దళితులు మీసాలతో సెల్ఫీలు ఎందుకు షేర్ చేస్తున్నారు?

దళితుల మీసాలు

ఫొటో సోర్స్, Getty Images

గుజరాత్‌లో ఒక దళిత యువకుడిపై మీసాలున్నాయన్న నెపంతో దాడి జరిగింది. మంగళవారం గాంధీనగర్‌‌లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు 17 సంవత్సరాల దళిత యువకుడిని బ్లేడుతో గాయపరిచారు.

అంతకు ముందు కూడా మీసాలు పెంచుతున్నారనే కారణంతో ఇద్దరు దళితులను కొట్టినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ దాడుల వెనుక అగ్ర కులాల వారి హస్తం ఉందని దళితులు ఆరోపిస్తున్నారు.

ఆదివారం ఆనంద్ జిల్లాలో గర్బ నృత్యాన్ని చూస్తున్నాడనే నెపంతో మరో దళిత యువకుడిని కొట్టి చంపారు.

దళితుల మీసాలు

ఫొటో సోర్స్, FACEBOOK

దళితులపై దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో దీనిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మీసాలు పెంచుకున్నామనే నెపంతో తమపై దాడులకు పాల్పడడానికి నిరసనగా ఫే‌స్‌బుక్, ట్విటర్‌లలో దళితులు మీసాలతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు.

మీడియా సమాచారం ప్రకారం, ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది దళిత యువకులు వాట్సప్‌లలో మీసాలతో ఉన్న ఫొటోను తమ డీపీగా మార్చుకుంటున్నారు.

ఫేస్‌బుక్, ట్విటర్‌లలో కూడా #DalitWithMoustache అనే హ్యాష్‌ట్యాగ్‌తో తమ ఫ్రొఫైల్ చిత్రాలను మార్చుకుంటున్నారు.

ఇది కూడా చదవండి:

సుమీత్ చౌహాన్ ఫేస్ బుక్‌లో భీమ్‌రావ్ అంబేద్కర్ విగ్రహంతో సెల్ఫీ తీసుకుని దాన్ని షేర్ చేస్తున్నాడు. దమ్ముంటే నా చిత్రాన్ని కాల్చండని సవాలు విసురుతున్నాడు.

దళితుల మీసాలు

ఫొటో సోర్స్, FACEBOOK/SUMIT CHAUHAN

విజయ్ కుమార్ తన ఫొటోతో పాటు, ''ఈ కులతత్వవాదులంతా మమ్మల్ని చూసి భయపడుతున్నారు. ఇది ప్రారంభం మాత్రమే'' అని పోస్ట్ చేశాడు.

దళితుల మీసాలు

ఫొటో సోర్స్, FACEBOOK

హేమంత్ కుమార్ అనే మరో యువకుడు, ''మేం భీమ్‌రావ్ అంబేద్కర్ వారసులం. గడ్డం, మీసాలు పెంచుకుంటాం. ఇతరులకన్నా ప్రత్యేకంగా ఉంటాం'' అని పోస్ట్ చేశాడు.

ట్విటర్‌లో కూడా అనేక మంది యువకులు మీసాలతో ఉన్న ఫొటోలను ట్వీట్ చేస్తున్నారు. తన మీసాల ఫొటోను ట్వీట్ చేసిన వినీత్ గౌతమ్, ''మీసాలు పెంచుకుంటే దళితుడిలా పెంచుకో. లేకుంటే పెంచుకోవద్దు'' అని ట్వీట్ చేశాడు.

దళితుల మీసాలు

ఫొటో సోర్స్, FACEBOOK

సందీప్ గౌతమ్ తాను, తన స్నేహితులు మీసాలతో ఉన్న ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దళితులపై జరుగుతున్న దాడులకు నిరనసగా మీసాలతో ఉన్న సెల్ఫీ తీసి తనతోపాటు ప్రచారంలో పాల్గొనాలని సందీప్ పిలుపునిచ్చాడు.

గుజరాత్ యువత స్థానిక భాషలో సోషల్ మీడియాలో ఈ దాడులను నిరసిస్తోంది.

దళితుల మీసాలు

ఫొటో సోర్స్, TWITTER

''ఈ వర్ణవ్యవస్థ నాకు మీసాలను పెంచుకునే హక్కు ఇవ్వలేదేమో కానీ రాజ్యాంగం మాత్రం నాకు సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది'' అంటూ వాఘేలా రాహుల్ అనే యువకుడు ట్విట్ చేశాడు.

గబ్బర్ సింగ్ అనే మరో యువకుడు ''చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఈ రోజుకు జై భీమ్ చాలు'' అని పోస్ట్ చేశాడు.

దళితుల మీసాలు

ఫొటో సోర్స్, FACEBOOK

దళితులపై దాడుల నేపథ్యంలో కొందరు దళిత నేతలు గుజరాత్‌లో ఒక ర్యాలీ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ వారంలో అహ్మదాబాద్‌లో ర్యాలీ నిర్వహించే అవకాశం ఉంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)