నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక

ఫొటో సోర్స్, FAIRFAX MEDIA/GETTY IMAGES
- రచయిత, ఫ్రాన్సిస్ మావో
- హోదా, బీబీసీ ప్రతినిధి
పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్న ఈ పట్టణాన్ని ఒక ఆస్‌బెస్టాస్(రాతినార) గనిపై నిర్మించారు. అదే స్థానికులకు ప్రమాదంగా మారింది. చివరకు ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోయేలా చేసింది. ఇప్పుడీ పట్టణం దాదాపు నరమానవుల్లేని ‘ఘోస్ట్’ టౌన్‌గా మారింది.
1970లో ఖాళీ అయిన విట్టెనూమ్ అనే ఈ మారుమూల పట్టణం చూడాలని వస్తున్నపర్యాటకులను, ఉత్సాహవంతులను ఎలా ఆపాలా అని అధికారులు ఇప్పుడు తలపట్టుకుంటున్నారు.
పెర్త్‌కు 1100 కిలోమీటర్లు ఉత్తరంగా ఉన్న విట్టెనూమ్ వస్తున్న వారిని హెచ్చరిస్తూ అధికారులు నోటీస్ బోర్డులు పెట్టారు.
గతంలో తవ్వకాలు జరిగిన ఈ ప్రాంతమంతా కలుషితం అయ్యిందని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది.
గనిలోంచి ఆస్‌బెస్టాస్ బయటకు తీయడంతో గతంలో ఇక్కడ కొన్ని వేల మంది స్థానికులు, పర్యాటకులు మృతి చెందారు.
చెర్నోబిల్, భోపాల్ విషాదాల్లాగే, విట్టెనూన్‌లో జరిగిన దానిని కూడా ఒక అతిపెద్ద విషాదంగా అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
జనం ఎవరూ ఈ పట్టణంలోకి రాకుండా రోడ్డు పక్కన అధికారులు బోర్టులు కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఇక్కడ ఇంకా కొంతమంది నివసిస్తూనే ఉన్నారు.
అయినా, గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌లో పోటెత్తుతున్న వీడియోలు, బ్లాగుల్లో వెలుస్తున్న పోస్టులతో విట్టెనూమ్ వెళ్లద్దనే ప్రభుత్వం హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదనే విషయం బయటపడింది.

ఫొటో సోర్స్, Getty Images
'ఒక్కసారి వెళ్లొస్తే ఏమవుతుంది?'
ఈ నెల మొదట్లో పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే వైట్, ఈ పట్టణంలోకి వెళ్లాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి పిల్బారా ప్రాంతంలోంచి ప్రయాణించాడు.
లోయలు, జలపాతాలతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే కర్జిని నేషనల్ పార్క్‌కు వెళ్లే దారిలో ఈ విట్టెనూమ్ పట్టణం ఉంటుంది.
విట్టెనూమ్ వెళ్లే ముందు పట్టణంలో ఆస్‌బెస్టాస్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి పరిశోధన చేశానని వైట్ బీబీసీకి చెప్పారు. తను ఆ ప్రాంతంలో ఉన్న హెచ్చరికల బోర్డులు కూడా చదివానన్నారు.
"గాలిలో ఉన్న ఫైబర్స్ వల్లే సమస్యలు వచ్చాయని అక్కడ నాకు అనిపించింది. మేం వెళ్లినప్పుడు అక్కడ గాలి అంత ఎక్కువగా లేదు. అందుకే అక్కడ కాసేపున్నంత మాత్రాన ఏం కాదని అనిపించింది" అని వైట్ చెప్పారు.
అధికారులు మాత్రం విషపూరితమైన ఆస్‌బెస్టాస్ ఫైబర్స్ విట్టెనూమ్, దానికి దగ్గరే ఉన్న ఒక పాపులర్ లోయతోపాటు పట్టణం చుట్టుపక్కల ఉన్నాయని చెబుతున్నారు.

