‘నా భార్య నన్ను పదేళ్లు రేప్ చేసింది'

గృహహింస

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విక్టోరియా జుహాన్, యానా గ్రిగోంవస్కాయా, డెనిస్ కోరెలెవ్
    • హోదా, బీబీసీ న్యూస్ ఉక్రెనియన్, రష్యన్

గృహ హింస గురించి వచ్చే వార్తల్లో చాలావరకు బాధితులుగా మహిళలే ఉంటుంటారు. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని మహిళల్లో దాదాపు 33 శాతం తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో శారీరక, లైంగిక హింస ఎదుర్కొంటున్నారు.

చాలా తక్కువగా పురుషులు తమ భాగస్వాములు, కుటుంబ సభ్యుల చేతుల్లో హింసకు గురైన కేసులను చూస్తుంటాం.

చాలా సమాజాల్లో మగాళ్లపై గృహ హింస అనేది ఎవరూ అంటీముట్టకుండా ఉండే అంశం. బాధితులు ఒంటరిగానే తమ కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

యుక్రెయిన్‌లో అలాంటి ఓ బాధిత యువకుడు తన కథను బీబీసీతో చెప్పుకున్నారు. ఆ కథ ఆ వ్యక్తి మాటల్లోనే...

గృహహింస

మొదటిసారి

నా స్నేహితులకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందో, లేదో నాకు తెలియదు. బయటి నుంచి చూస్తే అంతా బాగున్నట్లు కనిపించేది. నవ్వులు, స్నేహితులు, చాలా డబ్బు, సంతోషం... అన్నీ ఉండేవి. కలిసి సగం ప్రపంచం తిరిగాం.

ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆమె అంటే భయపడే అవసరం ఉండేది కాదు. మిగతా వాళ్ల ముందు ఆమె నన్ను బాధపెట్టేది కాదు. ఆమెతో నేను ఒంటరిగా ఉండకుండా జాగ్రత్తపడటం నాకు చాలా ముఖ్యం.

నా మాజీ భార్య పదేళ్లుగా నాపై అత్యాచారానికి పాల్పడుతోందని ఈ మధ్యే నేను తెలుసుకున్నా.

ఐరా నా తొలి ప్రేయసి. 20ల్లో ఉన్నప్పుడు మేం కలుసుకున్నాం. బయటకు వెళ్దాం అని తనే అడిగేది.

ఎవరితోనైనా డేటింగ్ మొదలుపెడితే, ఆ వెంటనే మరో ఇల్లుకు మారిపోవాలని నా తల్లిదండ్రులు నాకు ముందే చెప్పారు. అంటే, నేను మరో బంధం కావాలనుకుంటే, కుటుంబాన్ని వదులుకోవాలి. ఒక్క రోజులో సర్వస్వం విడిచిపెట్టాలి.

అందుకు నేను భయపడ్డా. విడిగా ఉండేందుకు తగినంత డబ్బు కూడబెట్టుకున్నాకే, బంధంలోకి ప్రవేశించగలిగా.

గృహహింస

ఆత్మన్యూనత

నా గురించి, నా రూపం గురించి మా అమ్మ చిన్నచూపు చూసేది. నాలో ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉండేది.

నేను మొదటగా శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేసింది ఐరాతోనే. అది సాధారణంగా ఉండేది కాదు. చాలా బాధ అనుభవించేవాణ్ని. మేం మొదటగా సెక్స్‌లో పాల్గొనప్పుడు ఆ ప్రక్రియ అంతా ఐదు గంటలు సాగింది. అప్పుడూ, ఆ తర్వాత నేనంతా బాధను అనుభవిస్తూనే ఉన్నా.

చివర్లో వీర్యం ఉండాలని ఆమెకు ఓ పిచ్చి ఉండేది. అప్పటివరకూ ఆమె నన్ను రుద్దుతూనే ఉండేది. సగటున ఇదంతా గంట నుంచి రెండు గంటలు సాగేది.

