అందరూ ఉన్నా ఆదుకునేవారు లేక బిస్కెట్లు తిని బతుకుతున్న ఓ తండ్రి
- రచయిత, డి.ఎల్. నరసింహ
- హోదా, బీబీసీ న్యూస్ తెలుగు కోసం
కన్న కొడుకులు కాదన్నారు. ఆస్తులన్నీ లాక్కుని ఈయన్ని రోడ్డున పడేశారు. తిండి లేక, ఆకలికి తట్టుకోలేక బిస్కెట్లు తింటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఇతని పేరు గంగదాసరి నాగిరెడ్డి. కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లె స్వగ్రామం. ఇతనికి ఎవరూ లేరా? అంటే అందరూ ఉన్నారు.
ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, బంధువులూ ఉన్నారు. 20 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో అన్నీతానై పిల్లల్ని పెంచి పెద్ద చేశారు.
ఒకప్పుడు గోవిందపల్లెకు ఈయన ఉప సర్పంచ్. వారసత్వంగా వచ్చిన 16 ఎకరాలకు తోడు కష్టపడి మరో 26 ఎకరాలు సంపాదించారు.
రెండు ఇళ్లతో పాటు తన 42 ఎకరాలను కొడుకులకు రాసిచ్చారు. ఆస్తులు తీసుకున్న తర్వాత వారు తండ్రి ఆలనాపాలన మరిచారు.
దాంతో 75 ఏళ్ల వయసులో నాగిరెడ్డి ఒంటరివాడయ్యారు. ప్రస్తుతం అగ్గిపెట్టెలాంటి ఓ గదిలో ఉంటున్నారు. అన్నంపెట్టే దిక్కులేక సత్రాల్లో కడుపు నింపుకుంటున్నారు.
మా ఇతర కథనాలు:

న్యాయం కోసం లోక్ అదాలత్‌ను ఆశ్రయించారు. తండ్రికి కొంత భూమి ఇవ్వాలని జడ్జి తీర్పు ఇచ్చారు. అయినా ఆయన పరిస్థితి మాత్రం మారలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాగిరెడ్డి ఫిర్యాదుతో అతని కుమారులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. తండ్రికి కొంత భూమి ఇవ్వాలని సూచించారు. కానీ ఇంతవరకు అది జరగలేదు. జీవిత చరమాంకంలో తల్లిదండ్రుల్ని ఆదరించకపోతే చట్టప్రకారం నేరమని పోలీసులు చెప్తున్నారు.
అయితే, తండ్రిని తామే పోషిస్తున్నామని నాగిరెడ్డి కుమారులు చెప్పారు. తండ్రి ప్రవర్తన సరిగా ఉండదని ఆరోపించారు.
మా ఇతర కథనాలు:

నాగిరెడ్డి లాంటి వారు సమాజంలో అనేక మంది ఉన్నారని నంద్యాలలోని కాశిరెడ్డి ఆశ్రమ నిర్వాహకులు శివరామయ్య చెప్పారు. అలాంటి వారికి అశ్రమాలే అన్నం పెడుతున్నాయని అన్నారు.
వీరిలో కొందరు అందరూ ఉండీ అనాథలయ్యారు. మరికొందరు ఎవరూ లేని అనాథలు. ఒక్కొక్కరిది ఒక్కో దీనగాధ. ఆస్తికోసం పెద్దకొడుకు చిన్నకొడుకును హత్య చేయడంతో ప్రాణభయంతో ఇంటి నుంచి బయటికొచ్చింది సుబ్బమ్మ అనే వృద్ధురాలు.
మా ఇతర కథనాలు:

చూపు లేదని తనను ఇంట్లోంచి తరిమేశారని మరో వృద్ధుడు వాపోయాడు. కొడుకులు, కూతుళ్లు ఉన్నా పిడికెడు మెతుకులు పెట్టే వారే లేరని మరో వృద్ధురాలు కంటతడి పెట్టుకుంది.
కాటికి కాలు చాపిన సమయంలో తల్లిదండ్రుల్ని రోడ్డున పడేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని నంద్యాలలోని ప్రతిభ ఓల్జేడ్ హోం నిర్వహకులు నారాయణ అంటున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఓ వృద్ధాశ్రమం నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










