కరోనావైరస్: తొలి కోవిడ్ వ్యాక్సీన్ అనుమతి కోసం అమెరికాలో దరఖాస్తు చేయనున్న ఫైజర్

ఫైజర్ వ్యాక్సీన్
    • రచయిత, జేమ్స్ గెలఘర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్ వ్యాక్సీన్ సరఫరా కోసం అమెరికాలో అత్యవసర అనుమతులు పొందడానికి శుక్రవారం దరఖాస్తు చేసుకోనున్నట్లు ఫైజర్, బయోఎన్‌‌టెక్ సంస్థలు తెలిపాయి.

ఈ వ్యాక్సీన్ సురక్షితమో కాదో నిర్ణయించే బాధ్యత యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డి ఏ) పై ఉంటుంది. ఈ సమాచారాన్ని పరిశీలించడానికి ఎఫ్ డి ఏ ఎన్ని రోజులు తీసుకుంటుందనే అంశం పై స్పష్టత లేదు.

అమెరికా ప్రభుత్వం మాత్రం డిసెంబరు మధ్యకల్లా వ్యాక్సీన్ అమలు చేయడానికి ఆమోదం లభిస్తుందని భావిస్తోంది. ఇప్పటికే యుకె 4 కోట్ల డోసులను ఆర్డర్ చేయగా ఈ సంవత్సరాంతానికి ఒక కోటి డోసులు లభ్యమవుతాయని అంచనా వేస్తున్నారు.

డిసెంబరు మొదటి వారానికల్లా ఎఫ్ డి ఏ అనుమతులు లభిస్తే, అనుమతి లభించిన కొన్ని గంటల లోపే వ్యాక్సీన్ ని రోగికి అందివ్వగలమని ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు తెలిపాయి.

జెనెటిక్ కోడ్ ని విశదీకరించిన 10 నెలల లోపే వ్యాక్సీన్ తయారు చేయడం అత్యంత వేగవంతంగా జరిగిందని చెప్పవచ్చు. సాధారణంగా ఏదైనా వ్యాక్సీన్ కి ఆమోదం లభించడానికి 8 సంవత్సరాల వరకు పడుతుంది. "అత్యవసర కేసులలో ఈ వ్యాక్సీన్ వాడకానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడం ప్రపంచానికి వ్యాక్సీన్ అందించేందుకు సంస్థ చేస్తున్న ప్రయాణంలో ఒక కీలకమైన మైలురాయి" అని ఫైజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆల్బర్ట్ బౌర్ల అన్నారు.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

పెద్ద వయస్కులలో మెరుగైన ఫలితాలు...

ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ సంస్థలు తాము తయారు చేస్తున్న కోవిడ్‌ వ్యాక్సీన్‌ 65 సంవత్సరాలు దాటిన వారిలో 94శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని వెల్లడించాయి.

వివిధ జాతులు, వయోజన వర్గాలపై ప్రస్తుతం నిర్వహిస్తున్న మూడు దశల ట్రయల్స్‌లో ఈ వ్యాక్సీన్‌ అందరిపైనా సమానమైన ప్రభావం చూపినట్లుగా తాజా గణాంకాలనుబట్టి తేలిందని ఫైజర్‌, బయోఎన్‌టెక్‌లు వెల్లడించాయి.

ఈ ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా 41వేలమందిపై జరుగుతున్న ట్రయల్స్‌ ఆధారంగా తీసుకున్నవని, అమెరికాలో ఎమర్జెన్సీ కేసులలో ఈ వ్యాక్సీన్‌ను ఉపయోగించేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తామని ఆ సంస్థలు తెలిపాయి.

గత వారం తమ వ్యాక్సీన్‌ 90% ప్రభావవంతంగా పని చేస్తోందని, భద్రతా సమస్యలేవీ లేవని ఫైజర్‌ ప్రకటించింది. ఇటు అమెరికాకు చెందిన 'మోడెర్నా' కూడా తమ వ్యాక్సీన్‌ 95% మెరుగైన పనితీరు కనబరిచిందని ఇటీవల వెల్లడించింది.

తాజా ఫలితాలు 170 మంది వాలంటీర్ల మీద చేసిన ప్రయోగాల ఆధారంగా తీసుకున్నామని, ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు కనిపించలేదని, కేవలం 2%మందిలో స్వల్ప తలనొప్పి, అలసట లక్షణాలు కనిపించాయని ఆ సంస్థలు వెల్లడించాయి.

ఈ ట్రయల్స్‌లో పాల్గొంటున్న వాలంటీర్లలో 42% వివిధ జాతులవారు కాగా, 41%మంది 56 నుంచి 85 సంవత్సరాల మధ్య వయసున్న వారు.

