‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది

దూదేకులు, ముస్లింలు
    • రచయిత, శంకర్
    • హోదా, బీబీసీ కోసం

"ఏడాది కిందట మా అబ్బాయి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్ష రాసినప్పుడు సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లాం. అక్కడ ఓబీసీ కుల సర్టిఫికెట్ కావాలని అడిగాం. మా వివరాలు అడిగినప్పుడు మతం విషయంలో ముస్లింలమని చెప్పాం. కానీ అధికారులు అభ్యంతరం పెట్టారు. మీరు హిందువులని అన్నారు. మేమంతా తాతముత్తాతల నుంచి ఇస్లాం మతాచారాలను పాటిస్తుంటే హిందువులు అంటారేంటని అడిగాం’’ అని చెప్పారు గుంటూరు‌కు చెందిన షేక్ హజరత్.

‘‘కానీ అధికారులు మాత్రం రికార్డుల ప్రకారం మేము హిందువులమని రాసిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు.

మొన్న ఎంసెట్‌లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ విషయంలో కూడా అదే జరిగింది. ముస్లింలమని చెబుతూ హిందువులుగా టీసీలో ఉండడంతో హోల్డ్‌లో పెట్టారు.

ఏం చేయాలో పాలుపోలేదు. మా కులస్థులు కొందరు రిటైర్డ్ అధికారులను కలుసుకున్నాం. వారి సహకారంతో ఎంసెట్ కన్వీనర్‌ను కలిస్తే చివరకు అనుమతించారు. కానీ సీటు కేటాయించే సమయంలో ఏం చేస్తారో చూడాలి" అని ఆయన వివరించారు.

ఇది ఒక్క షేక్ హజరత్ కుటుంబం మాత్రమే కాదు, దూదేకుల కులస్థులంతా ఎదుర్కొంటున్న సమస్య.

చదువులు, ఉద్యోగాల విషయంలో తమ మత విశ్వాసాలకు భిన్నంగా రికార్డుల్లో వివరాలు నమోదు చేయడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు తమకు రావాల్సిన ప్రయోజనాలకు ఇది ఆటంకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా అధికారులకు విన్నవించినా ఫలితం ఉండట్లేదని వాపోతున్నారు.

చివరకు తాజాగా ఏపీ హైకోర్టులో దూదేకుల సంఘం ప్రతినిధులు పిటిషన్ వేశారు. ఈ అంశంపై ఇప్పుడు విచారణ సాగుతోంది.

ఏపీ హైకోర్టు

ఎవరీ దూదేకులు?

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ దూదేకుల కులస్థులున్నారు. తమిళనాడులో కూడా గుర్తింపదగ్గ సంఖ్యలో ఉంటారని ఆ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.

ఏపీలో రాయలసీమ ప్రాంతంలో దూదేకుల కులస్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. దూదేకులను నూర్ బాషాలని కూడా పిలుస్తారు. దూది(పత్తి)ని ఏకుతూ(విడదీస్తూ) జీవనం సాగించే వారు కాబట్టి తమ కులం వారికి దూదేకుల కులం అనే పేరు వచ్చిందని ఖాజవలీ బజాజ్ అనే వ్యక్తి చెబుతున్నారు. నూర్ బాఫ్ అన్న పదానికి కూడా నేతపని అనే అర్థం వస్తుందని, దాని నుంచే నూర్ బాస్ అన్న గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు. లద్దఫ్, పింజరి అనే ఉప కులాలు కూడా దూదేకుల జాబితాలో ఉంటాయి.

దూదేకులుగా పిలిచే ఈ వర్గమంతా శతాబ్దాలుగా ఇస్లాం ఆచారాలను పాటిస్తున్నారు. దర్గాలలో ముస్లిం పీర్లను అనుసరిస్తారు. తమ కులానికి చెందిన వారిని "ముజావర్"గా ఎంపిక చేసుకుని మొహర్రం కూడా జరుపుతారు.

వివాహం, మరణం వంటి సందర్భాల్లో సయ్యద్ ముస్లిం వర్గానికి చెందిన మతాధికారుల ఆదేశాలను పాటిస్తారు.

శుక్రవారం మతసంబంధిత సమావేశాలు హజరత్ నేతృత్వంలో జరుగుతాయి. ఆ సందర్భంగా చేసే మత ఉపన్యాసాలను ఉర్దూ, అరబిక్ భాషలతో పాటుగా తెలుగులోనూ వినిపిస్తారు.

దూదేకుల కులస్థుల్లో ఎక్కువ మంది ఉర్దూ, అరబిక్ అర్థం కాకపోవడమే దానికి కారణం.

దూదేకులు తీర్థయాత్రలో ముస్లిం మందిరాలను (దర్గా) క్రమం తప్పకుండా సందర్శిస్తారు.

