లేడీ సింగం: మోసగాడని తెలియడంతో కాబోయే భర్తపై కేసు పెట్టి అరెస్ట్ చేసిన ఎస్ఐ

ఫొటో సోర్స్, FACEBOOK/JUNMONI RABHA
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ కోసం
ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయల మేర మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని అస్సాం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ అరెస్టు చేశారు.
మామూలు సందర్భంలో ఇందులో వింత, విశేషం ఏమీ కనిపించకపోవచ్చు. కానీ, ఆ అరెస్టయిన వ్యక్తి ఆమెకు కాబోయే భర్త. మరికొద్ది నెలల్లో వారి వివాహం జరగాల్సి ఉంది.
అస్సాంలోని నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ జున్‌మోని రభా, ఓఎన్‌జీసీలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా చెప్పుకుంటున్న రాణా పోగాగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నౌగావ్ పోలీసులు రాణాను రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో జున్‌మోని, రాణాల నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్‌లో పెళ్లి జరగాల్సి ఉంది.
తనకు కాబోయే భర్త మోసగాడన్న విషయం నిశ్చితార్ధం తర్వాతనే తెలిసిందని ఆమె నౌగావ్‌లో నమోదైన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/JUNMONI RABHA
ఫిర్యాదులో ఏముంది?
నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ప్రకారం, నిందితుడు రాణా పోగాగ్ మొదటిసారి ఆమెను కలుసుకున్నప్పుడు తాను ఓఎన్‌జీసీ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌నని పరిచయం చేసుకున్నారు.
కానీ, నిశ్చితార్థం తర్వాత తనకు లభించిన కొన్ని ఆధారాలతో జున్‌మోని తనకు కాబోయే భర్తను అనుమానించడం ప్రారంభించారు.
తన అనుమానాలపై మరింత లోతుగా విచారణ ప్రారంభించగా..ఆయనకు పలు మోసాలలో ప్రమేయం ఉన్నట్లు తెలిసింది.
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారని రాణాపై ఆరోపణలున్నాయి.
గత ఏడాది జనవరిలో జున్‌మోని మజులిలో పని చేసినప్పుడు ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. రాణా మజులి నివాసి.
ఇలా అనేకసార్లు కలుసుకున్న తర్వాత, ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్ని నెలల తర్వాత వారిద్దరి కుటుంబాల అనుమతితో పెళ్లికి సిద్ధమయ్యారు. నిశ్చితార్థం కూడా జరిగింది.
''నాకు మజులీలో పోస్టింగ్ ఇచ్చారు. జనవరి 2021లో మొదటిసారి ఆయనను కలిశాను. నాకు పరిచయమున్న వ్యక్తులు, స్టేషన్ ఇంఛార్జ్, ఇతర పోలీసు అధికారులతో ఆయన పరిచయాలు పెంచుకున్నారు. బహుశా తాను చేసే మోసాల విషయంలో ఇబ్బందుల ఏర్పడకుండా ఇలా పరిచయాలు పెంచుకుని ఉండొచ్చు. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లే ఇలాంటి పనులు చేస్తారు'' అని తన నిశ్చితార్ధానికి ముందు జరిగిన పరిణామాలను వివరించారు జున్‌మోని.
''పరిచయం తరువాత, అతను నాకు ప్రపోజ్ చేశాడు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, కుటుంబ సభ్యులతో మాట్లాడాలని చెప్పాను. మా ఇద్దరి కుటుంబ సభ్యులు కలుసుకున్నారు, మా ప్రేమను అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత మా నిశ్చితార్థం జరిగింది. ఈలోగా నాకు నౌగావ్‌కి బదిలీ అయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అతని ఉద్యోగానికి సంబంధించిన కొన్ని విషయాలపై నాకు అనుమానం వచ్చింది. నేను విచారణ చేసినప్పుడు నా కళ్లు తెరుచుకున్నాయి" అన్నారామె.

