దారా షికోహ్: అన్న తల నరికి తండ్రికి బహుమతిగా పంపిన ఔరంగజేబు

దారా షికోహ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మొఘల్ సామ్రాజ్యం గురించి ఎప్పుడూ "యా తఖ్త్ యా తాబూత్" అనే ఒక మాట చెప్పుకుంటారు. అంటే "సింహాసనం లేదా శవపేటిక" అనే అర్థం వస్తుంది.

మనం మొఘల్ చరిత్ర పుటలను తిప్పితే షాజహాన్ తన ఇద్దరు సోదరులు ఖుస్రో, షహర్యార్‌లను చంపమని ఆదేశించడమే కాదు, 1628లో సింహాసనం అధిష్టించగానే ఇద్దరు మేనల్లుళ్లు, సవతి సోదరులను కూడా చంపించాడు.

షాజహాన్ తండ్రి జహంగీర్ కూడా తన తమ్ముడు దాన్యాల్ మరణానికి కారణమయ్యాడు.

అదే సంప్రదాయం షాజహాన్ తర్వాత కూడా కొనసాగింది. ఆయన కొడుకు ఔరంగజేబు తన అన్న దారా షికోహ్ తల నరికించి సింహాసనాన్ని సొంతం చేసుకున్నాడు.

దారా షికోహ్ షాజహాన్‌కు ప్రియ పుత్రుడు. ఆయన కొడుకులు అందరిలోకీ పెద్దవాడు. అతడి వ్యక్తిత్వం ఎలా ఉండేది? ఇటీవల ప్రచురితమైన 'దారా షికోహ్, ద మేన్ హు వుడ్ బీ కింగ్' రచయిత అవీక్ చందాను నేను అదే ప్రశ్న అడిగాను.

సమాధానంగా అవీక్ "దారా షికోహ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనది జటిల వ్యక్తిత్వం. ఒక విధంగా ఆయన మంచివాడు. ఆలోచనాపరుడు, మంచి కవి, వేదాంతి, సూఫీ, లలిత కళలపై ఆసక్తి ఉండేది. కానీ, రాజ్య పాలన, సైన్యానికి సంబంధించిన అంశాల్లో ఆయనకు అసలు ఆసక్తి ఉండేది కాదు. ఆయన చాలా భయస్థులు. ఏదైనా ప్రమాదాన్ని ముందే గుర్తించలేకపోయేవారు" అన్నారు.

దారా షికోహ్

ఫొటో సోర్స్, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING

సైనిక కార్యకలాపాలకు దూరంగా ఉంచిన షాజహాన్

షాజహాన్‌కు దారా అంటే ఎంత ఇష్టమంటే, అతడు యువరాజును సైనిక కార్యకలాపాల్లో పంపించడానికి కూడా భయపడేవాడు. అతడు ఎప్పుడూ తన కళ్ల ముందే ఉండేలా దర్బారులోనే కూచోబెట్టుకునేవాడు.

"అప్పటికి ఔరంగజేబు వయసు 16 ఏళ్లు. అయినా, అతడిని సైనిక చర్యలకు పంపించడానికి షాజహాన్ ఏమాత్రం వెనకాడేవాడు కాదు. ఔరంగజేబు దక్షిణాదిన భారీ సైనిక దాడులకు నాయకత్వం వహించేవాడు. అలాగే షాజహాన్ మురాద్ బక్షాను గుజరాత్ వైపు, షాషుజాను బంగాల్ వైపు పంపించేవాడు. కానీ తన పెద్ద కొడుకు దారాను మాత్రం దర్బారులోనే ఉంచుకునేవాడు. తన కంటికి దూరంగా ఆయన్ను ఎక్కడకూ పంపేవాడు కాదు. ఫలితంగా దారా షికోహ్ యుద్ధ ప్రావీణ్యం, పాలనా నైపుణ్యం అందిపుచ్చుకోలేకపోయాడు. షాజహాన్ దారాను తన వారసుడిని చేసేందుకు ఎంత తపించిపోయాడంటే, దానికోసం దర్బారులో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాడు. తన సింహాసనం పక్కనే కూర్చోపెట్టుకుని, అతడికి 'షాహే బులంద్ ఇక్బాల్' అనే బిరుదు కూడా ఇచ్చాడు. తన తర్వాత సింహాసనంపై దారానే కూర్చుంటాడని చెప్పాడు" అని అవీక్ చందా చెప్పారు.

