గాజా: తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత... అక్కడి ప్రతి కథా విషాదమే

గాజా

ఫొటో సోర్స్, REUTERS

హమాస్​ దాడుల తర్వాత ఇజ్రాయెల్​ గాజాపై వైమానిక దాడులకు దిగింది. గాజాకు కష్టాలు కొత్తేంకాదు. ఎన్నో ఏళ్లుగా ఆ ప్రాంతంపై ఏదో ఒక దేశం ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉంది. తినడానికి గింజలు పండించుకోవాలన్నా పక్క దేశం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వారిది.

41 కి.మీ. పొడవు, 10 కి.మీ వెడల్పున్న గాజా స్ట్రిప్‌లో 22 లక్షల మంది నివసిస్తున్నారు. దీనికి మధ్యధరా సముద్రం, ఇజ్రాయెల్, ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్నాయి.

వాస్తవానికి గాజా ఈజిప్ట్ ఆక్రమణలో ఉండేది. 1967 'మిడిల్ ఈస్ట్ యుద్ధం'లో ఇజ్రాయెల్ సొంతం చేసుకుంది.

కాగా, 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ తన దళాలను వెనక్కి రప్పించింది. అక్కడి నుంచి 7,000 మంది ఇజ్రాయెల్ సెటిలర్స్ కూడా వచ్చేశారు.

అయితే, 2007లో గాజాలో హింసాత్మక ఘర్షణ చెలరేగింది. ఆ సమయంలో అప్పటి పాలస్తీనియన్ అథారిటీ (పీఏ) దళాల నుంచి గాజాను మిలిటెంట్ ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ నియంత్రణలోకి తీసుకుంది.

దీంతో ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలు భద్రతా కారణాల దృష్ట్యా గాజా లోపల, వెలుపల కదలికలు, రవాణా తదితరాలు పరిమితం చేస్తూ ఆంక్షలు విధించాయి.

అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే తదితర దేశాలు హమాస్‌ను తీవ్రవాద సంస్థగా పరిగణించాయి. గాజాను హమాస్ నియంత్రణలోకి తెచ్చుకున్నప్పటి నుంచి ఇజ్రాయెల్‌పై అనేక దాడులు జరిగాయి.

ఇజ్రాయెల్‌పై స్వయంగా దాడులు చేయడం లేదా ఇతర మిలిటెంట్ గ్రూపులు అక్కడ దాడులు చేసే పరిస్థితిని హమాస్ సృష్టించింది.

గాజా

ఫొటో సోర్స్, REUTERS

తాజా హింసకు కారణమేంటి?

అక్టోబర్ 7న ఇజ్రాయెల్​పై వేలాది రాకెట్లతో దాడి చేసింది హమాస్​. వందలాది మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారు. ఈ దాడులలో 1,300 మంది ఇజ్రాయెలీలు చనిపోయారు. అంతేకాదు డజన్ల కొద్దీ బందీలను గాజాకు తీసుకెళ్లారు మిలిటెంట్లు.

దీంతో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 2,200కు పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇపుడు గ్రౌండ్ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది.

అంతేకాదు, హమాస్‌ను ఓడించి "మిడిల్ ఈస్ట్‌ను మార్చేస్తాం" అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రతిజ్ఞ కూడా చేశారు.

ఈ క్రమంలో గాజాను దిగ్బంధం చేయాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అక్టోబర్ 9న ఆదేశించారు.

గాజాలో కరెంట్ బంద్

ఫొటో సోర్స్, REUTERS

'నీళ్లు, విద్యుత్, ఆహారం బంద్'

ఇజ్రాయెల్ దిగ్బంధనంతో గాజాలో విద్యుత్ లేదు, ఆహారం లేదు, ఇంధనం లేదు, ప్రతిదీ మూసివేశారు. అంతేకాదు, గాజా స్ట్రిప్‌కు నీటి సరఫరా కూడా నిలిపివేసింది ఇజ్రాయెల్​.

ఈ చర్య గాజాలో పరిస్థితిని మరింత దిగజార్చింది. ఎందుకంటే అక్కడ దాదాపు 80 శాతం జనాభాకు అప్పటికే అంతర్జాతీయ సహాయం అవసరం.

ఇంధనం లేకపోవడంతో గాజాలో ఉన్న ఏకైక పవర్ ప్లాంట్‌ అక్టోబరు 11న ఆగిపోయింది.

వైమానిక దాడులతో ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి. ఆసుపత్రులన్నీ బ్యాకప్ జనరేటర్లపై పనిచేస్తున్నాయి.

