సెక్స్ లేని వైవాహిక జీవితాలతో ఈ తరం సతమతం... ఎందుకిలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెసికా క్లెయిన్
- హోదా, బీబీసీ వర్క్‌లైఫ్
‘‘పెళ్లైన కొత్తలో మా శృంగార జీవితం అద్భుతంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆయనకు వయసు పైబడినట్లు (ఆయన 30ల వయసులో ఉన్నారు) అనిపిస్తోంది. అసలు ఆయన సెక్స్‌పై ఆసక్తి చూపించడం లేదు.’’
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లోని ఆర్/డెడ్‌బెడ్‌రూమ్స్ గ్రూపులో కనిపిస్తున్న చాలా మెసేజ్‌లలో ఇది కూడా ఒకటి. దీనిలో కొంతమంది రెడిట్ యూజర్లు సెక్స్ జీవితాన్ని ఎలా కోల్పోతున్నారో తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
‘‘అసలు ఆయన నాతో సెక్స్ చేసేకంటే తన చేతికే ఎందుకు ఎక్కువ పని చెబుతున్నారు?’’అని ఓ మహిళ ఆ గ్రూపులో ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘మంచి సలహాలు ఉంటే చెప్పండి. మీరిచ్చే అన్ని సూచనలు మేం పాటించినా ఆశ్చర్యపోవద్దు’’అని ఆ గ్రూపు డిస్క్రిప్షన్‌లో రాసుకొచ్చారు.
కొన్నేళ్లకు ముందులా నేడు సెక్స్‌లో పాల్గొనడంలేదని కొన్ని వృద్ధ జంటలు మాట్లాడుకుంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ, ఇక్కడ 20లు లేదా 30ల వయసులోనున్న యువత ఈ చర్చలు పెడుతున్నారు.
పిల్లల్ని కనడం లేదా పెళ్లి చేసుకోవడంతో సెక్స్ జీవితం ముగిసిపోతుందని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం కోరికలు తక్కువుండే తమ భర్తలు గంటలపాటు పోర్న్ చూస్తారని, వారు పక్కన ఉండేటప్పుడు కనీసం తమకు కూడా కోరికలు కలగడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ‘‘డెడ్ బెడ్‌రూమ్స్’’ గ్రూపులో మిలినియల్స్ చెప్పుకొంటున్న బాధల జాబితా చాలా పెద్దగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
నిజానికి, ఇప్పుడు మిలీనియల్స్ సెక్స్‌లో చురుగ్గా పాల్గొనే దశలో ఉంటారు. కానీ, ఇప్పటికే సెక్స్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు చాలా మంది వెల్లడిస్తున్నారు. ప్రస్తుత ‘‘డెడ్ బెడ్‌రూమ్స్’’ గ్రూపులోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలం జీవిత భాగస్వామితో కలిసి ఉన్నవారు, పెళ్లి అయిన వారు ఇలా స్పందిస్తున్నారు.
తాజా గణాంకాలను పరిశీలిస్తే కూడా ఈ వాదన నిజమేనని తెలుస్తోంది. దీనిపై 2021లో అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీకి చెందిన కిన్సీ ఇన్‌స్టిట్యూట్ ఒక అధ్యయనం నిర్వహించింది. దీనిలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారు పాల్గొన్నారు. అయితే, పెళ్లైనవారిలో, ముఖ్యంగా మిలీనియల్స్‌లో కోరికలు తగ్గిపోవడం అనే సమస్య ఎక్కువైందని దీనిలో తేలింది.
పెళ్లి చేసుకున్న 25.8 శాతం మంది మిలీనియల్స్ ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఆ అధ్యయనంలో వెల్లడించారు. వారి తర్వాత జన్మించిన జనరేషన్ జడ్‌లో ఈ సమస్య 10.5 శాతం ఉండగా, జనరేషన్ ఎక్స్‌లో ఇది 21.2 శాతంగా ఉంది.
అయితే, ఇక్కడ కోరికలు తక్కువగా ఉందని చెప్పడాన్ని అసలు శృంగారం జీవితమే లేకపోవడంగా భావించకూడదని కిన్సీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు జస్టిన్ లేమిల్లర్ వివరించారు. ‘‘జంటలో ఒకరికి శృంగార కోరికలు తగ్గిపోయినా.. ఇద్దరిపైనా ఆ ప్రభావం పడుతుంది. వైవాహిక జీవితంలో సెక్స్ లేకపోవడానికి ప్రధాన కారణం ఈ కోరికలు తగ్గిపోవడమే’’అని జస్టిన్ చెప్పారు.
