Bilkis Bano: మోదీ ప్రభుత్వ అనుమతితోనే ఆ సామూహిక అత్యాచార దోషులను విడుదల చేశారా?

- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్
గుజరాత్‌లో ముస్లిం గర్భిణిపై సామూహిక అత్యాచారంతోపాటు ఆమె కుటుంబంలో 14 మందిని హత్యచేసిన కేసులో 11 మంది దోషులను క్షమాభిక్షపై విడుదల చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా అనుమతించినట్లు కోర్టులో సమర్పించిన ఒక పత్రం చెబుతోంది.
గుజరాత్‌లో హిందూ-ముస్లింల మధ్య 2002లో చోటుచేసుకున్న ఘర్షణల్లో బిల్కిస్ బానో, ఆమె కుటుంబంపై ఓ హిందూ మూక దాడిచేసింది. ఈ కేసులో నిందితులను కోర్టు దోషులుగా కూడా నిర్ధారించింది.
అత్యాచారం, హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆ దోషులు ఇటీవల విడుదలై జైలు నుంచి బయటకు వచ్చారు. వీరికి కొందరు ఆహ్వానం పలకడంతోపాటు వీరిని హీరోలుగా కొనియాడటంపై పెద్దయెత్తున నిరసన వ్యక్తమైంది.
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న మహిళలను గౌరవించాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించిన కొన్ని గంటలకే ఈ దోషులను బయటకు విడిచిపెట్టారు.
గోద్రా జైలు వెలుపల ఆ దోషులకు కొందరు స్వాగతం పలకడంతోపాటు స్వీట్లు తినిపించుకోవడం, దోషుల మెడలో దండలు వేయడం లాంటి దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

ఫొటో సోర్స్, CHIRANTANA BHATT
క్షమాభిక్ష కోసం దోషులు పెట్టుకున్న అభ్యర్థనకు ఓ ప్రభుత్వ కమిటీకి ఆమోదం తెలిపినట్లు దోషుల విడుదల సమయంలో ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. వీరిని 2008లోనే తొలిసారి కోర్టు దోషులుగా నిర్ధారించింది, జైలులో ఇప్పటికే 14 ఏళ్లకుపైనే వారు గడిపారని, వయసు సత్ప్రవర్తన లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని వారి అభ్యర్థనకు ఆమోదం తెలిపినట్లు వివరించారు.
అయతే, ఆ దోషుల విడుదలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై గుజరాత్ ప్రభుత్వం మంగళవారం ఒక పత్రాన్ని సమర్పించింది. దోషుల క్షమాభిక్ష విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోం శాఖ నుంచి గత జులై నెలలోనే అనుమతి తీసుకున్నట్లు ఆ పత్రంలో వెల్లడించారు.
అయితే, కోర్టుతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు కూడా ఆ దోషుల విడుదలను వ్యతిరేకిస్తున్న సమయంలో ఆ క్షమాభిక్ష అభ్యర్థనకు ఆమోదం తెలిపారు. ‘‘అసలు ఆ దోషులను ముందుస్తుగా విడుదల చేయకూడదు. వారి విషయంలో ఎలాంటి కనికరం చూపకూడదు. ఎందుకంటే వారు పాల్పడిన నేరాలు చాలా తీవ్రమైనవి’’అని కొందరు అధికారులు మీడియాతో చెప్పారు.
దోషుల విడుదలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కలిపి ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణ చేపడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
(ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలిచివేయొచ్చు)
దోషులను విడుదలచేసిన కొన్ని రోజుల తర్వాత బిల్కిస్ బానో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆ నేరస్థులను విడుదల చేయడమనేది చాలా అన్యాయమైన చర్య. దీని వల్ల న్యాయం జరుగుతుందనే నమ్మకం పూర్తిగా తొలగిపోయింది’’అని ఆమె అన్నారు.
‘‘నా కుటుంబాన్ని, నా జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన దోషులు స్వేచ్ఛగా బయటకు వచ్చేశారనే వార్త విన్నప్పుడు షాక్‌కు గురయ్యాను. అసలు ఇప్పటికీ ఏం మాట్లాడాలో తెలియక చాలాసార్లు మౌనంగా ఉండిపోతున్నాను’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
‘‘అసలు ఇలాంటి చర్యలతో ఏ మహిళకైనా ఎలా న్యాయం జరుగుతుంది? మన దేశంలోని కోర్టులను నేను నమ్మాను. ఇక్కడి వ్యవస్థలపై విశ్వాసం ఉంచాను. బాధను అనుభవిస్తూ జీవితం ఎలా గడపాలో నెమ్మదిగా నేర్చుకున్నాను. కానీ, ఇప్పుడు ఆ దోషులను వదిలిపెట్టారనే వార్త న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది’’అని ఆమె వివరించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆమె అభ్యర్థించారు. ఎలాంటి భయం లేకుండా, మనశ్శాంతితో జీవించే హక్కును తనకు ప్రసాదించాలని కోరారు.
