సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, గౌరి కోహ్లీ
- హోదా, బీబీసీ వర్క్ లైఫ్
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పుడు దిల్లీకి చెందిన రజత్ సేతియా ఒక వైపు ఇంట్లో పిల్లలను చూసుకుంటూ మరో వైపు ఆఫీసు పని చేయడానికి చాలా ఒత్తిడికి గురయ్యేవారు. "మా అమ్మాయి తరచుగా తనపై నా దృష్టిని కేంద్రీకరించాలని కోరుతూ ఉండేది. ఒక్కొక్కసారి నేను ఆఫీసు పని మధ్యలో వదిలిపెట్టి తనతో గడపాల్సి వచ్చేది" అని ఆమె చెప్పారు.
31 సంవత్సరాల సేతియా పీపుల్ స్ట్రాంగ్ అనే హెచ్ఆర్ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆమె పని చేసే సంస్థ ఉద్యోగుల ఆనందాన్ని అంచనా వేసే విధానాల గురించి వివిధ సంస్థలకు సలహాలు, సూచనలు ఇస్తుంది. ఇప్పుడు వారు చెప్పే పనిని వారే పాటించాల్సిన సమయం వచ్చింది.
ఆమె సంస్థ కూడా ఫీడ్ బ్యాక్ సర్వేలు, సీనియర్ అధికారులతో ఆన్‌లైన్‌లో సమావేశాలు, చాట్ బాట్ లాంటి కమ్యూనికేషన్ సాధనాల ద్వారా సంస్థలో పని చేసే ఉద్యోగుల మనఃస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది. మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నవారి కోసం కొన్ని చర్యలను ప్రవేశ పెట్టింది.
ఆమెకున్న వ్యక్తిగత బాధ్యతల కారణంగా పైఅధికారులు ఆమెను కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు, సమావేశాల నుంచి తప్పిస్తారేమోనని భయపడుతూ ఉండేవారు రజత్. కానీ, సంస్థ ప్రవేశపెట్టిన సర్వే ఆమె భయాలను, విచారాలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడానికి సహాయపడింది. దీంతో, ఆమెకు అన్ని పనుల్లో భాగస్వామ్యం కల్పిస్తూ ఆమె పరిస్థితిని సాధారణంగా చేయటానికి ఆమె సహఉద్యోగులు సహాయపడినట్లు చెప్పారు.
ఆడియో, వీడియో కాల్స్ చోటు చేసుకుంటున్నప్పుడు అమ్మాయి గొంతు వినపడుతున్నప్పుడు ఆమె ఇబ్బంది పడుతుంటే అది సాధారణ విషయమే అని చెప్పడానికి కూడా తన సహఉద్యోగులు సహాయం చేశారని చెప్పారు. దాంతో తన ఒత్తిడి చాలా వరకు తగ్గిందని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Alamy
సాధారణంగా భారతీయ కంపెనీలలో పైఅధికారుల నుంచి కింది వరకు శ్రేణులు ఉంటాయి. ఏదైనా విషయానికి సంబంధించి సిబ్బంది నేరుగా అధికారులను సంప్రదించడం అరుదుగా జరిగే విషయమనే చెప్పుకోవచ్చు.
కోవిడ్-19 రాక ముందు కూడా పని పట్ల సంతృప్తికరంగా ఉండే సిబ్బంది వలన సంస్థకు లాభాలు చేకూరుతాయనే విషయాన్ని కొన్ని యాజమాన్యాలు గుర్తించడం ప్రారంభించాయి. సంతోషంతో పని చేసే సిబ్బంది 13 శాతం ఎక్కువ ఉత్పాదకత ఇస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.
భారతీయ శ్రామిక శక్తిలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2021 నాటికి భారతీయ శ్రామిక శక్తిలో 64 శాతం మంది 20-35 సంవత్సరాల మధ్య వారు ఉంటారని అంచనా. ఈ యువతరం ఆశావహ దృక్పధంతో కనిపిస్తున్నప్పటికీ, కఠినమైన డెడ్ లైన్లు, ఉద్యోగ అభద్రత, పని నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు నిర్దేశించే లక్ష్యాలను మాత్రం చాలా మంది ఒత్తిడిగా పరిగణిస్తున్నారు.
చాలా మంది ఉద్యోగులు ఎక్కువ గంటలు పని చేస్తున్నప్పటికీ, తాము చేసే పని నుంచి డబ్బులు కంటే కూడా ఆనందం ఇచ్చేదేదో కావాలని అత్యధికంగా భావిస్తున్నారు. ఇప్పటి తరం ముందు తరాల వారి కంటే ఎక్కువ విద్యార్హతలు, నైపుణ్యం కలిగి ఉంటున్నారు. దీంతో ఇలాంటి వారిని పనిలో నిలిపి ఉంచుకోవడానికి యాజమాన్యాలు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగులను సంతోషంగా ఉంచడం చాలా ముఖ్యమైన విషయమని చాలా యాజమాన్యాలు గ్రహించి వారి అవసరాలు, విచారాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఉద్యోగుల మనః స్థితిని అంచనా వేయడానికి కొన్ని సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని వాడుతున్నాయి.