అసలు ఇంతకీ ఏం జరుగుతోంది? మిలీనియల్స్ వైవాహిక జీవితంలో సెక్స్ ఎందుకు మిస్సవుతోంది? దీనికి సెక్స్ థెరపిస్టులు, పరిశోధకులు భిన్న కారణాలు చెబుతున్నారు. ఇంటర్నెట్ వల్ల తమ జీవితాలపై పడుతున్న ప్రభావంలో దీనికి పెద్ద పాత్ర ఉందని అంటున్నారు. అదే సమయంలో ముందుతరం ఎదుర్కోని వింత సవాళ్లు వీరి సెక్స్ జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని వివరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తెర వెనుక ఏం జరుగుతోంది?
వైవాహిక జీవితంలో సెక్స్ లేకపోవడాన్ని ‘‘సెక్స్‌లెస్ మ్యారేజ్’’గా పిలుస్తారు. దీనికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. సాధారణ పరిభాషలో చెప్పాలంటే సుదీర్ఘ కాలంపాటు ఆ జంట సెక్స్‌కు దూరంగా ఉండటం. ఏడాదికి పది కంటే తక్కువసార్లు చెక్స్ చేయడాన్ని సెక్స్‌లెస్ లైఫ్‌గా ఎక్కువమంది నిపుణులు అంగీకరిస్తున్నారు.
ఈ విషయంపై బీబీసీ వర్క్‌లైఫ్‌తో మాట్లాడిన నిపుణులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. న్యూయార్క్‌కు చెందిన సెక్స్ థెరపిస్టు స్టీఫెన్ స్నైడెర్ మాట్లాడుతూ.. ‘‘ఏడాది నాలుగు లేదా అంతకంటే తక్కువసార్లు సెక్స్ చేస్తే సెక్స్‌లెస్‌గా చెప్పుకోవచ్చు.
మరోవైపు కాలిఫోర్నియా యూనివర్సిటీలోని మెడిసిన్ స్కూల్ ప్రొఫెసర్, సెక్స్ థెరపిస్టు కింబెర్లీ ఆండెర్సన్ మాత్రం.. ఏడాదికి 25 కంటే తక్కువసార్లు సెక్స్ చేయడాన్ని సెక్స్‌లెస్‌గా చెప్పారు.
అసలు ఎన్నిసార్ల కంటే తక్కువ సెక్స్ చేస్తే సెక్స్‌లెస్‌గా పరిగణించాలనే విషయంలో పూర్తిగా వ్యక్తిగతమైన అంశంగా చూడాలని మరికొందరు అంటారు. ఇక్కడ సెక్స్ విషయంలో ఆ జంట అసంతృప్తితో ఉంటే, కచ్చితంగా సమస్య ఉన్నట్లేనని, దానికి మనం పరిష్కారం చూపించాలని వారు వివరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కారణాలు ఏమిటి?
సెక్స్‌లెస్ లేదా లో-సెక్స్ వైవాహిక జీవితానికి చాలా కారణాలు ఉన్నాయి. ‘‘ఒకరిలో కోరికలు క్రమంగా తగ్గుతున్నప్పుడు అసమతౌల్యత ఏర్పడుతుంది. దీన్ని పరిష్కరించేందుకు ఆ జంట కృషి చేయాలసి ఉంటుంది’’అని కాలిఫోర్నియాకు చెందిన సెక్స్ థెరపిస్టు క్రిస్టెనే లోజానో చెబుతున్నారు.
‘‘కొందరు సెక్స్‌ను ఎక్కువగా కోరుకుంటారు. ఒకవేళ వారిని పదేపదే తిరస్కరిస్తుంటే, వారి ఆత్మవిశ్వాసం తగ్గే ముప్పు ఉంటుంది. అదే సమయంలో తిరస్కరిస్తున్న వ్యక్తి కూడా వేదనను అనుభవిస్తూ తనను తాను దోషిగా భావించుకునే పరిస్థితి వస్తుంది. మొత్తంగా అసలు కోరికలే లేని పరిస్థితికి ఇది దారితీయొచ్చు’’అని లోజానో వివరించారు.
సదరు వ్యక్తి ఆరోగ్య చరిత్ర, మానసిక ఆరోగ్యం కూడా సెక్స్‌లెస్‌కు దారితీయొచ్చు. ఎందుంకంటే ఈ సమస్యల వల్ల ఒక్కోసారి సెక్స్ చేయడం అసాధ్యంగా అనిపిస్తుంది. మరోవైపు ఉద్యోగం, పిల్లలతో బిజీగా గడిపే జీవితం కూడా సెక్స్ ఆలోచనలు రానివ్వదు. జీవిత భాగస్వామి కోరికలను తెలుసుకోవడంలో కమ్యూనికేషన్ లోపాలు కూడా సెక్స్‌లెస్‌కు దారితీయొచ్చు.
