యుక్రెయిన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్, రష్యా మత గురువు కిరిల్ మధ్య వాదోపవాదాలు ఎందుకు?

ప్యాట్రియార్క్ కిరిల్, పోప్ ఫ్రాన్సిస్

ఫొటో సోర్స్, TASS/SPAZIANI

ఫొటో క్యాప్షన్, ప్యాట్రియార్క్ కిరిల్, పోప్ ఫ్రాన్సిస్

రష్యా-యుక్రెయిన్‌ల మధ్య శాంతి కోసం ఫిబ్రవరి 24 నుంచి క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిస్తున్నారు. యుద్ధం మొదటిరోజే తాను, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీకి ఫోన్ చేసినట్లు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆయన నేరుగా ఫోన్ చేయలేదు. కానీ, పుతిన్‌ను కలిసేందుకు తాను రష్యా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కార్డినల్ పెట్రో పారోలిన్ ద్వారా ఆయన సందేశం పంపించారు. యుద్ధం ప్రారంభమైన 20వ రోజున ఆయన ఈ సందేశాన్ని పంపారు.

యుక్రెయిన్ పర్యటన గురించి కూడా ఆయన మాట్లాడారు. కానీ, ఏ రోజున ఈ సందర్శనలకు వెళ్లనున్నారో చెప్పలేదు.

యుక్రెయిన్‌లోని మరియుపూల్ నుంచి సాధారణ పౌరులు వెళ్లిపోవడానికి సురక్షితమైన మార్గాన్ని ఏర్పాటు చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మూడుసార్లు పోప్ ఫ్రాన్సిస్ కోరినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. అయితే, ఈ అభ్యర్థనకు గానూ ఆయనకు సానుకూల సమాధానం లభించలేదు.

రష్యా ఆర్థోడాక్స్ చర్చి ప్రముఖ మత గురువు ప్యాట్రియార్క్ కిరిల్‌కు చెందిన వెబ్‌సైట్‌లో మార్చి 16న ఒక ప్రకటనను విడుదల చేశారు. 'యుక్రెయిన్ పరిస్థితిపై విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ సంక్షోభ సమయంలో మానవతా అంశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం' అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

పోప్ ఫ్రాన్సిస్

ఫొటో సోర్స్, TASS/STEFANO SPAZIANI

ఫొటో క్యాప్షన్, పోప్ ఫ్రాన్సిస్

రాజకీయ భాషలో చర్చలు

పోప్ ఫ్రాన్సిస్ తన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు. ''ఆయన రష్యా ఆక్రమణను సమర్థిస్తూ తన చేతిలోకి తీసుకున్న పేపర్‌ను చదవడం ప్రారంభించారు. అది విన్న తర్వాత నేను... సోదరా, నాకేం అర్థం కావడం లేదని అన్నాను. 'మనం ప్రభుత్వ అధికారులం కాదు. మనం రాజకీయ భాషలో మాట్లాడకూడదు. ప్రభువు జీసెస్ భాషలో మాట్లాడాలి. మనం శాంతి మార్గాలను అన్వేషించాలి. యుద్ధాన్ని ఆపించాలి. మతగురువులు, పుతిన్‌ మిత్రుడి పాత్రను పోషించకూడదు' అని చెప్పాను'' అని పోప్ ఫ్రాన్సిస్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

''పుతిన్‌ను రెచ్చగొట్టారో లేదో నాకు తెలియదు. కానీ, రష్యా సరిహద్దుల్లో నాటో బలగాల మోహరింపును మాత్రం రెచ్చగొట్టే చర్యగా పరిగణించవచ్చు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ తర్వాత, మాస్కోలోని మత గురువుల విదేశీ చర్చలకు సంబంధించిన విభాగం మే 4న స్పందించింది. పోప్ ఇంటర్వ్యూపై సుదీర్ఘ వివరణను ఇచ్చింది.

చర్చల్లో వచ్చిన అంశాలను సరైన టోన్‌లో వ్యక్తం చేయలేకపోయినందుకు ఈ విభాగం, పోప్ ఫ్రాన్సిస్‌కు క్షమాపణలు చెప్పింది. అంతేకాకుండా, ఇలాంటి మాటలు ఇద్దరు మతగురువుల మధ్య ఎలాంటి అర్థవంతమైన చర్చలకు ఉపయోగపడవని వ్యాఖ్యానించింది.