అక్కడ ఇంధన నిల్వ అంతగా లేదు. దీంతో అవి కొన్నిరోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఇజ్రాయెల్ దిగ్బంధించడంతో 6 లక్షల మందికి పైగా ప్రజలకు తాగడానికి నీరు దొరకడం లేదు.

స్థానిక నీటి పంపులు, మురుగునీటి వ్యవస్థలు పనిచేయడానికి కూడా ఇంధనమే అవసరం.

కెరెమ్ షాలోమ్ నుంచి వస్తువులు సరఫరా చేసే మార్గం మూసేయడంతో ఆహార సరఫరా తగ్గిపోయింది. గాజాలో మూడింత ఒకవంతు దుకాణాల్లో వస్తువుల కొరత ఉంది.

చాలా షాపుల్లో రెండు వారాలకు సరిపడా ఆహారం మాత్రమే ఉందని ఐక్యరాజ్య సమితి అంటోంది. అక్కడ కనీసం 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది ఐరాస పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు.

ఐరాస ప్రకారం ఈ దాడులకు ముందు కూడా ఇక్కడి ఇళ్లకు రోజుకు 13 గంటలే విద్యుత్‌ అందేది.

స్ట్రిప్ దాదాపు మూడింట రెండొంతుల విద్యుత్‌ను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసేది. మిగిలింది గాజా పవర్ ప్లాంట్ (జీపీపీ) ద్వారా ఉత్పత్తి చేసుకుంటోంది.

విద్యుత్ కోతలను ఎదుర్కోవడానికి సర్వీస్ ప్రొవైడర్లు, ఇళ్లు తప్పనిసరిగా బ్యాకప్ జనరేటర్‌లను ఆశ్రయించాలి.

అయితే అవి ఇంధనం, విడిభాగాలపై ఆధారపడి పనిచేస్తాయి. ఇవి అక్కడ ఎక్కువగా దొరకవు. ఎందుకంటే పౌర, సైనిక ఉపయోగాలున్నాయని ఈ వస్తువుల దిగుమతిని ఇజ్రాయెల్ పరిమితం చేసింది.

గాజా సరిహద్దు

ఫొటో సోర్స్, REUTERS

తప్పించుకునే దారి లేదు

దాడుల నుంచి తప్పించుకోవడానికి గాజాను విడిచి వెళ్లగలమనే నమ్మకం అక్కడి పౌరులకు పెద్దగా లేదు.

గాజాకు ఉత్తరాన ఉన్న ఎరెజ్ క్రాసింగ్‌ను నిరవధికంగా మూసివేశారు. గతవారం దక్షిణాన ఈజిప్టు నియంత్రిత రఫా సరిహద్దు క్రాసింగ్‌ వద్ద గల పాలస్తీనా గేటును మూసివేశారు.

పాలస్తీనియన్లందరికీ తమ దేశం నుంచి బయటికి వెళ్లడానికి ఇజ్రాయెల్ నుంచి అనుమతి రాలేదు.

రోజువారీ కూలీలు, వ్యాపారులు, రోగులు, వారి సహచరులు, వైద్య సహాయక సిబ్బందికి మాత్రమే అనుమతి లభించింది.

గత ఆగస్టులో 58,600 మందికి ఎరెజ్ ద్వారా వెళ్లడానికి అవకాశం దక్కిందని ఐరాస తెలిపింది. ఇది 2022లో వెళ్లిన నెలవారీ సగటు మనుషుల కంటే 65 శాతం ఎక్కువ.

రఫా ద్వారా వెళ్లాలనుకుంటే దానికి కొన్నివారాల ముందుగానే పాలస్తీనా అధికారుల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలి.

అలాగే ఈజిప్ట్‌కూ దరఖాస్తు చేసుకోవాలి. ఈ దేశం దరఖాస్తులపై పరిమితులు, భద్రతా నియంత్రణలను విధించింది.

ఆగస్టులో గాజా నుంచి రఫా మీదుగా వెళ్లడానికి 19,600 మందిని అనుమతించింది ఈజిఫ్టు. 2012 జూలై నుంచి ఇదే అత్యధిక సంఖ్య.

గాజా

ఫొటో సోర్స్, Getty Images

గాజాలో సమస్యలు కోకొల్లలు...

ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో గాజా ఒకటి. ఇక్కడ సగటున ఒక చ.కి.మీ కు 5,700 మంది కంటే ఎక్కువుంటారు. లండన్‌లోని జన సాంద్రతకు ఇది దగ్గరగా ఉంటుంది. కానీ గాజా సిటీలో ఆ సంఖ్య ఇపుడు 9,000 దాటింది.

