కశ్మీర్: 'ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ పునరుద్ధరణ అబద్ధం, BSNL నుంచి BSNL సర్వీస్ మాత్రమే మొదలైంది'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాజిద్ జహంగీర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘ప్రభుత్వం ప్రకటించినట్లుగా.. నా జియో నంబర్‌కి ఎటువంటి ఎస్ఎంఎస్ రాలేదు. ఎస్ఎంఎస్ సర్వీసుల ద్వారా నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు వస్తాయని నేను అనుకున్నా. కానీ.. అలా జరగలేదు'' అని శ్రీనగర్‌లోని సీడీ ఆస్పత్రికి వచ్చిన ఒక సందర్శకుడు జాఫర్ అహ్మద్ చెప్పారు.
ప్రభుత్వ అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్ డిసెంబర్ 31వ తేదీన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఐదు నెలలుగా మూగబోయిన మొబైల్ ఫోన్లలో ఎస్ఎంఎస్ సర్వీసులను అర్థరాత్రి నుంచి పునరుద్ధరించటం జరుగుతుందని చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు కూడా అర్థరాత్రి నుంచి పునరుద్ధరణ అవుతాయన్నారు.
‘‘జనవరి ఒకటో తేదీ ఉదయం నేను స్థానికంగా ఒక బ్యాంకుకు వెళ్లాను. కేవలం బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ సర్వీసులను మాత్రమే పునరుద్ధరించినట్లు అక్కడివాళ్లు నాకు చెప్పారు. ప్రభుత్వం చెప్పింది ఒకటి.. ఇక్కడ జరుగుతున్నది మరొకటి. నేను చాలా నిరుత్సాహపడ్డాను. ప్రభుత్వం అబద్ధం చెప్పింది. మాకు ఇంటర్నెట్ లేదు. ఎస్ఎంఎస్‌లు లేవు. దీనివల్ల మానసికంగా అనారోగ్యం పాలయ్యాం. కనీసం ఎస్ఎంఎస్‌నైనా పునరుద్ధరిస్తారని మేం ఆశించాం. కాస్తయినా ఊరట లభించేది. కానీ వాస్తవంగా అదేమీ కనిపించటం లేదు'' అని జాఫర్ చెప్పారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణను భారత ప్రభుత్వం ఆగస్టు 5వ తేదీన రద్దు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
అదే రోజున.. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులు, మొబైల్ ఫోన్లు, లాండ్‌లైన్ టెలిఫోన్ సర్వీసులు అన్నీ మూగబోయాయి. కొంత కాలం తర్వాత.. ప్రభుత్వం లాండ్‌లైన్ ఫోన్ సర్వీసులను పునరుద్ధరించింది. ఆ తర్వాత పోస్ట్ పెయిడ్ మొబైల్ సర్వీసులనూ తిరిగి ప్రారంభించింది.
ఇంటర్నెట్‌ను నిలిపివేయటం.. తమ ఆస్పత్రిలో విద్యా, పాలనా స్థాయిలో చాలా సమస్యలు సృష్టించిందని శ్రీనగర్‌లోని సీడీ హాస్పిటల్‌లో ఛాతీ విభాగాధిపతి డాక్టర్ నవీద్ బీబీసీతో చెప్పారు.
''ఆగస్టు 15వ తేదీ నుంచి మా ఆస్పత్రిలో రోజువారీ కార్యకలాపాలను ఎలాగోలా నడపగలిగాం.. సందేహం లేదు. కానీ ఇంటర్నెట్ పాత్ర చాలా కీలకమైనది. కానీ.. ఇంటర్నెట్ లేకపోవటం విద్యా, పాలనా వ్యవహారాలను దెబ్బతీసింది. ఇంటర్నెట్ ద్వారా మేం ఆన్‌లైన్‌లో మెడిసిన్లు కొనుగోలు చేస్తాం. ఇప్పుడు ఆస్పత్రుల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ మా ఆస్పత్రిలో అదింకా పునరుద్ధరణ కాలేదు. ఇంటర్నెట్ పునరుద్ధరణ కోసం మేం మా నంబర్ ఇచ్చాం. ఇప్పటివరకూ అయితే ఆస్పత్రి లోపల మాకు ఇంటర్నెట్ లేదు. త్వరలో పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్నా'' అని ఆయన పేర్కొన్నారు.