ప్యాట్రియార్క్ కిరిల్‌తో వ్లాదిమర్ పుతిన్

ఫొటో సోర్స్, PATRIARCHIA.RU

ఫొటో క్యాప్షన్, ప్యాట్రియార్క్ కిరిల్‌తో వ్లాదిమర్ పుతిన్

రష్యా సమాధానం

వివరణలోని తొలి 20 నిమిషాల పాటు, రష్యా ఆక్రమణను సమర్థించారనే ఆరోపణపై వివరణ ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి లభించిన సమాచారంపై ప్యాట్రియార్క్ కిరిల్ మాట్లాడుతూ... పశ్చిమ మీడియా మాట్లాడని అంశాలను మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నా అని అన్నారు.

2014లో కీయెవ్‌, ఒడెస్సాలో జరిగిన సంఘటనలను కిరిల్ ప్రస్తావించారు. ''మనం ప్రతీది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాం. భయానక పరిస్థితుల్లోనూ ఆగ్నేయ యుక్రెయిన్ ప్రజలు తమ హక్కుల కోసం నిలబడ్డారు'' అని చెప్పారు.

''సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత, తూర్పు వైపుగా ఒక్క అంగుళం కూడా విస్తరించబోమని నాటో హామీ ఇచ్చింది. కానీ, ఆ వాగ్దానాన్ని నాటో ఉల్లంఘించింది. దీనివల్ల రష్యాకు ప్రమాదకర పరిస్థితులు తలెత్తాయి'' అని కిరిల్ చెప్పుకొచ్చారు.

''సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు కొన్ని నిమిషాల దూరంలోనే నాటో క్షిపణులను మోహరిస్తోంది. యుక్రెయిన్, నాటోను అనుమతిస్తే ఇక మాస్కో వారికి ఎంతో దూరంలో ఉండదు. దీన్ని మేం ఎన్నటికీ జరగనివ్వం'' అని పోప్ ఫ్రాన్సిస్‌తో ప్యాట్రియాక్ కిరిల్ అన్నట్లు వివరణలో పేర్కొన్నారు.

ఈ సుదీర్ఘ వివరణలో కేవలం ఒక పేరా మాత్రమే మానవతా అంశాలకు సంబంధించి ఉంది. దీన్ని విచారకర పరిస్థితిగా కిరిల్ వర్ణించారు. ఇరువైపులా తమ ప్రజలు ఉన్నారని, అందుకే శాంతి నెలకొల్పడానికి ప్రయత్నించాలి అని అన్నారు.

ప్యాట్రియార్క్ కిరిల్, పోప్ ఫ్రాన్సిస్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ప్యాట్రియార్క్ కిరిల్, పోప్ ఫ్రాన్సిస్

పోప్ ఫ్రాన్సిస్, ప్యాట్రియార్క్ కిరిల్ సమావేశం?

అయితే, ఈ వివరణలో ముఖ్యమైన అంశాలకు సమాధానం ఇవ్వలేదు.

ఉదాహరణకు రష్యాలోని సంప్రదాయ అర్థోడాక్స్ చర్చి మత గురువు, రోమన్ క్యాథలిక్ చర్చి మత గురువు మధ్య భేటీ జరుగుతుందా? అనే ప్రశ్నకు ఇందులో జవాబు లేదు.

ప్యాట్రియార్క్ కిరిల్, పోప్ ప్రాన్సిస్‌లు మొదటిసారిగా 2016 క్యూబాలో భేటీ అయ్యారు. ఈ సమావేశం కోసం సుదీర్ఘ సన్నాహాలు జరిగాయి.

''ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మత సంరక్షణ కోసం రెండు చర్చిలు కలిసి చురుగ్గా పనిచేస్తాయి. మా బాధ్యతలను నెరవేర్చడానికి మేం కలిసి పనిచేస్తాం'' అని నాటి సమావేశం అనంతరం కిరిల్ అన్నారు.

ఈ ఇద్దరు మతగురువుల తదుపరి సమావేశాన్ని జెరూసలెం వేదికగా జూన్ 14న ప్రతిపాదించారు. ''ఇది మా మధ్య రెండో సమావేశం అయి ఉండేది. ఈ భేటీకి, యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ, దీన్ని రద్దు చేశాం. ప్రపంచానికి తప్పుడు సందేశం వెళ్తుందనే ఉద్దేశంతోనే దీన్ని రద్దు చేశాం'' అని పోప్ ఫ్రాన్సిస్ ఇంటర్వ్యూలో చెప్పారు.

రష్యా మత గురువు కిరిల్ ఇచ్చిన వివరణలో కూడా వీరి తర్వాత సమావేశానికి సంబంధించిన ఎలాంటి ప్రస్తావన లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)