గంగా నదిలోకి 30 ఘరియల్ మొసళ్లు విడుదల - NewsReel

ఘరియల్ మొసళ్లు

ఫొటో సోర్స్, ANI

ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారులు 30 ఘరియల్ మొసళ్లను బిజ్నోర్ సమీపంలో గంగా నదిలో విడిచిపెట్టినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రి ప్రకాశ్ జావదేకర్ చెప్పారని ఏఎన్ఐ తెలిపింది.

ఈ ప్రాంతంలో ఉన్న నది హస్తినాపూర్ వన్యప్రాణుల అభయారణ్యంలో భాగంగా ఉంది.

ఘరియల్ మొసళ్లు

ఫొటో సోర్స్, ANI

డబ్ల్యుూడబ్ల్యుూఎఫ్ నుంచి శిక్షణ పొందిన గంగమిత్ర సంఘం ఈ ప్రాంతంలో ఘరియల్ మొసళ్లు, తాబేళ్ల సంరక్షణ కోసం కృషిచేస్తోంది.

మొట్టమొదట 2009లో ఈ ప్రాంతంలోని గంగా నదిలో ఘరియల్ మొసళ్లను విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం 818 మొసళ్లను ఇక్కడకు తీసుకొచ్చారు.

ఘరియల్ మొసళ్లు

ఫొటో సోర్స్, ANI

సన్నటి, పొడవాటి నోరు ఉండే ఘరియల్ మొసళ్లు అంతరించిపోయే దశకు చేరుకున్నట్టు యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ గుర్తించింది. వాటిని సంరక్షించేందుకు ఈ చర్యలు తీసుకుంటోంది.

line
తరుణ్ గొగోయ్

ఫొటో సోర్స్, Getty Images

అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్ సోమవారం సాయంత్రం చనిపోయారు.

ఆయన వయసు 86 సంవత్సరాలు. మూడు సార్లు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు.

తరుణ్ గొగోయ్ కొన్ని నెలల క్రితమే కోవిడ్-19కు గురైనా ఆ తర్వాత కోలుకున్నారు. కానీ, ఆ తర్వాత తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు.

సోమవారం సాయంత్రం 5:34 గంటలకు తరుణ్ గొగోయ్ తుదిశ్వాస విడిచినట్లు అస్సాం ఆరోగ్యశాఖ మంత్రి హేమంతా బిస్వా శర్మ తెలిపారు.

"తరుణ్ గొగోయ్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం శంకరదేవ్ కళాక్షేత్రలో ఉంచుతాం. ఆయన భౌతిక కాయానికి పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తాం" అని చెప్పారు.

తరుణ్ గొగోయ్‌ను అనారోగ్యంతో గువాహటి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చేరారు. గత రెండు రోజులుగా ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆయనను వెంటిలేటర్ మీద ఉంచారు.

సోమవారం ఉదయం తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిందని వార్తలు వచ్చాయి. దాంతో, అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ దిబ్రూగఢ్‌లో తన అన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుని గువాహటి చేరుకున్నారు.

తరుణ్ గగోయ్ కుమారుడు ఎంపీ గౌరవ్ గొగోయ్ తన తండ్రి అవయావాలేవీ పనిచేయడం లేదని నవంబర్ 21న ట్విటర్ ద్వారా తెలిపారు.

ఆస్పత్రిలో గౌరవ్ గొగోయ్‌తోపాటూ అస్సాం ఆరోగ్య మంత్రి హేమంతా బిస్వా శర్మ కూడా ఉన్నారు.

line

కోవిడ్ వ్యాక్సీన్‌: ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ కరోనావైరస్ నుంచి '70 శాతం రక్షణ ఇస్తోంది'

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, OXFORD UNIVERSITY/JOHN CAIRNS

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన కరోనావైరస్ వ్యాక్సీన్ 70 శాతం మందిలో కోవిడ్ లక్షణాలు పెరగకుండా అడ్డుకుందని పెద్ద ఎత్తున జరిగిన పరీక్షల్లో తేలింది.

దీన్ని ఒక విజయంగా భావిస్తున్నారు. కానీ, ఇది 95 శాతం రక్షణ అందిస్తున్న ఫైజర్, మోడెర్నా వ్యాక్సీన్ల కంటే వెనక నిలిచింది.

అయితే, ఆక్స్‌ఫర్డ్ టీకా చాలా చౌకగా లభించనుంది. దీనిని నిల్వ చేయడం కూడా సులభం. అందుకే దీనిని మిగతా రెండు వ్యాక్సీన్ల కంటే ఎక్కువగా ప్రపంచంలో మూలమూలలకూ చేర్చవచ్చు.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్‌కు ఆమోదం లభిస్తే, కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో ఇది గణనీయమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

ఈ టీకా డోస్ పూర్తి చేయడం వల్ల దీని నుంచి లభించే రక్షణ 90 శాతం వరకూ పెరగవచ్చని కూడా ఒక డాటా చెప్తోంది.

