కరోనావైరస్‌-నిరుద్యోగం: ఉద్యోగం పోతే ఎలా? ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి?

కరోనా వైరస్‌తో పెరుగుతున్న

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డామియన్ ఫోవ్లర్
    • హోదా, బీబీసీ కోసం

కరోనావైరస్ సంక్షోభం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు.

అమెరికాలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. దశాబ్ద కాలం కిందట తీవ్రమైన ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు 2009 మార్చిలో ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య 6,65,000 ఉండగా, ఇప్పుడు అంతకు మించిపోయింది. ఏప్రిల్ 3వ తేదీ నాటికి అమెరికాలో దాదాపు 7,01,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు.

ఈ సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మరోవైపు, అనేక రాష్ట్రాల్లో నిరుద్యోగ బీమా పొందేందుకు అర్హత లేని తాత్కాలిక ఉద్యోగాలు చేసేవారు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, ఫ్రీలాన్సర్లు ఇందులో లేరు. వాళ్లందరినీ కలిపితే నిరుద్యోగుల సంఖ్య ఇంకా భారీగా ఉంటుంది.

ఒక్క అమెరికాలోనే కాదు, కోవిడ్ -19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. "ఇది ప్రపంచ నిరుద్యోగ విపత్తుగా మారబోతోంది. సంక్షోభంలో మరో సంక్షోభం వస్తోంది" అని బోస్టన్ కాలేజీకి చెందిన మానసిక నిపుణుడు, ప్రొఫెసర్ డేవిడ్ బ్లూస్టెయిన్ అంటున్నారు.

కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దాంతో, ఎన్నో కంపెనీలు, వ్యాపారాలు మూతపడ్డాయి. కొన్ని సంస్థలు వేతనం లేని సెలవులు ఇచ్చి ఉద్యోగులను ఇళ్లకు పంపించాయి. మరికొన్ని కంపెనీలు వేతనాలు ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నాయి. ఈ పరిణామాలతో ఒక్కసారిగా ఆదాయం కోల్పోయిన చాలా మంది ఆర్థిక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల వల్ల కొందరు మానసికంగానూ దెబ్బతినే ప్రమాదం ఉంది.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్న లక్షల మందిలో 39 ఏళ్ల జేమ్స్ బెల్ ఒకరు. ఆయన ఒక బార్‌లో పనిచేసేవారు. ఇప్పుడు అది మూతపడటంతో ఆయన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.

ఉద్యోగం పోయిందన్న షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నానని జేమ్స్ అంటున్నారు. భార్య, ముగ్గురు పిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడంలేదని చెబుతున్నారు.

“ఉద్యోగం కోల్పోవడం వల్ల చాలామంది మానసికంగా తీవ్రంగా దెబ్బతింటారు. పైగా ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఈ ఇబ్బందులు ఎన్నాళ్లు కొనసాగుతాయోనన్న ఆందోళన వారిలో మరింత పెరిగే అవకాశం ఉంది” అని న్యూయార్క్ నగరంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న మనస్తత్వవేత్త ఆడమ్ బెన్సన్ అంటున్నారు.

“చాలా మందికి ఉద్యోగం కోల్పోడం అనేది ఆప్తులను కోల్పోవడంతో సమానం. ఆ రెండు సందర్భాలలోనూ వారు పడే మానసిక వేదన ఒకేలా ఉంటుంది” అని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఈ సందర్భాలలో ఆయా వ్యక్తుల భావోద్వేగంతో కూడిన ప్రయాణంలో కొన్ని దశలు ఉండొచ్చు.

  • మొదట షాక్‌కు గురికావడం
  • జీవితం పట్ల విరక్తి కలగడం
  • కోప్పడటం
  • బతిమాలించుకోవడం
  • ఆఖరికి అంగీకరానికి రావడం
  • జీవితం పట్ల ఆశను పెంచుకోవడం లాంటి దశలు ఉంటాయి.

“కొందరు బాధను, సంతోషాన్ని అన్నింటినీ నియంత్రించుకోవాలని చూస్తారు. అది సరికాదు. నష్టపోతున్నప్పుడు, అలా ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు. అందుకే, దుఃఖమైనా, సంతోషమైనా సరే.. మనలోని భావాలను మనం అనుభవించాలి” అని ఆడమ్ బెన్సన్ అంటున్నారు.

