
    • హోదా, బీబీబీ ప్రతినిధి

ఎండోమెట్రియోసిస్ సర్జరీ మూడేళ్లు ఆలస్యం కావడంతో పునరుత్పత్తి అవయవాలు బాగా దెబ్బతిన్నాయని, పిల్లలను కనే సామర్థ్యం కుంటుపడిందని క్లెయిర్ నికోల్స్ చెప్పారు.

29 ఏళ్ల క్లెయిర్ నికోల్స్ కొన్నేళ్లుగా ఎండోమెట్రియాసిస్ రుగ్మతతో బాధపడుతున్నారు. ఎండోమెట్రియాసిస్ ఉన్నవాళ్లకు పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది.

ఎండోమెట్రియోసిస్ అంటే..

  • ఎండోమెట్రియం అనేది గర్భాశయం లోపల ఉండే పొర.
  • గర్భకోశం లోపల మాత్రమే ఉండాల్సిన ఈ పొర (టిష్యూ) ఇతర అవయవాలలో ఏర్పడడమే ఈ రుగ్మతకు కారణం.
  • ఫెలోపియన్ ట్యూబ్స్ (అండ వాహికలు), కటి భాగం (పెల్విస్), పెద్ద పేగులు, చిన్న పేగులు, యోని.. ఇలా ఎక్కడైనా ఈ పొర ఏర్పడవచ్చు.
  • ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు విపరీతమైన నొప్పి (ముఖ్యంగా కటి భాగంలో), అలసట, నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావం.

ఉత్తర ఐర్లాండ్‌లో మహిళలకు జననేంద్రియాలకు సంబంధించిన రుగ్మతల నిర్ధరణ, చికిత్స వేగంగా జరగట్లేదని, సర్జరీల వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతోందని ఒక అధికారిక సంస్థ తెలిపింది.

స్థానికంగా రెండు ఎండోమెట్రియోసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆ సంస్థ పిలుపునిస్తోంది.

కాగా, వ్యక్తిగత కేసులపై వ్యాఖ్యానించలేమని, స్పెషలిస్ట్ సెంటర్‌లకు పెట్టుబడి అవసరమని ఐర్లండ్ ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఉత్తర ఐర్లాండ్‌లో 36,900 మంది మహిళలు గైనకాలజీ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారని రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్‌స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్‌ల నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి వీరి సంఖ్య ఈ 42 శాతం పెరిగిందని వెల్లడించింది.

మహిళలకు వేగంగా చికిత్స జరగాలని, ప్రాంతీయంగా చికిత్స కేంద్రాలు ఏర్పటు చేయడం వలన వెయిటింగ్ లిస్ట్ తగ్గుతుందని బెల్‌ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్‌కు చెందిన కన్సల్టెంట్ గైనకాలజికల్ సర్జన్ డాక్టర్ హన్స్ నగర్ అన్నారు.

ఎండోమెట్రియాసిస్

ఫొటో సోర్స్, BBC/ALAMY

ఫొటో క్యాప్షన్, పిల్లల్ని కనగలిగిన వయస్సులో ఉన్న ప్రతి పదిమంది స్త్రీలలో ఒకరికి ఈ వ్యాధి ఉన్నట్లు అంచనా

'నాకు నొప్పి అని చెబితే ఎవరూ నమ్మలేదు'

గత పదేళ్లుగా ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగానని నికోల్స్ చెప్పారు. తనకు తీవ్రమైన నొప్పి కలుగుతోందని చెప్పినా వైద్యులు నమ్మలేదని అన్నారు.

ఆమె ఎండోమెట్రియాసిసి స్టేజ్ 4కు చేరుకున్నారు. ఈ స్టేజ్‌లో నొప్పి భరించలేనంతగా ఉంటుంది. అలాగే ఇతర అవయవాలకూ వ్యాపిస్తుంది.

"ఒక్కోసారి నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే, నేను మంచం మీంచి కిందకు దిగలేకపోతాను. కొన్నిసార్లు ఎమెర్జెన్సీకి పరిగెత్తాల్సి వచ్చేది" అని నికోల్స్ చెప్పారు.

ఎండోమెట్రియాసిస్ టిష్యూ (కణజాలం) లోపల అవయాల చుట్టూ పేరుకుపోయిందని, చాలా అవయవాలు సరిగ్గా కనిపించట్లేదని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలోని సర్జన్ నికోల్స్‌కు చెప్పారు.

