హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?

మొఘలులు, ఔరంగజేబు, అక్బర్, జాతకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇప్పటికీ అనేకమంది పేపర్లలో వచ్చే రాశిఫలాలు, గ్రహాలు, నక్షత్రాల వంటి జ్యోతిష్యాలను తెలుసుకున్నాకే తమ రోజువారీ కార్యక్రమాలను మొదలుపెడతారు.

అదే సమయంలో జ్యోతిష్యాన్ని నమ్మనివాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.

చంద్రుడు, నక్షత్రాల కదలికలను అర్థం చేసుకునేందుకు ప్రజలు చాలా కాలంగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రాచీన గ్రీస్ నుంచి ఆధునిక భారత్ వరకు ఖగోళ శాస్త్ర అన్వేషణ కొనసాగుతోంది.

మధ్య యుగంనాటికి గ్రహాలు, నక్షత్రాల కదలికల సాయంతో భవిష్యత్‌ను అంచనా వేయడం మొదలైంది. భారతదేశాన్ని దీర్ఘకాలం పాలించిన మొఘలులు కూడా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మారు. ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు జ్యోతిష్యుల సలహాలు తీసుకునేవారు.

ఇస్లాం, క్రైస్తవం జ్యోతిష్యాన్ని తంత్ర విద్యగా భావిస్తాయి. దాన్ని నమ్మవద్దని చెబుతాయి. కేవలం అల్లా మాత్రమే భవిష్యత్‌ను ముందు చెప్పగలరని ఇస్లాం నమ్ముతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రముఖ జర్నలిస్ట్ ఎంజే అక్బర్ "ఆఫ్టర్ మీ కేయోస్, ఆస్ట్రాలజీ ఇన్‌ ద మొఘల్ ఎంపైర్" అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో ఆయన జ్యోతిష్యశాస్త్రం గురించి మొఘల్ చక్రవర్తుల అభిప్రాయాలెలా ఉన్నాయో వివరించారు.

"హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబుకు జ్యోతిష్యశాస్త్రంపై నమ్మకం ఉంది. అక్బర్ కాలంలో ఆస్ట్రాలజర్లు ఆస్థానంలో ఒక భాగంగా ఉండేవారు. ఔరంగజేబు కూడా కీలకమైన అంశాల విషయంలో తప్పనిసరిగా జ్యోతిష్యులను సంప్రదించేవారు. మత ఆధారిత తిరుగుబాట్లు రాజకీయ స్థిరత్వానికి హానికరమని మొఘల్ చక్రవర్తులు నమ్మారు" అని ఎంజే అక్బర్ బీబీసీకి చెప్పారు.

మొఘలులు, ఔరంగజేబు, అక్బర్, జాతకాలు

ఫొటో సోర్స్, Bloomsbury

ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రం

చరిత్రకారుడు, రచయిత బెన్సన్ బోబ్రిక్ 'ఖలీఫాస్ స్ప్లెండర్' అనే పుస్తకంలో "బాగ్దాద్ నగర నిర్మాణానికి క్రీస్తు శకం 762 జులై 31న మధ్యాహ్నం 2.40 గంటలకు అబు జాఫర్ అల్ మన్సూర్ పునాది రాయి వేశారు. ఎందుకంటే అది మంచి మహూర్తం" అని రాశారు.

మరో చరిత్రకారుడు, ప్రొఫెసర్ మొహమ్మద్ ముజీబ్ తన 'ది ఇండియన్ ముస్లిం' అనే పుస్తకంలో "భారతదేశంలో ముస్లిం పాలనకు ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అద్భుతాలను, విలువైన రాళ్లను, శకునాలను నమ్మడం ప్రారంభించారు. భారతదేశంలో జ్యోతిష్యం కూడా సైన్స్‌గా భావించేవారు. ముస్లింలు కూడా దాన్ని విశ్వసించేవారు" అని రాశారు.

మధ్యయుగ చరిత్రకారుడు జియాఉద్దీన్ బరానీ కూడా 'తారిఖ్-ఇ- ఫిరోజ్‌షాహి'లో "జ్యోతిష్యుడి సలహా లేకుండా పెద్ద కుటుంబాల్లో ఏ ఆచారం లేదా ముఖ్యమైన పని చేయరు. ఫలితంగా ప్రతి వీధిలోనూ హిందూ, ముస్లిం జ్యోతిష్యులు కనిపించారు" అని రాశారు.