అంతే కాదు, యువరాజుగా దారాకు ఖజానా నుంచి తక్షణం రెండు లక్షల రూపాయలు ఇచ్చారు. వాటి నుంచి రోజుకు వెయ్యి రూపాయలను ఆయనకు రోజువారీ బత్తాగా ఇచ్చేవారు.

దారా షికోహ్

ఫొటో సోర్స్, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING

ఏనుగుల పోరాటంలో ఔరంగజేబు సాహసం

1633 మే 28న జరిగిన ఒక నాటకీయ ఘటన ప్రభావం, ఆ తర్వాత ఎన్నో ఏళ్ల వరకూ కనిపించింది.

షాజహాన్‌కు ఏనుగుల పోరాటం చూడ్డం అంటే చాలా ఇష్టం. దాంతో, సుధాకర్, సూరత్-సుందర్ అనే రెండు ఏనుగుల మధ్య పోరాటం ఏర్పాటు చేశారు. దాన్ని చూడ్డానికి ఆయన బాల్కనీ నుంచి దిగి కిందికొచ్చారు.

ఆ పోరాటంలో సూరత్-సుందర్ ఏనుగు మైదానం వదిలి పారిపోవడం మొదలెట్టింది. సుధాకర్ దానిని వెంటాడుతోంది. ఇదంతా చూసిన జనం భయపడి అటూఇటూ పరిగెత్తడం మొదలెట్టారు.

ఏనుగు ఔరంగజేబుపై దాడి చేసింది. గుర్రం మీదున్న 14 ఏళ్ల ఔరంగజేబు తన గుర్రాన్ని పరిగెత్తకుండా ఆపేశాడు, ఏనుగు తన దగ్గరకు రాగానే, చేతిలోని బల్లెంతో దాని తలపై దాడి చేశాడు.

ఈలోపు కొంతమంది సైనికులు అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు. ఏనుగును భయపెట్టడానికి టపాకాయలు పేల్చారు. కానీ ఆ ఏనుగు తొండంతో ఔరంగజేబు గుర్రాన్ని కింద పడేసింది.

దారా షికోహ్

ఫొటో సోర్స్, Getty Images

కానీ, ఔరంగజేబు పడిపోయే ముందు గుర్రం నుంచి కిందికి దూకేశాడు. కత్తి దూసి ఏనుగుపైకి వెళ్లాడు. అప్పుడే మరో యువరాజు షుజా వెనక నుంచి వచ్చి ఏనుగుపై దాడి చేశాడు.

ఏనుగు బలంగా కొట్టడంతో అతడి గుర్రం కూడా కిందపడిపోయింది. అప్పుడే జశ్వత్ సింగ్, చాలా మంది సైనికులు తమ గుర్రాలపై అక్కడికి చేరుకున్నారు. చుట్టూ చేరి గట్టిగట్టిగా అరవడంతో సుధాకర్ అనే ఏనుగు అక్కడి నుంచి పారిపోయింది. తర్వాత వారు ఔరంగజేబును చక్రవర్తి ముందుకు తీసుకొచ్చారు. ఆయన సాహసం చూపిన కొడుకును హత్తుకున్నాడు.

"తర్వాత ఆ సాహసానికి సంబరాలు జరిగాయి. ఆ సమయంలో ఔరంగజేబుకు చూసిన సాహసానికి అతడికి 'బహదూర్' అనే బిరుదు ఇచ్చారు. ఆయన్ను బంగారంతో తులాబారం వేసి, ఆ బంగారాన్ని ఆయనకే బహుమతిగా ఇచ్చేశారు. ఇదంతా జరుగుతున్నప్పుడు దారా షిహోక్ అక్కడే ఉన్నాడు. కానీ ఏనుగులను అదుపు చేయడానికి ఆయన ఎలాంటి ప్రయత్నం చేయలేదు. భారతదేశ సింహాసనాన్ని ఎవరు అధిష్టిస్తారు అనేదానికి ఈ ఘటన ఒక విధంగా ఒక ప్రారంభ సంకేతం" అన్నారు అవీక్ చందా.

