ఇజ్రాయెల్‌లో అంతర్గత రాజకీయ వివాదాల నడుమ ప్రధాని మోదీ పర్యటన.. అక్కడి ప్రతిపక్షం ఏమంటోంది?

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా బుధవారం పార్లమెంట్‌లో చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరించాలని అక్కడి ప్రతిపక్షం యోచిస్తోంది.
వాస్తవానికి, అక్కడి అంతర్గత రాజకీయాల్లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.
నరేంద్ర మోదీ బుధవారం ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని అక్కడి మీడియా పేర్కొంది.
"ఈ ప్రత్యేక సమావేశానికి నెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) స్పీకర్ అమీర్ ఓహానా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఐజాక్ అమిత్‌ను ఆహ్వానించలేదు. ఇలా సంప్రదాయాన్ని పక్కనబెట్టడంపై ప్రస్తుతం వివాదం నెలకొంది'' అని ఇజ్రాయెల్ న్యూస్ వెబ్‌సైట్ హారెట్జ్ వెల్లడించింది.
''సగం ఖాళీగా ఉన్న పార్లమెంట్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించరు. పార్లమెంటును బహిష్కరించే ప్రతిపక్ష ఎంపీల సీట్లను భర్తీ చేయడానికి మాజీ ఎంపీలను ఆహ్వానించాలని ఆలోచిస్తున్నాం'' అని నెసెట్ స్పీకర్ అమీర్ ఓహానా అన్నట్లుగా ఇజ్రాయెల్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ 'కాన్' వెల్లడించింది.

''పార్లమెంట్‌లో మోదీ ప్రసంగానికి సంబంధించి ఐజాక్ అమిత్‌కు ఇప్పటివరకూ ఎటువంటి ఆహ్వానం అందలేదు'' అని ఇజ్రాయెల్ జ్యుడీషియల్ అథారిటీ ప్రతినిధి ఒకరు సోమవారం 'ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్'తో చెప్పారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆహ్వానం పంపలేదన్న విషయాన్ని నెసెట్ స్పీకర్ అమీర్ ఓహానా ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.
''సుప్రీం కోర్టు ప్రెసిడెంట్‌ను బహిష్కరించవద్దని, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన అధికారిక సమావేశంలో ప్రతిపక్షాలు కూడా పాల్గొనేలా చూడాలని స్పీకర్‌కు సూచించాలని ప్రధాన మంత్రి నెతన్యాహును కోరుతున్నా'' అని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని యాయిర్ లాపిడ్ ఫిబ్రవరి 23వ తేదీన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో రాశారు.
''ఆ సమావేశానికి హాజరుకావాలని అనుకుంటున్నాం. మేం ఉండాలి కూడా. సమావేశంలో పాల్గొనేందుకు మమ్మల్ని అనుమతించేలా ప్రధాని నెతన్యాహు పార్లమెంట్ స్పీకర్ అమీర్ ఓహానాను సూచించాలి'' అని ఆయన కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
బహిష్కరణ బెదిరింపులపై వివాదం
''సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఐజాక్ అమిత్‌ను ఆహ్వానించకూడదనే నెతన్యాహు ప్రభుత్వ నిర్ణయం, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు అటార్నీ జనరల్ గాలీ బహారవ్-మియారా అధికారాలను సవాల్ చేయడం, న్యాయవ్యవస్థ అధికారాల్లో మార్పులు తీసుకురావడానికి కొత్త చట్టాలు చేయడంలో భాగమే'' అని హారెట్జ్ పేర్కొంది.
గత వారం ఈ ప్రతిపాదిత బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంలో యాయిర్ లాపిడ్ మాట్లాడుతూ, ''జస్టిస్ అమిత్‌ను బహిష్కరించడం అంటే ప్రతిపక్షాలనూ బహిష్కరించడమే. ఇది మేం సభకు హాజరుకాలేని పరిస్థితిని కల్పిస్తోంది'' అని వ్యాఖ్యానించారు.
యాయిర్ లాపిడ్ గురువారం నెసెట్‌లో ప్రసంగిస్తూ, ''150 కోట్ల జనాభా కలిగిన దేశాధినేతను సగం ఖాళీగా ఉన్న పార్లమెంట్‌లో నిలబెట్టడం ద్వారా భారత్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రతిపక్షం అనుకోవడం లేదు. ఈ పరిస్థితులపై భారత రాయబార కార్యాలయం ఆందోళనలో ఉంది'' అని అన్నారని హారెట్జ్ పేర్కొంది.
లాపిడ్ బెదిరింపును రాజకీయ ఘర్షణలో ఉపయోగించే ఒక 'అక్రమ ఆయుధం'గా ఓహానా అభివర్ణించారు.
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకటైన భారత్‌తో ఇజ్రాయెల్ అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీయవద్దని లాపిడ్‌ను ఆయన కోరారు.
''అధ్యక్షుడు జేవియర్ మిలీ (అర్జెంటీనా), అధ్యక్షుడు ట్రంప్ (అమెరికా) గౌరవార్థం నిర్వహించిన ప్రత్యేక సమావేశాలకు జస్టిస్ అమిత్‌ను ఆహ్వానించనప్పటికీ లాపిడ్ ఎందుకు బహిష్కరించలేదు? మరి ఇప్పుడు భారత ప్రధానిని బహిష్కరించాలనుకుంటున్నారు. లాపిడ్ భారత రాయభార కార్యాలయంతో తన తదుపరి చర్చల్లో ఈ విషయమై సమాధానం చెప్పాలి'' అని ఓహానా 'ఎక్స్' పోస్టులో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బహిష్కరణ...