బ్రిటన్ ప్రభుత్వం ఆక్స్‌ఫర్డ్ టీకా కోసం ముందే 10 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. ఇవి ఐదు కోట్ల మందికి వేయడానికి సరిపోతాయి.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్

''పరీక్షల్లో ఆక్స్'ఫర్డ్ వ్యాక్సీన్ చాలా సమర్థవంతమైనదని తేలడం అద్భుతమైన వార్త. ఇంకా మరిన్ని భద్రతా తనిఖీలు చేయాల్సి ఉంది. కానీ, ఇవి అద్భుతమైన ఫలితాలు'' అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతోషం వ్యక్తం చేశారు.

ఆక్స్‌ఫర్డ్ ఈ వ్యాక్సీన్‌ను 10 నెలల్లోనే అభివృద్ధి చేసింది. సాధారణంగా ఈ ప్రక్రియకు ఒక దశాబ్దం పడుతుంది.

''ఈరోజు ప్రకటన వైరస్ వల్ల జరిగిన వినాశనానికి ముగింపు పలకడానికి మనం టీకా ఉపయోగించే కాలానికి మనల్ని మరో అడుగు దగ్గర చేసింది" అని టీకాను తయారీలో పాల్గొన్న ప్రొపెసర్ సారా గిల్బెర్ట్ చెప్పారు.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ పరీక్షల్లో మొత్తం 20,000 మంది వలంటీర్లు పాల్గొంటున్నారు. వీరిలో సగం మంది బ్రిటన్ పౌరులు, మిగతావారు బ్రెజిల్‌కు చెందినవారు.

వైరస్ రెండు డోసులు తీసుకున్న వలంటీర్లలో 30 కోవిడ్ కేసులు బయటపడగా.. డమ్మీ ఇంజెక్షన్ వేసుకున్నవారిలో 101 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో ఇది 70 శాతం రక్షణను అందిస్తోందని పరిశోధకులు గుర్తించారు.

బ్రిటన్‌లో ప్రస్తుతం ఈ టీకా 40 లక్షల డోసులు ఉపయోగించడానికి సిద్ధంగా ఉండగా, మరో 9 కోట్ల 60 లక్షల డోసులు డెలివరీ చేయాల్సి ఉంది.

కానీ, అత్యధిక స్థాయిలో తయారు చేసే వ్యాక్సీన్ భద్రత, సమర్థతను అంచనా వేసే అధికారులు దానికి ఆమోదముద్ర వేసేవరకూ వీటిని సరఫరా చేయడం కుదరదు. ఈ ప్రక్రియకు ఇంకొన్ని వారాల సమయం పడుతుంది.

line

అఫ్గానిస్తాన్‌: 15 ఏళ్ల యుద్ధం, ఘర్షణల్లో 26,000 మంది పిల్లలు బలి

అఫ్గానిస్తాన్ చిన్నారి

యుద్ధ వాతావరణం నెలకొన్న అఫ్గానిస్తాన్‌లో గత 14 ఏళ్లుగా ప్రతి రోజూ సగటున ఐదుగురు చిన్నారులు చనిపోవడమో లేదంటే గాయపడడమో జరుగుతోందని ఒక స్వచ్చంద సంస్థ గుర్తించింది.

ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2005 నుంచి 2019 వరకూ దాదాపు 26,025 మంది పిల్లలు ఘర్షణలకు ప్రాణాలు కోల్పోవడం లేదా అంగవైకల్యానికి గురికావడం జరిగిందని ది చిల్డ్రన్ సంస్థ చెప్పింది.

సోమవారం జెనీవాలో జరగనున్న కీలక సమావేశానికి ముందు దేశంలో పిల్లల భవిష్యత్తును కాపాడాలని తమకు సాయం అందించే దేశాలను కోరింది.

అమెరికా తన దళాలను వెనక్కు పిలిపించడం, శాంతి చర్చలు ఆగిపోవడంతో అఫ్గానిస్తాన్‌లో హింస పెరుగుతోంది.

సేవ్ ది చిల్డ్రన్ సంస్థ వివరాల ప్రకారం చిన్నారులకు అత్యంత ప్రమాదకరంగా మారిన 11 దేశాల్లో అఫ్గానిస్తాన్ కూడా ఒకటి.

అఫ్గానిస్తాన్ చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

ఇక్కడ 2019లో జరిగిన ఘర్షణల్లో 874 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. 2,275 మంది చిన్నారులు అంగవైకల్యానికి గురయ్యారు. 2017-2019 మధ్య స్కూళ్లపై 300 దాడులు జరిగినట్లు సేవ్ ది చిల్డ్రన్ గుర్తించింది.

"ఆత్మాహుతి దాడిలోనో, వైమానిక దాడుల్లోనో ఈ రోజు మన బిడ్డ ప్రాణాలు కోల్పోతాడేమో అని ఎంతో మంది తల్లిదండ్రులు నిరంతరం భయంలో జీవించడం ఒక్కసారి ఊహించండి" అని సేవ్ ది చిల్డ్రన్ అఫ్గానిస్తాన్ డైరెక్టర్ క్రిస్ న్యామంది చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లో నిరంతరం కొనసాగుతున్న హింస ప్రభావం దాదాపు దేశమంతటా ఉందని గత ఏడాది బీబీసీ పరిశోధనలో తేలింది.