అదే ఘటన గురించి రాసిన మరో చరిత్రకారుడు రానా సఫ్వీ దారా ఆ సమయంలో ఘటానాస్థలానికి కాస్త దూరంలోనే ఉన్నాడు. ఔరంగజేబును అందరూ మెచ్చుకోవడం కోసమే అతను వెనక్కు తగ్గాడని చెప్పడం పొరపాటే అవుతుంది" అన్నారు.

దారా షికోహ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దారా షికోహ్ వివాహ ఊరేగింపు

మొఘల్ చరిత్రలో అత్యంత ఖరీదైన వివాహం

దారా షికోహ్, నాదిరా బానో, వివాహాన్ని మొఘల్ సామ్రాజ్య చరిత్రలోనే అత్యంత ఖరీదైన వివాహంగా చెబుతారు.

ఆ సమయంలో భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ యాత్రికుడు పీటర్ మాడీ తన రచనలో "ఆ పెళ్లిలో అప్పట్లోనే 32 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అని చెప్పారు. ఆ డబ్బులో 16 లక్షల రూపాయలను దారా షికోవ్ అక్క జహానారా బేగమ్ ఇచ్చారని రాశారు".

దీని గురించి చెప్పిన అవీక్ చందా "దారా షికోవ్ అందరికీ ఇష్టమైన వ్యక్తి. చక్రవర్తికే కాదు, సోదరికి జహానారాకు కూడా తమ్ముడంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయన తల్లి ముంతాజ్ మహల్ మృతిచెందారు. దాంతో జహానారా బేగమ్ బాద్షా బేగమ్ అయ్యారు. ఈ పెళ్లికి హాజరైన షాజహాన్ భార్య చనిపోయిన తర్వాత మొదటిసారి ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. దారా షికోహ్ వివాహం 1633 ఫిబ్రవరి 1న జరిగింది. విందు వినోదాలు ఫిబ్రవరి 8 వరకూ కొనసాగాయి. ఆ సమయంలో రాత్రి బాణాసంచా పేలుళ్లు, పట్టపగలును తలపించాయి. వధూవరుల పెళ్లి బట్టలకే అప్పట్లో 8 లక్షలు అయ్యిందని చెబుతారు" అన్నారు.

దారా షికోహ్

ఫొటో సోర్స్, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING

కాందహార్‌పై దారా షికోహ్ యుద్ధం

దారా షికోహ్‌ మీద బలహీనుడు, పనికిరాని పాలకుడనే ఒక ముద్ర పడింది. కానీ, అంతమాత్రాన ఆయన యుద్ధాలే చేయలేదని కాదు.

కాందహార్ యుద్ధంలో ఆయన స్వంతంగా పోరాడ్డానికి వెళ్లాడు. కానీ, తగిన ఎత్తులు వేయలేక అందులో ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది.

