రఫా క్రాసింగ్ అంటే ఏమిటి? గాజా-ఈజిప్ట్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?

రఫా క్రాసింగ్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, రఫా క్రాసింగ్ దగ్గర ఎగ్జిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలు

క్షేత్రస్థాయిలో దాడుల(గ్రౌండ్ అటాక్)‌కు ఇజ్రాయెల్ సిద్ధమవుతోందన్న సమాచారంతో ఈజిప్టు-గాజా స్ట్రిప్ మధ్య ఉన్న బోర్డర్ క్రాసింగ్ రఫా దగ్గర పాలస్తీనియన్లు పెద్ద ఎత్తున గుమిగూడారు.

వివిధ దేశాల పౌరులు బయటకు వెళ్లేందుకు, గాజాకు మానవతా సాయం అందించేందుకు ఈ బోర్డర్ క్రాసింగ్ తెరుచుకుంటుందని అమెరికా మీడియా వెల్లడించింది. అయితే, ఎప్పుడు, ఎంతసేపు తెరుచుకుంటుందన్నది మాత్రం చెప్పలేదు.

కానీ, సోమవారం మధ్యాహ్నం క్రాసింగ్ పాయింట్‌ను పూర్తిగా మూసేశారు.

ఇజ్రాయెల్, గాజా సరిహద్దులు
ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్, గాజా సరిహద్దులు

గాజా ఎగ్జిట్ పాయింట్లు ఏవేవి?

ఈజిప్టుకు చెందిన సినాయ్ పెనిన్సులా, గాజా సరిహద్దుల్లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఎగ్జిట్ పాయింటే రఫా క్రాసింగ్. ఇది కాకుండా గాజా స్ట్రిప్ ప్రాంతానికి మరో రెండు ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ఎరెజ్ పాయింట్. ఉత్తర గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ లోకి వెళ్లే మార్గం ఇది.

మరొకటి కిరెమ్ షాలోమ్ పాయింట్. ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి దక్షిణ గాజాకు కేవలం సరుకులను మాత్రమే రవాణా చేస్తారు.

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఎరెజ్ క్రాసింగ్ దగ్గర దాడులు చేశారు. ఈ దాడుల్లో 1300 మంది చనిపోయారు. ఈ దాడి జరిగిన ఒకరోజు తర్వాత ఇజ్రాయెల్ ఎరెజ్, కీరెమ్ షాలోమ్ క్రాసింగ్‌లను నిరవధికంగా మూసేసింది.

దీంతో గాజా ప్రజలకు సాయం అందడానికి రఫా బోర్డర్ ఒక్కటే మిగిలింది.

గాజాకు సహాయం అందించే అంతర్జాతీయ సంస్థలు తమ దేశంలోని ఎల్-అరిష్ ఎయిర్ పోర్టు ద్వారా సామగ్రిని పంపవచ్చని గత వారం ఈజిప్టు సూచించింది.

ప్రస్తుతం పదుల సంఖ్యలో లారీలు ఇంధనం, సహాయ సామగ్రితో రఫా క్రాసింగ్ వద్ద ఈజిప్టు భూభాగంలో సిద్ధంగా ఉన్నాయి.

రఫా క్రాసింగ్
ఫొటో క్యాప్షన్, రఫా క్రాసింగ్ దగ్గర బాలిక

రఫా క్రాసింగ్ దగ్గర ఏం జరుగుతోంది?

రఫా క్రాసింగ్ దగ్గర నెలకొన్న పరిస్థితుల మీద భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. ఈ పాయింట్ నుంచి రవాణా, రాకపోకల మీద ఈజిప్టు, హమాస్‌ పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాయని చెబుతున్నారు. అయితే, గాజా మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు మొదలు పెట్టిన తర్వాత ఈ రవాణాకు తీవ్ర అంతరాయం కలిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అక్టోబరు 9, 10 తేదీల్లో ఇజ్రాయెల్ జరిపిన మూడు వైమానిక దాడుల కారణంగా పాలస్తీనా, ఈజిప్టు సరిహద్దుల్లో కొందరు గాయపడ్డారని, తర్వాత రఫా క్రాసింగ్‌ను మూసివేయాల్సి వచ్చిందని ఈజిప్ట్ మీడియా వెల్లడించింది.

