లోయలో పడిపోయి ఆరు రోజులు తిండీ, నీళ్లు లేకుండా బతికింది..

ఫొటో సోర్స్, QUEENSLAND POLICE
ఆస్ట్రేలియాలో ఆరు రోజుల పాటు కనిపించకుండా పోయిన ఒక దక్షిణ కొరియా యువతిని ఎట్టకేలకు రక్షించారు.
ఒక శిఖరం పైనుంచి లోయలోకి పడిపోయిన 25 ఏళ్ల జోహీ హాన్‌ను ఆస్ట్రేలియాకు చెందిన అత్యవసర సిబ్బంది రక్షించారు.
శిఖరం పైకి ఎక్కి ఫొటోలు తీసుకుంటుండగా హాన్ కింద పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
లోయలోకి పడిపోయిన హాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినా, కొద్దిసేపటి తర్వాత మెల్లగా పాకుతూ పైకి రాగలిగింది. అయితే తిండి, నీళ్లు లేకుండా పడిన చోటే ఉండిపోయింది.
గత బుధవారం ఆమె స్నేహితులు హాన్ తమ క్యాంప్‌కు తిరిగి రాలేదన్న విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు అన్వేషణ చేపట్టారు.

''ఆరు రోజుల పాటు నీళ్లు లేకుండా డీహైడ్రేషన్‌కు గురైన ఆ యువతి పొదల్లో పడి ఉండగా గుర్తించాం'' అని పోలీసు ప్రకటనలో పేర్కొన్నారు.
ఆమెను హుటాహుటిన అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
దాదాపు ఐదు గంటల పాటు అపస్మారక స్థితిలో ఉన్న తర్వాత ఆమె లోయలోంచి బైట పడిందని క్వీన్స్‌ల్యాండ్ ఆంబులెన్స్ ఫ్లైట్ ప్రతినిధి హన్నా గాల్కే ఏబీసీ న్యూస్‌కు తెలిపారు.
హాన్ పడిపోయిన చోటి నుంచి కేకలు రావడంతో హెలికాప్టర్ సిబ్బంది ఆమెను గుర్తించగలిగారు.
ఆమె కప్పుకున్న రెయిన్ కోట్ ఆమెను వెచ్చగా ఉంచిందని తెలిపారు.
''కొన్ని చిన్న చిన్న దెబ్బలు తగిలినా, ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉంది'' అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








