గుజరాత్‌లో దళిత యువకుడి హత్య కేసులో 8 మంది అరెస్టు

ఫొటో సోర్స్, CHANDRAKANT PARMAR
గుజరాత్‌లో అక్టోబర్ 1న తెల్లవారుజామున సంప్రదాయ గర్బ నృత్య ప్రదర్శనను చూడటానికి వెళ్లిన 21 ఏళ్ల దళితుడిని కొందరు కొట్టి చంపారు. నవరాత్రి సందర్భంగా గుజరాత్‌లో తొమ్మిది రోజుల పాటు గర్బ ఆడుతారు.
ఆనంద్ జిల్లా భండారనియా గ్రామంలో జరిగిన ఈ దారుణంపై మృతుడు జయేష్ సోలంకీ బంధువులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇందులో పేర్కొన్న ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశామని పోలీసులు బీబీసీతో చెప్పారు.
ఒక ఆలయం సమీపాన నిర్వహించిన నృత్య కార్యక్రమాన్ని చూసేందుకు జయేష్ తన కజిన్ ప్రకాశ్, మరో ముగ్గురితో కలిసి వెళ్లారు. ‘‘మేం గుడి సమీపాన బల్లలపై కూర్చుని ఉండగా, సంజయ్ పటేల్ అనే వ్యక్తి మా దగ్గరకు వచ్చారు. ఇక్కడేం చేస్తున్నారని అడిగారు. మా అక్కాచెల్లెళ్లు కూడా గర్బ ఆడుతున్నారని, చూడటానికి వచ్చామని చెప్పాం. సంజయ్ మమ్మల్ని దుర్భాషలాడారు. కులం పేరుతో దూషించారు. ‘ఇక్కడికి రావడానికి మీకెంత ధైర్యం’ అని కూడా అన్నారు’’ అని ఫిర్యాదులో ప్రకాశ్ ఆరోపించారు.
''జయేష్, ప్రకాశ్ తదితరులతో వాగ్వాదం తర్వాత సంజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయి, ఏడుగురిని వెంటపెట్టుకొని వచ్చారు. వారిలో ఒకరు ప్రకాశ్‌పై చేయి చేసుకున్నారు. జయేష్ కల్పించుకోగా, వాళ్లు ఆయన్ను ఈడ్చుకొని వెళ్లి కొట్టారు. గోడకేసి కొట్టారు. జయేష్ స్పృహ కోల్పోయారు'' అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, CHANDRAKANT PARMAR
జయేష్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
జయేష్ బృందం, సంజయ్ బృందం మధ్య ఘర్షణ జరిగిందని, అదే జయేష్ హత్యకు దారితీసిందని ఫిర్యాదులో ఉంది.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాల నివారణ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద, భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని హత్యా నేరం, ఇతర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి.
గ్రామంలో జయేష్ బంధువులకు భద్రత ఏర్పాటు చేసినట్లు డీఎస్‌పీ ఏఎం దేశాయ్ బీబీసీ గుజరాతీతో చెప్పారు.
జయేష్ తల్లిదండ్రులు పేదలని, వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారని ప్రకాశ్ బీబీసీ గుజరాతీతో పేర్కొన్నారు. వారికి జయేష్‌తో పాటు ఒక కుమార్తె ఉన్నారని తెలిపారు.
‘‘గ్రామాల్లో దళితుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. దీనికి మా కేసే సాక్ష్యం’’ అని చెప్పారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