గాజాకు సహాయం అందించేందుకు రఫా ప్రాంతంలో వైమానిక దాడులను నిలిపి వేయాల్సిందిగా ఈజిప్టు అక్టోబర్ 12న ఇజ్రాయెల్‌ను కోరింది. తమ సిబ్బందిపై దాడులు జరగవన్న హామీ వచ్చే వరకు రఫా క్రాసింగ్‌ను తెరవబోమని చెప్పింది.

ఇటు వివిధ దేశాలు గాజా ప్రాంతంలో ఉన్న తమ పౌరుల కోసం, మానవతా సాయం కోసం రఫా బోర్డర్‌ క్రాసింగ్‌ దగ్గర సేఫ్ పాసేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.

క్రాసింగ్ పాయింట్‌ను ఓపెన్ చేయించేందుకు ఈజిప్ట్, ఇజ్రాయెల్‌లతోపాటు, ఈ ప్రాంతంలో ప్రభావమున్న అన్ని రాజకీయ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నామని అమెరికా, బ్రిటన్ విదేశాంగ మంత్రులు ప్రకటించారు.

రఫా క్రాసింగ్ వద్దకు చేరుకోవాలని, కొద్ది సమయంపాటు క్రాసింగ్‌ను తెరిచే అవకాశం ఉందని గాజాలో చిక్కుకుపోయిన తమ పౌరులకు సూచించామని గత వారం అమెరికా హోంశాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

తాత్కాలిక కాల్పుల విరమణతో రఫా క్రాసింగ్ తెరుచుకోవచ్చన్న అంచనాల మధ్య సోమవారం క్రాసింగ్ పాయింట్ దగ్గర పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. అయితే, కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్ రెండూ తిరస్కరించాయి.

రఫా క్రాసింగ్

ఫొటో సోర్స్, BBC/GettyImages

ఫొటో క్యాప్షన్, రఫా క్రాసింగ్

క్రాసింగ్‌లను ఎందుకు మూసేశారు?

2007లో గాజాను హమాస్ స్వాధీనపరచుకున్న తర్వాత ఈజిప్టు, ఇజ్రాయెల్ రెండూ క్రాసింగ్‌ల దగ్గర రాకపోకలపై నియంత్రణలను విధించాయి. ఈ కట్టడి తమ దేశ భద్రత కోసమేనని రెండు దేశాలు వెల్లడించాయి.

తాజాగా హమాస్ దాడి తర్వాత ఆహారంగానీ, ఇంధనంగానీ సరఫరా చేయడానికి వీలు లేకుండా సంపూర్ణంగా క్రాసింగ్‌ను క్లోజ్ చేస్తున్నామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

రఫా క్రాసింగ్‌ను విదేశీ పాస్‌పోర్టు ఉన్న పౌరులకు, విదేశీ సహాయానికి ఓపెన్ చేస్తే పెద్ద ఎత్తున పాలస్తీనియన్లు తమ దేశంలోకి శరణార్థులుగా వస్తారని ఈజిప్టు భయపడుతోంది.

ఇస్లామిక్ జిహాదిస్టులు కూడా తమ దేశంలోకి చొరబడవచ్చని ఈజిప్టు ఆందోళన చెందుతోంది. గతంలో సినాయ్ ప్రాంతంలో ఇస్లామిక్ మిలిటెన్సీ కారణంగా పదేళ్లపాటు ఈజిప్టు ఇబ్బందులు ఎదుర్కొంది.

రఫా క్రాసింగ్
ఫొటో క్యాప్షన్, క్షేత్ర స్థాయిలో దాడులు చేస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది.

రఫా క్రాసింగ్‌ను ఎలా ఉపయోగించేవారు?

రఫా నుంచి బయటకు బయటకు వెళ్లడం పాలస్తీనియన్లకు అంత సులభమేమీ కాదు. ఇక్కడి నుంచి బయటకు వెళ్లాలనుకునే వారు పాలిస్తీనా అథారిటీ దగ్గర రెండు నుంచి నాలుగు వారాల ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే వీరి అభ్యర్ధనను అటు పాలస్తీనా అథారిటీగానీ, ఇటు ఈజిప్టుగానీ, తిరస్కరించవచ్చు.

ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో 19,608 మందిని ఈజిప్టు రఫా నుంచి ఎగ్జిట్‌కు అనుమతించగా, 314 మందిని గాజాలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంది.

వీడియో క్యాప్షన్, వీడియో డైరీ ద్వారా గాజా పరిస్థితిని ప్రపంచానికి చెబుతున్న గాజా ఫిల్మ్ మేకర్ బిసన్ ఔడా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)