పెనుకొండ బాబా ఫక్రుద్దీన్‌ను ఆరాధిస్తారు. ఏటా అక్కడ జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు.

హిందువులుగా ఎందుకు పరిగణిస్తున్నారు?

సాంస్కృతికంగా ఇస్లాం మతాచారాలను పాటించే దూదేకుల కులస్థులు ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తూ ఉంటారు.

దాంతో సామాజికంగా ప్రధాన పాత్ర పోషించే స్థాయికి చేరలేకపోయారన్నది ఆ కులస్థుల అభిప్రాయం. అదే సమయంలో పల్లెల్లో అన్ని మతాచారాలకు అనుగుణంగా వ్యవహరించే అలవాటుండడంతో కొన్ని చోట్ల హిందూ మత సంబంధిత కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనే నేపథ్యం ఉందని చెబుతున్నారు.

విశ్వాసాలు, ఆచారాలు ఇస్లాంమే అయినప్పటికీ, హిందువులకు సన్నిహితంగా మెలిగిన కారణంగా హిందువుల జాబితాలో దూదేకుల వారి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవని రిటైర్డ్ ఆర్డీవో ఎం వీ రావు అభిప్రాయపడ్డారు.

"దూదేకుల కులస్థులు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి దానికి ప్రధాన కారణం. మొదట్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం దూదేకుల అంటే హిందువుగానే అధికారుల్లో ఉండేది. ఆ తర్వాత ముస్లింలని చెప్పినా ఉన్న సంప్రదాయం ప్రకారం కొనసాగించాలని చెప్పారు. ఇప్పుడది కొందరికి సమస్య అవుతుంది. ప్రభుత్వం పునరాలోచన చేస్తే ఇది పెద్ద సమస్య కాదు" అని ఆయన బీబీసీతో అన్నారు.

ఖాజా రఫీ
ఫొటో క్యాప్షన్, ఖాజా రఫీ

సమస్య ఎందుకు?

దూదేకుల, నూర్ బాస్ అని వివిధ ప్రాంతాల్లో పిలుస్తున్న వీరందరినీ 12011/68/93-BCC(C ) dt 10.09.93 ప్రకారం బీసీ జాబితాలో చేర్చారు. బీసీ-బీ కేటగిరీలో రిజర్వేషన్ కల్పించారు. ఆ తర్వాత కుల సర్టిఫికెట్లు కేటాయించే అంశంలో స్కూల్ సర్టిఫికెట్లలో హిందువులని కొందరికి, ముస్లింలని కొందరికి ఉండటం వివాదానికి కారణంగా మారింది.

స్కూల్‌లో చేర్చిన సమయంలో ఎక్కువ చోట్ల వారిని హిందువులుగా నమోదు చేశారు. నేటికీ అలాంటి పరిస్థితే ఉందని షేక్ ఖాజా రఫీ అంటున్నారు.

"మమ్మల్ని బీసీ-బీలో చేర్చారు. కానీ ఆ సర్టిఫికెట్ కావాలంటే మేము హిందువులమేనని డిక్లరేషన్ అడుగుతున్నారు. ముస్లింలమైన మేం హిందువులుగా ఎలా ఇవ్వాలి. ఎన్నిసార్లు అడిగినా ఫలితం ఉండటం లేదు. కొందరు తిరగలేక అలానే రాసి ఇస్తున్నారు. దాంతో వాటిని చూపించి అందరూ అలానే ఇవ్వాలని అడుగుతున్నారు. మా కుల సంఘం పెద్దలు ఎన్నిసార్లు అడిగినా ఫలితం రావడం లేదు. ప్రతిసారీ సమస్య అవుతోంది. నేటితరంలో ఎక్కువ మంది చదువుకోవడం వల్ల ఈ సమస్య పెరుగుతోంది" అని ఆయన బీబీసీతో అన్నారు.

షేక్ సుభాన్
ఫొటో క్యాప్షన్, షేక్ సుభాన్

'మైనార్టీ కార్పొరేషన్‌లో పదవులు ఇచ్చి, హిందువులంటే ఎలా?'

గతంలో తాను మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించానని రాజమహేంద్రవరానికి చెందిన నూర్ బాషా సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు షేక్ సుభాన్ చెప్పారు.

