మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
"మ్యూచువల్ ఫండ్స్ సహీ హై" అనేది గత కొన్నేళ్లలో వచ్చిన అతిపెద్ద మార్కెటింగ్ కాంపెయిన్. ఈ దశాబ్దాన్ని మ్యూచువల్ ఫండ్ దశాబ్దం అని కొందరు మార్కెట్ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్లోకి వస్తున్న మొత్తం, స్టాక్ మార్కెట్ చరిత్రలోనే గరిష్ఠ స్థాయిలో ఉంది.
గతంలో విదేశీ సంస్థాగత మదుపర్లు భారత స్టాక్ మార్కెట్ నుంచీ తమ పెట్టుబడులు వెనక్కు తీసుకుంటే స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యేవి.
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి రాలేదు. దానికి కారణం మ్యూచువల్ ఫండ్స్ రూపంలో మార్కెట్లోకి వస్తున్న పెట్టుబడులు. రీటెయిల్ మదుపరులు తమ మదుపును కొనసాగించడం వల్ల బేర్ మార్కెట్ నుంచీ త్వరగా కోలుకుంటున్నాం.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రస్తుతం మనం విదేశీ మదుపరుల మీద ఆధారపడటం తగ్గిందని తెలిపారు. ఈఎంఐ ద్వారా రియల్ ఎస్టేట్ రంగం లాభపడినట్లు..ఎస్ఐపీల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, NORA CAROL PHOTOGRAPHY
అవగాహన చాలా ముఖ్యం..
ఇలాంటి పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్ పనితీరు ఎలా బేరీజు వేయాలి అనే అవగాహన చాలా ముఖ్యం. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిబంధనల ప్రకారం.. మ్యూచువల్ ఫండ్స్ పనితీరుకు సంబంధించిన అన్ని విషయాలూ సదరు సంస్థలు వివరంగా అంబాటులో ఉంచాయి.
మనీ కంట్రోల్, ఏఎంఎఫ్ఐ, లాంటి వెబ్‌సైట్ల నుంచీ ఈ వివరాలన్నీ సులభంగా పొందవచ్చు. కానీ ఆ వివరాలను సరిగ్గా అన్వయించుకోవడం చాలా కీలకం.
ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన వివరాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణగా కింద ఇచ్చిన పట్టిక చూద్దాం.
ప్రస్తుతం మార్కెట్లో ప్రాచుర్యం పొందిన నాలుగు స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వివరాలు ఉన్నాయి. వీటిని ఎలా అర్థం చేసుకోవాలో మరింత లోతుగా పరిశీలిద్దాం.

ఫొటో సోర్స్, IVB karthikeya
పోర్ట్‌ఫోలియో
మ్యూచువల్ ఫండ్ వల్ల కలిగే పెద్ద ప్రయోజనం ఒక సమర్థవంతమైన పోర్ట్‌ఫోలియో ద్వారా నష్టభయాన్ని తగ్గించుకోవడం. అందుకే మదుపు చేస్తున్న ఫండ్ ఏ రంగాల మీద పెడుతున్నారో తెలుసుకోవాలి. మనం మదుపు చేసే కాలపరిమితి పదేళ్లకు పైగా ఉన్నప్పుడు ఏ సంస్థలో మన ఫండ్ మదుపు చేసింది అనే విషయం కంటే ఏ రంగాలలో మదుపు చేసింది అనే విషయమే కీలకం. పట్టికలో ఉన్న ఉదాహరణలో వినియోగదారుల వస్తువులు, క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్షియల్స్, కెమికల్స్, సేవా రంగాలలో ఫండ్స్ మదుపు చేస్తున్నారు. ఈ రంగాలకు భవిష్యత్తు ఎలా ఉంది? అనేది మొదట అధ్యయనం చేయాలి. ఈ రంగాలకు భవిష్యత్తులో గిరాకీ ఉంటుంది అని మనకు నమ్మకం కుదిరితేనే ఆ ఫండ్ ద్వారా మనం మదుపు చేయాలి. భవిష్యత్తులో గిరాకీ ఉన్న రంగాలలో మదుపు చేయడం ద్వారా మాత్రమే మనం లాభాలు పొందగలుగుతాం.
అలాగే మన ఫండ్ ఏ సూచికను అనుసరిస్తోంది? అనే అంశం కూడా చాలా కీలకం. ప్రతీ ఫండ్ పనితీరు కూడా సూచికతో పోల్చి బాగుందో లేదో నిర్ణయిస్తారు. ఒకవేళ సూచిక పనితీరు కూడా బాగా లేకుంటే అప్పుడు మన ఫండ్ సూచిక కంటే మంచి పనితీరు కనబరిచినా లాభాలు ఆశించినంతగా ఉండవు.

ఫొటో సోర్స్, Getty Images
పీ/ఈ, పీ/బీ
ఈ రెండు కొలమానాలు ఒక కంపెనీ పనితీరు బేరీజు వేయడానికి సరిపోతాయి. కానీ అనేక కంపెనీ షేర్ల సమాహారమైన మ్యూచువల్ ఫండ్స్ లాంటి మదుపు మార్గానికి దీనితో అంత ఉపయోగం ఉండదు. సదరు ఫండ్ వివిధ సంస్థలలో చేసిన మదుపు ఆధారంగా ఈ రెండు కొలమానాలను గణించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్స్‌పెన్స్ రేషియో
మ్యూచువల్ ఫండ్ నడపటానికి అవసరమైన ఖర్చును ఈ కొలమానం సూచిస్తుంది. ఫండ్ మేనేజర్ జీత భత్యాల నుంచీ ఫండ్ హౌస్ మార్కెటింగ్ వరకూ చేసే అన్ని ఖర్చులనూ ఎక్స్‌పెన్స్ రేషియో సూచిస్తుంది. మిగిలిన ఫండ్స్ ఎలాంటి ఎక్స్‌పెన్స్ రేషియో చూపిస్తున్నాయో పోల్చి చూసుకుని ఏ ఫండ్ సరైనదో తెలుసుకోవాలి. ఎక్స్‌పెన్స్ రేషియో విపరీతంగా పెరగకుండా, తద్వారా మదుపరులకు నష్టం కలగకుండా ఉండేందుకు సెబీ నిర్దిష్టమైన మార్గనిర్దేశకాలను ప్రకటించింది.
