గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?

ఫొటో సోర్స్, Davvid Levi
- రచయిత, ప్రమీలా కృష్ణన్
- హోదా, బీబీసీ తమిళ్
చెన్నైలో నివసించిన చివరి యూదు డేవిడ్ లెవీ. ఆయన వయసు 45 ఏళ్లు
17వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనా కాలంలో ఇక్కడకు వలస వచ్చిన తమ పూర్వీకుల పుస్తకాలు, ఇతర సంప్రదాయ వస్తువులను జాగ్రత్తగా కాపాడటంలో సాయం చేయాలని ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తరతరాల నుంచి యూదులకు ఆశ్రయం కల్పిస్తున్న చెన్నై నగరం చరిత్రలో తమకూ చోటు ఉండాలని ఆయన కోరుకొంటున్నారు.
క్రీ.శ. 1600 కాలంలో పోర్చుగల్, స్పెయిన్‌లతోపాటు వాయువ్య యూరప్‌లోని ప్రాంతాల నుంచి తరిమివేయడంతో పెద్ద సంఖ్యలో యూదులు దక్షిణ భారత దేశానికి వచ్చారు. వీరిలో చాలా మంది తమిళనాడులోని మద్రాసు, కేరళలోని మలబార్ ప్రాంతంలో స్థిరపడ్డారు.
తమ పూర్వీకుల గురించి డేవిడ్ లెవీ మాట్లాడుతూ- 1687లో బ్రిటిష్ ఇండియాలో ఏర్పాటైన తొలి కార్పొరేషన్లలో ఒకటైన మద్రాస పట్టణం సిటీ కార్పోరేషన్ (ఎంసీసీ)లో ముగ్గురు యూదు వర్తకులను ‘ఎల్డెర్‌మెన్’గా తొలి మేయర్ నాథానియేల్ హిగ్గిన్సన్ నామినేట్ చేశారని చెప్పారు.
ప్రస్తుతం గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లోనూ ఆ వివరాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Davvid Levi
17వ శతాబ్దంలోనే సినగోగ్‌లు
మద్రాస్‌లో యూదుల చరిత్ర గురించి ప్రజలకు చెప్పేందుకు, సినగోగ్‌లలో (యూదుల ప్రార్థనా మందిరాలలో) ఉపయోగించే వస్తువులను పరిచయం చేసేందుకు, తమ పూర్వీకుల ఫోటోలను పంచుకునేందుకు డేవిడ్ ఒక ఫేస్‌బుక్ పేజీని కూడా నడిపిస్తున్నారు.
17వ శతాబ్దంలో చెన్నైలో రెండు సినగోగ్‌లు ఉండేవని డేవిడ్ చేప్పారు. అయితే, ఆ తర్వాత కాలంలో వీటిని కొందరు ఆక్రమించేసుకున్నారని వివరించారు.
చివరగా 1968 వరకూ ఇక్కడి జార్జ్ టౌన్ ప్రాంతంలో ఒక సినగోగ్ ఉండేదని, అయితే, ఒక స్కూలును నిర్మించేందుకు ప్రభుత్వం దీన్ని పడగొట్టిందని ఆయన చెప్పారు.
‘‘కొన్ని వ్యక్తిగత కారణాలతో నా భారత పౌరసత్వాన్ని వదులుకున్నాను. కానీ, ఇక్కడి యూదుల చరిత్రతోపాటు భారత్‌లో మేం ఎలా వేళ్లూనుకున్నామో గ్రంథస్థం చేయాల్సిన అవసరముంది. కొన్ని పవిత్రమైన పుస్తకాలు, సినగోగ్‌లలో ప్రార్థనలో ఉపయోగించే వస్తువులు నా దగ్గర ఉన్నాయి. వీటిని ప్రభుత్వం తీసుకొని మ్యూజియంలలో పెట్టాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ నగరంతో మాకున్న అనుబంధాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయాలి’’ అని డేవిడ్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Davvid Levi
గోల్కొండ గనుల్లోని వజ్రాలతో వ్యాపారం
చెన్నై నగరంలో భిన్న కమ్యూనిటీల చరిత్రపై అధ్యయనం చేసిన చరిత్రకారుడు వెంకటేశ్ రామకృష్ణన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘17వ శతాబ్దంలో స్పెయిన్‌లో యూదులను బహిష్కరించినప్పుడు వీరు ఇంగ్లండ్, హాలండ్, ఇటలీ మీదుగా మద్రాసుకు వచ్చి స్థిరపడ్డారు’’ అని తెలిపారు.