ఈ సమాచారం కొన్ని సంస్థలు తమ సిబ్బందిని ఉద్యోగాల్లో నిలిపి ఉంచేందుకు సహాయపడుతోంది.

ఫొటో సోర్స్, Alamy
'హౌస్ ఆఫ్ ఛీర్ ' అనే భారతీయ మీడియా సంస్థ యూకేకి చెందిన హ్యూమన్ ఇన్సైట్ కంపెనీ 'ది హ్యాపీనెస్ ఇండెక్స్' తో కలిసి 'హ్యాపీనెస్ మీ' అనే సాధనాన్ని తయారు చేసింది. దీనిని వాడి సిబ్బంది ఆలోచనలు, భావాలను విశ్లేషిస్తారు.
తరచుగా నిర్వహించే సిబ్బంది నింపిన సర్వేల ఆధారంగా సంస్థ యాజమాన్యాలకు వారి సిబ్బంది "హ్యాపీనెస్ ఆడిట్' పంపిస్తామని హౌస్ ఆఫ్ ఛీర్ కి చెందిన నమ్రత టాటా చెప్పారు.
ఈ సర్వేల ద్వారా సిబ్బంది రోజులో ఎప్పుడైనా ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా వారి పరిస్థితిని విశ్లేషిస్తారు. దానిని, యాజమాన్యం అర్ధం చేసుకునే రీతిలో పొందుపరిచి పంపిస్తారు.
అయితే, కేవలం ఫీడ్ బ్యాక్ సర్వేలను ఉపయోగించి మనుషుల భావాలలో ఉండే సంక్లిష్టతను అర్ధం చేసుకోలేం. అలాంటి పరిస్థితుల్లో వ్యక్తులు కలిసి సంభాషించుకోవడం గాని, చర్చించడం కానీ ఉపయోగపడుతుంది.
ఇన్ఫీడో అనే కంపెనీ ఆమ్బర్ అనే చాట్ బాట్ ని అభివృద్ధి చేసింది. ఇందులో ఉండే ఒక పరికరం ఉద్యోగులు వ్యక్తపరిచిన భావాలు, గొంతు ఆధారంగా వారి మనఃస్థితిని అంచనా వేస్తుంది.
ఈ చాట్ బాట్ సిబ్బందితో తరచుగా మాట్లాడుతూ ఉంటుంది. దానికి సమాధానం చెప్పాలా లేదా అనే నిర్ణయం పూర్తిగా సిబ్బంది ఇష్టం పై ఆధారపడి ఉంటుంది. ఇందులో కచ్చితంగా మాట్లాడాలనే నియమం ఏమి లేదు. అలాగే, ఈ చాట్ బాట్ అడిగే ప్రశ్నలు కూడా కంపెనీ కంపెనీకి మధ్య భిన్నంగా ఉంటాయి.
ఇందులో సిబ్బంది తాము చేస్తున్న పని పట్ల ఎంత సంతృప్తికరంగా ఉన్నారు, అధికారులతో, మిగిలిన బృందంతో వారి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనే విషయాల గురించి ప్రశ్నలు ఉంటాయి.

ఫొటో సోర్స్, Alamy
క్రీడా పరికరాలను ఉత్పత్తి చేసే పూమా సంస్థ తమ సిబ్బంది సంతోషాన్ని అంచనా వేసేందుకు సర్వేలు, చాట్ బాట్ లను వాడుతుంది.
"సిబ్బందికి తమ మాట ఎవరో వింటున్నారనే భావన కలిగితే సంస్థలో ఒక నమ్మకమైన, స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడి అది సిబ్బందిని సంస్థకు కట్టిపడేలా చేస్తుంది" అని పూమా ఇండియా సౌత్ ఈస్ట్ ఆసియా మేనేజర్ అభిషేక్ గంగూలీ చెప్పారు.
బెంగళూరుకి చెందిన ఆన్ లైన్ ఫ్యాషన్ సంస్థ మిన్త్ర కూడా తమ సిబ్బంది ఇచ్చే ఫీడ్ బ్యాక్ సర్వేలను విశ్లేషించి ఉద్యోగం పట్ల సంతృప్తిగా లేని సిబ్బంది పట్ల దృష్టి కేంద్రీకరించి, వారి సమస్యలను పరిష్కరించే విధంగా పని చేస్తుంది. దీంతో సిబ్బంది ఉద్యోగాలు మానేసి వెళ్లడం బాగా తగ్గుతుంది అని మిన్త్ర ప్రతినిధి స్నేహ అరోరా చెప్పారు.