"ఔరంగజేబు కాందహార్ నుంచి ఓడిపోయి తిరిగి వస్తున్నప్పుడు, దారా షికోహ్ స్వయంగా చక్రవర్తి దగ్గరకు వెళ్లి, తాను కాందహార్ వెళ్లి, అక్కడ యుద్ధానికి నాయకత్వం వహించాలని అనుకుటుంన్నట్లు చెప్పాడు. షాజహాన్ కూడా సరే అంటాడు. లాహోర్ చేరుకున్న దారా 70 వేల సైన్యాన్ని సమీకరించాడు. వారిలో 110 ముస్లిం, 58 మంది రాజపుత్ర సామంత రాజులు ఉన్నారు. ఆ సైన్యంలో 230 ఏనుగులు, 6 వేల మంది నేలను తవ్వేవారు, 500 భిష్తీలు ఉన్నారు. వారితోపాటూ చాలా మంది మంత్రగాళ్లు, భూతవైద్యులు, మౌలానాలు, సాధువులు కూడా సైన్యంలో ఉండేవారు. యుద్ధంలో దారా తన సామంతరాజుల సలహా తీసుకోకుండా మంత్రగాళ్లు, సాధువుల మాటలు విని ముందుకు వెళ్లేవాడు. వాళ్ల కోసం డబ్బు విపరీతంగా ఖర్చుపెట్టేవాడు. అవతలివైపు పార్శీ సైనికులు తిరుగులేని ప్రణాళిక సిద్ధం చేయడంతో, వరుసగా కొన్ని రోజులు యుద్ధం చేసినా దారాకు విజయం దక్కలేదు. దాంతో అతడు వట్టి చేతుల్తోనే తిరిగి దిల్లీ రావాల్సి వచ్చింది.

దారా షికోహ్

ఫొటో సోర్స్, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING

వారసత్వ పోరులో ఔరంగజేబు చేతిలో ఓటమి

షాజహాన్ అనారోగ్యానికి గురైన తర్వాత ఆయన వారసత్వం కోసం జరిగిన పోరాటంలో ఔరంగజేబు ముందు దారా షికోహ్ ఏమాత్రం నిలవలేకపోయారు.

పాకిస్తాన్ నాటర రచయిత షాహిద్ నదీమ్ మాట ప్రకారం ఔరంగజేబు చేతిలో దారా షికోహ్ ఓటమి భారత్-పాకిస్తాన్ మధ్య విభజన బీజాలను నాటింది.

"ఆ యుద్ధంలో ఔరంగజేబు ఒక పెద్ద ఏనుగు మీద ఉన్నాడు. అతడి వెనుక విలుకాళ్లు ఉన్న 1500 మంది సైనికులు ఉన్నారు. అతడి కుడి వైపు కొడుకు సుల్తాన్ మొహమ్మద్, సవతి సోదరుడు మీర్ బాబా ఉన్నారు. సుల్తాన్ మొహమ్మద్ పక్కనే నజాబత్ ఖాన్ దళం ఉంది. అది కాకుండా మరో 15 వేల మంది సైనికులు మురాద్ భక్ష్ నాయకత్వంలో ఉన్నారు. ఆయన కూడా ఒక ఏనుగు మీద కూర్చుని ఉన్నారు. ఆయనకు సరిగ్గా వెనక ఆయన చిన్నకొడుకు ఉన్నాడు అని అవీక్ చందా చెప్పారు.

"మొదట రెండు సైన్యాల మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది. ఒక సమయంలో దారా సైనికులు విజృంభిస్తున్నారు. అప్పుడు హఠాత్తుగా ఔరంగజేబు తన అసలు సిసలు నాయకత్వ పటిమ చూపించాడు. ఆయన తన ఏనుగు నాలుగు కాళ్లను గొలుసులతో బంధించాడు. అది ముందుకు, వెనక్కు వెళ్లకుండా చేశాడు. తర్వాత తన రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా 'సాహసికుల్లారా.. మీ ధైర్యం చూపించడానికి ఇదే సమయం. యా ఖుదా, యా ఖుదా నా మొర ఆలకించు.. ఇక్కడ ఓడిపోవడానికంటే, ప్రాణాలు వదలడమే మంచిదని నాకు అనిపిస్తోంది అని అరిచాడు."

దారా షికోహ్

ఫొటో సోర్స్, Getty Images

ఏనుగు వదిలిన దారాకు కష్టాలు

"అది చూసిన ఖలీల్ ఉల్లాహ్ ఖాన్, దారా షికోహ్‌తో ఈ యుద్ధంలో మీదే విజయం అన్నాడు. మీరు ఆ ఎత్తైన ఏనుగుపై ఎందుకు కూర్చున్నారు. అలా ఉంటే మీరు ప్రమాదంలో పడతారు. ఎవరైనా బాణం వేస్తే, బుల్లెట్ పేలిస్తే అది అంబారీని చీల్చుకుని వచ్చి, మీకు తగులుతుంది. త్వరగా ఏనుగు మీద నుంచి దిగండి" అన్నారు.