మొఘలులు, ఔరంగజేబు, అక్బర్, జాతకాలు

ఫొటో సోర్స్, Sang-e-Meel Publications

అక్బర్ జననాన్ని వాయిదా వేసే ప్రయత్నం

1542 అక్టోబర్ 15న అర్థరాత్రి 1.06 గంటలకు మొఘల్ చక్రవర్తి అక్బర్ జననానికి సంబంధించిన కథనం, మొఘల్ చక్రవర్తులకు జ్యోతిష్యం మీద ఎంత నమ్మకం ఉందో చెబుతుంది.

మొఘల్ చక్రవర్తి హుమాయూన్, షేర్‌షా చేతిలో ఓడిపోయి సింధ్ ఎడారి వైపు పారిపోయారు. ఆ సమయంలో ఆయనకు రాజపుత్రులు ఉమర్‌కోట్ కోటలో ఆశ్రయం కల్పించారు.

ఆ సమయంలో హుమాయూన్ భార్య హమీదా బేగం గర్భవతి.

మొఘలులు, ఔరంగజేబు, అక్బర్, జాతకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొఘల్ చక్రవర్తి హుమాయూన్

"హమీదాకు నొప్పులు ప్రారంభమైనప్పుడు హుమాయూన్ ఆమె ఉన్న ప్రాంతం నుంచి 30 మైళ్ల అవతల తట్టాలో ఉన్నారు. ఆయన తన వ్యక్తిగత జ్యోతిష్యుడు మౌలానా చాంద్‌ను హమీదా వద్ద ఉంచారు. హమీదా బిడ్డకు జన్మనిచ్చినప్పుడు కచ్చితమైన సమయం నమోదు చేస్తే, దాని ద్వారా అతని జాతకాన్ని రూపొందించవచ్చని హుమాయూన్ భావించారు. అక్టోబర్ 14 రాత్రి హమీదాబానోకు నొప్పులు మొదలయ్యి ఆమె బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇది మౌలానా చాంద్‌కు ఆందోళన కలిగించింది" అని ఎంజే అక్బర్ తన పుస్తకంలో రాశారు.

ఆమె శుభ ముహూర్తం కంటే ముందే బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని మౌలానాచాంద్ భావించారు. అయితే ఆ సమయానికి కాసేపటి తర్వాత ఆకాశంలో వేల ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే నక్షత్రాల అమరిక వస్తోంది. ‘‘బిడ్డ పుట్టుకను కాసేపటి వరకు వాయిదా వేయగలరా’’ అని ఆయన మంత్రసానులను అడిగారు.

మొఘలులు, ఔరంగజేబు, అక్బర్, జాతకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొఘలుల మూడో చక్రవర్తి జలాలుద్దీన్ అక్బర్

పురుటినొప్పులు ఎలా ఆపేశారంటే

మౌలానా చాంద్ చెప్పింది విని మంత్రసానులు ఆశ్చర్యపోయారు. బిడ్డ ఎప్పుడు పుట్టాలనేది దైవ సంకల్పమని, ఈ విషయంలో మనుషులు ఏమీ చేయలేరని వాళ్లు ఆయనతో చెప్పారు.

అక్బర్ పుట్టుక విషయంలో ఏం జరిగిందో రచయిత అబుల్ ఫజల్ 'అక్బర్‌నామా'లో వివరించారు.

"మౌలానాచాంద్‌కు అకస్మాత్తుగా ఒక వింత ఆలోచన వచ్చింది. ఆయన ఓ సన్నని తెర చాటున తన మొహన్ని భయంకరంగా పెట్టి హమీదాబానో వద్దకు వెళ్లారు. చీకట్లో ఆ భయంకరమైన మొహాన్ని చూసిన ఆమెకు నొప్పులు ఆగిపోయాయి. తర్వాత ఆమె నిద్రపోయారు"

"అద్భుతమైన మహూర్తం వచ్చినప్పుడు కూడా హమీదా బానో నిద్రలోనే ఉంటే ఎలా అని మౌలానా చాంద్‌లో ఆందోళన మొదలైంది. శుభ ముహూర్తం దగ్గరపడటంతో అతను మంత్రసానుల్ని పిలిచి ఆమెను నిద్ర లేపాలని చెప్పారు. అయితే మంత్రసానులు రాణిని నిద్ర లేపేందుకు భయపడ్డారు. అయితే అదే సమయంలో ఆమె ఎవరో లేపినట్లుగా నిద్ర లేచారు. ఆ తర్వాత ఆమెకు నొప్పులు రావడం, అక్బర్ జన్మించడం జరిగిపోయాయి" అని అక్బర్‌నామాలో వివరించారు.