ఈ కారణాలన్నీ ఏదో ఒక జనరేషన్‌కు మాత్రమే పరిమితం కావు. అయితే, ఎవరు వీటికి ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు? ఈ దశలో సెక్స్‌లెస్ లైఫ్ మొదలవుతోంది? లాంటి అంశాల్లో నేడు కొన్ని కీలక మార్పులు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
‘‘పెళ్లి తర్వాత సెక్స్‌లెస్ లైఫ్ మొదలయ్యే సమయం క్రమంగా తగ్గిపోతుంది’’అని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన సెక్స్ థెరపిస్టు సెలెస్టె హిర్స్‌మన్ అన్నారు. ఆమె 20ఏళ్లుగా ఈ సమస్యపై జంటలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ‘‘ఇదివరకు పెళ్లి అయిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత ఈ సమస్యతో మా దగ్గరకు వచ్చేవారు. కానీ, ఇప్పుడది మూడు నుంచి ఐదేళ్లకు తగ్గిపోయింది’’అని ఆమె అన్నారు.
తను వైద్యురాలిగా పనిచేయడం మొదలుపెట్టినప్పటితో పోలిస్తే, నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆండెర్సన్ అన్నారు. ఆమె 30ఏళ్లుగా పనిచేస్తున్నారు. ‘‘30ఏళ్లకు ముందుకు ఇలాంటి సమస్యలతో 50 ఏళ్లు కంటే ఎక్కువ వయసుండే వారు వచ్చేవారు. ముఖ్యంగా హార్మోన్ల మార్పులు, ఇతర అనారోగ్యాల వల్ల వారిలో కోరికలు తగ్గేవి. కానీ, నేటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 45ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు నేడు ఎక్కువగా ఈ సమస్యలతో వస్తున్నారు. అయితే, వీరు చెప్పే కారణాలు కూడా కాస్త భిన్నంగా ఉంటున్నాయి’’అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒత్తిడి.. ఒత్తిడి.. ఒత్తిడి..
విపరీతమైన ఒత్తిడి ఎవరి శృంగార జీవితాన్ని అయినా పాడుచేస్తుంది. మిలీనియల్స్‌ను ముఖ్యంగా ఈ సమస్య వేధిస్తోంది. ‘‘ఒత్తిడి నడుమ కార్టిజాల్ స్థాయిలు పెరగడంతో వారి కోరికలు తగ్గిపోతున్నాయి. జనరేషన్ ఎక్స్‌తో పోలిస్తే, మిలీనియల్స్ చాలా ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు’’అని లేమిల్లర్ అన్నారు.
జీవితంలో వచ్చే ప్రధాన మార్పులు మరో కారణం. ఇప్పుడు చాలా మంది మిలీనియల్స్ తల్లిదండ్రలు అవుతున్నారు. వారి జీవితంలో సింహ భాగాన్ని పిల్లలకే కేటాయించాల్సి వస్తోంది. అలా నెమ్మదిగా వారు సెక్స్‌కు దూరం అవుతున్నారు.
పిల్లలను చూసుకోవడంలో పడిపోవడంతో సెక్స్ చేయడం తగ్గిందని 30ల వయసులోనున్న 61 శాతం మంది అభిప్రాయపడినట్లు బ్రిటన్‌కు చెందిన కౌన్సెలింగ్ నెట్‌వర్క్ రిలేట్ ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడించింది. పిల్లలు పుట్టిన తర్వాత తమలో కోరికలు పూర్తిగా తగ్గిపోయినట్లు 31 శాతం మంది వెల్లడించారు.
మరోవైపు ఇదివరకటి జనరేషన్‌తో పోల్చినప్పుడు చాలా అంశాల్లో నేటి యువత వెనుకబడుతున్నారు. ఉదాహరణగా ఇల్లు కొనుక్కోవడాన్ని చెప్పుకోవచ్చు. ధరలు పెరగడంతో వారిపై చాలా ఒత్తిడి పడుతోంది. ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో వారిపై విపరీతమైన ఒత్తిడి ఉంటోంది.
మరోవైపు ఉద్యోగాల్లోనూ వారిపై ఒత్తిడి ఎక్కువవుతోంది. మే 2022లో గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ ఐదు దేశాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. 38 శాతం మంది మిలీనియల్స్ మానసిక సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. దీనిలో మహిళలు వాటా (41 శాతం) ఎక్కువగా ఉంది.
‘‘ఉద్యోగం అనేది మిలీనియల్స్‌కు మొదట్నుంచీ ఒత్తిడితో కూడుకున్న అంశం. ఎందుకంటే గ్రేట్ రెసెషన్ నడుమ వీరు కెరియర్ మొదలుపెట్టారు. ఇప్పుడు కోవిడ్-19తో మరిన్ని సమస్యలు వచ్చిపడ్డాయి’’అని లేమిల్లర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా, పోర్న్...