ఈ కేసులో దోషులను విడిచిపెట్టడంతో భారత్‌లో భారీగా నిరసన వ్యక్తమైంది. ప్రభుత్వాన్ని విపక్షాలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు విమర్శించారు. ఇది మైనారిటీ ముస్లింలపై వివక్ష చూపడమేనని వారు వ్యాఖ్యానించారు. 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయి.
దోషుల విడుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేలా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేయాలంటూ 6,000 మందికిపైగా సామాజిక కార్యకర్తలు, చరిత్రకారులు, సాధారణ పౌరులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ‘‘సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకపోతే బాధిత మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది’’అని వారు చెప్పారు.
కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంచేసిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఆ దోషులను విడుదల చేశారని చాలా మంది సామాజిక నిపుణులు చెప్పారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం, అత్యాచారం, హత్య కేసుల నిందితులు క్షామాభిక్షకు అనర్హులు. ఈ కేసులో జీవిత ఖైదు అంటే.. వారు మరణించే వరకు జైలులో గడపడమే.
అయితే, దోషులను విడిచిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అతిపెద్ద ఎదురుదెబ్బ బిల్కిస్ బానో, ఆమె కుటుంబంపై పడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నేరం తీవ్రతతోపాటు తమకు న్యాయం జరగాలని వారు ఏళ్లపాటు కోర్టులు చుట్టూ తిరిగారు. నేడు వారి ఆగ్రహం, ఆవేదనలను మనం అర్థం చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్ అల్లర్లలో భాగంగా చోటుచేసుకున్న అత్యంత దారుణమైన ఘటనల్లో బిల్కిస్ బానో, ఆమె కుటుంబంపై దాడి కూడా ఒకటి. గోద్రా నుంచి హిందూ యాత్రికులతో వెళ్తున్న రైలుకు నిప్పు పెట్టడంతో ఈ అల్లర్లు చెలరేగాయి. ఆ రైలుకు నిప్పు పెట్టిన ఘటనలో 60 మంది హిందూ యాత్రికులు మరణించారు.
ఈ రైలుకు నిప్పు పెట్టింది ముస్లింలేనని చెబుతూ, చుట్టుపక్కల ఇళ్లలోని ముస్లింలపై కొన్ని హిందూ మూకలు దాడులు చేయడం మొదలుపెట్టాయి. మూడు రోజుల్లోనే ఈ దాడుల్లో వెయ్యి మందికిపైగా మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు.
అప్పట్లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఈ అల్లర్లను అడ్డుకునేందుకు సరైన చర్యలు తీసుకోలేదని ఆయనపై విమర్శలు వచ్చాయి. అయితే, ఇందులో తన తప్పేమీ లేదని ఆయన చాలాసార్లు చెప్పారు.
2013లో సుప్రీం కోర్టు కమిటీ కూడా ఈ అల్లర్ల కేసులో మోదీ ప్రమేయంపై ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది. కానీ, ఆయన కనుసన్నల్లోనే అన్నీ జరిగాయని ఇప్పటికీ చాలా మంది ఆయన్ను విమర్శిస్తుంటారు.
ఆ తర్వాత కాలంలో ఈ అల్లర్లకు సంబంధించి డజన్ల మందిని కోర్టులు దోషులుగా నిర్ధారించాయి. అయితే, కొంతమంది హైప్రోఫైల్ నిందితులు మాత్రం బెయిల్‌పై విడుదలయ్యారు. మరికొందరిని కోర్టులే విడిచిపెట్టాయి.
ఇలా కోర్టు నిర్దోషిగా ప్రకటించిన వారిలో మాజీ మంత్రి, మోదీకి సన్నిహితురాలు మాయా కోడ్నానీ ఒకరి. ఆమెను ఈ అల్లర్లకు సూత్రధారిగా ఓ ట్రయల్ కోర్టు వ్యాఖ్యానించింది. కానీ, హైకోర్టును ఆమెను నిర్దోషిగా ప్రకటించింది.
