గాజాలో బాంబు పేలుళ్ళ నడుమ బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కథ

జుమానా ఎమాద్

ఫొటో సోర్స్, JUMANA EMAD

ఫొటో క్యాప్షన్, గాజాలో గర్భం దాల్చడం చాలా ప్రమాదకరంగా ఉందన్న జుమానా ఎమాద్
    • రచయిత, దాలియా హైదర్
    • హోదా, బీబీసీ అరబిక్

గాజాలోని జుమానా ఎమాద్ నిండు గర్భిణి. నెల రోజుల నుంచి కాన్పు కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో గాజాలో బాంబుల మోతలు మొదలయ్యాయి. ఉన్నట్లుండి పరిస్థితులు పూర్తిగా దారుణంగా మారిపోయాయి.

నిండు గర్భాన్ని సంతోషంగా చూపిస్తూ దిగిన ఫోటోలు కొన్నింటిని జుమానా ఎమాద్ అప్పట్లో షేర్ చేశారు. ప్రసవానికి అన్నీ సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.

తనకు పుట్టబోయేది ఆడపిల్లే అని ఆమెకు తెలుసు. ఎమాద్ భర్త కూడా చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారు. ప్రసవానికి తీసుకెళ్లే సామగ్రితో బ్యాగ్ ప్యాక్ రెడీ చేశారు.

ఇక వారి నాలుగేళ్ల కూతురు తులిన్ అయితే రాబోయే చిట్టి చెల్లి కోసం ఎంతో ఎదురుచూస్తోంది.

కానీ, అంతలోనే మొత్తం మారిపోయింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఆ దాడుల్లో దాదాపు 1,400 మంది చనిపోయారు. 200 మందికి పైగా ప్రజలను హమాస్ బందీలుగా తీసుకెళ్లింది.

దీనికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులను ప్రారంభించింది. ఈ దాడుల్లో సుమారు ఏడు వేల మంది మరణించి ఉంటారని హమాస్‌కు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.

‘‘నేను వణికిపోయాను’’ అని జుమానా ఎమాద్ బీబీసీతో అన్నారు. ‘‘నిరంతరం బాంబు దాడుల జరుగుతున్న సమయంలోనే నాకు నొప్పులు వచ్చాయి’’ అని చెప్పారు.

గాజా ఉత్తర దిక్కును విడిచి పెట్టి దక్షిణానికి వెళ్లాలని ఇజ్రాయెల్ ఆదేశించిన తర్వాత ఈ 25 ఏళ్ల ఫ్రీల్యాన్స్ జర్నలిస్ట్ ఎమాద్ ఉత్తర ప్రాంతంలో ఉన్న తన ఇంటిని వదిలి బయటికి వచ్చారు.

ఇజ్రాయెల్ దాడులు మొదలైన రెండు రోజుల తర్వాత ఆమె గాజా నగరాన్ని విడిచిపెట్టారు.

తొమ్మిది నెలల గర్భంతో, భయంభయంగా తన పెద్ద కూతుర్ని తీసుకుని బంధువుల ఇంటికి చేరుకున్నారు.

కేవలం ఒక జత బట్టలు, పాల డబ్బా, తన కూతురి కోసం చిన్న బ్యాగ్ తీసుకుని ఇక్కడికి వచ్చారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని జుమానా వాయిస్ మెసేజ్‌లో వివరించారు.

‘‘రాత్రి నిద్రపోలేదు. బాగా బాంబుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో మేం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. నాలాంటి గర్భిణీలు కొద్దిసేపు నడవాలి. కానీ, యుద్ధం వల్ల కనీసం ఏదైనా తినడానికి కొనుక్కుందామన్నా కూడా బయటికి వెళ్లలేకపోయాం’’ అని మరో మెసేజ్‌లో వివరించారు.

విద్యుత్ కోతలు, ఇంటర్నెట్‌కు అంతరాయం, నీటి కొరత వంటి విషయాలపై జుమానా పదేపదే ప్రస్తావించారు. భయం, ఆందోళనతో కూడిన పరిస్థితులలోనే.. తాను బిడ్డకు జన్మించినట్లు తెలిపారు.

బేబీ తాలియా

ఫొటో సోర్స్, JUMANA EMAD

ఫొటో క్యాప్షన్, గాజాలో 2023 అక్టోబర్ 13న పుట్టిన బేబీ తాలియా

అక్టోబర్ 13 శుక్రవారం రోజు జుమానా ప్రసవానికి వెళ్లారు. జుమానా తొలుత గాజా నగరంలో అతిపెద్ద ఆస్పత్రి అని అల్-షిఫాలో ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు.

కానీ, యుద్ధంతో, తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో గాజా స్ట్రిప్‌లో ఉన్న ఒక చిన్న ఆస్పత్రి అల్-అవ్దా హాస్పిటల్‌లో ప్రసవానికి చేరారు. అక్కడికి చేరుకోవడానికి కూడా ఆమెకు బాగా ఇబ్బందైంది.

తీవ్రమైన నొప్పులు, ప్రసవ వేదనతో తనని ఎవరైనా ఆస్పత్రికి తీసుకెళ్తారేమోనని జుమాను చాలామందిని వేడుకున్నారు. ‘‘ట్యాక్సీ డ్రైవర్లు భయపడ్డారు. మహిళ ప్రసవానికి సాయపడేందుకు అంబులెన్స్‌లకు సమయం లేదు’’ అని ఆమె వివరించారు.

గంటల వ్యవధి పాటు ప్రసవ వేదనను భరించానని, ఇది చాలా భయానకమని జుమానా అన్నారు. ‘‘ఆస్పత్రికి పక్కనే ఉన్న ఇంటిపై తీవ్రమైన బాంబుల దాడి జరిగింది. పెద్ద శబ్దం వచ్చింది. ఆస్పత్రిపైనే బాంబు దాడి జరిగిందేమోనని నేను భయపడ్డాను. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తీసుకొచ్చారు.