అక్బర్ జాతకాన్ని సిద్ధం చేసిన మౌలానా చాంద్, ఈ బాలుడు చాలాకాలం పాటు రాజ్యాన్ని ఏలతాడని రాసిన సందేశాన్ని హుమాయూన్‌కు పంపించారు.

మొఘలులు, ఔరంగజేబు, అక్బర్, జాతకాలు

ఫొటో సోర్స్, Bloomsbury

ఫొటో క్యాప్షన్, జ్యోతిష్యులు రూపొందించిన అక్బర్ జాతకం

జ్యోతిష్యుల సలహాతో సింహాసనం కోసం హుమాయూన్ యత్నం

జ్యోతిష్యులు నిర్ణయించిన ప్రకారం 1542 నవంబర్ 22న హమీదా బేగం హుమాయూన్‌ను కలిశారు. అక్బర్ పుట్టిన 35 రోజుల తర్వాత హుమాయూన్ తొలిసారి అక్బర్‌ను చూశారు. అక్బర్ జీవితంలో ప్రతీ నిర్ణయం జ్యోతిష్యుల సూచనల ప్రకారమే జరిగింది.

"తనచుట్టూ అన్నివైపులా విషాదం ఉన్నా, తన కుమారుడు దైవ రక్షణలో ఉన్నాడు కాబట్టి అతనికి ఏమీ జరగదని హుమాయూన్ భావించారు. అతని విశ్వాసం నిజమని తేలింది. హుమాయూన్ వెళ్లిపోయిన తర్వాత శత్రుత్వం ఉన్నప్పటికీ అక్బర్‌ను జాగ్రత్తగా చూసుకున్నారు హుమాయూన్ సోదరుడు అస్కారి. అక్బర్ ఉండేందుకు కాందహార్ కోట పై భాగంలో ఒక గది ఇచ్చారు. అస్కారి భార్య సుల్తాన్ బేగం 14 నెలల వయసున్న అక్బర్‌ను ప్రేమగా చూసుకున్నారు" అని అబుల్ ఫజల్ రాశారు.

కోల్పోయిన దిల్లీ సింహాసనాన్ని తిరిగి పొందేందుకు 1545 మార్చ్ 14న సరైన సమయమని జ్యోతిష్యులు హుమాయూన్‌కు సలహా ఇచ్చారు. 1545 సెప్టెంబర్ 3న అస్కారి లొంగిపోయారు.

అస్కారి మెడపై కత్తి పెట్టి మరీ బైరాంఖాన్ ఆయనను హుమాయూన్ వద్దకు తీసుకొచ్చారు. కుటుంబం కోరిక మేరకు అస్కారికి ప్రాణభిక్ష పెట్టారు హుమాయూన్.

అక్బర్‌కు నాలుగేళ్ల 4 నెలల 4 రోజుల వయసు ఉన్నప్పుడు ఆయన విద్యాభ్యాసం ముల్లా ఇస్లాముద్దీన్ ఇబ్రహీం పర్యవేక్షణలో ప్రారంభమైంది.

జ్యోతిష్యుల సలహా మేరకు, అక్బర్ విద్యాభ్యాసాన్ని 1547 నవంబర్ 20న ప్రారంభించాలని హుమాయూన్ నిర్ణయించుకున్నారు.

అయితే ఈ మహూర్తం సరిగ్గా పని చేయలేదు. అక్బర్‌కు చదవడం, రాయడం రాదని అనేక మంది చరిత్రకారులు నమ్ముతారు.

మొఘలులు, ఔరంగజేబు, అక్బర్, జాతకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అక్బర్ చక్రవర్తి

హుమాయూన్‌కు తన మరణం గురించి ముందే తెలుసా?

హుమాయూన్ 7 తన లక్కీ నెంబర్ అని నమ్మేవారు. ఆయన దుస్తులు కూడా ఆ రోజు నక్షత్రరాశులకు అనుగుణంగా ఉండేవి. ఆదివారాలు పసుపు, సోమవారం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించేవారు.