ఆయన మాట విని దారా ఏనుగు నుంచి దిగి గుర్రం ఎక్కారు. యుద్ధం చేస్తున్నారు. కానీ ఏనుగు మీద దారా లేకపోయేసరికి సైనికులు ఆయనకు ఏదో అయ్యిందనుకున్నారు. అంబారీ ఖాళీగా ఉండడంతో దారా యుద్ధంలో చనిపోయాడని, లేదంటే పట్టుబడ్డాడని వదంతులు వ్యాపించాయి. ఆయన సైనికులు బెదిరిపోయారు. పారిపోవడం మొదలెట్టారు. తర్వాత కాసేపట్లోనే ఔరంగజేబు సైనికులు దారా సైన్యంపై పైచేయి సాధించారు" అని అవీక్ చెప్పారు.

ఆ యుద్ధాన్ని ఇటాలియన్ చరిత్రకారుడు నికోలావో మనూచీ తన 'స్టోరియా దో మోగోర్' పుస్తకంలో చాలా వివరంగా వర్ణించారు.

"దారా సైనికులు వృత్తిపరంగా సైనికులు కాదు. వాళ్లలో చాలా మంది మంగలి, కసాయి, మిగతా మామూలు పనులు చేసుకునేవాళ్లు ఉన్నారు. దారా షికోహ్ తన గుర్రాన్ని ముందుకు పరిగెత్తించాడు. సాహసి అనిపించుకోడానికి నగారా మోగించడం కొనసాగించాలని ఆదేశించారు. ఆయనకు ఎదురుగా కొంత దూరంలో శత్రు సైన్యం ఉంది. అక్కడి నుంచి ఎలాంటి దూకుడూ కనిపించడం లేదు. దాంతో దారా తన సైనికులతో ముందుకు కదిలారు. ఆయన ఔరంగజేబు సైన్యం పరిధిలోకి రాగానే వారిపై ఫిరంగులు, తుపాకులు, ఒంటెలపైనున్న మర తుపాకులతో దాడి మొదలయ్యింది. హఠాత్తుగా జరిగిన ఆ దాడికి దారా, ఆయన సైనికులు సిద్ధంగా లేరు" అని మనూచీ రాశారు.

ఔరంగజేబు సైన్యంలోని ఫిరంగి గుళ్లకు దారా సైనికుల తలలు పేలిపోతున్నప్పుడు, దారా కూడా వాటికి జవాబిచ్చేందుకు తమ ఫిరంగులను ముందుకు తీసుకురావాలని ఆదేశించాడు. కానీ అతడు ముందుకు వెళ్లాలని ఆదేశించినపుడు తన సైనికులు ఫిరంగులు వెనకే వదిలొచ్చారని తెలిసి షాక్ అయ్యారు.

దారా షికోహ్

ఫొటో సోర్స్, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING

చీకటిలో ఆగ్రా కోటకు చేరాడు

ఈ యుద్ధంలో దారా ఓటమి గురించి ప్రముఖ చరిత్రకారుడు జదునాథ్ సర్కార్ ఔరంగజేబు జీవితచరిత్రలో వర్ణించారు.

"గుర్రంపై నాలుగైదు మైళ్లు పారిపోయిన తర్వాత దారా షికోహ్ కాసేపు విశ్రాంతి తీసుకోడానికి ఒక చెట్టు కింద ఆగాడు. అయితే ఔరంగజేబు సైనికులు ఆయన్ను వెంటాడుతూనే ఉన్నారు. కానీ దారా తన తల వెనక్కు తిప్పి చూసినప్పుడల్లా అతడికి ఔరంగజేబు సైనికుల నగారా శబ్దం వినిపిస్తున్నాయి. ఒక సమయంలో ఆయన తన శిరస్త్రాణాన్ని తీసేయాలని కూడా అనుకున్నారు. అది ఆయన ముఖం చర్మాన్ని కోసేస్తోంది. కానీ ఆయన దానిని తీయలేనంతగా అలిసిపోయారు" అని చెప్పారు.