‘‘యూరప్‌లలోని భిన్న ప్రాంతాలల్లో జీవించే తమ బంధువులతో వీరు వాణిజ్య సంబంధాలను ఏర్పరుచుకున్నారు. గోల్కొండ గనుల్లోని ముడి వజ్రాల్లాంటి విలువైన వస్తువులతో వీరి వ్యాపారం జరిగేది. వీటిని వీరు విదేశాలకు పంపించేవారు. అక్కడ కటింగ్, పాలిషింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ ఆ కోరల్ డైమండ్స్‌ను ఇక్కడకు దిగుమతి చేసేవారు. అందుకే చెన్నైలో వీరు జీవించిన ప్రాంతానికి కోరల్ మర్చంట్ స్ట్రీట్ అని పేరు పెట్టారు. గోల్కొండ గనుల్లోని వజ్రాల వ్యాపారంలో పోర్చుగల్‌కు చెక్ పెట్టేందుకు యూదులను బ్రిటిష్ వారు ప్రోత్సహించేవారు. ఫలితంగా గోవా-లిస్బన్ నుంచి మద్రాస్-లండన్‌గా వజ్రాల వర్తకం మారింది’’ అని వెంకటేశ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Davvid Levi
ద్రావిడ ఉద్యమానికి యూదుల మద్దతు
స్వాతంత్ర్యోద్యమ సమయంలో కొందరు యూదులు స్థానికులతో కలిసి పోరాటాల్లో పాల్గొన్నారు. ఇక్కడ ద్రావిడ ఉద్యమానికి కూడా వారు మద్దతు పలికారు.
డేవిడ్ లెవీ ‘గ్రేట్ గ్రాండ్‌మదర్’కు తమిళ భాషపై అభిమానంతో తమిళ పేరే పెట్టారు.
ఆమె భర్త ఐజాక్ హెన్రిక్స్ డీక్యాస్ట్రోకు చాలా మంది ద్రావిడ నాయకులతో మంచి సంబంధాలు ఉండేవి.
ఐజాక్ చనిపోయినప్పుడు ప్రముఖ ద్రావిడ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై విడుదల చేసిన ప్రకటనలో ఐజాక్‌ను ‘అన్నా’ అని, రోసాను ‘అన్నీ (వదిన)’ అని సంబోధించారు.
1944లో ఆష్విట్జ్ శిబిరంలో చోటుచేసుకున్న నరమేథంలో రోసా, ఐజాక్ మరణించారు. వీరి ఏకైక కుమారుడు లెవీ హెన్రిక్స్ డీక్యాస్ట్రో ఆ మారణహోమం నుంచి తప్పించుకొని చెన్నైకు వచ్చేశారు.
వీరి తరంలో చివరి యూదు డేవిడ్ లెవీ 2020 వరకూ చెన్నైలోనే ఉండేవారు.

ఫొటో సోర్స్, Davvid Levi
ఇజ్రాయెల్‌కు వలస
భారత స్వాతంత్ర్యం తర్వాత ఇక్కడ కొంత మంది యూదులే మిగిలారని కేరళకు చెందిన చరిత్ర ప్రొఫెసర్ కర్మా చంద్రన్ బీబీసీతో చెప్పారు.
‘‘వీరిలో కొంత మంది మళ్లీ ఇజ్రాయెల్‌కు వలస వెళ్లిపోయారు. కేరళలో వీరి కోసం ఎనిమిది సినగోగ్స్ ఉండేవి. ప్రస్తుతం వీటిలో మూడు మాత్రమే పనిచేస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.
‘‘వీరి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే, వీరి చరిత్రను గ్రంథస్థం చేయాల్సిన అవసరముంది. వీరి చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని కేరళ ప్రభుత్వాన్ని మేం కోరుతున్నాం. భిన్నత్వం, మత సామరస్యాలను మొదట్నుంచీ భారత్ ఎలా ప్రోత్సహించేదో చెప్పడానికి ఇది తోడ్పడుతుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని యూదులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ తరాలపాటు వారు సంతోషంగా జీవించారు. వారి చరిత్ర నేడు మన చరిత్ర’’ అని ఆయన చెప్పారు.
ఆ వస్తువులను మ్యూజియంలో పెడతారా?
డేవిడ్ లెవీ పూర్వీకుల విలువైన వస్తువులను మ్యూజియంలో పెట్టే ఆలోచనలను పరిశీలిస్తారా అని తమిళనాడు పురావస్తు విభాగాన్ని బీబీసీ ప్రశ్నించింది.
దీనిపై కమిషనర్ ఉదయచంద్రన్ స్పందిస్తూ- ‘‘ఈ వస్తువులు ఎవరికి, ఏ కాలానికి చెందినవో కనుక్కునేందుకు పరిశోధనలు మొదలుపెట్టాం. అయితే, ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు’’ అన్నారు.
ఇవి కూడా చదవండి..
- కెనడాలో హిందువులపై అక్కడి పార్టీల వైఖరి ఏమిటి?
- ఇండియా-కెనడా వివాదం: భారత్‌కు అమెరికా అనుకూలమా, వ్యతిరేకమా? ఆ మాటలకు అర్థం ఏమిటి?
- కెనడాలో వీసా సేవలు నిలిపివేయడం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
- ‘ఖలిస్తాన్’ ఉద్యమానికి కెనడా ఎందుకు కేంద్రంగా మారింది? హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు?
- సిక్కు నేత నిజ్జర్ హత్య: ఇండియా, కెనడా గొడవతో అమెరికా ఎందుకు టెన్షన్ పడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















