యుక్రెయిన్, రష్యా యుద్ధంలో ఎలాంటి మలుపు తీసుకోనుంది? పుతిన్ కాల్పుల విరమణ ప్రకటిస్తారా, యుక్రెయిన్ గెలుస్తుందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ లాండేల్
- హోదా, డిప్లమాటిక్ కరెస్పాండెంట్
యుద్ధాలు వస్తాయి, పోతాయి. యుక్రెయిన్ మీద వ్లాదిమిర్ పుతిన్ దండయాత్రకూ దీన్నుంచి మినహాయింపు లేదు.
యుక్రెయిన్‌ను రష్యా వేగంగా ఆక్రమించుకుంటుందంటూ తొలుత భయాలు నెలకొన్నాయి. కానీ రష్యా వెనుకంజ వేసింది. యుక్రెయిన్ ప్రతిఘటించింది. ఇప్పుడు యుక్రెయిన్ తూర్పు ప్రాంతం మీద రష్యా మరింతగా దృష్టి కేంద్రీకరించింది.
యుద్ధం మొదలై 100 రోజులు దాటింది. ఇది ఎటు వెళుతుంది?
యుద్ధం ఐదు రకాలుగా మలుపు తిరిగే అవకాశాలున్నాయి. ఇవి వేటికవే ప్రత్యేక మలుపులు కావుగానీ అన్ని అవకాశాలూ ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
1: జయాపజయాల ఊగిసలాట
రష్యా, యుక్రెయిన్ బలగాలు ఒకరి మీద మరొకరు పైచేయి సాధిస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధం సంవత్సరాల తరబడి కాకపోయినా నెలల పాటు కొనసాగవచ్చు.
ఇరు పక్షాలూ విజయాలు, అపజయాలు చవిచూస్తున్నందున గాలి అటూ ఇటూ ఊగిసలాడుతుండవచ్చు. ఏ పక్షమూ చేతులెత్తేయటానికి సిద్ధంగా లేదు. వ్యూహాత్మక సహనం ప్రదర్శించటం ద్వారా తాను లాభపడతానని రష్యా అధ్యక్షుడు పుతిన్ అంచనా వేస్తున్నారు. ఇదొక జూదం. పశ్చిమ దేశాలు యుక్రెయిన్ మీద దృష్టికేంద్రీకరించి అలసిపోతాయని, ఇక తమ ఆర్థిక సంక్షోభాల మీదకు, చైనా నుంచి వచ్చే ముప్పు మీదకు దృష్టి మళ్లిస్తాయని ఆయన భావిస్తున్నారు.
అయితే పశ్చిమ దేశాలు పట్టుదల చూపుతూ యుక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా కొనసాగిస్తున్నాయి. పాక్షిక శాశ్వత యుద్ధ క్షేత్రాలు స్థాపితమవుతున్నాయి. ఈ యుద్ధం స్థిరంగా ఘనీభవిస్తూ 'శాశ్వత యుద్ధం'గా మారుతోంది.
''రాబోయే స్వల్ప కాలంలో ఏ పక్షానికీ ఘనమైన లేదా వ్యూహాత్మక విజయం లభించే అవకాశం కనిపించటం లేదు. వ్యూహాత్మకంగా నిర్ణయాత్మక దెబ్బ తీయగల సామర్థ్యాన్ని ఏ పక్షమూ చూపించలేదు'' అని ఆస్ట్రేలియా మాజీ సైనికాధికారి, సైనిక నిపుణుడు మిక్ రేయాన్ విశ్లేషించారు.

2: పుతిన్ కాల్పుల విరమణ ప్రకటన
పుతిన్ ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తే? ఆయన గెలుచుకున్న భూభాగాలను తన ఖాతాలో వేసుకుని 'విజయం' సాధించామని ప్రకటించవచ్చు.
ఆయన తన 'సైనిక చర్య' పూర్తయిందని చెప్పుకోవచ్చు: దోన్బాస్ ప్రాంతంలో రష్యా మద్దతు గల వేర్పాటువాదులకు రక్షణ, క్రైమియాకు లాండ్ కారిడార్ నెలకొల్పటం. అలా నైతికంగా తనదే పైచేయి అని చెప్తూ యుద్ధం నిలిపివేసేలా యుక్రెయిన్ మీద ఒత్తిడి పెట్టవచ్చు.
