పిల్లల ఉన్నత విద్య ఖర్చుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

ఫొటో సోర్స్, DELHI UNIVERSITY
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలకు అతి పెద్ద ఖర్చు పిల్లల చదువే.
హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో స్కూల్ ఫీజులు కూడా ఏడాదికి లక్ష రూపాయల దాకా ఉంటున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల గ్రాడ్యుయేషన్, పీజీ లాంటి ఉన్నత విద్యకు సంబంధించిన ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
గతంలో కంటే ప్రస్తుతం కాలేజీలు, విశ్వవిద్యాలయాల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఫీజుల మోత కూడా అధికంగానే ఉంది.

ఫొటో సోర్స్, Thinkstock
అలాగే డీమ్డ్ విశ్వవిద్యాలయాలలోనూ ఫీజులు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నాయి.
2019లో ఐఐటీలలో ఎంటెక్ ఫీజు ఇరవై వేల నుంచీ రెండు లక్షలకు, అంటే దాదాపు 900% పెంచారు.
ఇక మెడిసిన్ అంటే ముందు నుంచీ అధిక ఖర్చుతో కూడిన వ్యవహారమే. చాలామంది భారతీయ విద్యార్థులు యుక్రెయిన్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు మెడిసిన్ చదవడానికి వెళుతున్నారంటే మన విశ్వవిద్యాలయాలలో ఫీజులు ఎలా ఉన్నాయో అంచనా వేయచ్చు.
లా, సీఏ లాంటి కోర్సుల ఫీజులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఎంత ఖర్చు అవుతుంది?
ముందుగా పిల్లలు ఉన్నత విద్య దశకు చేరే సమయానికి ఎంత ఖర్చు రావచ్చో బేరీజు వేద్దాం.
ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యకు సంబంధించి వార్షిక ఖర్చు సగటున లక్ష రూపాయల దాకా ఉంటోంది. దీనికి తోడు కొంత హాస్టల్ ఫీజు కలుపుకుంటే ఏడాదికి ఒకటిన్నర లక్ష దాకా ఉంటొంది. అంటే నాలుగేళ్లకు కలిపి ఆరు లక్షల దాకా ఖర్చు ఉంటోంది.
అలాగే ఈ ఫీజు ఏడాదికి పది శాతం దాకా పెరిగే అవకాశం ఉంది. ఒక వేళ ప్రభుత్వ పరంగా ఫీజు పెంపు లేకపొయినా ఇతర ఖర్చులలో ఆ మాత్రం పెంపు చూడచ్చు.
కనుక ఈ ప్రాతిపదికన పిల్లల వయసును బట్టి వారికి పదిహేడేళ్లు వచ్చే సమయానికి ఎంత అవసరం ఉండచ్చో క్రింద ఇచ్చిన పట్టికలో చూద్దాం.


అంటే ఐదేళ్ల వయసున్న పాప/బాబు ఇంజినీరింగ్ చదవాలంటే పెద్దలు 19 లక్షల రూపాయల రాబడి వచ్చే విధంగా మదుపు చేయాలి.
ఇప్పుడు ఇదే విధంగా మెడిసిన్ ఖర్చు చూద్దాం. ప్రస్తుతం మెడిసిన్ చదవడానికి వార్షిక ఖర్చు సగటున రెండు లక్షల దాకా ఉంది. హాస్టల్, ఇతర ఖర్చులు కలుపుకుంటే రెండున్నర లక్షల దాకా ఖర్చు ఉంటుంది. మెడిసిన్ ఐదు సంవత్సరాల కోర్స్ కాబట్టి పన్నెండున్నర లక్షలు. దాని మీద పది శాతం వార్షిక పెరుగుదల పరిగణలోకి తీసుకుంటే వచ్చే మొత్తం ఎంత ఉంటుందో క్రింద ఇచ్చిన పట్టికలో చూద్దాం.