"చివరికి రాత్రి 9 గంటల సమయంలో దారా షికోహ్ గుర్రాలపై ఉన్న కొంతమంది సైనికులతో కలిసి దొంగలా ఆగ్రా కోట ప్రధాన ద్వారం దగ్గరికి చేరుకున్నారు. ఆయన సైనికుల దగ్గర కాగడాలు కూడా లేవు. నగరం అంతా నిశ్శబ్దంగా ఉంది. దారా తన గుర్రం దిగి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. మొఘల్ ఆధిపత్య పోరులో ఓటమి రుచిచూశాడు" అని సర్కార్ రాశారు.

దారా షికోహ్

ఫొటో సోర్స్, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING

ఫొటో క్యాప్షన్, చిన్నతనంలో తండ్రి షాజహాన్‌తో దారా షికోహ్

మలిక్ జీవన్ కుట్రతో దొరికిన దారా

ఆగ్రా నుంచి పారిపోయిన దారా షికోహ్ మొదట దిల్లీ వెళ్లాడు. అక్కడ నుంచి మొదట పంజాబ్, తర్వాత అఫ్గానిస్తాన్ వెళ్లాడు. అక్కడ మలిక్ జీవన్ అతడిని కుట్ర ద్వారా పట్టుకుని, ఔరంగజేబు సైన్యానికి అప్పగించాడు. దారాను సైనికులు దిల్లీ తీసుకొచ్చారు. అవమానకరంగా దిల్లీ వీధుల్లో తిప్పుకుంటూ తీసుకెళ్లారు.

రోమన్ సేనాధిపతులు ఎవరినైనా ఓడించినప్పుడు, వారిని కొలీజియంలో ఎలా చక్కర్లు కొట్టించేవారో, అలాగే ఔరంగజేబు కూడా దారా షికోహ్‌తో దారుణంగా ప్రవర్తించాడు. దారాకు ఆగ్రా, దిల్లీ ప్రజల్లో చాలా ఆదరణ ఉండేది. అందుకే, అతడిని అలా అవమానపరిచిన ఔరంగజేబు ప్రజల ప్రేమ, ఆదరణ ఉన్నంతమాత్రాన ఎవరూ చక్రవర్తి కాలేరని అందరికీ చెప్పాలనుకున్నాడు.

దారా షికోహ్

ఫొటో సోర్స్, Getty Images

చిన్న ఏనుగుపై కూర్చోపెట్టి దిల్లీ వీధుల్లో తిప్పారు

దారాకు జరిగిన ఈ అవమానం గురించి ఫ్రెంచ్ చరిత్రకారుడు ఫ్రాంకోయిస్ బెర్నియర్ తన 'ట్రావెల్స్ ఇన్ ద మొఘల్ ఇండియా'లో చాలా వివరంగా చెప్పారు.

"దారాను ఒక చిన్న ఏనుగుపై అంబారీ కూడా లేకుండా కూర్చోపెట్టారు. దాని వెనక ఇంకో ఏనుగుపై అతడి 14 ఏళ్ల కొడుకు సిఫిర్ షికోహ్ ఉన్నాడు. ఇద్దరి వెనుక కత్తి పట్టుకుని ఔరంగజేబు సైనికుడు గులామ్ నజర్ బేగ్ నడుస్తున్నాడు. దారా పారిపోడానికి ప్రయత్నించినా, అతడిని ఎవరైనా కాపాడ్డానికి ప్రయత్నించినా, వెంటనే తన తల నరికేయమని అతడికి ఆదేశాలు ఉన్నాయి".

"ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజ కుటుంబం వారసుడు చిరిగిపోయిన దుస్తుల్లో తన ప్రజల ముందే అవమానం ఎదుర్కుంటున్నాడు. అతడి తలకు ఒక వెలిసిపోయిన తలపాగా ఉంది. మెడలో ఆభరణాలు ఏవీ లేవు".

