షబ్నమ్‌: స్వతంత్ర భారతదేశంలో ఉరి శిక్షను ఎదుర్కొంటున్న ఈ తొలి మహిళ చేసిన నేరమేంటి?

షబ్నమ్

ఫొటో సోర్స్, Suraj

ఫొటో క్యాప్షన్, షబ్నమ్
    • రచయిత, షాబాజ్ అన్వర్
    • హోదా, బీబీసీ కోసం, అమ్రోహ్ నుంచి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఒక మహిళకు ఉరి శిక్ష అమలు చేయబోతున్నారు. ఆమె పేరు షబ్నం.

ఇంట్లో తన ప్రేమను వ్యతిరేకించిన ఏడుగురినీ అసహ్యించుకున్నారు షబ్నమ్. సొంత తల్లిదండ్రులు, మేనల్లుళ్ళు, ఇద్దరు సోదరులు, సోదరి, బావ... అందరికీ పాలలో మత్తు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేశారు. ఆ తరువాత గొడ్డలితో వారిని నరికి చంపారు. ఈ హత్యాకాండలో ఏడుగురి ప్రాణాలు పోయాయి.

2008, ఏప్రిల్ 14- ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని హసన్పూర్ తహసీల్లో ఉన్న బావన్ఖేడి గ్రామ ప్రజలు ఈ తేదీని మర్చిపోలేరు.

షబ్నం ఇంటి ముందు ఏడు సమాధులున్నాయి. ఇవి ఆనాటి రక్తసిక్త భయానక హత్యాకాండకు సాక్ష్యాలుగా మిగిలాయి. ఆమె చేసిన నేరానికి ఎప్పుడో శిక్ష పడి ఉండాల్సిందని గ్రామస్తులు అంటున్నారు.

బావన్ఘేడి

ఫొటో సోర్స్, Shahbaz Anwar/BBC

ఫొటో క్యాప్షన్, బావన్ఘేడి

ప్రియుడు సలీంతో కలిసి...

షబ్నం, తన ప్రేమికుడు సలీంతో కలిసి తన తండ్రి, తల్లి, ఇద్దరు సోదరులు, ఒక బావ, మేనల్లుడు, వరసకు సోదరి అయ్యే మరో యువతిని చంపినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో సుప్రీంకోర్టు షబ్నం, సలీంలకు మరణశిక్ష విధించింది. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. "షబ్నంకు ఉరి శిక్ష విధించడంలో ఇప్పటికే ఆలస్యం జరిగింది. ఆమె చేసింది క్షమించరాని నేరం '' అన్నారు ఆమె మామ సత్తార్. "మేమూ, షబ్నం కుటుంబం కలిసే ఉండేవాళ్లం. షబ్నం తండ్రి షౌకత్ 2000కు ముందు తహార్పూర్లో ఉండేవారు. అక్కడ ఆయన ఇంటర్ కాలేజీలో టీచర్‌గా పని చేస్తుండేవారు.తర్వాత ఆయన బావన్ఖేడిలో ఇల్లు కట్టుకున్నారు" అని సత్తార్ వివరించారు.

"సలీం, షబ్నంల మధ్య సంబంధం ఎప్పటి నుంచి ఉందో మాకు తెలియదు. ఒక రాత్రి పూట కొందరు వ్యక్తులు తాహర్పూర్ వచ్చి నాకు ఈ హత్యాకాండ గురించి చెప్పారు. అక్కడి దృశ్యం చూడగానే నాకు గుండెలు అదిరి పోయాయి. అక్కడంతా రక్తం ఉంది. శరీరాలు తెగిపడి ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా చనిపోయి పడి ఉన్నారు" అని సత్తార్ ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నారు.

"షబ్నం ప్రవర్తన గురించి మేం షౌకత్‌ను హెచ్చరించాం. కానీ ఆయన నమ్మలేదు" అని సత్తార్ భార్య ఫాతిమా అన్నారు.

"మేము బావన్ఖేడీ వెళ్లి చూడగా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఒక్కొక్క మృతదేహాన్ని బయటకు తెస్తుంటే మా హృదయాలు బద్ధలయ్యాయి. షబ్నం అందరినీ చంపేసింది. అయితే, అక్కడ ఏడుస్తూ కనిపించిన షబ్నం ఈ హత్యలు చేసిందని అప్పుడు ఎవరికీ తెలియదు" అన్నారు ఫాతిమా.

