కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?

మాస్కు ధరించిన యువతి

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ పరీక్షలు నిర్వహించడం ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన అధికారి టెడ్రోస్ అదానమ్‌ గెబ్రియేసస్ ఈ వారం జెనీవాలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ఇన్ఫెక్షన్ సోకిందని అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని దేశాలు పరీక్షలు నిర్వహించాలని దీనిపై ఎవరూ కళ్ళు మూసుకుని ప్రవర్తించడానికి లేదని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,75,000 మందికి పైగా కరోనావైరస్ బారినపడగా, 11,000 మందికి పైగా మరణించారు.

భారతదేశంలో 300 మందికి పైగా ఈ వైరస్ బారిన పడినట్లు, నలుగురు మరణించినట్లు నివేదికలు అందాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోనే జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న భారత దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సలహా పాటించి కరోనావైరస్‌ని గుర్తించేందుకు తగినన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తోందా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది.

మాస్కు ధరించిన యువకుడు

ఫొటో సోర్స్, EPA

గురువారం సాయంత్రానికి అధికారిక అంచనాల ప్రకారం భారతదేశం ఇప్పటికే 72 టెస్టింగ్ లాబ్స్‌లలో 14,175 మందికి పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. వీటిని ప్రపంచంలోనే అతి తక్కువ స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్షలు అని చెప్పవచ్చు.

దేశంలో పరీక్షలు నిర్వహించడానికి తగినన్ని లేబొరేటరీస్ లేకపోవడం కూడా తక్కువ స్థాయిలో పరీక్షలు జరగడానికి ఒక కారణం అని చెప్పవచ్చు.

వైరస్ సోకినవారికి దగ్గరగా మెలిగిన వ్యక్తులకు, విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారికి, కోవిడ్-19 సోకిన వ్యక్తులకు వైద్యం అందిస్తున్న వారికి, వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారికి మాత్రమే ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

100 కోట్లకి పైగా జనాభా ఉన్న దేశంలో ఇంత తక్కువ స్థాయిలో పరీక్షలు ఎందుకు నిర్వహిస్తున్నారు?

ఈ వైరస్ ఇంకా సమాజంలో వ్యాప్తి చెందలేదని అధికారులు భావించడం కూడా ఇందుకు ఒక కారణం. మార్చ్ 1 నుంచి 15 వరకు దేశంలో 50 ప్రభుత్వ ఆసుపత్రుల్లో శ్వాస కోశ ఇబ్బందులతో బాధపడుతున్న 826 మంది రోగులకు పరీక్షలు నిర్వహించిన వారందరికీ కరోనావైరస్ లేదని తేలిందని వైద్య అధికారులు చెబుతున్నారు. శ్వాస కోశ ఇబ్బందులతో బాధపడుతూ హాస్పిటల్లో చేరే వారి సంఖ్య పెరిగినట్లు ఆస్పత్రులు ధ్రువీకరించలేదు.

ఇది అంటువ్యాధిలా ప్రబలకపోవడం కొంత ధైర్యాన్ని ఇస్తోందని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ బలరాం భార్గవ చెప్పారు.

"గెబ్రియేసస్ చెప్పిన పరిస్థితి భారతదేశంలో లేదని, అయన ఇచ్చిన సలహా ఇప్పట్లో దేశంలో అమలు చేయవలసిన అవసరం లేదని ఆయన అంటారు. అధిక స్థాయిలో పరీక్షలు నిర్వహించడం వలన ప్రజలు మరింత భయానికి గురవుతారు" అని ఆయన అన్నారు.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

వైద్య నిపుణులు మాత్రం ఈ అంశంపై కచ్చితంగా ఏమీ చెప్పలేకపోతున్నారు.

రోగులు ఒకేసారి వస్తే తగినన్ని ఆసుపత్రులు, ప్రజా ఆరోగ్య సదుపాయాలు దేశంలో లేకపోవడం వలన కూడా తగినంత స్థాయిలోవైద్య పరీక్షలు నిర్వహించటం లేదని, కొంత మంది నిపుణులు అభిప్రాయపడ్డారు.

