ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలో భారత్ నలిగిపోతోందా?

ఫొటో సోర్స్, REUTERS/ANI
- రచయిత, ప్రియాంక ఝా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్యలో ఏప్రిల్ మొదటి వారం నుంచి పెరిగిన ఉద్రిక్తతలు, మధ్య ప్రాచ్య వెలుపలకు కూడా విస్తరించే అవకాశం పెరిగింది.
300కి పైగా డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌పైన దాడులకు దిగినట్లు గత వారం ఇరాన్ ప్రకటించింది.
ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇరాన్ కాన్సులేట్‌పై జరిగిన వైమానిక దాడికి సమాధానంగానే దాడులు చేశామని ఇరాన్ చెబుతోంది. అప్పటి దాడిని ఇజ్రాయెలే చేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది.
దీనిపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసిందని, దీని తర్వాత ఈ ప్రాంతంలో ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉందని శుక్రవారం అమెరికా చెప్పింది.
అయితే, ఈ పరిస్థితులు భారత్‌కు మరింత సవాలుగా మారనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే, ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలతో భారత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.
అంతేకాక, పశ్చిమ ఆసియా దేశాల్లో చాలా మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్యలో నెలకొన్న ఉద్రిక్తతలు, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ఇరాన్ దాడి తర్వాత, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను జారీ చేసింది. ఇరు దేశాలు దౌత్య మార్గాన్ని అనుసరించాలని కోరింది.
మరోవైపు ఈ రెండు దేశాలకు ప్రయాణాలు చేపట్టవద్దని చెబుతూ పౌరుల కోసం ముందస్తు ప్రయాణ హెచ్చరికలను జారీ చేసింది భారత్.
అయితే, ఈ హెచ్చరికలో ఈ రెండు దేశాలకు ప్రయాణించకుండా ఎలాంటి నిషేధాన్ని విధించలేదు. ముంద జాగ్రత్తగా ప్రయాణాలను చేయకపోవడం మంచిదని మాత్రమే తెలిపింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఘర్షణల నేపథ్యంలో, ఈ రెండు దేశాలలో, పశ్చిమ ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో నివసించే లక్షల మంది భారతీయ పౌరుల భద్రతే భారత్ ముందున్న అతిపెద్ద సవాలు అని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో 18 వేల మంది భారతీయులు ఉండగా.. ఇరాన్‌లో ఐదు నుంచి పది వేల మంది భారతీయులు నివసిస్తున్నట్లు అంచనా.

ఫొటో సోర్స్, MEA/X
ప్రయాణ హెచ్చరిక జారీ
హమాస్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఇజ్రాయెల్‌లో నిర్మాణ రంగంలో తీవ్ర కార్మికుల కొరత నెలకొంది. ఈ కొరతను పూడ్చుకునేందుకు, భారత ప్రభుత్వం, ఇజ్రాయెల్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం కింద, ఉత్తర ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల నుంచి 10 వేల మంది కార్మికులను అక్కడికి పంపనున్నారు.
ఇప్పటికే హరియాణాకు చెందిన 530 మంది కార్మికులు ఇజ్రాయెల్‌కు వెళ్లారు. మిగిలిన వారు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, భారత ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలతో వీరి ప్రయాణాలు నిలిచాయి.
‘‘పశ్చిమ ఆసియా దేశాలలో 90 లక్షల నుంచి కోటి మంది వరకు భారతీయులు నివసిస్తున్నారు. వీరు ప్రతి ఏడాది భారత్‌కు 50 నుంచి 55 లక్షల డాలర్లు(సుమారు రూ.41 కోట్ల నుంచి రూ.45 కోట్ల వరకు) పంపుతుంటారు. భారత్‌కు అతిపెద్ద ఆయిల్ సరఫరా దేశాలు సౌదీ అరేబియా, ఇరాన్‌లు పశ్చిమ ఆసియాలోనే ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రాంతంలో ఘర్షణలు పెరిగితే, కచ్చితంగా భారత్‌కు సమస్యగా మారుతుంది’’ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ సీనియర్ ఫెలో అసోసియేటెడ్ డాక్టర్ ఫజుర్ రెహమాన్ తెలిపారు.
గాజాలో ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు స్పందనగా ఎర్ర సముద్రంలో హూతీ రెబల్స్ దాడులు పెరిగాయని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకు చెందిన నెల్సన్ మండేలా సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఫ్యాకల్టీ మెంబర్ ప్రేమానంద మిశ్రా చెప్పారు.
దీని ప్రభావం వాణిజ్య మార్గాలలో ఇప్పటికే కనిపిస్తుందన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్యలో ఒకవేళ యుద్ధం మాదిరి పరిస్థితి నెలకొంటే, దీర్ఘకాలం పాటు తటస్థ విధానాన్ని నిర్వహించడం భారత్‌కు కష్టం కావొచ్చన్నారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు ధ్రువీకరణ అయ్యాక, అంతర్జాతీయంగా క్రూడాయిల్, బంగారం ధరలు పెరిగాయి.
శుక్రవారం ఆసియాలో క్రూడాయిల్ ధరలు 3 శాతం పెరిగి ఒక బ్యారల్ ధర 90 డాలర్లకు చేరుకుంది.
అదే విధంగా బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయిలో ఒక ఔన్స్ 2400 డాలర్లకు ఎగిసింది.
ఆయిల్ ధరలు పెరగడం మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుందని ప్రేమానంద మిశ్రా అన్నారు.
ఇప్పుడసలే లోక్‌సభ ఎన్నికల కాలం. ఒకవేళ ద్రవ్యోల్బణం పెరిగితే, ఎలక్టోరల్ రాజకీయాలపై నేరుగా ప్రభావం పడనుంది. ఇలా జరగాలని భారత్ కోరుకోవడం లేదు.