సిబ్బంది ఉద్యోగం పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా అని అంచనా వేయడానికే ఈ సమాచారాన్ని సేకరిస్తున్నప్పటికీ, ఇలా సమాచారం సేకరించడం పట్ల సిబ్బంది గోప్యతకు భంగం వాటిల్లవచ్చనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమను ఇబ్బంది పెడుతున్న విషయాలను యాజమాన్యంతో ఎక్కువగా పంచుకోవడం వలన కూడా తమ సహ ఉద్యోగులతో, పై అధికారులతో సంబంధాలు దెబ్బ తింటాయనే భయాన్ని కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.
పని స్థలాలలో ఉండే తమ మానసిక ఇబ్బందుల గురించి బయటకు చెప్పిన వారిలో 47 శాతం ఉద్యోగులు ప్రతికూల ఫలితాలు చవి చూసినట్లు లైమీడ్ అనే అమెరికా సంస్థ తెలిపింది.
రహస్యంగా సమాచారాన్ని సేకరించడం వలన సిబ్బంది మీద ప్రతికూలంగా పని చేసే అవకాశం తగ్గుతుంది కానీ, అలా చేయడం వలన వ్యక్తిగతంగా సమస్యలను పరిష్కరించే వీలు కలగదు.

ఫొటో సోర్స్, Alamy
"మానవ స్పర్శను మించిన టెక్నాలజీ లేదు" అని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సంస్థ హాప్టిక్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కార్తీక్ పొద్దార్ అంటారు. "కొన్ని సంస్థలు చాట్ బాట్ లను ఉపయోగించి కౌన్సెలింగ్ చేస్తున్నాయి. కానీ, టెక్నాలజీకి ఉన్న పరిమితుల వలన నిజంగా సిబ్బంది సంతోషాన్ని అంచనా వేయడం కష్టం" అని ఆయన అంటారు.
"మనుషుల భావాలు, ఆనందాన్ని కొలవడానికి మనిషిని మించిన టెక్నాలజీ లేదు" అని ఆయన అన్నారు.
కానీ, సిబ్బంది నేరుగా చర్చించలేని విషయాలను తెలుసుకోవడానికి టెక్నాలజీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని పీపుల్ స్ట్రాంగ్ చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ ప్రకాష్ రావు అంటారు.
చాట్ బాట్లు, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా సేకరించిన సమాచారంతో సిబ్బంది ఆలోచనా విధానాన్ని తెలుసుకుని వారితో సంభాషణలు జరపడానికి సహకరిస్తుందని ఆయన అంటారు.

ఫొటో సోర్స్, Alamy
ప్రస్తుతం సంస్థలు, సిబ్బంది కూడా ఒక కష్ట కాలంలో ఉన్నాయి. కోవిడ్ వలన తలెత్తే మానసిక సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో సుమారు 20 కోట్ల మంది ప్రజలు ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారని అంచనా వేశారు.
ఈ లాక్ డౌన్లో చాలా మంది కార్పొరేట్ ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసిందని దిల్లీకి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ మీమాంస సింగ్ తన్వార్ చెప్పారు. ఉద్యోగుల మానసిక సంక్షేమం పై సంస్థలు మరింత దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు.
సంస్థలు తిరిగి యధా స్థితికి రావాలంటే సిబ్బంది సంక్షేమం పై దృష్టి పెట్టడం చాలా కీలకం. ఇది దీర్ఘకాలంలో సంతృప్తికరమైన సిబ్బందితో కూడిన వాతావరణ కల్పనకు దోహదం చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ‘ఈ మందు వాడిన కరోనా రోగులు 10 రోజుల్లోనే కోలుకుంటున్నారు’.. రెమెడెసివీర్‌కు పూర్తి అనుమతులు ఇచ్చిన అమెరికా
- దసరా ఆఫర్లు: భారీ డిస్కౌంట్ల వెనుక మతలబు ఏమిటి? వీటిని మనం నమ్మవచ్చా?
- కరోనావైరస్ - ఏపీ, తెలంగాణ రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- కరోనావైరస్: మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కరోనావైరస్: భారత్‌లో కోవిడ్ సామాజిక వ్యాప్తి లేదా? అధికారులు ఎందుకలా చెబుతున్నారు?
- గ్రామాల్లో కరోనా వైరస్ విజృంభణ.. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక వ్యాప్తికి ఇది సంకేతమా
- భారతదేశంలో సామాజిక రుగ్మతలా మారుతున్న కరోనావైరస్.. దీన్ని తొలగించడం ఎలా?
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