ఇప్పుడు బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసిన దోషులను బయటకు వదిలిపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
2017లో నేను దిల్లీలో బిల్కిస్ బానోను కలిశాను. 11 మంది దోషులకు బాంబే హైకోర్టు జీవిత ఖైదులను ధ్రువీకరించిన కొన్ని రోజుల తర్వాత ఆమెతో నేను మాట్లాడాను.
ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుంటూ.. ఆ దాడులు జరిగినప్పుడు ఏమైందో వివరించారు.
రైలుకు నిప్పుపెట్టిన ఘటన జరిగినప్పుడు, బిల్కిస్ బానో వయసు 19ఏళ్లు. ఆమె రెండోసారి గర్భం దాల్చారు. గోద్రాకు సమీపంలోని తను పుట్టిన గ్రామానికి మూడేళ్ల కుమార్తెతో కలిసి ఆమె వచ్చారు.
‘‘నేను వంటగదిలో వంట చేస్తున్నాను. అప్పుడే మా అత్తయ్య, ఆమె పిల్లలు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చారు. తమ ఇళ్లకు నిప్పు పెట్టారని వారు చెప్పారు. మనం అందరమూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నారు’’అని బిల్కిస్ వివరించారు. ‘‘మేం కట్టుబట్టలతో అక్కడి నుంచి బయటకు వచ్చాం. కనీసం చెప్పులు వేసుకోవడానికి కూడా సమయం దొరకలేదు’’అని ఆమె వివరించారు.
బిల్కిస్ బానో, తన మూడేళ్ల కుమార్తె, బిల్కిస్ తల్లి, గర్భిణిగా ఉన్న మరో కుటుంబ సభ్యురాలు, ఇద్దరు పురుషులు ఇలా మొత్తం 17 మంది ముస్లింలు అక్కడి నుంచి బయటకు వచ్చారు.
ఆ తర్వాత కొన్ని రోజులపాటు గ్రామగ్రామాలు తిరుగుతూ ఆశ్రయం కోసం చాలా మందిని వేడుకొన్నారు. మసీదులు, కొందరు హిందువులు ఏర్పాటుచేసిన శిబిరాల్లోనూ వీరు తలదాచుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మార్చి 3న తాము సురక్షితంగా ఉన్నామని వీరు భావించారు. దగ్గర్లోని ఒక గ్రామంలో వీరు అప్పుడు తలదాచుకున్నారు. కానీ, కొందరు మగవారు వీరి దగ్గరకు వచ్చారు.
‘‘వారు మాపై కత్తులు, కర్రలతో దాడులు చేశారు. వారిలో ఒక వ్యక్తి నా ఒడిలో కూర్చున్న మా పాపను లాక్కెళ్లారు. ఆమెను బలంగా నేలకేసి కొట్టారు. దీంతో ఆమె తల రాయికి కొట్టుకుంది’’అని బిల్కిస్ చెప్పారు.
వారిపై దాడిచేసిన వారంతా గ్రామంలో ఉండే ఇరుగుపొరుగు వారే. వీరు రోజూ ఆమెకు కనిపించేవారు. కానీ, వారు దాడిచేస్తారని ఆమె ఊహించలేదు.
ఆమె బట్టలను వారు చింపేశారు. ఆ తర్వాత వరుసగా ఆమెపై అత్యాచారం చేశారు. వద్దని ఎంత వేడుకున్నా వారు పట్టించుకోలేదు.
అప్పటికి రెండో రోజుల క్రితమే పాపకు జన్మనిచ్చిన సోదరిని కూడా పరుగులు పెట్టించి అత్యాచారం చేశారు. రోజుల పసిబిడ్డతోపాటు ఆమెను హత్య చేశారు.
ఆ రోజు అత్యాచారాల అనంతరం బిల్కిస్ స్పృత తప్పిపోయారు. దీంతో ఆమె చనిపోయిందని భావించి, దాడిచేసిన వారు ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆమెతోపాటు ఏడేళ్లు, నాలుగేళ్లు వయసున్న ఇద్దరు పిల్లలు పాత్రమే ఆ నరమేథం నుంచి తప్పించుకోగలిగారు.