''శాంతి కోసం లొంగిపోవాలని, భూభాగాన్ని వదులుకోవాలని యుక్రెయిన్ మీద యూరప్ దేశాల ఒత్తిడిని సొమ్ము చేసుకోవాలని రష్యా భావించినట్లయితే.. రష్యా ఎప్పుడైనా సరే ఈ ఎత్తుగడను ఉపయోగించుకోవచ్చు'' అని చాథమ్ హౌస్ థింక్ ట్యాంక్‌లో రష్యా నిపుణుడు కీర్ గైల్స్ అభిప్రాయపడ్డారు.
ఈ వాదనలు ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీల్లో వినిపించాయి: యుద్ధాన్ని సాగదీయాల్సిన అవసరం లేదు, ప్రపంచ ఆర్థిక బాధకు ముగింపు పలకాల్సిన సమయమిది, కాల్పుల విరమణకు ఒత్తిడి తెద్దాం.. అనేవి ఆ వాదనలు.
అయితే దీనికి అమెరికా, బ్రిటన్, తూర్ప యూరప్‌లోని చాలా దేశాలు వ్యతిరేకిస్తాయి. యుక్రెయిన్ క్షేమం కోసం, అంతర్జాతీయ శాంతి కోసం రష్యా దండయాత్ర విఫలమవ్వాలని ఈ దేశాల విధానకర్తలు నమ్ముతున్నారు.
కాబట్టి రష్యా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించినట్లయితే యుద్ధ కథనం మారవచ్చు కానీ యుద్ధం ముగియకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
3: యుద్ధరంగంలో ప్రతిష్టంభన
యుక్రెయిన్, రష్యాలు రెండూ తాము మరింతగా సైనిక విజయాలు సాధించలేమని నిర్ధారణకు వచ్చి.. రాజకీయ పరిష్కారం కోసం చర్చలు మొదలు పెడితే ఏమవుతుంది?
రెండు దేశాల సైన్యాలు అలసిపోయి ఉన్నాయి. సైనికులు, ఆయుధాలు తరిగిపోతున్నాయి. పణంగా పెడుతున్న ప్రాణాలు, సంపద.. ఇంకా యుద్ధం కొనసాగించటం సరైనదేనని చెప్పటం లేదు. రష్యాకు సైనిక, ఆర్థిక నష్టాలు తట్టుకోగలిగేవి కావు. యుక్రెయిన్ ప్రజలు యుద్ధంతో అలసిపోయారు. శాశ్వతంగా దోబూచులాడుతున్న విజయం కోసం మరిన్ని ప్రాణాలను బలిపెట్టటానికి వారు సుముఖంగా లేరు.
యుక్రెయిన్ నాయకత్వం పశ్చిమ దేశాల మద్దతును ఇక ఏమాత్రం నమ్మకుండా.. చర్చలు జరపాల్సిన సమయం వచ్చిందని నిర్ణయిస్తే ఏం జరుగుతుంది? చర్చల వేదిక మీద యుక్రెయిన్ సాధ్యమైనంత బలమైన స్థితిలో ఉండాలన్నది అమెరికా లక్ష్యంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ బాహాటంగానే అంగీకరిస్తున్నారు.
కానీ యుద్ధరంగంలో ప్రతిష్టంభన చాలా నెలల పాటు కొనసాగకపోవచ్చు. రాజకీయ పరిష్కారం కష్టమవుతుంది. ఎందుకంటే రష్యా మీద యుక్రెయిన్‌కు నమ్మకం లేదు. శాంతి ఒప్పందం ఏదైనా కుదిరితే అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. మరింతగా యుద్ధం ముదరవచ్చు.

ఫొటో సోర్స్, EPA/UKRAINIAN PRESIDENTIAL PRESS SERVICE
4: యుక్రెయిన్ 'గెలుపు'
అననుకూల పరిస్థితుల్లో యుక్రెయిన్ విజయానికి దగ్గరగా ఉండేదేమైనా సాధించగలదా? రష్యా దండయాత్ర మొదలుకావటానికి ముందున్న చోటుకు రష్యా బలగాలు వెనుదిరిగి వెళ్లేలా యుక్రెయిన్ తరిమివేయగలదా?
''యుక్రెయిన్ కచ్చితంగా ఈ యుద్ధాన్ని గెలుస్తుంది'' అని దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ గత వారంలో ఒక డచ్ టీవీ చానల్‌తో పేర్కొన్నారు.