అన్ని దిక్కుల నుంచి ఏడ్పులే వినిపించాయి. నా మొదటి కూతురి కోసం చాలా భయపడ్డాను. ఎందుకంటే, ఆ సమయంలో ఆమె నాకు చాలా దూరంలో ఉంది’’ అని తెలిపారు.

‘‘ఏది ఏమైనా నా బిడ్డకు జన్మనివ్వాలని అనుకున్నాను’’ అని చెప్పారు. కొన్ని గంటల తర్వాత సాయంత్రం వేళలలో పాపకు జన్మనిచ్చారు. బిడ్డకు తాలియా అని పేరు పెట్టుకున్నారు జుమానా.

‘‘చిన్నారి ఏడుపు మేమంతా ఇంకా బతికే ఉన్నాం’’ అని తెలియజేసిందని గుర్తుకు చేసుకున్నారు జుమానా. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వెంటనే జుమానాకు బెడ్‌ దొరక లేదు.

నొప్పి, తీవ్ర రక్తస్రావంతోనే ఆమె బెడ్ కోసం వేచిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక చిన్న రూమ్‌లో ఒక బెడ్ దొరికింది.

‘‘నేను చాలా అదృష్టవంతురాలిని. కనీసం నాకొక బెడ్ దొరికింది. వేరే మహిళలు ప్రసవించిన వెంటనే ఆస్పత్రి కారిడార్‌లలో నేలపై, మంచాలపై పడుకున్నారు’’ అని జుమానా వివరించారు.

గాజాలో 50 వేల మంది గర్భిణులున్నారని, వారిలో 5,500 మంది వచ్చే నెలలో ప్రసవించబోతున్నారని యూనిటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్‌ఎఫ్‌పీఏ) అంచనావేసింది.

ఆస్పత్రిలు నిండిపోతున్నాయని, మందులు, బేసిక్ సరఫరాలు అయిపోతున్నాయని తెలిపింది.

జుమానా పాపకు జన్మనిచ్చిన తర్వాత, కూతుర్ని తెల్లటి దుప్పటిలో చుట్టుకుని ట్యాక్సీలో తీసుకెళ్తూ ఒక వీడియోను తీశారు. ఆ వీడియోను షేర్ చేశారు.

కుటుంబానికి పాపను చూపించేందుకు సంతోషంగా ఆమె ఆస్పత్రి నుంచి బయలుదేరారు. కానీ, ఆ సమయంలో కూడా జుమానా ఇబ్బందులు పడ్డారు.

జుమానా ఎమాద్ కూతుర్లు తాలియా, పెద్ద కూతురు తులిన్

ఫొటో సోర్స్, JUMANA EMAD

ఫొటో క్యాప్షన్, జుమానా ఎమాద్ కూతుర్లు తాలియా, పెద్ద కూతురు తులిన్

‘‘విద్యుత్ కోతతో లిఫ్ట్ పనిచేయలేదు. ఆస్పత్రిలో నాలుగో అంతస్తు నుంచి కుట్లు నొప్పి వస్తున్నా, పుట్టిన పాపను చేతుల్లో పట్టుకుని, నిదానంగా మెట్లు దిగి బయటికి వచ్చాను’’ అని చెప్పారు.

ఆస్పత్రి నుంచి బయటికి వచ్చిన తర్వాత, వారు ఇంటోన్న ఇంటికి వెళ్లేందుకు వెహికిల్ దొరికేందుకు కష్టమైందన్నారు.

‘‘గంటసేపు పాటు ట్యాక్సి కోసం చూశాం. మమ్మల్ని తీసుకెళ్లేందుకు ఏ డ్రైవర్ అంగీకరించలేదు. దగ్గర్లో బాంబుల దాడి జరుగుతుందని వారు చాలా భయపడ్డారు. చివరికి ఒక వెహికిల్ దొరికింది. కానీ, ఆయన కూడా చాలా ఎక్కువ డబ్బులు అడిగారు.

కనీసం మా ఇంటి ముందు కూడా మమ్మల్ని దించలేదు’’ అని తెలిపారు. ఇలాంటి సమయంలో పాపకు జన్మనివ్వడం చాలా కష్టమని జుమానా చెప్పారు.

‘‘మానసికంగా నేను చాలా అలసిపోయాను. ఇంకేం చేసేందుకు నాకు ఓపిక లేదు’’ అని ఆమె అన్నారు. కానీ, బేబీ తాలియా బాగుందని ఆమె చెప్పారు. ‘‘నావి, నా భర్తవి, పెద్ద కూతుర్ని కలగలిపిన పోలికలు తాలియాకు వచ్చాయి’’ అని తెలిపారు.

ఒకవేళ యుద్ధం లేకపోతే, పాప పుట్టిన వారం తర్వాత ఒక పెద్ద వేడుక చేయాలనుకున్నామని చెప్పారు.

కుటుంబ సభ్యులందర్ని పిలిచి, తన కోసం అఖిఖా(సంప్రదాయ ఇస్లామిక్ వేడుక) నిర్వహించే దాన్ని అన్నారు. తన కుటుంబం భవిష్యత్ ఏమిటో తనకు తెలియదని, కానీ, పాప పుట్టడంతో ఈ యుద్ధం, మరణ జీవితంలో ఆమే తన ఆశ అన్నారు.

వీడియో క్యాప్షన్, బాంబు పేలుళ్ల మధ్యే బిడ్డకు జన్మనిచ్చిన గాజా జర్నలిస్ట్ జుమానా...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)