ఫొటో సోర్స్, FACEBOOK/JUNMONI RABHA
మోసం ఎలా వెలుగులోకి వచ్చింది?
వారి పేర్లు చెప్పకుండా తనకు సాయం చేసిన వారందరికీ జున్‌మోని ధన్యవాదాలు చెప్పారు. వాళ్లు రాణాకు సంబంధించిన సమాచారాన్ని అన్ని ఆధారాలతో సహా ఆమెకు ఇచ్చారు.
''రాణా తనను తాను ఓఎన్‌జీసీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్నానని చెప్పాడు. నేను ఇక్కడ ప్రతిష్టాత్మకమైన కాటన్ కాలేజీ నుండి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కూడా చదివాను. అక్కడ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్‌ను చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. అందుకే, ఈ వ్యక్తి మోసగాడు అయ్యుంటాడని ఊహించలేదు'' అన్నారామె.
రాణా చేతిలో రూ.25 లక్షలు మోసపోయిన వ్యక్తి ఒకరు స్వయంగా జున్‌మోని వద్దకు వచ్చి విషయాలన్నీ వివరించారు. జున్‌మోని రాణాను పదే పదే ప్రశ్నించగా అసలు నిజం బైటపడింది.
''అతను మోసగాడు. కాబట్టి అతనికి శిక్ష పడాల్సిందే. ప్రేమలో పడినందుకు పిచ్చిగా బాధపడుతూ కూర్చునే అమ్మాయిని కాదు. అందుకే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశాను'' అన్నారు జున్‌మోని
నిందితుడు రాణా నుంచి ఓఎన్‌జీసీకి చెందిన పలు డాక్యుమెంట్లు, సీల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు నౌగావ్ పోలీసులు పేర్కొన్నారు. రాణా ఎప్పుడూ ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డ్‌ను, ఒక డ్రైవర్‌ను తన దగ్గర ఉంచుకునేవాడని, తద్వారా తాను పెద్ద అధికారిని అన్న భావన కల్పించేవారని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, FACEBOOK/JUNMONI RABHA
ఎమ్మెల్యేకు గట్టిసమాధానం
కొన్ని నెలల కిందట ఈ మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ అధికార బీజేపీ ఎమ్మెల్యేతో ఫోన్‌లో వాగ్వాదానికి దిగడం మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.
ఈ ఏడాది జనవరిలో జున్‌మోనిని మజులీలో పోస్ట్ చేసినప్పుడు, బిహ్‌పురియా ప్రాంతానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్‌తో ఆమె చేసిన టెలిఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో లీక్ అయింది.
ఒక పడవను పోలీసులు జప్తు చేసిన విషయంలో నిబంధనలను సడలించాల్సిందిగా ఆ ఎమ్మెల్యే జున్‌మోని కోరారు.
''మీరు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అయ్యుండి, నిబంధనలు ఉల్లంఘించాలని పోలీసులను ఎలా అడుగుతారు'' అని జున్‌మోని సదరు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
బ్రహ్మపుత్ర నదిలో బోటు ప్రమాదం జరిగిన తర్వాత సింగిల్ ఇంజన్ మెకనైజ్డ్ బోట్ల రాకపోకలపై నిషేధం విధించగా, దీని కింద పోలీసులు చర్యలు చేపట్టారు.

ఫొటో సోర్స్, FACEBOOK/JUNMONI RABHA
ప్రశంసల వెల్లువ
కాబోయే భర్తను అరెస్టు చేస్తూ జున్‌మోని తీసుకున్న నిర్ణయంపై మరోసారి సోషల్ మీడియాలో ఆమెకు ప్రశంసలు, అభినందనలు వచ్చాయి.
''ఈ సంఘటన మిమ్మల్ని బాధించిందా'' అని ఆమెను అడిగినప్పుడు, ''నేను చేసింది తప్పా ఒప్పా అని చాలాసేపు ఆలోచించాను. మన కుటుంబ సభ్యుడైనా సరే, తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాలి. అందుకే నేను ఖచ్చితంగా వ్యవహరించాను. నేను నిరాశపడటం లేదు. పై అధికారుల నుంచి నాకు మద్దతు లభించింది. నా బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాను. తప్పు చేసిన వ్యక్తులకు శిక్ష పడేలా చేస్తూనే ఉంటాను'' అన్నారామె.
ఇవి కూడా చదవండి:
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- వడదెబ్బను ప్రకృతి విపత్తుగా చూస్తారా? చనిపోతే నష్టపరిహారం ఇస్తారా?
- ‘శిథిలాల కింద చిక్కుకుపోయాను, నీళ్లు తాగి బతికాను.. నిశ్శబ్దంగా ఉంటే రాయితో గోడపై కొట్టేదాన్ని, ఎందుకంటే..’
- సింహం పెరట్లోకి ఎలా వచ్చింది... అసలు సంగతి తెలిసి అంతా ఆశ్చర్యపోయారు
- డెత్ రోడ్: భయంకరమైన ఈ మార్గంలో ప్రయాణం ఎలా ఉంటుందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