ఇక్కడ ఇంటర్నెట్ ప్రభావం గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి. సెక్స్‌ను దూరం చేయడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుందని సిండర్ వివరించారు. వైవాహిక జీవితంలో శృంగారం లేకపోవడంపై సోషల్ మీడియా చూపే ప్రభావం మరింత ఎక్కువని హిర్స్‌మన్ అన్నారు.
‘‘సోషల్ మీడియా వేదికలపై తమను తాము ఏ మచ్చాలేని వారిగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అయితే నిజానికి ఫిల్టర్లు, టచప్‌లు మన వాస్తవ జీవితంలో ఉండవనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియా వాడకంతో తమ గురించి తాము అతిగా ఆలోచించడం, ఫలింగా ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం లాంటివి సెక్స్ జీవితంపైనా ప్రభావం చూపిస్తాయి’’అని ఆమె వివరించారు.
సోషల్ మీడియాతోపాటు అదే స్థాయిలో ప్రభావం చూపే మరో అంశం పోర్న్. నేడు ఆన్‌లైన్‌లో ఒక్క క్లిక్‌లోనే పోర్న్ అందుబాటులో ఉంటోంది. ఇదివరకటి జనరేషన్‌కు ఇలా ఉండేది కాదు. ‘‘20వ శతాబ్దంలో కొందరు మగవారు సెక్స్ గురించి ఆలోచన వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక మహిళతో సెక్స్ చేయాని భావించేవారు. కానీ, నేడు మాత్రం పోర్న్ తెరుస్తున్నారు. అంటే ఇక్కడ సెక్స్‌ను అనుభూతి చెందేందుకు వేరొక వ్యక్తికి దగ్గరకు వెళ్లేబదులు, ఇతరులు చేసే సెక్స్‌ను చూసి అనుభూతి చెందుతున్నారు’’అని సిండర్ వివరించారు.
పోర్న్ వల్ల అంగ స్తంభనతో తమ దగ్గరకు వచ్చే కేసుల సంఖ్య పెరుగుతోందని ఆండెర్సన్ అన్నారు. ‘‘కొందరికి పోర్న్ లేకపోతే లైంగికంగా ఉద్రేకం కావడం అనేదే జరగడం లేదు. ఇక్కడ వారికి జీవిత భాగస్వామి పక్కన ఉండాల్సిన పనిలేదు. ఫలితంగా వీరు సోలో సెక్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ సెక్స్ జీవితంపై మొత్తం నియంత్రణ తమ చేతుల్లోనే ఉండాలని వీరు భావిస్తున్నారు’’అని ఆండెర్సన్ చెప్పారు.
‘‘పోర్న్ ఎప్పుడూ నాకు మొహం చాటేయదు. నేను ఎలా శృంగారంలో పాల్గొంటున్నానని పోర్న్ ఎప్పుడూ విమర్శించదు.. లాంటి వ్యాఖ్యలు మాకు తరచూ వినిపిస్తుంటాయి’’అని ఆమె వివరించారు.
ఇక ఇంతేనా?
ఉద్యోగాల విషయంలో కొన్ని ఒత్తిళ్ల నుంచి మిలీనియల్స్ తప్పించుకోలేకపోవచ్చు. పోర్న్ లేదా సోషల్ మీడియా ప్రభావాన్ని వారు చెరిపేయలేకపోవచ్చు.
అలానే అసలు వైవాహిక జీవితంలో శృంగారం లేకపోవడంపై ఇతరులతో మాట్లాడటానికి కూడా చాలా మంది ఇష్టపడకపోవచ్చు.
అయితే, ఈ సమస్యను అర్థం చేసుకోవడం, దీనికి పరిష్కారం కొనుగొడంపై తమ జీవితాన్ని పంచుకునే వారితో మాట్లాడొచ్చు.
‘‘అసలు ఈ సమస్య గురించి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. దీన్ని పరిష్కరించాలి. కానీ, అది ఎలానో అర్థం కావడం లేదు’’అని డెడ్ బెడ్‌రూమ్స్‌లో ఒక మహిళ కొన్ని రోజుల క్రితం రాసుకొచ్చారు. జీవిత భాగస్వామితో మొదలుపెట్టి వైద్యుల వరకు ఎవరితోనైనా దీనితో మాట్లాడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఎలక్ట్రిక్ కారు, స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలూ గుర్తుంచుకోండి..
- బిల్కిస్ బానో: మోదీ ప్రభుత్వ అనుమతితోనే ఆ సామూహిక అత్యాచార దోషులను విడుదల చేశారా?
- మల్లికార్జున ఖర్గే: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మోదీ-షాలను ఢీ కొట్టగలరా, ఉత్తర భారత ప్రజలను ఆకట్టుకోగలరా
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- 5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది - తాజా అధ్యయనం.. మంచి నిద్రకు 6 మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