శృంగారం ఆనందాన్ని ఇవ్వాలి. కానీ, నాకు అలా ఎప్పుడూ లేదు. ఇదివరకు అనుభవం లేకపోవడంతో, సెక్స్ అంటే అలాగే ఉంటుందేమో అనుకునేవాణ్ని. అంగీకరించేవాణ్ని.

ఆ తర్వాత కొద్దిరోజులకే నేను ‘వద్దు’ అని చెప్పడం మొదలుపెట్టా. కానీ, ఆమె ఆగలేదు. అప్పుడే అది అత్యాచారంగా మారింది.

గృహహింస

ఫొటో సోర్స్, Getty Images

చిక్కుకుపోయా

ఓ సుదీర్ఘ బిజినెస్ ట్రిప్‌పై నేను విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఐరాను కోల్పోతానేమోనన్న భయంతో, నాతో రమ్మని అడిగా. అంతకుముందే పెళ్లి చేసుకుందామని కూడా అడిగా. పెళ్లి వద్దంది కానీ, బిజినెస్ ట్రిప్‌కు వచ్చింది. ఇదంతా మొదలైంది అక్కడే.

పని భారం ఎక్కువ ఉండటంతో నేను విశ్రాంతి కావాలి అనేవాణ్ని. కానీ, ఆమె సెక్స్ కావాలనేది. ఒకసారి ఒప్పుకున్నా, రెండోసారి ఒప్పుకున్నా.... ‘‘నాకు అది కావాలి. అవసరం. చాలా సమయంగా వేచి చూస్తున్నా’’ అని ఆమె అనేది. ‘‘నాకు ఇష్టం లేదు. విశ్రాంతి కావాలి’’ అని నేను చెప్పేవాణ్ని.

అప్పుడు ఆమె నన్ను కొట్టేది. నేనేమీ చేయగలిగేవాణ్ని కాదు. గోళ్లతో రక్తం వచ్చేలా రక్కేది. పిడిగుద్దులు గుద్దేది. ముఖం మీద మాత్రం కొట్టేది కాదు. ఛాతీ, వీపు, చేతులు... ఇలా శరీరంలో బయటకు కనిపించని భాగాలపై గాయాలు చేసేది. ఆడవాళ్లను కొట్టడం తప్పని భావించి, నేను భరించేవాణ్ని. మా అమ్మ, నాన్న నన్ను అలా పెంచారు.

నేను బలహీనుడినని అనిపించేది. ఆ పరిస్థితి నుంచి తప్పించుకోలేకపోయా. ఆమె అనుకున్నది సాధించేది. నాపై పెత్తనం చెలాయించేది.

ఓసారి హోటల్‌లో విడిగా నాకు గది తీసుకోవాలని ప్రయత్నించా. కానీ, ఆ హోటల్ వాళ్లకు నా భాష అర్థం కాలేదు. నేను అక్కడ చిక్కుకుపోయా.

పని ముగించుకుని, హోటల్‌కు వెళ్లాలంటే భయమేసేది. అందుకని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లి, అది మూసేసేదాక అక్కడే గడిపేవాణ్ని. ఆ తర్వాత ఆ నగరంలో తిరిగేవాణ్ని. అక్కడ చలికాలం బాగా చల్లగా ఉండేది. వెచ్చటి దుస్తులు నేను తీసుకువెళ్లలేదు.

దీంతో నాకు మూత్రపిండ సంబంధ ఇన్ఫెక్షన్లు, ప్రొస్టేటిటిస్, జ్వరం వచ్చాయి. అయినా, ఐరా ఆగలేదు. ఆమె అడిగందల్లా నేను చేయాల్సి వచ్చింది. వారాంతాల్లో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. యుక్రెయిన్‌కు ఎప్పుడు తిరిగి వెళ్తానా అని రోజులు లెక్కపెట్టుకునేవాణ్ని. అక్కడికి వెళ్లడంతో మా బంధానికి తెరపడుతందని అనుకున్నా. కానీ, అలా జరగలేదు.

గృహహింస

ఫొటో సోర్స్, Press Association

వదిలివెళ్లాలనుకున్నా, కానీ

తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయా. ఐరాతో కలిసి ఉండటం కాదు, అసలు మాట్లాడనేకూడదని అనుకున్నా. స్వేచ్ఛ కోసం ఏళ్లపాటు ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది.

