హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా భారత్ ఎందుకు ప్రకటించలేదు?

హమాస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రేరణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న జరిపిన దాడికి హమాస్ 'ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్' అని పేరు పెట్టింది. హమాస్ దాడిని పలు దేశాధినేతలు ఖండించారు. పాశ్చాత్య దేశాలు దీనిని ఉగ్రవాద దాడిగా అభివర్ణించాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ దాడిని ఖండించారు. దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొన్నారు. అయితే, ప్రధాని మోదీ ప్రకటనలో ఎక్కడా హమాస్ ప్రస్తావన లేదు.

హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా భారత్ అధికారికంగా ప్రకటించలేదు. యూరోపియన్ యూనియన్, అమెరికా హమాస్‌ను ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయి.

హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ బుధవారం మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

దీంతో హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా భారత్ ప్రకటిస్తుందా, లేదా అనే చర్చ జరుగుతోంది.

అయితే, హమాస్‌పై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి

హమాస్ గురించి అరబ్ ఇస్లామిక్ దేశాలు ఒక విధంగా, పాశ్చాత్య దేశాలు మరో విధంగా ఆలోచిస్తున్నాయి. ఇటు ఆసియాలోనూ హమాస్ విషయంలో ఏకాభిప్రాయం లేదు.

హమాస్ ఉగ్రవాద సంస్థ కాదని, అది దాని భూమి, ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడుతోందని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ బుధవారం వ్యాఖ్యానించారు.

ఇండియాలోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిల్లాన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఇండియాలోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిల్లాన్

ఇజ్రాయెల్ రాయబారి భారత్‌ను ఏం కోరారు?

ఇండియాలోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిల్లాన్ బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారతదేశానిది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన వాణి అని గిల్లాన్ అభిప్రాయపడ్డారు.

“ఉగ్రదాడిని ఖండించిన మొదటి ప్రపంచ నాయకులలో ప్రధాని మోదీ ఒకరు. ఇజ్రాయెల్‌కు భారత్ మిత్ర దేశం, ఇదే సమయంలో ఇండియా కూడా ఉగ్రవాద బాధిత దేశమే కాబట్టి దాని తీవ్రతను అర్థం చేసుకోగలదు. హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా భారత్ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది'' అని తెలిపారు.

అంతేకాదు, చాలా ప్రజాస్వామ్య దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయని ఇజ్రాయెల్ రాయబారి గుర్తుచేశారు.

''సంబంధిత అధికారులతో మాట్లాడాం. మేం దీని గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. టెర్రరిస్టు బెదిరింపుల సమస్యను అర్థం చేసుకున్నాం, మేం (భారత్‌పై) ఒత్తిడి చేయడం లేదు, కోరుతున్నాం'' అని అన్నారు.

భారత్ ఏం చెబుతోంది?

ఇజ్రాయెల్ రాయబారి విజ్ఞప్తి తర్వాత భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీని మీడియా సంస్థ 'ది ప్రింట్ ' సంప్రదించింది.

''ఆ దాడిని తీవ్రవాద దాడిగా భావిస్తున్నట్లు ఇప్పటికే చెప్పాం. కానీ ఉగ్రవాద సంస్థ ప్రశ్నపై, సంబంధిత వ్యక్తులు స్పందించడం సమంజసం'' అని బాగ్చీ బదులిచ్చారు.

అంతకుముందు అక్టోబర్ 12న విదేశీ వ్యవహారాల శాఖ మీడియా సమావేశంలో - ‘‘హమాస్‌ను భారత్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిందా’’ అని బాగ్చీని ఓ విలేఖరి ప్రశ్నించారు.

అప్పుడు కూడా బాగ్చీ దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే బాధ్యత విదేశీ వ్యవహారాలశాఖకు లేదన్నారాయన. ‘‘మా దృష్టి పౌరులకు సహాయం చేయడంపైనే’’ అని బాగ్చీ బదులిచ్చారు.

హమాస్

ఫొటో సోర్స్, Getty Images

హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా భారత్ ఎందుకు పరిగణించలేదు?

యూరోపియన్ యూనియన్, అమెరికా, బ్రిటన్, కెనడా వంటి పాశ్చాత్య దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయి. భారత్ మాత్రం అలాంటి ప్రకటనేదీ చేయలేదు.

దీని గురించి వివరంగా తెలుసుకోవడానికి జామియా యూనివర్సిటీలోని 'పశ్చిమాసియా అధ్యయనాల కేంద్రం' ప్రొఫెసర్ డాక్టర్ సుజాత ఐశ్వర్య, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌లో సీనియర్ ఫెలో, మిడిల్ ఈస్ట్ నిపుణుడు డాక్టర్ ఫజుర్ రెహమాన్‌లను బీబీసీ సంప్రదించింది.

ఈ ప్రశ్నలు ఇంతకుముందు కూడా తలెత్తాయని, భారత మాజీ ప్రధానులు కూడా ఈ ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చిందని సుజాత ఐశ్వర్య గుర్తుచేశారు.

“భారత విదేశాంగ విధానంలో హమాస్, హిజ్బొల్లా లాంటి సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించలేదు. దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, హమాస్ లేదా హిజ్బొల్లా భారతదేశానికి ప్రత్యక్షంగా హాని కలిగించలేదు. భారత సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇతర సంస్థలపై ఐక్యరాజ్యసమితిలో భారత్ తన గళాన్ని వినిపించింది, వాటిని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. అలాంటిదే జైష్-ఎ-మొహమ్మద్'' అని తెలిపారు సుజాత ఐశ్వర్య.