"పరీక్షలు నిర్వహించడం ఒక్కటే మార్గం కాదని నాకు తెలుసు, కానీ తగినంత పరీక్షలు అయితే జరగటం లేదు. ఇది అంటువ్యాధిలా ప్రబలక ముందే అరికట్టాలి" అని ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, 'బట్ డూ వి కేర్ - ఇండియా'స్ హెల్త్ సిస్టం' రచయిత, కె.సుజాత రావు బీబీసీతో అన్నారు.

స్టార్‌బక్స్ కాఫీ దుకాణం ముందు పరీక్షిస్తున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

ఇష్టం వచ్చినట్లు ఎవరికి పడితే వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం వలన అనవసరమైన భయం నెలకొంటుందని, ఇది ప్రజారోగ్య వ్యవస్థని కలవరపెడుతుందని వైరాలజిస్టులు అన్నారు. వైరస్ లేదా జలుబు లాంటి లక్షణాలతో బాధపడుతున్న వారిని పరీక్షించడం ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి సమాజంలో వ్యాప్తి చెందుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. "ఇప్పుడు వైద్య పరీక్షలను కేంద్రీకృతంగా చెయ్యాలి. మనం ఒక కొరియాలానో, చైనాలానో అయ్యే పరిస్థితిని ఎదుర్కొనే స్థితిలో లేము" అని ఓ సీనియర్ వైరాలజిస్ట్ అన్నారు.

భారతదేశం అతి తక్కువ వనరులతో ఒక పెద్ద మహమ్మారిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. ప్రైవేట్ రంగం, నిపుణుల సహకారంతో పోలియో, స్మాల్ పాక్స్, హెచ్ఐవీ/ఎయిడ్స్ లాంటి రోగాలను అరికట్టడంలో, ఇటీవల సంభవించిన హెచ్1ఎన్1 ని వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో భారతదేశం అవలంబించిన తీరుని, సాధించిన విజయాన్ని కొంత మంది నిపుణులు ఉదాహరణగా చెపుతున్నారు.

కానీ, కరోనావైరస్ ఇటీవల కాలంలో ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ఒక ప్రాణాంతక వైరస్‌గా పరిణమించింది.

అంబులెన్సు

ఫొటో సోర్స్, Getty Images

ఇది తీవ్ర రూపం దాల్చి మహమ్మారిలా వ్యాప్తి చెందితే భారతదేశం తన ప్రజారోగ్యం మీద ఖర్చు పెడుతున్న 3.7 శాతం స్థూల జాతీయ ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది.ఇప్పటికే మూసి వేసిన స్కూళ్ళు, కాలేజీలు, రైల్వే సర్వీసులను బట్టి చూస్తే ఇది వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించినట్లుగా కనిపిస్తోంది.

జరగబోయే పరిణామం కోసం దేశం సంసిద్ధమవుతోంది. భారత దేశం పరీక్షల సంఖ్యని నెమ్మదిగా పెంచుతోంది. ప్రస్తుతం ఉన్న టెస్టింగ్ లాబ్స్ 6 గంటల్లో పరీక్షా ఫలితాలను ఇస్తున్నాయని, రోజుకి 90 మందికి పరీక్షలు నిర్వహించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిని రెట్టింపు చేయవచ్చని అన్నారు.

ఈ వారాంతానికి మరో 50 ల్యాబ్‌లు పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతాయని తెలిపారు. దీంతో దేశంలో పరీక్షలు నిర్వహించే కేంద్రాల సంఖ్య 122కి చేరుతుంది. ఇవన్నీ కలిపి రోజుకి 8000 శాంపిళ్లను పరీక్షించగలవని అధికారులు పేర్కొన్నారు.

అదనంగా మరో 50 ప్రైవేట్ ల్యాబ్‌లకు పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే ఈ కేంద్రాలు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించడానికి, తగిన వైద్య పరికరాలు అమర్చుకోవడానికి మరో 10 రోజులు పడుతుంది.