మేం పోట్లాడుకునేవాళ్లం. నా ఫోన్ స్విఛాఫ్ చేసేవాణ్ని, ఆమెను అంతటా బ్లాక్ చేసేవాణ్ని. నేను దాక్కుంటే, ఆమె తలుపు పక్కనే వచ్చి కూర్చునేది. అంతా సర్దుకుంటుందని చెప్పేది.

ప్రతిసారీ మళ్లీ ఆమె మాట విని, తిరిగి వెళ్లేవాణ్ని. ఒంటరిగా ఉండటానికి నేను భయపడేవాణ్ని.

మొదట్లో ఆమెను వదిలివెళ్లాలని చాలా ప్రయత్నాలు చేశా. ఆ తర్వాత తగ్గించా. ఇక చివరికి ఆశలు వదిలేశా. మేం పెళ్లి చేసుకోవాలని తను ఒత్తిడి చేసింది. నాకు ఇష్టం లేకున్నా, పెళ్లి చేసుకున్నాం.

ఐరా అందరిపై అసూయపడేది. నా స్నేహితులు, కుటుంబంపై కూడా. ఎక్కడికి వెళ్లినా తనకు ఫోన్ చేయాల్సి వచ్చేది. ఎందుకు, ఎక్కడికి వెళ్లానో తనకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చేది. తనకు అందుబాటులోనే ఎప్పుడూ ఉండాల్సి వచ్చేది.

నేను లేకుండా తను ఎక్కడికీ వెళ్లేది కాదు. నిత్యం తనకు వినోదం అందించే ఓ ఆట బొమ్మను నేను.

ఐరాకు ఉద్యోగం లేదు. నేనే డబ్బు సంపాదించేవాణ్ని. వంట చేసేవాణ్ని. ఇల్లు శుభ్రం చేసేవాణ్ని. మేం రెండు బాత్రూమ్‌లు ఉన్న ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నాం. అందులోని ప్రధాన బాత్రూమ్‌లోకి నన్ను ఐరా వెళ్లనిచ్చేది కాదు. అతిథుల కోసం ఉద్దేశించిన రెండో బాత్రూమ్‌నే నేను ఉపయోగించుకోవాలి. ఉదయం ఆమె తొమ్మిదికో, పదికో నిద్ర లేచేది. అప్పటివరకూ నేను వేచి ఉండాలి.

మేం వేర్వేరు గదుల్లో నిద్రపోవాలని తను నిర్ణయించింది. నా గదికి తాళం ఉండేది కాదు. నాకు ఎప్పుడూ ఒంటరిగా ఉండే అవకాశం ఉండేది కాదు.

నేనైదైనా ‘తప్పు చేస్తే’, నాపై అరిచేది. కొట్టేది. ప్రతి ఒకట్రెండు రోజులకూ ఇలా జరుగుతూనే ఉండేది. ఏం జరిగినా, నెపం నాపైనే నెట్టేది. నేను ఎలా ఉండాలి? ఏం చేయాలి? నిత్యం చెబుతుండేది. నేను శక్తిహీనుణ్ని అయిపోయా. తన కోపం, తన అరుపుల బారి నుంచి తప్పించుకునేందుకు, ఏది చెబితే అది చేసేవాణ్ని.

ఒక్కడినే బయటకు వెళ్ళి కారులో కూర్చొని ఏడవడం నాకు గుర్తుంది. నా వెనుకే వచ్చి, నన్ను గమనించేది. నేను ఇంటికి తిరిగివచ్చాక, నాపై జాలి చూపించేది. కానీ, మళ్లీ అలా చేయకుండా ఆగేది కాదు.

ఇలా ప్రతి రోజూ కథ మళ్లీ మొదలయ్యేది. ఏం జరిగినా, నేను ఎంత బాధపడినా, ఏ మార్పూ ఉండేది కాదు. ఇదంతా తప్పించుకునేందుకు రోజూ 10-14 గంటలు ఆఫీసులోనే గడిపేవాణ్ని. వారాంతాలు, సెలవు రోజుల్లో కూడా వెళ్లేవాణ్ని. టైమ్ పాస్‌ చేయడానికి కొందరు మందు తాగుతారు. నా లాంటి వాళ్లు ఆఫీసులో పనిచేస్తారు.