అమెరికా, జర్మనీ, టర్కీ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాలలోని 150 ప్రాంతాలలో వాలంటీర్ల మీద ఈ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరినాటికి 5 కోట్ల డోసులు, 2021 చివరినాటికి 130 కోట్ల డోసులు వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలని ఈ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Coronavirus vaccine కరోనా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

నవంబర్ 9న ఫైజర్ తొలి ప్రకటన

ఫైజర్, బయోఎన్‌టెక్ ఔషధ సంస్థలు తయారు చేసిన వ్యాక్సీన్ కోవిడ్-19 నుంచి మనుషులకు 90 శాతం రక్షణ కల్పిస్తున్నట్లు ప్రాథమిక పరిశీలనలో తేలింది.

సైన్స్‌కి, మానవాళికి ఇది ఒక అద్భుతమైన రోజు అని ఆ సంస్థలు వర్ణించాయి.

ఆరు దేశాల్లోని 43,500 మందిపై ఈ వ్యాక్సీన్‌ను పరీక్షించారు. దీని భద్రత గురించి ఎలాంటి ఆందోళనలూ వ్యక్తం కాలేదు.

నవంబర్ నెలాఖరులోగా ఈ వ్యాక్సీన్‌‌ను ఉపయోగించేందుకు అత్యవసర అనుమతులు పొందాలని ఈ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.

ఈ వ్యాక్సీన్‌ను కరోనాతో పోరాటానికి అత్యంత సమర్థవంతమైన ఆయుధంగా భావిస్తున్నారు.

మరో డజను వ్యాక్సీన్లు తుది దశ ట్రయల్స్‌లో ఉన్నాయి. కానీ. అత్యధిక శాతం సానుకూల ఫలితాలను చూపించిన మొట్టమొదటి వ్యాక్సీన్ మాత్రం ఇదేనని చెబుతున్నారు.

ఈ వ్యాక్సీన్ కోసం పూర్తిగా ప్రయోగాత్మక విధానాన్ని ఉపయోగించారు. ఈ ప్రక్రియలో వైరస్‌తో పోరాడేలా రోగనిరోధక శక్తికి శిక్షణ ఇచ్చేందుకు వైరస్ జెనెటిక్ కోడ్‌ను శరీరంలోకి ఎక్కించారు.

కరోనావైరస్ వ్యాక్సీన్

ఈ వ్యాక్సీన్‌ను మూడు వారాల్లో రెండు డోసులు తీసుకోవాలి. ఇప్పటివరకూ అమెరికా, బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, టర్కీలో ట్రయల్స్‌ నిర్వహించగా, అందులో పాల్గొన్న 90 శాతం మందిలో ఏడు రోజుల్లోనే కరోనావైరస్‌ను ఎదుర్కొనే స్థాయిలో రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడింది.

ఈ ఏడాది చివరికల్లా ఈ వ్యాక్సీన్ 5 కోట్ల డోసులు అందుబాటులోకి తీసుకురాగలమని, 2021 చివరి నాటికి 130 కోట్ల డోసులు తయారు చేయగలమని ఫైజర్ చెబుతోంది.

కానీ, ఈ వ్యాక్సీన్‌ను భద్రపరచడానికి సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. దీనిని మైనస్ 80 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.

రోగ నిరోధక శక్తిపై దీని ప్రభావం ఎంత కాలం ఉంటుంది? వివిధ వయసుల వారిలో దీని ప్రభావం ఎలా ఉంటుంది? అనేదానిపై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. కానీ, కంపెనీ ఇప్పటివరకూ దానికి సంబంధించి ఎలాంటి సమాచారమూ వెల్లడించలేదు.

"మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారిని ఈ సంక్షోభం నుంచి బయటపడేయడానికి చాలా దగ్గరగా వచ్చాం" అని ఫైజర్ చైర్మన్ డాక్టర్ ఆల్బర్ట్ బోర్లా చెప్పారు.

బయోఎన్‌టెక్ ప్రొఫెసర్ ఉగూర్ సాహీన్ ఈ ఫలితాలను ఒక 'మైలురాయి'గా అభివర్ణించారు.

ఇప్పటివరకూ అందిన డేటా తుది విశ్లేషణ కాదు. దీనిని మొదటి 94 మంది వలంటీర్ల డేటా ఆధారంగా చెప్పారు. పూర్తి ఫలితాలను విశ్లేషించాక వ్యాక్సీన్ కచ్చిత ప్రభావంలో మార్పు ఉండవచ్చు.

నవంబరు మూడోవారంలో తమ వ్యాక్సీన్‌ను ఔషధ నియంత్రణ సంస్థల దగ్గరికి తీసుకెళ్లే స్థితిలో ఉంటామని ఈ సంస్థలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఈ వ్యాక్సీన్ నాలుగు కోట్ల డోసులకు బ్రిటన్ ఆర్డర్ ఇచ్చింది. ఇవి 2 కోట్ల మందికి సరిపోతాయి.

ఇది శుభపరిణామం అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పీటర్ హార్బీ అన్నారు.

"ఈ వార్త ఎంతో ఉపశమనం కలిగించింది. ఇదొక చారిత్రక ఘట్టంలా అనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)