"హుమాయూన్‌కు 15 రోజుల కోసం నల్లమందు ఇచ్చారు. అయితే ఆయన ఏడు రోజులకు సరిపడింది తీసుకుని ఒక పేపర్‌లో మడత పెట్టారు. తనకు 7 రోజులకు సరిపడా చాలని ఆయన సేవకులకు చెప్పారు. 1556 జనవరి 24 శుక్రవారం ఆయన నల్లమందును రోజ్‌వాటర్‌లో కలుపుకుని తాగారు. ఆ రోజు మధ్యాహ్నం ఆయన 'ఇవాళ మన కాలంలో ఒక గొప్ప వ్యక్తి ఈ లోకాన్ని విడిచి పెడతాడని చెప్పారు"అని ఎంజే అక్బర్ వివరించారు.

అదే రోజు సాయంత్రం హుమాయూన్ గణిత శాస్త్రజ్ఞుల్ని కోట పైభాగానికి తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి శుక్రగ్రహం పూర్తి ప్రకాశవంతంగా ఉంటుందని వాళ్లు ఆయనకు చెప్పారు. వాళ్లు స్వయంగా ఆ సంఘటన చూడాలని అనుకున్నారు. హుమాయూన్ మెట్లు దిగుతున్న సమయంలో ప్రార్థన వినిపించడంతో ఆయన వెంటనే మోకాళ్లపై కూర్చుని ప్రార్థన చేశారు.

"మెట్లు ఏటవాలుగా పాకురు పట్టి అడుగేస్తే జారిపోయేలా ఉన్నాయి. హుమాయూన్ ప్రార్థన కోసం కుర్చున్నప్పుడు ఆయన కాలుకు అంగీ అడ్డుపడటంతో మెట్ల మీద నుంచి జారి పడిపోయారు. ఆయన తలకు నుదుటిన పెద్ద గాయమైంది. ఆయన నుదిట మీద నుంచి కుడి చెవి నుంచి రక్తం ధారలు కట్టింది. చక్రవర్తికి గాయం పెద్దదేమీ కాదని మొదట ప్రకటించారు. అయితే తర్వాతి చక్రవర్తిని ప్రకటించేందుకు అవసరమైన సమయం కోసం ఆస్థాన బృందం అలా చేసింది" అని అబుల్ ఫజల్ రాశారు.

జనవరి 27న హుమాయూన్ చివరి శ్వాస విడిచారు. 1556 ఫిబ్రవరి 10న ఆయన పడిపోయిన 17 రోజుల తర్వాత ఆయన మరణం గురించి బహిరంగ ప్రకటన చేశారు. అదే రోజు హుమాయూన్ కుమారుడు అక్బర్ పేరిట ప్రకటన జారీ చేశారు. ఇమామ్ ఘజ్నవి నాయకత్వంలో జ్యోతిష్యులు అక్బర్ పట్టాభిషేక సమయాన్ని నిర్ణయించారు.

మొఘలులు, ఔరంగజేబు, అక్బర్, జాతకాలు

ఫొటో సోర్స్, ALEPH

ఆస్థాన జ్యోతిష్యుడిని నియమించిన అక్బర్

జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు.

యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.

చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టన తర్వాత అక్బర్, జోతిక్ రాయ్ (జ్యోతిష్యుల రాజు) అనే పదవి సృష్టించారు.

వివాహ సంబంధాల ద్వారా అక్బర్ తన అధికారాన్ని బలోపేతం చేసుకుంటారని అక్బర్ కాలంలో ప్రముఖ జ్యోతిష్యుడు ఆజాద్ ఉద్ దౌలా షిరాజీ అంచనా వేశారు.

అక్బర్ వద్ద వెయ్యి సెట్ల దుస్తులు ఉన్నాయి. వాటిలో 120 దుస్తులు ఎప్పుడూ ధరించడానికి సిద్ధంగా ఉండేవి. హుమయూన్ లాగే అక్బర్ కూడా ఆనాటి నక్షత్రాల రంగు ప్రకారం దుస్తులు ధరించేవాడు.

"ప్రతి శుక్రవారం, ఆదివారం, ప్రతి సౌర మాసం మొదటి రోజు, సూర్య, చంద్ర గ్రహణాల రోజున అక్బర్ మాంసం తినేవారు కాదు" అని అబుల్ ఫజల్ రాశారు.

