ఫరూక్ అబ్దుల్లా: ఏడు నెలల నిర్బంధం నుంచి కశ్మీర్ నాయకుడి విడుదల

ఫరూక్ అబ్దుల్లా

ఫొటో సోర్స్, Getty Images

ఏడు నెలలుగా నిర్బంధంలో ఉన్న కశ్మీర్ సీనియర్ పార్లమెంటు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.

ఆయనను ఎందుకు విడుదల చేస్తున్నామనేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.

News image

వివాదాస్పద జమ్ముకశ్మీర్ ప్రాంతానికి రాజ్యాంగంలో కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని ఆగస్టులో రద్దు చేయటానికి ఒక రోజు ముందు వేలాది మంది స్థానిక నాయకులతో పాటు ఫరూక్ అబ్దుల్లాను కూడా గృహనిర్బంధంలో ఉంచారు.

రాష్ట్రంలో అలజడిని అణచివేయటానికి ప్రభుత్వం వేల సంఖ్యలో సైనికులను మోహరించింది. సమాచార వ్యవస్థలను స్తంభింపజేసింది.

పార్లమెంటు సభ్యుడు కూడా అయిన ఫరూక్ అబ్దుల్లాను వివాదాస్పద ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద నిర్బంధించటం చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటు ఇతర కశ్మీర్ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజుల కిందట ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి.

రాష్ట్రంలో ''ప్రజాస్వామిక అసమ్మతి స్వరాన్ని అణచివేస్తున్నారు'' అని ఆ సంయుక్త తీర్మానం విమర్శించింది.

రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు.

రాజకీయ పార్టీల కార్యకర్తలు, ఉద్యమకారులు, న్యాయవాదులు సహా వేలాది మంది కూడా నిర్బంధంలో ఉన్నారు. వారిలో చాలా మందిని కశ్మీర్ వెలుపలి నగరాల్లోని జైళ్లకు తరలించారు.

శ్రీనగర్

ఈ చర్య నిరంకుశమైనదని చాలా మంది విమర్శకులు తప్పుపట్టారు. అయితే.. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటానికి ఈ నిర్బంధాలు అవసరమని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. వీటిని పాక్షికంగానే పునరుద్ధరించారు.

కశ్మీర్‌కు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫరూక్ అబ్దుల్లాను.. రాష్ట్రంలో ''భారత అనుకూల'' రాజకీయ నాయకుడిగా పరిగణిస్తారు.

జమ్మూకశ్మీర్ మొత్తం తమకే చెందుతుందని భారత్, పాకిస్తాన్‌లు రెండూ వాదిస్తున్నాయి. అయితే.. ఈ ప్రాంతంలో కొన్ని భాగాలు మాత్రమే ఈ దేశాల అధీనంలో ఉన్నాయి.

పార్లమెంటు సభ్యుల్లో ఎవరినైనా అరెస్ట్ చేయాల్సి వస్తే తొలుత పార్లమెంటుకు తెలియజేయాలన్న విధానం ఉంది కనుక.. ఫరూక్ అబ్దుల్లాను తొలుత గృహనిర్బంధంలో ఉంచినపుడు.. దానిపై వివరణ ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేశారు.

దీంతో ఫరూక్ అబ్దుల్లాను ''నిర్బంధించటం కానీ, అరెస్ట్ చేయటం కానీ జరగలేదు'' అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో చెప్పారు.

ఆ తర్వాత ఫరూక్ అబ్దుల్లా ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో ఉద్వేగంగా మాట్లాడుతూ.. అమిత్ షా అబద్ధం చెప్తున్నారని ఆరోపించారు.

''నా రాష్ట్రం తగలబడుతోంటే, నా ప్రజలను జైళ్లలో చంపేస్తోంటే నాకు నేనుగా నా ఇంట్లోనే ఎందుకు ఉండిపోతాను? ఇది నేను నమ్మిన భారతదేశం కాదు'' అని ఆయన పేర్కొన్నారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)