"దారా కాళ్లకు గొలుసులు ఉన్నాయి. కానీ చేతులకు మాత్రం ఏం లేవు. దిల్లీలో ఆగస్టు ఎండల్లో అతడు అలాగే కూచుని ఉన్నాడు. తన కళ్లు పైకెత్తి చూడడం లేదు. మొదలు నరికిన చెట్టులా ఉన్నాడు. అతడిని ఆ పరిస్థితిలో చూసి జనాలు దారికి రెండు వైపులా కన్నీళ్లు పెడుతున్నారు" అని బెర్నియర్ అందులో రాశారు.

దారా షికోహ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తండ్రి షాజహాన్‌ను బంధీగా తీసుకెళ్తున్న ఔరంగజేబు

యాచకుడికి శాలువ విసిరారు

దారాను అలా ఏనుగుపై తిప్పుతున్నప్పుడు అతడికి ఒక యాచకుడి గొంతు వినిపించింది. అతడు గట్టిగా "దారా, ఒకప్పుడు, ఈ భూమికి మీరే యజమానిగా ఉన్నారు. మీరు ఈ దారిలో వెళ్తూ, నాకు ఏదో ఒకటి ఇచ్చేవారు. ఈరోజు మీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు" అన్నాడు. అది వినగానే దారా తన భుజంపైన ఉన్న శాలువ తీసి ఆ యాచకుడి వైపు విసిరారు. అది చూసినవారు ఆ విషయం ఔరంగజేబుకు చెప్పారు. ఆ పరేడ్ ముగియగానే దారా, అతడు కొడుకు సిఫిర్‌ను సైనికులు ఖిజ్రాబాద్ జైలర్లకు అప్పగించారు.

మొండెం నుంచి వేరయిన తల

ఆ తర్వాత రోజు ఔరంగజేబు దర్బారులో దారా షికోహ్‌కు మరణదండన విధించాలని నిర్ణయించారు. అతడిపై ఇస్లాంను వ్యతిరేకించాడనే ఆరోపణలు చేశారు. ఔరంగజేబు కావాలని 4 వేలం గుర్రపు రౌతులను దిల్లీ నుంచి బయటకు పంపించాడు. దారాను గ్వాలియర్ జైలుకు తీసుకెళ్తున్నారనే వదంతులు పుట్టించారు. అదే సాయంత్రం నజర్‌బేగ్‌ను పిలిపించిన ఔరంగజేబు, తనకు 'దారా షికోహ్ నరికిన తలను చూడాలని ఉంది' అన్నారు.

ఆ తర్వాత ఏం జరిగిందో అవీక్ చందా చెప్పారు. "నజర్ బేగ్, అతడి అనుచరులు కత్తులతో ఖిజ్రాబాద్ మహల్లోకి వెళ్తారు. అక్కడ దారా, అతడి కొడుకు తమ రాత్రి భోజనం కోసం పప్పు వండుకుంటున్నారు. ఎందుకంటే ఆ రాత్రి వారి భోజనంలో విషం కలుపుతారని వాళ్లకు ఎవరో చెప్పారు. నజర్‌ బేగ్ అక్కడికి రాగానే 'నీ కొడుకును తీసుకువెళ్లాలని దారాతో చెప్పాడు. సిఫిర్ ఏడుస్తూ తండ్రిని గట్టిగా పట్టున్నాడు. నజర్ బేగ్, అతడి అనుచరులు సిఫిర్‌ను బలవంతంగా విడిపించి వేరే గదిలోకి తీసుకెళ్లారు" అన్నారు.

"దాంతో, దారా తన దిండులో దాచుకున్న చాకుతో వాళ్లపై దాడి చేయాలని ప్రయత్నించాడు. కానీ సైనికులు అతడిని బలంగా పట్టుకున్నారు. మోకాళ్లపై వంచి అతడి నేలకు అదిమిపట్టారు. తర్వాత నజర్ బేగ్ తన కత్తితో దారా తలను మొండెం నుంచి వేరు చేశాడు" అని అవీక్ చెప్పాడు.