మొఘలులు, ఔరంగజేబు, అక్బర్, జాతకాలు

ఫొటో సోర్స్, Atlantic Publishers

జహంగీర్, అతని మనవరాలు

అక్బర్ కుమారుడు జహంగీర్ కూడా జ్యోతిష్య శాస్త్రాన్ని బలంగా నమ్మారు. అక్బర్ మాదిరిగానే జహంగీర్ విద్య కూడా నాలుగేళ్ల, 4 నెలల 4 రోజుల వయసులో ఉండగా 1573లో ప్రారంభమైంది.

జహంగీర్ పట్టాభిషేక మహూర్తంగా 1606 మార్చ్ 20ని జ్యోతిష్యులు నిర్ణయించారు.

జ్యోతిష్యుల సలహా మేరకు జహంగీర్ తన మనవరాలి మొహాన్ని మూడేళ్ల పాటు చూడలేదు.

"పదమూడో తేదీన నేను ఖుస్రో కుమార్తె, నా మనవరాలిని పిలిపించాను. ఆమె జననం నాకు శుభప్రదమని, ఆమె తండ్రికి మంచిది కాదని జ్యోతిష్యులు చెప్పారు. ఆమెకు మూడేళ్లు నిండాక ఆమెను చూడాలని చెప్పారు. నేను అలాగే చేశాను" అని జహంగీర్ తన ఆత్మకథ తుజుక్-ఎ-జహంగీరిలో రాశారు.

జహంగీర్ ఆస్థాన జ్యోతిష్యుడి పేరు కేశవ్ శర్మ. జహంగీర్ మనవడు షా షుజా ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆయన అంచనా వేశారు.

"ఒకరోజు షా షుజా కిటికీ దగ్గర ఆడుకుంటున్నాడు. ఆ రోజు కిటికీకి తాళం వేయలేదు. ఆడుకునేటప్పుడు యువరాజు కిటికీలో నుంచి తలకిందులుగా కిందపడిపోయాడు. వాడికి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు. నేను కిందకు పరుగెత్తి ఆ పిల్లవాడిని ఎత్తుకుని నా ఛాతీకి హత్తుకున్నాను. వాడికి స్పృహ వచ్చిన తర్వాత ప్రార్థన చేసి అల్లాకు కృతజ్ఞతలు చెప్పాను" అని జహంగీర్ రాశారు.

నాణేనికి ఒకవైపున రాశిచక్రం చిత్రాన్ని చెక్కిన మొదటి మొఘల్ చక్రవర్తి జహంగీర్

మొఘలులు, ఔరంగజేబు, అక్బర్, జాతకాలు

ఫొటో సోర్స్, Bloomsbury

ఫొటో క్యాప్షన్, జహంగీర్ కాలం నాటి నాణాలు

జాతకాన్ని సిద్ధం చేయించుకున్న ఔరంగజేబు

1592 జనవరి 5న లాహోర్ కోటలో షాజహాన్ పుట్టిన 3 రోజుల తర్వాత అతని తాత అక్బర్ షాజహాన్‌ను చూశారు.

ఆ బాలుడికి 'ఖ్‌' అనే అక్షరం వచ్చేలా పేరు పెట్టాలని జ్యోతిష్యులు సూచించడంతో అక్బర్ ఆ పిల్లవాడికి ఖుర్రం అని పేరు పెట్టారు..

మొఘల్ చక్రవర్తుల్లో ఔరంగజేబు కూడా జాతకాలను బలంగా నమ్మారు.

ఆస్థాన జ్యోతిష్యులే ఆయన పట్టాభిషేక సమయాన్ని నిర్ణయించారు.

"జూన్ 5, ఆదివారం సూర్యుడు ఉదయించిన 3 గంటల 15 నిముషాల తర్వాత అనుకూలమైన సమయమని జ్యోతిష్యులు అంచనా వేశారు" అని జదునాథ్ సర్కార్ తన 'ది హిస్టరీ ఆఫ్ ఔరంగజేబ్' అనే పుస్తకంలో రాశారు.

"ఆ సమయం రాగానే జ్యోస్యుల సంకేతాలతో తెరవెనుక కూర్చున్న ఔరంగజేబు బయటకు వచ్చి సింహాసనంపై కూర్చున్నారు" అని ఆయన వివరించారు.

ఔరంగజేబు కాలంలో భారతదేశాన్ని సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు ఫ్రాంకోయిస్ బెర్నియర్ కూడా జ్యోతిష్యశాస్త్రంలో ఔరంగజేబుకున్న నమ్మకాన్ని ధృవీకరించారు.