మరో జియో వినియోగదారుడు పర్వేజ్ అహ్మద్.. తన మొబైల్ నంబర్ నుంచి ఎస్ఎంఎస్‌ను పంపించటం కానీ, అందుకోవటం కానీ చేయలేకపోతున్నానని చెప్పారు. ప్రభుత్వ ప్రకటన ఒక జోక్ అన్నారు.
''ఇదేం ప్రభుత్వం? ఈ ప్రభుత్వం కేవలం అబద్ధాలే చెప్తుంది. ఎస్ఎంఎస్ సర్వీసులను పునరుద్ధరించినట్లయితే.. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలిసివుండేది. ఆస్పత్రుల్లో ఇంటర్నెట్‌ను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం చెప్పింది.. కానీ ఏదీ? నేను ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగిని. నాకు ఇంటర్నెట్ రావడం లేదు'' అని ఆయన విమర్శించారు.

''నా స్నేహితులకు, భార్యకు నేను ఎస్ఎంఎస్ పంపించాను. కానీ నిరాశే మిగిలింది. నా భార్యకు ఎస్ఎంఎస్ అందలేదు. అంటే ప్రభుత్వం అబద్ధం చెప్తోందని అర్థం'' అని బషీర్ అహ్మద్ (అసలు పేరు కాదు) బీబీసీతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
జుహూర్ అహ్మద్ అనే కార్మికుడు.. తను పంపించిన మెసేజ్‌లన్నీ ఫెయిల్ అయినట్లు చెప్తున్న తన మొబైల్ ఫోన్‌ను నాకు చూపించారు.
''బీఎస్ఎన్ఎల్ కాని ఇతర మొబైల్ ఫోన్ల నుంచి నేను ప్రయత్నించాను. అన్నింట్లోనూ ఇలాగే జరిగింది. బీఎస్ఎన్ఎల్ కాని నంబర్ల నుంచి ఎస్ఎంఎస్‌ను పంపించలేక పోతున్నాం'' అని చెప్పారు.
పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఒక బీఎస్ఎన్ఎల్ వినియోగదారుడు.. తనకు కొత్త సంవత్సర శుభాకాంక్షలతో మొదటి ఎస్ఎంఎస్ వచ్చినట్లు తెలిపారు.
''ఐదు నెలల తర్వాత.. నా ఫోన్‌లో నాకు ఎస్ఎంఎస్ రావటం ఆశ్చర్యం కలిగించింది. అదొక అద్భుత అనుభూతి. నిద్ర లేచిన తర్వాత నా మొబైల్ ఫోన్ ఎస్ఎంఎస్ బాక్సులో.. నా స్నేహితుడి నుంచి వచ్చిన మెసేజ్‌ని చూశాను. కానీ నా ఇతర జియో నంబర్లు మాత్రం మూగబోయే ఉన్నాయి'' అని ఆయన వివరించారు.
కేవలం బీఎస్ఎన్ఎల్ ఎస్ఎంఎస్ సర్వీసులను మాత్రమే ఎందుకు పునరుద్ధరించగలిగారనే అంశం మీద ప్రభుత్వ స్పందన తెలుసుకోవటానికి.. ప్రభుత్వ అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్‌కు బీబీసీ ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్‌లో 'ఇజ్రాయెల్ మోడల్'.. అసలు ఆ మోడల్ ఏంటి? ఎలా ఉంటుంది?
- 'మరణం తర్వాత మెదడులో మళ్లీ చలనం.. మనసును చదివే చిప్స్': 2019లో వైద్య రంగం సాధించిన అద్భుత విజయాలు
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- కొత్త ఏడాది తీర్మానాలు చేసుకుంటున్నారా? అయితే, ఈ 5 విషయాలు మరచిపోవద్దు
- ‘దేశంలో ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితి.. విధానపరమైన నిర్ణయాలు అవసరం’
- విజన్ 2020: అబ్దుల్ కలాం, చంద్రబాబు లక్ష్యాలు ఏంటి? వాటిలో ఎన్ని నెరవేరాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