గృహహింస

నా మాటలు ఆగలేదు

నా లాంటి పరిస్థితిలో ఉన్నవారికి, అసలు తమకు ఏం జరుగుతుందో తెలియదు. బయటపడే మార్గాన్ని మనం చూడలేం. అసలు అలాంటి అవకాశం ఉందని, తిరిగి పూర్తి సంతోషంగా ఉండొచ్చని మనం అనుకోం.

అలవాటు పడిపోయాను కాబట్టి నాకు ఇష్టం లేని పనులు కూడా నేను చేశా. నేను ఎప్పుడూ ఎవరి కోసమో ఏదో చేస్తూనే ఉన్నా. నా కోసం నేను బతకలేదు. నా తల్లిదండ్రుల కోసం, ఇతర కుటుంబ సభ్యుల కోసం... ఇలా బంధాలన్నింటి కోసం నేను త్యాగాలు చేయాల్సిందేనని అనుకున్నా.

అందుకే నా ఇష్టాలను, నన్ను నేనే త్యాగం చేశా. నాకు అది సహజంగానే అనిపించింది. అలా మొత్తం పరిస్థితి దిగజారింది.

ఇది మొదలైనప్పుడు, కేవలం నాకు నచ్చకపోయేదంతే. కానీ, ఆ తర్వాత పరిస్థితి తీవ్రమైంది. మా బంధంలోని ఆఖరి మూడు, నాలుగేళ్లు నాకు సెక్స్ అంటేనే భయంతో వణుకు వచ్చేది. ఐరా నన్ను బలవంతం చేసినప్పుడల్లా ప్యానిక్ అటాక్స్ వచ్చేవి.

భయంతో తనను వెనక్కి నెట్టేవాణ్ని. దాక్కునేవాణ్ని. ఇంటి నుంచి గానీ, కనీసం ఆ గది నుంచి గానీ పారిపోయేవాణ్ని.

నా వల్లే మాకు సెక్స్ సమస్యలు వస్తున్నాయని ఐరా అనుకునేది. అప్పుడప్పుడు సెక్సాలజిస్ట్ వద్దకు తీసుకువెళ్లేది. ఏదైనా ఇష్టం లేదని చెబితే, నాకు సెక్స్ అంటేనే ఇష్టం లేదని తను అనుకునేది. నాతోనే సమస్య అని చెప్పేది. నేను ఎదుర్కొన్న హింస గురించి, అత్యాచారాల గురించి మౌనంగా ఉండిపోయా.

ఈ డాక్టర్ దగ్గరకు వెళ్లడాలు ఐరాకు రుజువులు. కానీ, మేం విడాకులు తీసుకునే కొన్ని రోజుల ముందు నేను (హింస గురించి) మాట్లాడటం మొదలుపెట్టా. ఇక నా మాటలు కట్టలు తెంచుకున్నాయి.

గృహహింస

ఎలా బయటపడ్డానంటే...

అది చలికాలం. బ్రాంకైటిస్‌, జ్వరంతో నేను రెండు వారాలు మంచం పట్టా. అన్ని రోజులూ నన్ను పట్టించుకున్నవాళ్లు లేరు. నా జీవితానికి విలువ లేదని, అక్కడే చచ్చిపోయి ఉన్నా ఎవరూ పట్టించుకునేవారు కాదని అప్పుడు నాకు అర్థమైంది.

ఇంటర్నెట్‌ చూస్తుండగా, ఓ యాడ్ విండోలో కనిపించిన చాట్‌లో నేను ప్రవేశించా. అక్కడ ఒకరి వివరాలు మరొకరికి తెలియదు. అంతా గోప్యమే.

నాకు జరుగుతున్న విషయాలను ఇంకొకరితో చెప్పుకోవడం అదే మొదటిసారి. ఇప్పటికీ నాకు జరిగింది హింస అని గుర్తించాను. కానీ, అప్పటి నుంచి నేను ‘నో’ అని ఎక్కువగా చెప్పడం మొదలుపెట్టా.