దారా షికోహ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హుమయూన్ సమాధి

ఔరంగజేబు ముందు దారా తల

"దారా షికోహ్ తలను ఔరంగజేబు ముందు ఉంచారు. అప్పుడు అతడు తన కోటలో ఒక తోటలో కూర్చుని ఉన్నాడు. తలను చూశాక దానికి ఉన్న రక్తాన్ని కడిగి దానిని ఒక పళ్లెంలో పెట్టి తన దగ్గరకు తీసుకురావాలని చెప్పాడు".

"అది దారా తల అని ఔరంగజేబు ధ్రువీకరించుకోడానికి వీలుగా, అక్కడ వెంటనే కాగడాలు, లాంతర్లు వెలిగించారు. ఔరంగజేబు అంతటితో ఆగిపోలేదు. తర్వాత రోజు, అంటే 1659 ఆగస్టు 31న తలలేని దారా మొండాన్ని ఏనుగుపైకి ఎక్కించి, అంతకు ముందు రోజులాగే దిల్లీ వీధుల్లో తిప్పాలని ఆదేశించాడు. ఆ దృశ్యం చూసిన దిల్లీ ప్రజలు వణికిపోయారు. మహిళలు ఇళ్లలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టారు. తలలేని దారా మొండాన్ని హుమయూన్ సమాధి ఉన్న ప్రాంతంలో ఖననం చేశారు".

దారా షికోహ్

ఫొటో సోర్స్, Getty Images

ముక్కలైన షాజహాన్ మనసు

ఆ తర్వాత ఔరంగజేబు ఆగ్రా కోటలో బంధీగా ఉన్న తన తండ్రి షాజహాన్‌కు ఒక బహుమతి పంపించాడు.

ఇటాలియన్ చరిత్రకారుడు నికోలావ్ మనూచీ తన 'స్టోరియా దో మోగోర్' పుస్తకంలో అప్పుడు ఏం జరిగిందో చెప్పాడు.

ఔరంగజేబు తన దగ్గర పనిచేసే ఎత్‌బార్ ఖాన్‌తో షాజహాన్‌కు ఒక లేఖ రాయించాడు. అందులో, "ప్రేమతో మీ కొడుకు ఔరంగజేబు. మీకు ఈ బహుమతిని పంపిస్తున్నాడు. దీనిని చూస్తే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు" అని రాశాడు. అప్పటికే ముసలివాడైన షాజహాన్ ఆ లేఖ చూడగానే, దేవుడి దయ వల్ల నా కొడుకు నన్ను ఇంకా గుర్తుంచుకున్నాడు" అన్నాడు. అదే సమయంలో అతడి ముందు ఒక గుడ్డ కప్పిన పళ్లెం ఉంచారు. ఆ గుడ్డను తీయగానే షాజహాన్ గట్టిగా అరిచాడు. ఆ పళ్లెంలో, అతడికి ఇష్టుడైన, పెద్ద కొడుకు దారా షికోహ్ తల ఉంది అని మసూచీ చెప్పాడు.

దారా షికోహ్

ఫొటో సోర్స్, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING

క్రూరత్వానికి పరీక్ష

ఆ దృశ్యం చూసి అక్కడ ఉన్న మహిళలందరూ ఘోరంగా ఏడ్చారు. గుండెలు బాదుకున్నారు. ఆభరణాలు తీసి విసిరేశారు. షాక్‌కు గురైన షాజహాన్‌ను అతడిని అక్కడనుంచి వేరే దగ్గరికి తీసుకెళ్లిపోయారు. దారా మొండాన్ని వేరే దగ్గర ఖననం చేశారు. కానీ దారా తలను తాజ్ మహల్ పరిసరాల్లో పాతిపెట్టాలని ఔరంగజేబు ఆదేశించాడు. షాజహాన్ ఎప్పుడు తన బేగం సమాధి(తాజ్ మహల్) వైపు ఎప్పుడు చూసినా, మొండెం లేని తన పెద్ద కొడుకు తల అక్కడే కుళ్లుతోందనే విషయం అతడిని బాధపెట్టాలని ఔరంగజేబు భావించాడు".

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)