విదేశీ దళాలు వెళ్లిపోయిన తర్వాత చొరబాటుదారులను అఫ్గాన్ సైన్యం తగినంత బలంగా ఎదుర్కోలేకపోతోందని చాలా మంది పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

జనవరి చివరిలోపు మరో 2,500 మంది సైనికులను వెనక్కు పిలిపిస్తామని గత వారం అమెరికా చెప్పింది.

line

పుతిన్: 'బైడెన్‌కు వెంటనే అభినందనలు చెబితే అమెరికాతో రష్యా సంబంధాలు బాగుపడతాయా?'

బైడెన్, పుతిన్

ఫొటో సోర్స్, REUTERS/ALEXANDER NATRUSKIN/FILE PHOTO

అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంతవరకూ అధికారికంగా అభినందనలు తెలియజేయలేదు.

దీనికి కారణాలను వివరిస్తూ, "కోర్టులో జరుగుతున్న కేసుల విచారణ పూర్తయి, తీర్పు వెలువడేవరకూ వేచి చూస్తానని, అనంతరం బైడెన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తానని" పుతిన్ తెలిపారు.

"అధికారికంగా అభినందనలు అందజేయడంలో జరుగుతున్న ఆలస్యం ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చెయ్యదని" ఒక రష్యా టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ తెలిపారు.

అయితే, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలలో ఇప్పటికే ఉద్రిక్తత నెలకొని ఉంది.

'అధికారికంగా బైడెన్‌ను అభినందించకపోవడం వలన ఇరు దేశాల మధ్య సంబంధం చెడిపోదా?' అని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, "ముందునుంచే సంబంధాలు చెడిపోయి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చెడిపోయేదేముంది" అని పుతిన్ వ్యాఖ్యానించారు.

"మాకు ఎవరితోనూ ఏ సమస్యా లేదు. డోనాల్డ్ ట్రంప్‌తోనూ, జో బైడెన్‌తోనూ కూడా గౌరవప్రదమైన సంబంధాలున్నాయి. అభినందనలు తెలియజేయడమనేది అధికారిక విషయం. ఇందులో దాచిపెట్టేదేం లేదు. త్వరగా అభినందనలు తెలియజేస్తే చెడిపోయిన సంబంధాలు బాగైపోతాయని నేను అనుకోవట్లేదు" అని పుతిన్ తెలిపారు.

క్రితంసారి కూడా అందరూ ముందే హిల్లరీ క్లింటన్‌కు అభినందనలు తెలియజేసారు, కానీ, చివరికి ట్రంప్ గెలిచారని పుతిన్ గుర్తు చేసారు. అమెరికా ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడితో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే, అక్కడ అంతర్లీనంగా జరుగుతున్న వాదవివాదాలు సమసిపోయి, తుది తీర్పు వెలువడేవరకూ వేచి చూస్తామని పుతిన్ తెలిపారు.

line

పాకిస్తాన్ సరిహద్దు వద్ద జమ్మూకశ్మీర్ సాంబా సెక్టర్‌లో బయటపడ్డ సొరంగం

సాంబా సెక్టార్ సొరంగం

ఫొటో సోర్స్, ANI

పాకిస్తాన్ సరిహద్దుల్లో జమ్మూ-కశ్మీర్‌లోని సాంబా సెక్టర్‌లో150 మీటర్ల పొడవున్న రహస్య సొరంగమార్గాన్ని భారత బలగాలు కనుగొన్నాయి.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), జమ్మూ-కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారని వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.

"నగరోటా ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన ఉగ్రవాదులు ఈ సొరంగమార్గాన్నే అనుసరించినట్లు కనబడుతోంది. ఇది కొత్తగా తవ్విన సొరంగంలాగ ఉంది. వాళ్లకు హై వే వరకూ దారి చూపించడానికి ఎవరో ఒకరు గైడ్‌లాగ సహాయం చేసుంటారని భావిస్తున్నాం" అని బీఎస్ఎఫ్ జమ్మూ ఫ్రాంటియర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎన్ఎస్ జంవాల్ తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

"నగరోటా ఎన్‌కౌంటర్‌ గురించి పోలీసులకు క్లూ దొరకడంతో వారు బీఎస్ఎఫ్‌కు వార్త అందించారు. వెంటనే అన్వేషణ ప్రారంభించడంతో ఈ రహస్య సొరంగమార్గం బయటపడింది. పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఏ-మొహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఈ సొరంగమార్గాన్ని ఉపయోగించినట్లు అనుమానిస్తున్నాం" అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దిల్బాగ్ సింగ్ తెలిపారు.

నగరోటా టోల్ ప్లాజా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల దగ్గర లభించిన ఆయుధ సామాగ్రిని ఈ సొరంగమార్గంగుండానే తరలించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)