మొదట్లో చిన్న విషయాలకు మౌనంగా ఉండటం ఆపి, ‘నో’ చెప్పడం మొదలుపెట్టా. నాకు మానసికంగా బలం అవసరమైనప్పుడు, నేను అనారోగ్యంతో బాధపడ్డ రోజులను గుర్తుచేసుకునేవాణ్ని.

ఆ తర్వాత నేనో ఫ్యామిలీ థెరపిస్ట్‌ను కలిశా. నేనూ, ఐరా ఆ సెషన్స్‌లో మాట్లాడటం మొదలుపెట్టాం. ఆ సెషన్స్‌లో నేను మాట్లాడేటప్పుడు తన జోక్యం చేసుకోకూడదు. అప్పుడే నేను ఎదుర్కొన్న హింస గురించి మాట్లాడా.

ఆమె నాపై మండిపడింది. నేను అబద్ధాలు ఆడుతున్నానని అంది. కానీ, ఆ తర్వాత ఆమె విడాకులు తీసుకుందామని అంది. తనకు ఇష్టమై ఆమె ఆ పని చేసిందని నేను అనుకోను. నేను మాట్లాకుండా ఉండాలని అలా చేసింది. నాకు ఇంకో అవకాశం రాదని నాకు తెలుసు. అందుకే ఒప్పుకున్నా.

ఓ నెల తర్వాత విడాకుల పత్రాలు నా చేతికి వచ్చాయి. నా జీవితంలోనే అదే అత్యంత సంతోషకరమైన రోజు.

ఆ మరుసటి రోజు... ‘‘నువ్వు నన్ను అత్యాచారం చేస్తూ వచ్చావు’’ అని ఆమెపై అరిచా. ‘‘అయితే ఏంటి?’’ అని ఆమె అంది.

దానికి ఏం సమాధానం ఇవ్వాలో నాకు తెలియలేదు. ఇప్పటికీ తెలియదు. ఓ రకంగా ఆమె చేసినదాన్ని ఒప్పుకుంది. కానీ, ఆమెకది నవ్వులాట.

తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు వచ్చా. ఉద్యోగం వదిలేసి, ఓ రెండు వారాలు ఇంట్లోనే ఉన్నా. తను ఎక్కడో బయటే ఉండి, నన్ను గమనిస్తుందేమోనని భయపడ్డా.

మరో రోజు ఆమె తిరిగివచ్చింది. నా తలుపు కొట్టడం, తన్నడం మొదలుపెట్టింది. బయటి నుంచి అరిచింది.

గృహహింస

ఫొటో సోర్స్, Getty Images

అదే ముగింపు కాదు

నేను ఆధారాలేవీ సేకరించుకోలేదు. ఎవరికీ చెప్పుకోలేదు.

నా తల్లిదండ్రులకు చెప్పాల్సింది. కానీ, బాల్యం నుంచి విషయాలను నాలోనే దాచుకోవడం నాకు అలవాటైంది. నాకు జరుగుతున్నదాని గురించి స్నేహితులకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియలేదు.

సహాయపడే బృందాలేమైనా ఉన్నాయా అని వెతికా. యుక్రెయిన్‌లో మహిళల కోసం మాత్రమే అలాంటివి ఉన్నాయి. ఇంటర్నెట్‌లో శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ బృందం దొరికింది.

యుక్రెయిన్‌లో నేను మొదట కలిసిన సైకోథెరపిస్ట్ నన్ను చూసి నవ్వుకున్నారు.

‘‘ఆమె ఆడ. నువ్వు మగ. అలా జరగదు’’ అని అన్నారు. అందుకే నేను ఆరు సార్లు నిపుణులను మార్చాల్సి వచ్చింది.

ఎవరినైనా నా చేయి పట్టుకోనివ్వడానికి నాకు ఎనిమిది నెలలు పట్టింది.