"నా అవయవాల చుట్టూ కణజాలం పేరుకుపోయిందని సర్జన్ చెప్పారు. మొత్తం టిష్యూను తీసివేయలేకపోయారు. మూత్రాశయం సహా ఇతర అవయవాలకు కూడా ఇది హాని కలిగించి ఉండవచ్చు. వ్యాధి అంత తీవ్ర స్థాయికి చేరుకుంది" అని నికోల్స్ చెప్పారు.

ఒక ఫెలోపియన్ ట్యూబ్ పూర్తిగా దెబ్బతిన్నదని, దీనివల్ల పిల్లలను కనే సామర్థ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని డాక్టర్లు ఆమెకు చెప్పారు.

అది వినగానే తనకు చాలా కోపం, బాధ కలిగాయని నికోల్స్ అన్నారు. తనలాగే ఎంతోమంది మహిళలు బాధపడుతున్నారని, ఎందుకంటే వాళ్ల మాటలు ఎవరూ పట్టించుకోవట్లేదని, వాళ్ల బాధను గుర్తించట్లేదని ఆమె అన్నారు.

"విపరీతమైన నొప్పిగా ఉందని చెబితే, అదంతా నా బుర్రలో ఉందని, ఈ మాత్రం నొప్పి ఉండడం సాధారణమని నాకు చెప్పారు. నాకు పీరియడ్స్ సమయంలోనే కాదు, ప్రతిరోజు నొప్పి ఉండేది" అని నికోల్స్ చెప్పారు.

నొప్పి తగ్గడానికి, పునరుత్పత్తి అవయవాలకు హాని కలగకుండా కాపాడడానికి నికోల్స్‌కు హార్మోన్ రీప్లేస్‌మెంట్ చికిత్స అందిస్తున్నారు.

అంటే, ఆమెకు మెనోపాజ్ దశ రావాల్సిన దాని కన్నా ముందే వస్తున్నట్టు లెక్క.

"నాకు మెనోపాజ్ దశ తెప్పించడం షాకింగ్‌గా అనిపించింది. సంతానోత్పత్తి అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే ఇంతకన్నా వేరే మార్గం లేదని చెప్పారు" అన్నారు నికోల్స్.

చాలాసార్లు స్త్రీలు చెప్పే నొప్పి చిహ్నాలను తీసిపారేస్తారు

ఫొటో సోర్స్, BBC/ALAMY

ఫొటో క్యాప్షన్, చాలాసార్లు స్త్రీలు చెప్పే నొప్పి చిహ్నాలను తీసిపారేస్తారు

ఎండోమెట్రియాసిస్ లక్షణాలు ఏంటి?

  • గర్భాశయం లోపల ఉండాల్సిన పలుచటి పొర (టిష్యూ), గర్భాశయం వెలుపల పెరగితే దాన్ని ఎండోమెట్రియాసిస్ అంటారు.
  • సాధారణంగా ఈ పొర (కణజాలం) పునరుత్పత్తి అవయవాలు, మూత్రాశయం, పేగుల్లో ఏర్పడుతుంది.
  • గర్భాశయంలో అండాలు నెలకోసారి విచ్చిన్నమయినట్టే ఈ టిష్యూలోని కణజాలం కూడా విచ్ఛినమయి రక్తస్రావం అవుతుంది.
  • కానీ, ఈ రక్తం శరీరం నుంచి బయటకు వెళ్లే మార్గం లేదు. అందుచేత మంట, నొప్పి కలుగుతాయి. మచ్చలతో కూడిన టిష్యూ ఏర్పడుతుంది.
  • కొందరు మహిళలలో ఏ రకమైన లక్షణాలు కనిపించవు. కానీ, కొంతమందికి తీవ్రమైన నొప్పి, బాధ ఉంటాయి.
  • కటి భాగంలో విపరీతమైన నొప్పి, శృంగారంలో పాల్గొన్నప్పుడు, మల, మూత్ర విసరజన సమయంలో నొప్పి, అలసట, గర్భం ధరించలేకపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి.
  • దీనికి చికిత్స లేదు. కానీ, లక్షణాలు తగ్గించేందుకు చికిత్స అందించవచ్చు.
  • హార్మోన్ చికిత్స, నొప్పి తగ్గించేందుకు మందులు, సర్జరీ, గర్భాశయాన్ని తొలగించడం వంటి చికిత్సలు అందించవచ్చు.
వీడియో క్యాప్షన్, వీర్యం, అండం లేకుండా సృష్టించిన ఈ పిండం గుండె కొట్టుకుంటోంది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)