కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?

కరోనా
    • రచయిత, ఫ్లోరా కర్మికయెల్, మరియానా స్ప్రింగ్
    • హోదా, బీబీసీ ట్రెండింగ్

కరోనావైరస్‌కు సంబంధించి తప్పుడు సమాచారం ఇప్పుడు వరదలా వచ్చిపడుతోంది. దీంతో ప్రజలంతా 'ఇన్ఫర్మేషన్ హైజీన్' అంటే సమాచార పరిశుభ్రత పాటించాలని నిపుణులు కోరుతున్నారు. మరి ఇలాంటి తప్పుడు సమాచారం చెలరేగకుండా మీరు ఏం చేయగలరు?

1. ఆగండి, ఆలోచించండి

మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సహాయపడాలని, వారికి అన్ని విషయాలూ తెలియజేయాలని మీరు అనుకుంటారు. అలా మీకు ఈమెయిల్, వాట్సాప్, ఫేస్ బుక్ లేదా ట్విటర్ ద్వారా వచ్చిన తాజా సలహాలను మీరు చాలా వేగంగా వారికి ఫార్వార్డ్ చేస్తుండొచ్చు.

అయితే, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవాలంటే చేయాల్సిన మొదటి పని... కాసేపు ఆగి, ఆలోచించడం అని నిపుణులు చెబుతున్నారు.

మీకు వచ్చిన సమాచారానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా, వాటిని ఫార్వార్డ్ చేయకుండా.. ఆగి, ఆ సమాచారం సరైనదో కాదో నిర్థరించుకోవాలి.

ఫేక్ న్యూస్

2. సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో చెక్ చేయండి

మీరు మీకు వచ్చిన సమాచారాన్ని ఫార్వార్డ్ చేసేముందు, ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోండి.

మీకు ఈ సమాచారాన్ని ఎవరు పంపించారో వాళ్లనే అడగండి.. ఇది ఎలా వచ్చింది? అని ప్రశ్నించండి.

వారు కనుక 'నా ఫ్రెండ్ కి ఫ్రెండ్' పంపించాడు అనో, 'మా అంటీ వాళ్ల కొలీగ్ వాళ్ల స్నేహితురాలు' పంపించింది అనో వాళ్లు సమాధానం ఇచ్చారంటే కనుక ఆ సమాచారానికి సరైన ఆధారం లేకపోవచ్చు అని భావించండి. ఎర్ర జెండా ఎగరేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమాచారాన్ని ఫార్వార్డ్ చేయకండి.

మాస్టర్స్ డిగ్రీ పట్టా ఉన్న ఒక అంకుల్ పంపించిన ఒక తప్పుదారి పట్టించే పోస్టు ఎలా వైరల్ అయ్యిందో మేం ఈ మధ్యనే కనుగొన్నాం.

ఆ పోస్టులో పేర్కొన్న కొంత సమాచారం నిజంగానే వాస్తవం. చేతులు కడుక్కోవడాన్ని ప్రోత్సహించడం ద్వారా వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గించొచ్చు వంటివి. కానీ,, మిగతా సమాచారం మాత్రం చాలా ప్రమాదకరమైనది. రోగ నిర్థరణ ఎలా చేయాలి అన్న దానికి సంబంధించి నిరూపణ కాని విషయాలను పేర్కొన్నారు.

''అత్యంత విశ్వసనీయమైన, ఆధారపడదగ్గ సమాచారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వంటి ప్రభుత్వ వైద్య సంస్థల వద్దే లభిస్తుంది'' అని యూకేకు చెందిన నిజ నిర్థరణ సంస్థ ఫుల్ ఫ్యాక్ట్ డిప్యూటీ ఎడిటర్ క్లారీ మిల్నె చెప్పారు.

నిపుణులు తప్పు చేయని దోషరహితులేమీ కాదు. కానీ, వాట్సాప్‌లో మెసేజ్‌లు ఫార్వార్డ్ చేసే ముక్కూ మొహం తెలియని వ్యక్తి వాళ్ల దూరపు బంధువు కంటే నిపుణులు చాలా వరకు ఆధారపడదగ్గవారు.

3. ఇది తప్పుడు సమాచారం అయి ఉండవచ్చా?

ఒక్కోసారి కంటికి కనిపించేది కూడా వాస్తవం కాకపోవచ్చు.

బీబీసీ న్యూస్‌తో సహా సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వాల అధికారిక ఖాతాలను పోలిన ఖాతాలను తయారు చేయడం చాలా సులభం. సమాచారం నమ్మదగ్గ ప్రభుత్వ సంస్థల నుంచే వచ్చింది అని అనిపించేలా స్క్రీన్ షాట్లను కూడా మార్చొచ్చు.

తెలిసిన, ధృవీకరించిన ఖాతాలు, వెబ్‌సైట్లను పరిశీలించండి. అక్కడ మీకు సమాచారం సులభంగా దొరకలేదంటే, మీకు వచ్చిన సమాచారం మోసపూరితమైనది కావొచ్చు. ఏదైనా పోస్టు, వీడియో, లింక్ అనుమానాస్పదంగా అనిపిస్తే.. అది నిజంగానే అనుమానించాల్సినది కావొచ్చు.