ప్రభుత్వ పరీక్షా కేంద్రాలలో కరోనా వైరస్ వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. అయితే ప్రైవేట్ సంస్థలు ఈ పరీక్షలకు ఎంత వసూలు చేస్తారో తెలియదు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 1

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 1

ఈ వారాంతానికి ..రోజుకి 400 శాంపిళ్లను పరీక్షించేందుకు వీలుగా రెండు టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. భారత దేశం ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థని పది లక్షల టెస్టింగ్ కిట్లను సరఫరా చేయమని అడిగింది. మరో పది లక్షల టెస్టింగ్ కిట్లను కూడా అడిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉన్న అవసరం, అవకాశాన్ని బట్టి ప్రభుత్వం సరైన రీతిలోనే పరీక్షలు నిర్వహిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశ ప్రతినిధి హెంక్ బెకెడం బీబీసీతో చెప్పారు.

"భారతదేశంలో ఉన్న పరీక్ష కేంద్రాలు వైద్య పరీక్షలను తగినంత స్థాయిలో నిర్వహిస్తున్నాయి. అయితే, జలుబు, వైరస్ లక్షణాలు ఉన్న వారిపై మరింత అధిక స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని అన్నారు. కారణం లేకుండా తలెత్తిన నిమోనియా కేసులలో కూడా పరీక్షలు నిర్వహించాలి" అని అన్నారు.

కరోనావైరస్ లక్షణాలు

ప్రస్తుతం చేపడుతున్న చర్యలు తగినంత స్థాయిలో ఉన్నాయా లేదా అన్నది రానున్న వారాలు, నెలలే చెప్పాలి.

భారతదేశంలో ఈ వ్యాధి ప్రబలకుండా అడ్డుకోగలిగామని కచ్చితంగా చెప్పలేమని భార్గవ అన్నారు. ఈ ఇన్ఫెక్షన్ స్థాయి పెరిగి, ఎక్కువ మంది రోగులు హాస్పిటల్ పాలయితే భారతదేశం చాలా సవాళ్ళను ఎదుర్కోవల్సి వస్తుందని అన్నారు.

భారత దేశంలో ప్రతి 10,000 జనాభాకి 8 మంది డాక్టర్లు ఉండగా, ఇటలీలో ప్రతి 10,000 మందికి 41 మంది, కొరియాలో 71 మంది ఉన్నారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 2

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 2

దేశంలో ప్రతి 55000 మందికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ప్రైవేట్ హాస్పిటళ్లు చాలా మందికి అందుబాటులో ఉండవు. వైద్య పరీక్షలు నిర్వహణలో వెనకబడే ఉండగా, జలుబుతో బాధపడుతున్న వారు చాలా మంది డాక్టర్ దగ్గరకి వెళ్లకుండా ఇంటి వైద్యం తీసుకోవడం లేదా దగ్గర్లో ఉన్న మందుల షాపులో మందులు కొనుక్కోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

తగినన్ని ఐసొలేషన్ పడకలు, వెంటిలేటర్లు, ఇంటెన్సివ్ కేర్ పడకలు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కూడా లేరు.

వర్షా కాలంలో భారత దేశంలో జలుబుతో బాధ పడే వారి సంఖ్య సాధారణంగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో, మళ్ళీ కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని వైరాలజిస్టులు అంటున్నారు.

కరోనావైరస్ జాగ్రత్తలు

ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనావైరస్ కేసుల సంఖ్యని బట్టి చూస్తే, ఇటలీ కన్నా మూడు వారాలు, స్పెయిన్ కన్నా రెండు వారాలు వెనకబడి ఉంది. తగినంత స్థాయిలో సామూహిక కార్యక్రమాలని, భారీ ఎత్తున సమావేశాలని ఇంకా పూర్తిగా నిర్బంధించకపోతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, జార్జ్ మసన్ విశ్వ విద్యాలయంలో ఆర్థిక వేత్త శృతి రాజగోపాలన్ అన్నారు.

"ఈ వైరస్ భారతదేశ గ్రామాలకి, చిన్న పట్టణాలకు గనక విస్తరిస్తే, గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్న భారత దేశ ప్రజారోగ్య వ్యవస్థకి దెబ్బ పడే ప్రమాదం ఉంది. ఇది ప్రజారోగ్యానికి తలెత్తిన ఒక పెద్ద సవాలు. ప్రస్తుతం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం" అని సుజాత రావు అన్నారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)