" మైనార్టీ కార్పోరేషన్ పదవి నిర్వహించిన నేను మైనార్టీ అవుతాను. కానీ ఇప్పుడు మా పిల్లలు మైనార్టీ కోటాలో సీటు కావాలంటే చాలా సమస్య అవుతుంది. మైనార్టీ విద్యాసంస్థల్లో చదువుకోవడానికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. చాలామంది దూదేకుల, నూర్ బాస్ లకు ఇది ఇబ్బందిగా మారింది. అనేక మార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చాం. కొన్ని చోట్ల కలెక్టర్లు చొరవ తీసుకుని ఉత్తర్వులు ఇచ్చినా జీవో లేకుండా ఏమీ చేయలేమని అంటున్నారు. రాయలసీమలోని కొన్ని చోట్ల ముస్లింలని టీసీలలో రాస్తూ, ఇంకొన్ని చోట్ల మాత్రం హిందువులని రాస్తున్నారు. ఇలాంటి వైరుధ్యం వల్ల మా కులస్థులు నష్టపోతున్నారు" అని ఆయన బీబీసీతో అన్నారు.

జీవో సవరిస్తే సరిపోతుంది..

దూదేకుల, నూర్ బాషా, పింజారీ, లద్దాఫ్ కులస్తులను బీసీ బీలుగా పరిగణిస్తూ విడుదల చేసిన జీవోలో హిందూ మతస్తులుగా పేర్కొనడం వల్లనే ఈ సమస్య ఉందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సాబ్జీ అంటున్నారు.

‘‘దూదేకుల పేరుతో వచ్చిన కులానికి సంబంధించిన వృత్తులు పోయినా పేర్లు అలా మిగిలిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో హిందూ దూదేకుల అని పేర్కొనడం మూలంగా ప్రస్తుతం టీసీలలో అలా నమోదు చేయాల్సి వస్తోంది. చాలామందికి అదే ఉంటుంది. దాని మూలంగా మతం పరంగా మైనార్టీలే అయినా గానీ, ఆ కోటాలో రావాల్సిన సదుపాయాలు కోల్పోతున్నారు. జీవో సవరిస్తూ వ్యక్తిగతంగా వారు ఆచరించే మతాలను నమోదు చేయాలనే మార్పు తీసుకొస్తే సరిపోతుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాల’’ని ఆయన కోరుతున్నారు.

'మతం మారినా కులపరంగా బీసీ-బీ అవుతారు'

ప్రస్తుతం దూదేకుల, నూర్ బాస్‌ల సర్టిఫికెట్ల విషయంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈనెల 6న అది విచారణకు వచ్చింది.

ఈ కేసులో దూదేకుల తరుపున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ వై కే బీబీసీతో మాట్లాడారు.

"రాజ్యాంగం ప్రకారం ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ల అంశం ప్రస్తావనకు వస్తుంది. బీసీ-బీలో ఉన్న దూదేకులు ముస్లిం మతంలో ఉన్నప్పటికీ వారికి బీసీ-బీ కేటగిరీ దక్కుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలను గతంలో బీసీ-ఈ లో చేర్చారు. దానికన్నా ముందే, వాటితో సంబంధం లేకుండా ఈ కులాలకు బీసీ-బీ కేటగిరీ ఉంది. కాబట్టి రికార్డుల్లో మతం ఇస్లాం అని పేర్కొన్నా రిజర్వేషన్లకు ఢోకా లేదు. కులానికి, మతానికి సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. కాబట్టి దూదేకులందరికీ ముస్లిం అని సర్టిఫికెట్లలో పేర్కొనాలంటూ పిటిషన్ వేశాం. విచారణ చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులకు కోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణ కొనసాగుతోంది" అని ఆయన వివరించారు.

దూదేకుల కులస్థులందరికీ ముస్లింలుగా రికార్డుల్లో పేర్కొనడం మూలంగా ఎవరికీ సమస్య ఉండదని పిటిషన్ వేసిన ఖాజవల్లీ బజాజ్ అంటున్నారు.

"చాలాకాలం పాటు తిరిగాం. సెక్రటేరియేట్‌లో అధికారుల దగ్గరకి ఎన్నిసార్లు వెళ్లామో లెక్కలేదు. అయినా చిన్న సమస్యను సాగదీస్తున్నారు. చాలామంది విద్యార్థులను ఇక్కట్లు పాలుజేస్తున్నారు. అన్ని అర్హతలుండీ మైనార్టీ విద్యాసంస్థల్లో సీట్లు రాకుండా పోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి వారందరికీ న్యాయం జరగడం కోసమే హైకోర్టులో పిటిషన్ వేశాం. సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. విద్యా , రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం వస్తే సమస్యే లేదు. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుంటే వేలాది మంది విద్యార్థులకు ఊరట వస్తుంది" అని ఆయన బీబీసీతో అన్నారు.

ఈ సమస్యపై బీబీసీ ఏపీ ప్రభుత్వ విద్యా, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారుల వివరణను అడిగింది. అంశం హైకోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వ విధానం బెంచ్ ముందు తెలియజేస్తామని వారు సమాధానం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)