షబ్నమ్‌ మామ, అత్త

ఫొటో సోర్స్, Shahbaz Anwar/BBC

ఫొటో క్యాప్షన్, షబ్నమ్‌ మామ, అత్త

తన ఇంటిపై ఎవరో దాడి చేశారని అప్పటికి చెప్పిన షబ్నం, తర్వాత పోలీసుల ముందు నిజాలను వెల్లడించించారు. "ఈ హత్యలో తనకు వరసకు సోదరుడయ్యే వ్యక్తిని ఇరికించాలని షబ్నం భావించింది. తండ్రి ఆస్తిని సొంతం చేసుకుని, సలీంతో జీవించాలని భావించింది. కానీ, అది కుదరలేదు" అన్నారు ఫాతిమారోజూ లీటర్ పాలు తీసుకొచ్చే షబ్నం ఆ రోజు రెండు లీటర్ల పాలు కొనుక్కొచ్చారు. అందులో మత్తు మందు కలిపి అందరికీ ఇచ్చారు. వారు మత్తులో కూరుకున్నాక, ఆమె సలీంను వెంటబెట్టుకుని వచ్చారు. ఇంట్లో ఉన్న ఏడుగురిని షబ్నం గొడ్డలితో నరికి చంపారు. హత్యలు జరుగుతున్నప్పుడు సలీం అక్కడే ఉన్నారు. కుట్రలో పాలు పంచుకున్నందుకు కోర్టు సలీంకు కూడా మరణ శిక్ష విధించింది.

షబ్నమ్ మామ

ఫొటో సోర్స్, Shahbaz Anwar/BBC

భయానక దృశ్యాలు...

ఈ ఘటన తర్వాత ఇంట్లోని దృశ్యాలను చూసిన బావన్ఖేడి గ్రామస్తులు కొందరు అప్పటి భయానక ఘటనను గుర్తు చేసుకున్నారు. " రాత్రి వర్షం మొదలైంది. అందరూ పడుకునే సమయం. అప్పుడే పెద్దగా ఏడుపు శబ్ధం వినిపించింది." అని గ్రామానికి చెందని షాజాద్ ఖాన్ బీబీసీకి వెల్లడించారు.

ఘటన జరిగిందని తెలిసిన వెంటనే నేను అక్కడి వెళ్లాను. ఏడు శవాలు పడి ఉన్నాయి. షబ్నం ఏడుస్తోంది."అని గ్రామానికి చెందని అఫ్జల్ఖాన్ అనే యువకుడు వెల్లడించారు. " ఆ దృశ్యాన్ని చూశాక మా కాళ్లు వణికిపోయాయి" అని అదే గ్రామానికి చెందిన వృద్ధుడొకరు ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు.

బావన్ఘేడి

ఫొటో సోర్స్, Shahbaz Anwar/BBC

షబ్నం-సలీం ప్రేమ వ్యవహారం

షబ్నం సలీంను ప్రేమించిందని, కానీ ఆమె కుటుంబానికి ఇది ఇష్టం లేదని గ్రామస్తులు చెప్పారు. అది కుటుంబానికి, షబ్నంకు మధ్య వివాదానికి కారణమైంది.

మనది చదువుకున్న, సంపన్న కుటుంబమని, సలీమ్ ఆర్ధిక, సామాజిక నేపథ్యం మంచిది కాదని షబ్నంకు ఆమె తల్లిదండ్రులు చెప్పారు.

హత్యాకాండ జరిగిన సమయంలో సలీమ్ వయసు 25 ఏళ్లు. షబ్నమ్ వయసు 27 ఏళ్లు. ఇప్పుడు ఆమె వయసు 39 ఏళ్లు.

సలీంతో కలిసి వ్యాపారం చేసినప్పటికీ, షబ్నమ్ గురించి ఎప్పుడూ తనకు చెప్పలేదని సలీమ్ స్నేహితుడు ఒకరు చెప్పాడు.

షబ్నమ్ గురించి ఆమె కుటుంబంలో చాలా ఆందోళన ఉండేదని, ఆమె తాత కొన్నాళ్లు అన్నం తినడం కూడా మానేశారని గ్రామస్తులు వెల్లడించారు.

సలీంతో షబ్నమ్ సంబంధం గురించి ఆమె తమ్ముడు రషీద్‌కు కూడా తెలుసు. ఆయన వీరిద్దరి విషయంలో చాలా కోపంగా ఉండేవారు. ఒక దశలో షబ్నమ్‌ను ఒకసారి చెంపదెబ్బ కొట్టాడని గ్రామస్తులు చెబుతున్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)