పైన పట్టికలో ఉన్న ఉదాహరణలో నిప్పాన్ ఇండియా ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో మిగిలిన ఫండ్స్ కంటే ఎక్కువగా ఉంది. ఇలా ఎందుకు ఉందో తెలుసుకోవాలి. ఒకవేళ సహేతుకమైన కారణం లేని వ్యయం ఉంటే ఆ ఫండ్ నుంచీ దూరంగా ఉండటం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
ఆల్ఫా, బీటా
ఒక మ్యూచువల్ ఫండ్ పనితీరుని ఇతర ఫండ్స్ నుంచీ వేరు చేసే ఈ రెండు కొలమానాలు చాలా కీలకం. క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్ (సీఏపీఎం) అనే సిద్ధాంతం ప్రకారం వచ్చిన ఈ రెండు కొలమానాల గురించి పూర్తి అవగాహన చాలా ముఖ్యం. సంక్లిష్టంగా ఉండే ఈ రెండు కొలమానాలను స్టాటిస్టికల్ మోడల్ ద్వారా తెలుసుకోవచ్చు. స్టాటిస్టికల్ మోడల్ అర్థం చేసుకోవడం సాధారణ మదుపరులకు కష్టం కావచ్చు. కానీ ఈ కొలమానాల వెనుక ఉన్న సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే, మెరుగ్గా మ్యూచువల్ ఫండ్స్‌ను నిర్వహించొచ్చు.
ఆల్ఫా
ఫండ్ మేనేజర్ పనితీరుని సూచించే కొలమానం ఆల్ఫా. ఫండ్ సూచిక ఇచ్చిన లాభానికి, మన ఫండ్ ఇచ్చిన లాభానికి మధ్య ఉన్న వ్యత్యాసమే ఆల్ఫా. ఉదాహరణకు సూచిక ఇచ్చిన వార్షిక లాభం ఐదేళ్లల్లో 15% అయితే మన ఫండ్ ఇచ్చిన వార్షిక లాభం 22% వస్తే.. ఆ ఫండ్ ఆల్ఫా 7%. అలాగే బేర్ మార్కెట్లో కూడా ఫండ్ సూచిక 5% నష్టపోతే మన ఫండ్ మాత్రం 3% నష్టపోతే ఆ వ్యత్యాసమైన 2% ఆల్ఫా.
పైన ఇచ్చిన పట్టికలో అన్ని ఫండ్స్ కంటే ఎక్కువ ఆల్ఫా నిప్పాన్ ఇండియా ఫండ్ సాధించింది. అంటే ఈ ఫండ్ మేనేజర్ సూచిక కంటే ఎక్కువగా లాభాలు సాధిస్తోందని అర్థం.
బీటా
ప్రతీ మదుపు మార్గంలో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. ఎలాంటి పద్ధతిలో మదుపు చేసినా రిస్క్ నుంచి తప్పించుకోలేం. మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ గురించి చెప్పేదే బీటా. బీటా ఎక్కువగా ఉన్న ఫండ్స్ రిస్క్ ఎక్కువగా ఉన్న ఫండ్స్ అని అర్థం చేసుకోవాలి. పైన ఇచ్చిన పట్టికలో హెచ్‌డీఎఫ్‌సీ, నిప్పాన్ ఫండ్స్‌ల బీటా ఎక్కువగా ఉంది. అంటే ఈ రెండు ఫండ్స్ ఎక్కువ రిస్క్ ఉన్నవి అని అర్థం.
విడివిడిగా చూడకూడదు
సరైన మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవడానికి పైన చెప్పిన అంశాలు చాలా ముఖ్యమైనవే.. అయినా ఈ కొలమానాలను వేటికవి విడిగా చూడకూడదు. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే కనుక అన్ని కలిపి వాటి పనితీరుని బేరీజు వేయాలి. అలాగే గతంలో మంచి పనితీరు కనబరచిన ఫండ్స్ భవిష్యత్తులో కూడా మంచి పనితీరు కనిపిస్తాయని ఆశించకుండా.. జాగ్రత్తగా పరిశీలించి మన అవసరానికి సరిపోయే ఫండ్ ఎంచుకోవాలి.
ఇవి కూడా చదవండి:
- INDvsPAK మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిదీ కూతురు భారత జాతీయ జెండాను ఎందుకు ఊపింది?
- బ్రిటన్‌లో రాచరికానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
- జ్ఞానవాపి కేసు: ‘ఇది ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. ఈ మసీదు... ఆ మసీదు ఇలా కొనసాగుతూనే ఉంటుంది’
- థాయ్‌లాండ్: రాణిలా దుస్తులు ధరించినందుకు రెండేళ్లు జైలు శిక్ష
- ఐఫోన్ 14 అమ్మకాలను నిషేధించిన బ్రెజిల్, కారణం ఏమిటంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