"ఔరంగజేబు డిసెంబర్ 6, 1664న మధ్యాహ్నం మూడు గంటలకు జ్యోతిష్యుల సలహా మేరకు దక్షిణం వైపు బయలుదేరారు. సుదీర్ఘ ప్రయాణానికి ఇదే అత్యంత అనుకూలమైన సమయం అని ఆయన నమ్మారు" అని బెర్నియర్ రాశారు.

"తన గురించి జ్యోతిష్యుడు ఫజిల్ అహ్మద్ రూపొందించిన జాతకంలో ప్రతీ అంశం నిజమైందని ఔరంగజేబు తన కుమారుడితో చెప్పారు. నా మరణం తర్వాత ఏమి జరుగుతుందో కూడా నా జాతకంలో రాసి ఉంది. 'అజ్ మస్త్ హమా ఫసాద్ ఎ బాకీ' అని జాతకంలో రాసి ఉన్నట్లు ఔరంగజేబు కుమారుడితో చెప్పారు. అంటే నేను వెళ్లిపోయిన తర్వాత అంతా గందరగోళంగా మారుతుంది అని అర్థం. నా తర్వాత అజ్ఞాని, సంకుచిత మనస్తత్వం కలిగిన చక్రవర్తి వస్తాడు. నేను అసద్ ఖాన్ అనే సమర్థుడైన మంత్రిని ఇచ్చి వెళ్తాను. కానీ నా నలుగురు కొడుకులు అతన్ని తన పని చేయనివ్వరని ఔరంగజేబ్ తన కుమారుడితో చెప్పారు" అని ఎంజే అక్బర్ వివరించారు.

మొఘలులు, ఔరంగజేబు, అక్బర్, జాతకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తన తర్వాత మొఘలు సామ్రాజ్య పతనం ప్రారంభమవుతుందని ఔరంగజేబు ముందే ఊహించారు.

జ్యోతిష్యుల అంచనాలు తప్పని తేలినప్పుడు

జ్యోతిష్యుల అంచనాలన్నీ నిజం కాలేదు. జాతకాలు తప్పిన సంఘటనలను నమోదు చేయలేదు లేదా పట్టించుకోలేదు.

బాబర్ కుమార్తె గుల్‌బదన్ బేగంకు సంబంధించిన జోస్యంలో లెక్కలు తప్పాయి.

"నక్షత్రాలు అనుకూలంగా లేవని కాణ్వా యుద్ధానికి వెళ్లకపోవడమే మంచిదని బాబర్‌కు జ్యోతిష్యుడు మొహమ్మద్ షరీఫ్ సూచించారు. ఇది విన్న సైన్యంలో ఆందోళన, నిరాశ ఏర్పడ్డాయి. అయితే బాబర్ వీటిని పట్టంచుకోలేదు. యుద్ధం విషయంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు" అని హుమాయూన్ నామాలో రాశారు.

మొఘలులు, ఔరంగజేబు, అక్బర్, జాతకాలు

ఫొటో సోర్స్, Juggernaut

ఫొటో క్యాప్షన్, హుమాయూన్ సోదరి గుల్ బదన్ బేగం

బాబర్ సైన్యాన్ని సమీకరించి వారితో "ఆగ్రా నుంచి కాబూల్‌కు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. యుద్ధంలో మరణిస్తే వీరులవుతారు. బతికి ఉంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి" అని సైన్యానికి చెప్పారు.

యుద్ధానికి రెండు రోజుల ముందు బాబర్ మద్యం తాగడం మానేశారు. జ్యోతిష్యుల అంచనాలకు విరుద్ధంగా బాబర్ కాణ్వా యుద్ధంలో గెలిచారు.

రాణా సంగను ఓడించి భారతదేశంలో మొఘల్ పాలనను స్థాపించారు.

భారతదేశ చరిత్రలో గన్‌పౌడర్ వాడకం నిర్ణయాత్మక పాత్ర పోషించిన మొదటి యుద్ధం ఇది. యుద్ధంలో ఓడిపోతామని చెప్పడం ద్వారా జ్యోతిష్యుడు మొహమ్మద్ షరీఫ్‌, తనను కావాలనే తప్పుదారి పట్టించారని బాబర్ ఆరోపించారు.

అయితే ఆయన్ను శిక్షించలేదు. పదవి నుంచి తొలగించి కాబూల్‌కు తిప్పి పంపించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)