పెద్దపెద్ద అక్షరాలు, అసంబద్ధమైన రాత ప్రతులు (ఫాంట్) ఉంటే కనుక ఆ సమాచారం తప్పుదోవపట్టించేది అనటానికి అవే సంకేతాలని నిజనిర్థరణ చేసే నిపుణులు భావిస్తుంటారని ఫుల్ ఫ్యాక్ట్ కు చెందిన క్లారీ మిల్నె చెప్పారు.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

4. నిజమో కాదో తెలియట్లేదా? అయితే షేర్ చేయొద్దు

నిజమో కాదో స్పష్టంగా తెలియనప్పుడు, ఒకవేళ నిజం కావొచ్చునేమో అని వేటినీ ఫార్వార్డ్ చేయకండి. ఇలా చేస్తే మీరు మంచికంటే చెడే ఎక్కువ చేస్తున్ననట్లు లెక్క.

మనకు తెలిసిన డాక్టర్లు, ఇతర నిపుణులు చెప్పిన విషయాలను తరచుగా పోస్ట్ చేస్తుంటాం. అది సరైనదే కావొచ్చు కానీ, అప్పుడు కూడా మన అనుమానాలన్నీ తీరాకే పోస్ట్ చేయాలి.

అలాగే, ఒక సందర్భంలో చెప్పిన విషయాలను మరొక సందర్భానికీ, సంఘటనకీ ముడిపెట్టి కూడా పోస్టులు, మెసేజ్‌లు, ఫొటోలు తయారు చేస్తుంటారన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.

కరోనావైరస్ జాగ్రత్తలు

5. ప్రతి సమాచారాన్నీ చెక్ చేయాలి

వాట్సాప్‌లో ఒక వాయిస్ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. ఆసుపత్రిలో పనిచేస్తున్న ''కొలీగ్ వాళ్ల ఫ్రెండ్'' సలహాను తాను ట్రాన్స్‌ లేట్ చేస్తున్నానని ఒక మహిళ ఆ వాయిస్ మెసేజ్‌లో మాట్లాడుతోంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా చాలామంది బీబీసీకి కూడా పంపించారు.

అయితే, అందులో వాస్తవాలు కొన్ని, అవాస్తవాలు కొన్ని ఉన్నాయి.

మెసేజ్ పెద్దదిగా ఉన్నప్పుడు, అందులో చాలా విషయాలు పేర్కొన్నప్పుడు, ముందు చెప్పిన కొన్ని విషయాలు మనకు తెలిసిన, వాస్తవ విషయాలు అయినప్పుడు మిగతావి కూడా వాస్తవాలేనని మనం అనుకునే అవకాశాలు ఉన్నాయి.

అయితే, మనం అనుకుంటున్నట్లుగా అందులోని మిగతా అంశాలన్నీ కూడా ప్రతిసారీ వాస్తవాలు కాకపోవచ్చు.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

6. భావోద్వేగ పోస్టులతో జాగ్రత్త

మనల్ని భయపెట్టే, కోపం తీసుకొచ్చే, ఆందోళనకు గురిచేసే, ఆనందింపజేసే ఈ పోస్టులు బాగా వైరల్ అవుతుంటాయి.

''తప్పుడు సమాచారాన్ని పెంచిపోషించే వాటిల్లో కీలకమైనది భయం'' అని ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనేలా జర్నలిస్టులకు సహాయం చేసే ఫస్ట్ డ్రాఫ్ట్ సంస్థకు చెందిన క్లారీ వార్డ్‌ లె చెప్పారు.

తక్షణం స్పందించండి అన్నట్లుగా తీర్చిదిద్దిన ఈ పోస్టులు ఆందోళన, ఆత్రుతల్ని పెంచేందుకు ప్రత్యేకంగా రూపొందించినవి. కాబట్టి వీటిపట్ల చాలా జాగ్రత్తగా ఉండండి.

''తాము ప్రేమించేవాళ్లంతా సురక్షితంగా ఉండేందుకు సహాయపడాలని ప్రజలు భావిస్తుంటారు. అందుకే 'వైరస్‌ నుంచి కాపాడుకునే సలహాలు' అని, 'మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వీటిని తీసుకోండి' అని చెప్పే పోస్టుల్ని చూసినప్పుడు వాళ్లు తాము చేయగలిగిన సహాయం చేయాలనుకుంటారు'' అని క్లారీ చెప్పారు.

7. పక్షపాతం గురించి ఆలోచించండి

మీరు ఏదైనా షేర్ చేసేముందు, ఫార్వర్డ్ చేసేముందు ఒక్కసారి ఆలోచించండి.. అది నిజం అని మీకు తెలుసా? లేక దాంతో మీరూ ఏకీభవిస్తున్నారా?

మనం బలంగా నమ్మే విషయాలను పునరుద్ఘాటించే పోస్టుల్ని మనం షేర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డెమోస్ సంస్థ సెంటర్ ఫర్ ది అనాలసిస్ ఆఫ్ సోషల్ మీడియా రీసెర్చి డైరెక్టర్ కార్ల్ మిల్లర్ చెప్పారు.

''మనం ఆగ్రహంతో తల ఊపుతున్నామంటే, మనం దాని ప్రభావానికి లోనైనట్లే'' అని ఆయన అన్నారు. ''అప్పుడే మనం ఆన్‌లైన్‌లో చేస్తున్నవన్నీ తక్షణం తగ్గించుకోవాలి'' అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)