ఫొటో సోర్స్, Getty Images
బిల్కిస్ బానోకు న్యాయం కూడా అంత తేలిగ్గా దక్కలేదు. దీని కోసం ఆమె సుదీర్ఘ పోరాటం చేశారు. కొందరు పోలీసులు, అధికారులు ఆమెను తీవ్రంగా భయపెట్టారని, ఆధారాలను కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని, హత్యకు గురైన వారికి శవపరీక్షలు నిర్వహించకుండానే పాతిపెట్టారని కోర్టుల్లో సమర్పించిన పత్రాలు వెల్లడించాయి. మరోవైపు అసలు ఆమెపై అత్యాచారమే జరగలేదని ఆమెకు పరీక్షలు చేసిన వైద్యులు చెప్పారు. ఆమెను చంపేస్తామని కూడా బెదరించారు.
ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు సుప్రీం కోర్టు అప్పగించింది. ఆ తర్వాత 2004లో ఈ కేసులో తొలి అరెస్టులు జరిగాయి. గుజరాత్‌లోని కోర్టులు ఆమెకు న్యాయం చేయలేవని, ఈ కేసును ముంబయికి బదిలీ చేయాలన్న అభ్యర్థనకు కూడా సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది.
ఒకవైపు కోర్టుల్లోఆమె పోరాటం చేస్తుంటే.. ఆమె కుటుంబం చాలా వేధింపులను ఎదుర్కొంది. కేసుల విచారణ సమయంలో ఆమె పదికిపైగా ఇళ్లు మారాల్సి వచ్చింది.
‘‘మేం ఇప్పటికీ మా సొంత ఇళ్లకు వెళ్లలేం. ఎందుకంటే మాపై దాడిచేసిన వారికి పోలీసులు, రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం మొదట్నుంచీ సాయం చేస్తూ వచ్చింది. మేం గుజరాత్‌లో తిరిగేటప్పుడు మా ముఖాలను కప్పుకుంటాం. మా సొంత ఇంటి చిరునామా ఎవరికీ చెప్పం’’అని ఆమె నాతో చెప్పారు.
కోర్టులో కేసు విచారణ సమయంలో బిల్కిస్ బానోపై దాడిచేసిన వ్యక్తులకు మరణ శిక్ష విధించాలని డిమాండ్లు వినిపించాయి.
అయితే, ముంబయి హైకోర్టు దోషులకు జీవిత ఖైదు విధించింది. ‘‘నేను వారిపై పగ తీర్చుకోవాలని అనుకోవట్లేదు. అసలు మాకు ఏం చేశారో వారికి తెలియాలి’’అని బిల్కిస్ అన్నారు.
‘‘ఏదో ఒకరోజు వారికి పశ్చాత్తాపం వస్తుంది. చిన్న పిల్లలను హత్య చేయడం, మహిళలపై అత్యాచారం చేయడం లాంటి నేరాలను దారుణంగా ఎలా చేశారో వారికి తెలిసివస్తుంది’’అని ఆమె వివరించారు.
అయితే, ఆ దోషులుంతా జీవితాంతం జైలులోనే ఉండాలని ఆమె అన్నారు.
జైలు నుంచి దోషులు విడుదలైన తర్వాత బిల్కిస్ బానో భర్త రసూల్ మాట్లాడుతూ.. ‘‘నా భార్య ఇప్పుడు మరింత కుంగుబాటుకు గురవుతోంది. ఆమె విచారంగా కనిపిస్తోంది’’అని చెప్పారు.
‘‘ఏళ్లపాటు మేం చేసిన న్యాయ పోరాటం మా కళ్ల ముందే నీరు గారిపోతోంది’’అని ఆయన అన్నారు.
‘‘అసలు ఈ వార్తను మేం జీర్ణించుకొనే సమయం కూడా ఇవ్వలేదు. వారిని విడిచిపెడుతున్నారని తెలిసిన కొద్ది సమయానికే వారు వారి ఇళ్లకు వచ్చి చేరారు’’అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- 5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది - తాజా అధ్యయనం.. మంచి నిద్రకు 6 మార్గాలు
- బీటీఎస్: ఆడుతూ, పాడుతూ ఏడాదికి రూ. 800 కోట్లు సంపాదించే ఈ యువకులు రెండేళ్లు ఆర్మీలో చేరుతున్నారు, ఎందుకు?
- బ్రిటన్ ప్రధాన మంత్రిపై ఎంపీల తిరుగుబాటు ఎందుకు? లిజ్ ట్రస్ పీఎంగా ఇంకెంత కాలం మనుగడ సాగించగలరు?
- హైదరాబాద్ సెక్స్ స్కాండల్: ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్యంలో సంచలనం సృష్టించిన సెక్స్ కుంభకోణం కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