ఆమెపై కోర్టుకు వెళ్లాలనుకున్నా. రిస్ట్రెయినింగ్ ఆర్డర్ తెచ్చుకునే అవకాశం ఉందని న్యాయవాదులు చెప్పారు. కానీ, నాకు అది ఇప్పుడు అవసరం లేదు. ఆమె తప్పు ఒప్పుకుని, క్షమాపణలు చెప్పాలని చాలా రోజులు నేను ఆశించా.

ఇప్పటికీ నేను ఉద్యోగానికి వెళ్లడం లేదు. ఇప్పుడు నేను దేనికోసం బతుకుతున్నానో తెలియదు. అసలు ఏడాదిగా ఏం చేస్తున్నానో తెలియదు.

నేను మరోసారి బంధంలోకి దిగనని, పిల్లల్ని కననని నాకు తెలుసు. నాపై నేను ఆశలు వదులుకున్నా.

నేను చాలా కాలం మౌనంగా ఉండటుం వల్ల నా జీవితం అస్తవ్యస్తమైపోయింది. నా లాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తే ఇప్పుడు ఎక్కడో ఉండొచ్చు. నా కథ చదవచ్చు.

అదే ముగింపు కాదని, ఆ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉందని అతడు అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా.

గృహహింస

ఫొటో సోర్స్, efcarlos

హింసించేవాళ్ల నుంచి బాధితులు ఎందుకు దూరంగా వెళ్లరు?

లా స్ట్రాడా-ఉక్రెయిన్ నేషనల్ హాట్‌లైన్ డిపార్ట్‌మెంట్ హెడ్, ఐరాస పాపులేషన్ ఫండ్ సలహాదారు అల్యోనా క్రివులియాక్ ఈ విషయాలు చెప్పారు.

  • గృహ హింస ఉన్న కుటుంబాల్లో పెరిగినవాళ్ల ప్రవర్తన తిరిగి వాళ్ల తల్లిదండ్రుల్లానే ఉండే అవకాశాలు ఉన్నాయి.
  • ఒంటరి అవుతామనో, ఎవరేమనుకుంటారో అని భయపడుతుంటారు. ‘‘చుట్టూ ఉన్నవాళ్లు ఏమనుకుంటారు?’’ ‘‘పిల్లలకు తల్లి, తండ్రి ఇద్దరూ అవసరమే’’ అని భావిస్తుంటారు.
  • మొదటి దశల్లో మానసిక హింస ఉంటుంది. దీన్ని గుర్తించడం కష్టం. బాధితులు నెమ్మదిగా అలవాటు పడిపోతూ ఉంటారు. తమ పరిస్థితిని అంచనావేసే, స్పందించే సామర్థ్యం కోల్పోతారు.
  • హింసించేవారిని వదిలి వెళ్లే చోటేది బాధితులకు ఉండకపోవచ్చు. ఆర్థికంగా వారిపై ఆధారపడి ఉండొచ్చు. వారి పరిస్థితి సహకరించకపోవచ్చు. ఉదాహరణకు గర్భంతో ఉన్నవాళ్లు, చిన్న పిల్లలు ఉన్నవాళ్లు భాగస్వామిని వదలివెళ్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని భయపడవచ్చు.
  • దీనిపై ఫిర్యాదులు చేసినా, వారికి ‘ఇవన్నీ కుటుంబ సమస్యలు’ అని సమాధానం ఎదురుకావొచ్చు. వారిలో ఆశలు నశించవచ్చు.

గృహ హింస లాంటి కేసుల్లో బాధితులైన పురుషులు తమ వివరాలు బయటకు రావాలని కోరుకోవడం లేదు. కోర్టులను ఆశ్రయించేందుకు వెనుకాడుతున్నారు.

‘మగాళ్లు ఏడవకూడదు’, ‘మగాళ్లు శారీరకంగా బలవంతులు’ లాంటి మాటలతో సమాజం ఓ రకంగా ఇలాంటి ఇబ్బందులను పురుషులు బయటకు చెప్పుకోకుండా చేస్తోందని సైకోథెరపిస్ట్, సెక్సాలజిస్ట్ యులియా క్లిమెంకో అన్నారు.

శారీరకంగా, మానసికంగా హింసను ఎదుర్కొన్నవారికి లింగం, వయసుతో సంబంధం లేకుండా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)