అంటే ప్రస్తుతం ఐదేళ్ల పాప/బాబు మెడిసిన్ చదవాలంటే కావలసిన మొత్తం నలభై లక్షలు.
ఇప్పుడు ఈ మొత్తం రాబడి రావడానికి ఎలా మదుపు చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం:
- రియల్ ఎస్టేట్, ఖనిజాలు లాంటి రంగాలలో మదుపు చేయకూడదు. ఎందుకంటే ఈ రంగాలలో ఒడిదొడుకులు చాలా ఎక్కువ. ఈ రంగాలను ప్రభావితం చేసే అంశాలు కూడా ఎక్కువే. కాబట్టి ఈ రంగాలలో చేసిన మదుపు మనకు అవసరం అయిన సమయానికి అందుతుందా లేదా అనేది అనుమానమే.
- ప్రత్యక్ష షేర్లు, ఐపీవో వగైరా మదుపు మార్గాలు కూడా పిల్లల చదువు లాంటి ఆర్థిక లక్ష్యాలకు సరిపోవు. దీనికి కారణం వాటిలో సహజంగా ఉండే రిస్క్. ఇలా రిస్క్ ఉండే మదుపు మార్గాలు మనకు అవసరం అయిన సమయానికి రాబడిని అందించలేకపోవచ్చు. పిల్లల చదువు విషయంలో రాబడి మొత్తం ఎంత ముఖ్యమో రావలసిన సమయం కూడా అంతే ముఖ్యం.
- ఈవిటీ ఫండ్స్ లేక డెట్ ఫండ్స్: ఫీజులలో వార్షిక వృద్ధి పదిశాతానికి పైగా ఉన్నప్పుడు మన పోర్ట్ ఫోలియో కూడా కనీసం ఆ మాత్రం వృద్ధిని సాధించాలి. అలాంటి వృద్ది ఈక్విటీ ఫండ్స్ ద్వారా సాధించవచ్చు. కానీ ఈక్విటీ ఫండ్స్ అంటే దీర్ఘకాలిక మదుపు వ్యవహారం. కాబట్టి మధ్యే మార్గంగా ఈక్విటీ మరియు డెట్ ఫండ్స్ రెండూ వాడుకోవడం చెప్పదగిన సూచన. ఉదాహరణకు మీ పిల్లల వయసు ఐదు సంవత్సరాలు అనుకుంటే వారు ఉన్నత విద్యకు ఇంకా పదేళ్ళ సమయం ఉంది. కాబట్టి మొదటి ఐదారేళ్లు ఈక్విటీ ఫండ్స్ ద్వారా మదుపు చేసి తర్వాత నాలుగేళ్ళు డెట్ ఫండ్స్ ద్వారా మదుపు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు అవసరం అయిన సమయానికి ఈక్విటీ ఫండ్స్ లాభాలలో ఉంటాయి. మీ డెట్ ఫండ్స్ నష్టభయం లేకుండా చేస్తాయి.
- ఇండెక్స్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి అవసరాలకు సరిపోతాయి. ఇండెక్స్ ఆధారిత ఫండ్స్ గురించి చాలా వాదనలు ప్రచారంలో ఉన్నాయి. వారెన్ బఫెట్ లాంటి వారు వాటిని సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తారు. కానీ ఇండెక్స్ ఆధారిత ఫండ్స్‌లో నష్ట భయం చాలా తక్కువ. మరో పక్క స్థిరమైన రాబడి కూడా ఉంటుంది. కాబట్టి పిల్లల చదువు లాంటి ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాలకు స్థిరమైన రాబడిని ఇచ్చే ఇండెక్స్ ఫండ్ చక్కగా సరిపోతాయి.
- ఎఫ్.యం.సి.జి, మెడికల్ రంగాలలో నష్ట భయం చాలా తక్కువ. ఈ రంగాలను ప్రభావితం చేసే అంశాలు కూడా తక్కువే. పిల్లల చదువు లాంటి ఆర్థిక లక్ష్యాలకు ఈ రంగాలలో మదుపు చేయవచ్చు.
పైన చెప్పిన సూచనల ప్రకారం పిల్లల చదువు కోసం నిర్మించాల్సిన పోర్ట్ ఫోలియో ఎలా ఉండాలో క్రింద ఇచ్చిన పటంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:
- ‘నా భార్య నగ్న ఫోటోలు అప్పులు ఇచ్చే వారి దగ్గరకు ఎలా వెళ్లాయి’
- Do Kwon: క్రిప్టోకరెన్సీ మార్కెట్ కుప్పకూలేందుకు కారణం ఇతనేనా? ఈయన కథేంటి?
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లి ఏం చేయాలి? ‘సూపర్ మామ్’గా ఉండటం కరెక్టేనా?
- పుతిన్ కాల్పుల విరమణ ప్రకటిస్తారా? యుక్రెయిన్ గెలుస్తుందా
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