“కొంతమంది తాము ఎంత నష్టపోతున్నా గుర్తించేందుకు ఇష్టపడరు. నేను పనిచేసే కంపెనీలో అందరూ ఉద్యోగాలు కోల్పోతున్నారు కదా, నేనే ఎందుకు ఆలోచించాలి? అని అనుకుంటారు. అదే వ్యక్తి తనకు నష్టం జరుగుతోందని గ్రహించినప్పుడు, అలా ఎందుకు జరిదిందన్నది అర్థం చేసుకుంటారు" అని బెన్సన్ చెప్పారు.

తీవ్రమైన మాంద్యం వచ్చిన తరువాత ఆర్థికపరమైన, ఇంటి ఖర్చులు, ఉద్యోగ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనే వారు మానసిక సమస్యలకు ఎక్కువగా గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

కరోనావైరస్‌-నిరుద్యోగం: ఉద్యోగం పోతే ఎలా? ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి?

ఫొటో సోర్స్, Getty Images

మరి, ఈ సంక్షోభ కాలంలో మానసిక ఆందోళన ఎదుర్కొంటున్న వారు ఏం చేయాలి?

“సాధారణంగా, మనకు ఏదైనా నష్టం జరిగితే, ఆ పరిస్థితి రావడానికి కారణలేంటో గుర్తించి, వాటిని అధిగమించడంపై దృష్టిపెట్టాలి. తక్షణం పరిష్కరించుకోగల సమస్యలను గుర్తించి (కొంతకాలం పాటు ఇంటి ఖర్చులను తగ్గించుకోవడం లాంటివి), పరిష్కరించుకోవాలి. అలా చేసినప్పుడు కొంత కాలం పాటు ఇబ్బందిగా అనిపించవచ్చు. అయినా, పరిస్థితులు చక్కదిద్దుకోవాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం తప్పనిసరి” అని బెన్సన్ చెబుతున్నారు.

ప్రస్తుతం నిరుద్యోగం పెరిగిపోతున్నప్పటికీ, ఇది తాత్కాలికమేనని, కరోనావైరస్ సంక్షోభం ముగిశాక పరిస్థితులు మళ్లీ అంతా చక్కదిద్దుకుంటుందని, మళ్లీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయనే సానుకూల ఆలోచనతో ఉండాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జేమ్స్ బెల్ కూడా అలాంటి సానుకూల ఆలోచనతోనే ఉన్నారు.

“నా వ్యక్తిగత సమస్యల కారణంగా నేను ఉద్యోగం కోల్పోలేదు. ఈ సంక్షోభం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఉపాధి పోయిందని షాక్ ఉన్నప్పటికీ, పరిస్థితులు మళ్లీ మెరుగుపడ్డాక, ఉద్యోగాలు వస్తాయన్న ఆశాభావం ఉంది” అని ఆయన అంటున్నారు.

కొన్ని సంస్థలు ఉపాధి కోల్పోయిన తమ ఉద్యోగులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొందరు విరాళాలు సేకరిస్తున్నారు. అయితే, “ప్రస్తుత నిరుద్యోగ సమస్యకు అది పరిష్కారం చూపించకపోవచ్చు. కానీ, ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఒక సానుకూల భావన కలుగేందుకు అలాంటి కార్యక్రమాలు సాయపడతాయి. తాము ఎదుర్కొంటున్న పరిస్థితికి తాము కారణం కాదన్న భావన వారిలో కలుగుతుంది” అని బెన్సన్ చెప్పారు.

ప్రస్తుత సంక్షోభం నుంచి తేరుకున్నాక మళ్లీ వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటాయనే ధీమా కొందరు పారిశ్రామిక వేత్తలలోనూ కనిపిస్తోంది.

ప్రస్తుతానికి ప్రాజెక్టులు అన్నీ నిలిచిపోతున్నప్పటికీ, పరిస్థితి మెరుగుపడ్డాక మళ్లీ వస్తాయనే ఆశాభావంతో ఉన్నామని అమెరికాలోని కనెక్టికట్‌లో 35 ఏళ్లుగా చలనచిత్ర, టెలివిజన్ సంస్థను నడుపుతున్న డోనా బెర్టాసినీ తెలిపారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)