దోన్బాస్ ప్రాంతం మొత్తాన్నీ స్వాధీనం చేసుకోవటంలో రష్యా విఫలమై, మరిన్ని నష్టాలను చవిచూస్తే ఏం జరుగుతుంది? రష్యా యుద్ధ యంత్రాంగాన్ని పశ్చిమ దేశాల ఆంక్షలు దెబ్బకొట్టాయి. యుక్రెయిన్ తనకు కొత్తగా అందిన దీర్ఘ శ్రేణి రాకెట్లను ఉపయోగిస్తూ ఎదురుదాడులు చేస్తుంది. రష్యా సరఫరా వ్యవస్థలు కుదేలైన చోట యుక్రెయిన్ తన భూభాగాలను మళ్లీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. యుక్రెయిన్ తన సైన్యాన్ని రక్షణ బలగం దశ నుంచి దాడి చేసే బలగంగా మారుస్తుంది.
ఇలాంటి పరిస్థితి వస్తే దాని వల్ల రాగల పర్యవసానాల గురించి ఇప్పటికే విధానకర్తలు ఆందోళన చెందుతున్నారు. పుతిన్ ఓటమి పాలయ్యే పరిస్థితి తలెత్తితే ఆయన మరింతగా యుద్ధ రూపురేఖలను పెంచేస్తూ అణ్వాయుధాలు కానీ రసాయన ఆయుధాలు కానీ ఉపయోగిస్తారా?
''పుతిన్‌కు అణ్వాయుధ అవకాశం ఉండగా.. సంప్రదాయ సైనిక ఓటమిని అంగీకరించే అవకాశం లేనట్లు కనిపిస్తోంది'' అని చరిత్రకారుడు నియాల్ ఫెర్గూసన్ ఇటీవల లండన్‌లోని కింగ్స్ కాలేజిలో జరిగిన ఒక సదస్సులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPA
5: రష్యా ‘గెలుపు’
ఒకవేళ రష్యా గెలిస్తే ఏమవుతుంది?
రష్యా తొలి దశల్లో ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ.. యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ను స్వాధీనం చేసుకుని ఆ దేశంలోని చాలా ప్రాంతాన్ని లోబరచుకోవాలని ఇంకా ప్రణాళికలు రచిస్తూనే ఉందని పశ్చిమ దేశాల నాయకులు గట్టిగా చెప్తున్నారు. ''ఆ గరిష్ట లక్ష్యాలు ఇంకా అలాగే ఉన్నాయి'' అని ఒక నేత పేర్కొన్నారు.
దోన్బాస్‌లో తమ పురోగతిని రష్యా సొమ్ముచేసుకోవచ్చు. అక్కడి తమ సైనిక బలగాలను వేరే ప్రాంతాల్లో వినియోగించటానికి, బహుశా మరోసారి కీయెవ్ మీద దాడి చేయటానికి ఉపయోగించుకోవచ్చు. రష్యా బలగాల భారీ సంఖ్య కారణంగా యుక్రెయిన్ బలగాలు దెబ్బతినటం కొనసాగవచ్చు.
ఈ యుద్ధంలో రోజుకు సగటున 100 మంది వరకూ యుక్రెయిన్ సైనికులు చనిపోతున్నారని, మరో 500 మంది గాయపడుతున్నారని అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఇప్పటికే అంగీకరించారు.
యుక్రెయిన్ ప్రజలు చీలిపోవచ్చు. కొందరు యుద్ధం కొనసాగించాలని, ఇంకొందరు శాంతి కోసం ప్రయత్నించాలని కోరవచ్చు. యుక్రెయిన్‌కు మద్దతు అందించటంలో కొన్ని పశ్చిమ దేశాలు అలసిపోవచ్చు. అయితే.. రష్యా గెలుస్తోందని ఆ దేశాలు భావిస్తే యుద్ధం మరింతగా ముదరాలని కొన్ని దేశాలు కోరుకోవచ్చు.
రష్యాకు హెచ్చరికగా పశ్చిమ దేశాలు పసిఫిక్ సముద్రంలో ఒక అణ్వాయుధాన్ని పరీక్షించాలని ఒక పశ్చిమ దేశపు దౌత్యవేత్త ఒకరు నాతో ప్రైవేటుగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
ఈ యుద్ధపు భవిష్యత్తు ఇంకా లిఖితం కాలేదు.
ఇవి కూడా చదవండి:
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్: భారత చరిత్రను మలుపు తిప్పిన ఈ వీరుడి కథ నిజమా, కల్పనా?
- Fake Currency notes: నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలా.. ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి
- ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