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2025 జనవరిలో అమిత్ ఎన్నికైన తర్వాత, ఆయన్ను అధికారికంగా గుర్తించేందుకు న్యాయశాఖ మంత్రి యారివ్ లెవిన్ నిరాకరించారు. అంతేకాదు, ఆయన్ను కలవడానికి కూడా ఇష్టపడలేదు, కోర్టు అధిపతిగా సంబోధించడానికీ నిరాకరించారు. చట్టప్రకారం, ఆయన నియామకాన్ని ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించడానికి కూడా సమ్మతించలేదు.
ఈ తరహా వైఖరిని నెతన్యాహు ప్రభుత్వంలోని మరికొందరు సభ్యులు సమర్థించారు.
ప్రవాస వ్యవహారాల శాఖ మంత్రి అమీహై చిక్లీ, సమాచార శాఖ మంత్రి శ్లోమో కర్హీ కూడా పలు సందర్భాల్లో కోర్టు కీలక ఆదేశాలను, తీర్పులను పాటించవద్దని బహిరంగంగానే ప్రభుత్వాన్ని కోరారు.
ఈ తరహా బహిష్కరణ ఫలితంగా, నెసెట్ నిర్వహించే అనేక కార్యక్రమాలకు అమిత్‌ను దూరం పెట్టారు.
సాధారణంగా, అమెరికా, ఇతర దేశాల నేతల ప్రసంగాలు వంటి కార్యక్రమాలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించడం ఒక సంప్రదాయం.
నిరుడు అక్టోబర్‌లో నెసెట్ 2025 శీతాకాల శాసనసభ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా స్పీకర్ అమీర్ ఓహానా, అమిత్‌ను 'చీఫ్ జస్టిస్' అని గాకుండా, 'జడ్జి' అని సంబోధించారు. దీనిపై అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
రెండు వారాల క్రితం, నెసెట్ 77వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి అమిత్‌ను ఆహ్వానించకపోవడంతో నిరసనగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి.
ఈ సందర్బంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన ఏకైక ప్రతిపక్ష సభ్యుడు యాయిర్ లాపిడ్ ఒక్కరే.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పట్ల నెతన్యాహు ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్‌లో రెండోసారి మోదీ పర్యటన...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల కారణంగా భారత్ పలు రంగాలలో వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్నారు.
ట్రంప్ 2.0 పాలనకు అనుగుణంగా మోదీ, నెతన్యాహు తమను తాము మలుచుకునే సత్తాను చాటుకున్నారని హారెట్జ్ పేర్కొంది.
''ఇప్పుడు దౌత్యం వ్యక్తిగతమైపోయింది. 'నేనే రాజ్యం' అనేది పరిపాలనా మంత్రంగా మారిపోయింది. పుతిన్ అంటే రష్యా, షీ అంటే చైనా, బీబీ (నెతన్యాహు) అంటే ఇజ్రాయెల్, మోదీ అంటే భారతదేశం అన్నట్లుగా మారింది. వారు ప్రతిఒక్కరూ తమ దేశాన్ని సైనిక, సాంకేతిక, భౌగోళిక రాజకీయాలపరంగా అమెరికాకు ఒక అనివార్యమైన భాగస్వామిగా నిలబెట్టుకున్నారు'' అని వ్యాఖ్యానించింది.
''గత పర్యటన తర్వాత మోదీ ఎదుగుదల, ఆయన పదవీకాలాన్ని అధ్యయనం చేయడానికి హారెట్జ్ ప్రయత్నించింది. తన పూర్తి పదవీకాలంలో దేశంలో సంప్రదాయంగా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించని ఒక ప్రధాన మంత్రి, రాజకీయంగా అంతటి కీలక వ్యక్తిగా ఎలా ఎదిగారో అర్థం చేసుకోవడానికి హారెట్జ్ ప్రయత్నించింది'' అని పేర్కొంది.
''మోదీ ఒక తరంలో ఒక్కసారి మాత్రమే కనిపించే అసాధారణ రాజకీయ ప్రతిభాశాలి'' అని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సీనియర్ ఫెలో, సౌత్ ఏసియా ప్రోగ్రామ్ డైరెక్టర్ మిలన్ వైష్ణవ్ హారెట్జ్‌తో అన్నారు.
''ఆయన (మోదీ) బరాక్ ఒబామా మాదిరిగా అద్భుతమైన ప్రసంగ కళను, బిల్ క్లింటన్ మాదిరిగా క్షేత్రస్థాయి రాజకీయ చాకచక్యంతో మిళితం చేస్తారు. సాధారణంగా రాజకీయ నాయకులలో వాటిలో ఏదో ఒక లక్షణం మాత్రమే ఉంటుంది. కానీ ఈ రెండింటిలోనూ ప్రావీణ్యం ఉండటం చాలా అరుదు'' అని మిలన్ వైష్ణవ్ వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