2006లో పాలస్తీనా అథారిటీకి జరిగిన ఎన్నికల్లో హమాస్ పాల్గొంది. దాన్ని ఎన్నికల ప్రత్యర్థిగా గుర్తించారు. కాబట్టి హమాస్ పాలస్తీనా పరిపాలనలో భాగం.

అయితే ఆ ఎన్నికల ఫలితాలపై పశ్చిమ దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. అవి హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నాయి. అదే సమయంలో గాజాపై ఇజ్రాయెల్ అనేక ఆంక్షలు విధించింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హమాస్‌ను ఎన్నుకున్నది పాలస్తీనియన్లు.

2006కి ముందు, గాజా జెరిఖోప్రణాళిక కింద గాజాలో భారత కాన్సులేట్ కూడా పనిచేసింది.

అందుకే హమాస్‌తో అధికారిక సంబంధాలు లేకపోయినా దాన్ని పాలస్తీనా పరిపాలనలో భాగంగానే చూస్తోంది ఇండియా. దీనికి ఓ నైతిక కారణం కూడా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు సుజాత.

భారతదేశం స్వతంత్రం కోసం పోరాడిందని, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న శక్తులు హింసాత్మక ధోరణిని కూడా ఆశ్రయించాయని ఆమె గుర్తుచేశారు.

"1940లలో యూదుల ఉద్యమంలో హింసాత్మక శక్తులు కూడా పాల్గొన్నాయి. స్టర్జ్ గ్యాంగ్, ఇర్గున్, ఇవన్నీ ఉగ్రవాద సంస్థలే. అందువల్ల, భారత దృక్కోణం నుంచి చూస్తే నైతిక ఒత్తిడి కూడా కారణం కావచ్చు'' అని ఆమె చెప్పారు.

హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పేర్కొనకపోవడానికి భారత విదేశాంగ విధానాన్ని కూడా ఒక ముఖ్యమైన కారణంగా భావిస్తున్నారు ఫజ్జూర్ రెహమాన్.

"భారత విదేశాంగ విధానం ఎప్పుడూ తటస్థంగా ఉంది. మనం ఎల్లప్పుడూ మధ్యే మార్గాన్ని ఎంచుకున్నాం. అమెరికా, ఈయూ, బ్రిటన్‌ మాదిరి దూకుడుగా లేము. ఇండియా ఏ దేశ అంతర్గత రాజకీయాలలో జోక్యం చేసుకోబోదు. పాలస్తీనాతో భారత సంబంధాలు ఇజ్రాయెల్ కంటే పాతవి. అందుకే భారత్ అన్ని దేశాల అంతర్గత రాజకీయాలనూ గౌరవిస్తుంది'' అని అన్నారు రెహమాన్.

హమాస్

ఫొటో సోర్స్, Getty Images

ఉగ్రవాద సంస్థగా ప్రకటించే విధానం ఏమిటి?

దీనికి రెండు మార్గాలున్నాయని సుజాత వివరించారు. దేశ స్థాయిలో వాస్తవాలు, కారణాలను వివరిస్తూ ఒక విధానాన్ని రూపొందించి, నిర్దిష్ట సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించవచ్చు.

అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాల్సి వస్తే అందుకు ఐక్యరాజ్యసమితి మద్దతు ఉండాలి.

ఒక సంస్థ ఉగ్రవాద సంస్థా, కాదా అనేది ఐక్యరాజ్యసమితి నిర్ణయించగలదు. మిగిలిన సభ్య దేశాలు దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు, వీటో చేయవచ్చు.

''ఒక సంస్థ ఒక దేశానికి ఉగ్రవాది కావచ్చు, మరొక దేశానికి కాకపోవచ్చు. దీనికి నిర్దిష్టమైన ప్రమాణాలేం లేవు.అటువంటి పరిస్థితిలో ఈ సంస్థలు పనిచేసే లేదా ఏదైనా హాని కలిగించే దేశాలకు వాటిని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించే హక్కు ఉంటుంది'' అని రెహమాన్ చెప్పారు.

''ఉదాహరణకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌పై ఇజ్రాయెల్ ప్రశంసలు కురిపిస్తోంది. పాలస్తీనా అథారిటీతో ఉన్నామని ఆ దేశం చెబుతోంది, అంతకుముందు అదే సంస్థను పాలస్తీనా నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని ఇజ్రాయెల్ పిలిచేది'' అని తెలిపారు.

ఈజిప్ట్, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయి.

అయితే అదే జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్)లో భాగమైన ఖతార్, హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణించడం లేదు. హమాస్‌కు ఖతార్‌లో బ్యూరో కూడా ఉంది.

ఖలిస్తాన్

ఫొటో సోర్స్, AFP

ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తే ఏం జరుగుతుంది?

ఏదైనా సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తే- ''ఆర్థిక వనరులపై తనిఖీ ఉంటుంది. ఆ సంస్థ పరిచయాలు, సంబంధాలపై ఓ కన్నేసి ఉంచుతారు. వారి లక్ష్యాలను ఏ దేశాలు సమర్థిస్తున్నాయి? ఏ దేశాలు వ్యతిరేకిస్తున్నాయో పరిశీలిస్తారు. ఉదాహరణకు ఇండియాలో కేసులు ఎదుర్కొంటున్న ఖలిస్తాన్ మద్దతుదారులు బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. కెనడాలోనూ నివసిస్తున్నారు. ఈ దేశాలు వారికి స్థలాలు ఇచ్చాయి, వారితో సంప్రదింపులు జరుపుతున్నాయి. వారు ఏదో ఒక విధంగా ఫైనాన్స్ పొందుతున్నారు. ఈ కార్యకలాపాలన్నింటిపై పర్యవేక్షణ ఉంటుంది'' అని తెలిపారు రెహమాన్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)