ఆయిల్ కోసం భారత్ ఆఫ్రికా దేశాలను ఆశ్రయించగలదని, కానీ, ఇరాన్ నుంచి చౌక ఆయిల్ లభించనుందని చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్‌కు దౌత్యపరంగా పెను సవాలు అవుతుందా?
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి తర్వాత, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రాంతీయంగా శాంతిని కాపాడుకోవడం చాలా ముఖ్యమని ఆ ప్రకటనలో పేర్కొంది.
హింసను, దాడులను ఆపి సంయమనం పాటించాలని, సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది. అయితే, భారత్ చేసిన ప్రకటన విదేశాంగ విధానంలోని బలహీనతకు అద్దం పడుతోందని నిపుణులు అంటున్నారు.
ఇరాన్‌పై గతంలో అమెరికా ఆంక్షలు ఉండేవని, అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని డాక్టర్ ప్రేమానంద్ మిశ్రా అన్నారు. భారతదేశం ఇజ్రాయెల్‌తో సంబంధాలను కొనసాగించాలనుకుంటే ఇరాన్‌తో సంబంధాలు చెడిపోవచ్చు. ఇరాన్‌కు దగ్గరైతే ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా అసంతృప్తిని ఎదుర్కోవలసి ఉంటుంది.
‘‘ఈ సంక్షోభంపై భారతదేశం చేసిన ప్రకటనను బట్టి చూస్తే విదేశాంగ విధానంలో ఉన్న గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. అయితే గందరగోళ పరిస్థితి పెద్ద సమస్య కాదు. కానీ, దౌత్య పరంగా సంక్షోభమే. ఎందుకంటే భారతదేశపు విదేశాంగ విధానం ఇలాంటి సమస్యలలో తటస్థంగా ఉంటుంది. భారత్ ఒకరకంగా ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య చిక్కుకుపోయింది.’’ అని ఆయన అన్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్‌తో భారత్ సంబంధాలు
భారతదేశానికి ముందు నుయ్యి, వెనకగొయ్యి అనే పరిస్థితి ఏర్పడిందని డాక్టర్ ప్రేమానంద్ మిశ్రా అన్నారు. పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఈ అంశంపై ఎక్కువకాలం మౌనంగా లేదా తటస్థంగా ఉండడం భారత్‌కు కష్టమేనని ఆయన అంటున్నారు.
ఇజ్రాయెల్‌తో భారత్ దౌత్య సంబంధాల చరిత్ర ఇటీవలిదే. ఇజ్రాయెల్ 1948లో ఒక దేశంగా ఉనికిలోకి వచ్చింది. 1992 నుంచి భారత్ దానితో దౌత్య సంబంధాలు మొదలు పెట్టింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకూ బలపడుతూ వచ్చాయి.
ఇప్పుడు భారతదేశానికి ఆయుధాలు, టెక్నాలజీ ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి.
ఇరాన్‌తో మాత్రం భారత్‌కు చాలాకాలం నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇండియాకు చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి. అణు కార్యక్రమం కారణంగా ఇరాన్‌పై విధించిన అంతర్జాతీయ ఆంక్షలకు ముందు, ఇరాన్ భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు ఎగుమతిదారు.
అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇరాన్‌తో భారత్ జాగ్రత్తగా సంబంధాలను కొనసాగిస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఈ ఏడాది ఇరాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా చాబహార్ పోర్టుపైనా చర్చ జరిగింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్ మధ్యవర్తిత్వం వహించగలదా?
చాబహార్ పోర్టు నిర్మాణంలో భారత్ పెట్టుబడులు పెట్టింది. వ్యూహాత్మకంగా ఈ నౌకాశ్రయం భారత్, ఇరాన్ రెండు దేశాలకు కీలకమైంది.
ఈ నౌకాశ్రయం ద్వారా పాశ్చాత్య దేశాల ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడంలో ఇరాన్‌కు భారత్ సహకరిస్తుంది.
అదే సమయంలో, అఫ్గానిస్తాన్, మధ్య ఆసియాతో వాణిజ్యం చేయడానికి భారతదేశం పాకిస్తాన్ ద్వారా వెళ్ళవలసిన అవసరం లేదు.
భారతదేశంలోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ గాజాలో యుద్ధాన్ని ఆపడానికి భారతదేశం క్రియాశీల పాత్ర పోషించాలని అన్నారు.
అయితే, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం గురించి ఆయన ప్రస్తావించలేదు. అయితే అలాంటి అవకాశం వచ్చినా భారత్‌కు అది అంత సులభం కాదు.
‘‘ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అతిపెద్ద సమస్య ఏమిటంటే, ఈ రెండు దేశాలు భావజాలం ఆధారంగా నడుస్తాయి. రెండింటి మధ్య ఏకాభిప్రాయం ఏర్పడటం అంత సులభం కాదు. ఉదాహరణకు, పాలస్తీనా అస్తిత్వంలో ఉండాలని ఇరాన్ కోరుతుంది. ఇజ్రాయెల్‌కు అది ఇష్టం ఉండదు." అని ప్రేమానంద్ అన్నారు.
అనేక సమస్యలు ఇందులో ముడిపడి ఉన్నందున వీటి మధ్య ఘర్షణ వాతావారణాన్ని తగ్గించడం భారత్‌కు అంత సులభం కాదని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ‘సైన్యం మమ్మల్ని చితకబాదింది, ఏ మొహంతో డ్యూటీ చేయగలం’ అని అక్కడి పోలీసులు ఎందుకు వాపోతున్నారు?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? అతిగా తాగితే ఏమవుతుంది?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- రెండు లక్షల 25 వేలు పలికిన ఆరు రూపాయల సాధారణ కోడి గుడ్డు, ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