జనం వదిలి వెళ్లిన ప్రాంతాలను, నిర్జనంగా ఉన్న పట్టణాన్ని చూడడం తనకు బాగా అనిపించిందని వైట్ చెప్పారు. పట్టణంలో వెళ్లడానికి తనకు ఎలాంటి భద్రతా సమస్యా రాలేదన్నారు.
ఈ పట్టణంలోకి వెళ్లిన మిగతావారు కూడా తమకు కూడా వైట్ లాగే అనిపించినట్టు ఆన్‌లైన్లో చెప్పారు.
ఒక యూట్యూబ్ వీడియోలో పురుషుల బృందం ఒక పాత ఆస్‌బెస్టాస్ గనిలోకి వెళ్లింది. అక్కడ గని తవ్వకాల గురించి తెలిసిన ఒక స్థానికుడు వారిని తీసుకెళ్లినట్టు అందులో కనిపించింది.
వీడియో కింద పోస్ట్ చేసిన కామెంట్స్‌లో కొందరు "గతాన్ని అద్భుతంగా చూపారని" వారికి కంగ్రాట్స్ చెప్పారు. కొందరు మాత్రం వారిని హెచ్చరించారు.
"అక్కడ ఆ ప్రాంతంలో బ్లూ ఆస్‌బెస్టాస్ ప్రమాదకరస్థాయిలో లేదా? ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండాలి. అది ప్రాణాలు తీయచ్చు" అని ఒకరు కామెంట్ పెట్టారు.
"ఇది మీ వ్యక్తిగతం అని తెలుసు, కానీ అంత రిస్క్ చేయడం ఎందుకు" అని మరొకరు అన్నారు.

ఫొటో సోర్స్, WESTERN AUSTRALIA GOVERNMENT
జాగ్రత్త
విట్టెనూమ్ వెళ్లివచ్చామని చెబుతూ పోస్ట్ చేసిన ఈ వీడియోలు అధికారులను అప్రమత్తం చేశాయి.
"విట్టెనూమ్ చరిత్ర వల్ల, పట్టణంలో, దాని చుట్టుపక్కల పర్యటిస్తున్న వారి భద్రతపై ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి" అని ఆష్‌బర్టన్ ప్రాంతానికి చెందిన అధికారి రాబ్ పాల్ చెప్పారు.
మేం ఎవరికైనా విట్టెనూమ్ రావడం ప్రమాదం అనే చెబుతాం.
ప్రభుత్వం గనులను 1966లో మూసేశాక, అక్కడ నివసించే చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. విట్టెనూమ్‌లో ఉన్న భవనాలన్నీ ధ్వంసమయ్యాయి.
2006లో అది పట్టణం హోదాను కోల్పోయింది. దానిని అధికారిక మ్యాపుల్లోంచి, రోడ్ సూచికల్లోంచి తీసేశారు.,

విట్టెనూమ్‌లో విడుదలైన ఆస్‌బెస్టాస్ వల్ల మెసొథెలియోమా అనే అరుదైన క్యాన్సర్ వస్తుందని ప్రభుత్వ వెబ్ సైట్ చెబుతోంది. ఛాతి, పొత్తి కడుపులో ఉండే పొరపై దీని ప్రభావం పడుతుందని, కాలుష్యం వల్ల ఆస్‌బెస్టోసిస్, లంగ్ క్యాన్సర్ కూడా రావచ్చని అంటోంది. అక్కడకు వెళ్లారా అంతే సంగతులు అంటోంది.
ఆస్‌బెస్టాస్ ప్రభావానికి గురైన తర్వాత కొన్ని దశాబ్దాల వరకూ దాని లక్షణాలు బయటపడకపోవచ్చని ఈ వెబ్ సైట్‌లో తెలిపారు.
"సురక్షితంగా ఉండండి. విట్టెనూమ్‌కు వెళ్లకండి" అని ప్రభుత్వం ఇందులో అధికారిక సలహా ఇచ్చింది.
అన్ని హెచ్చరికలు చేసినా పట్టణం చూడాలనుకునే తనలాంటి పర్యాటకులు వాటిని పట్టించుకోమని వైట్ చెబుతున్నారు.
అక్కడ చాలా బోర్డులు ఉన్నాయి. కానీ జనం వాటిని చదువుతారని నేను అనుకోవడం లేదు. నాలాగే అందరూ అక్కడి ప్రమాదాల గురించి తెలుసుకునే వెళ్తారు అని వైట్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాకు ఆ పేరు పెట్టిన మధ్యయుగాల నాటి మ్యాప్ ఇదే
- ఆస్ట్రేలియా కూడా అమెరికా, యూరప్‌ల బాటలోనే!
- ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గు ప్రాజెక్టు: ‘భారతీయ కంపెనీ కాబట్టే మాపై వివక్ష’
- ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ఆస్ట్రేలియా: పెరుగుతున్న చైనా ప్రాబల్య వివాదం.. 'జాతివివక్ష'తో మరింత ముదురుతుందా?
- చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకెళ్లి చైనాలో అమ్ముకుంటున్నారు
- ఇది కుందేళ్ల 'దండయాత్ర', కుదేలైన ఆర్థిక వ్యవస్థ
- లోయలో పడిపోయి ఆరు రోజులు తిండీ, నీళ్లు లేకుండా బతికింది..
- మల్టీప్లెక్స్: సినిమా టికెట్ రూ.150, పాప్‌కార్న్ రూ.270 ఎందుకిలా?
- 'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