ఐరాస గణాంకాల ప్రకారం గాజా జనాభాలో 75 శాతం అంటే దాదాపు 17 లక్షల మంది రిజిస్టర్డ్ శరణార్థులు. వారిలో 5 లక్షల కంటే ఎక్కువ మంది స్ట్రిప్‌లో ఉన్న ఎనిమిది రద్దీ శిబిరాల్లోనే నివసిస్తున్నారు.

ఇపుడు గాజా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా చాలామందికి పునరావాసం లభించడం లేదు.

2014 నుంచి 13 వేల ఇళ్లు ధ్వంసంకాగా దాదాపు 2,200 గృహాల పునర్నిర్మాణం కోసం నిధులు ఇవ్వాల్సి ఉందని జనవరిలో ఐరాస తెలిపింది.

మరోవైపు పాక్షికంగా దెబ్బతిన్న మరో 72,000 ఇళ్లకు ఎటువంటి మరమ్మతు సాయం అందలేదు. చాలా వస్తువులపై ఇజ్రాయెల్ పరిమితుల కారణంగా ఇళ్ల పునర్నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది.

ప్రస్తుత ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల 1,000 ఇళ్లు దెబ్బతిన్నాయని, వాటిలో 500 ఇళ్లు నివాసయోగ్యంగా లేవని పాలస్తీనా అధికారులు చెబుతున్నారు.

గాజాలో వైద్యం

ఫొటో సోర్స్, REUTERS

వైద్యం అందాలంటే అనుమతులు...

గాజాలో విద్యుత్ కోతలు ఎక్కువ. వైద్య పరికరాల కొరత తరుచుగా ఉంటుంది. చాలా సర్వీసులు, నిపుణుల చికిత్సలు ప్రజలకు అందుబాటులో లేవు.

దీనికి ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాల దిగ్బంధనాలు, పాలస్తీనా అథారిటీ (పీఏ) నుంచి ఆరోగ్యానికి నిధులు తక్కువ రావడం, ఈ అథారిటీ మధ్య అంతర్గత గొడవలు, హమాస్ అన్నీ కారణమని ఐరాస ఆరోపించింది.

వెస్ట్ బ్యాంక్ లేదా ఈస్ట్ జెరూసలేం ఆసుపత్రులలో వైద్య చికిత్స అవసరమయ్యే రోగులు తప్పనిసరిగా పీఏ ద్వారా, ఆ తర్వాత ఇజ్రాయెల్ నుంచి పాసులు పొందాలి.

2008 నుంచి 2022 వరకు 70 వేల కంటే ఎక్కువ మంది రోగుల దరఖాస్తుల అనుమతి ఆలస్యం అయ్యాయి లేదా తిరస్కరణకు గురయ్యాయి.

కొంతమంది రోగులు వారి దరఖాస్తుకు ఆమోదం రాకముందే మరణించారు.

వ్యవసాయం, చేపలు పట్టడంపై ఆంక్షలు

గాజాలో సుమారు 13 లక్షల మందికి ఆహారం అవసరమని ఐరాస పేర్కొంది, ఇక్కడ జనాభా అవసరాలను తీర్చడానికి దిగుమతులపైనే ఆధారపడుతుంది గాజా.

2023 ఆగస్టులో కెరెమ్ షాలోమ్, రఫా క్రాసింగ్‌ల ద్వారా ఇజ్రాయెల్, ఈజిప్ట్ అనుమతించిన 12,000 ట్రక్కుల సరుకుల్లో దాదాపు 22 శాతం ఆహార సరఫరాలేనని ఐరాస తెలిపింది.

గాజాలో వ్యవసాయం, చేపల వేటపై ఇజ్రాయెల్ పరిమితులు విధించింది. దీంతో అక్కడి ప్రజలు ఎక్కువగా ఆహారం ఉత్పత్తి చేసుకోలేకపోతున్నారు.

60 కి.మీ పొడవైన ఇజ్రాయెల్ చుట్టుకొలత కంచె నుంచి 100 మీ. వరకు ఉన్న ప్రాంతాలు "నో-గో" ప్రాంతాలుగా పరిగణిస్తారు.

అక్కడ భూములు ఉన్నా రైతులు పండించలేరు. 300 మీటర్ల లోపు రైతులను తప్ప అక్కడికి ఇతరులను అనుమతించరు.

మధ్యధరా సముద్రంలో ఇజ్రాయెల్ నౌకాయానంపై పరిమితిని కూడా విధించింది.

అంటే గజన్‌లు (గాజా నివాసితులు) తీరానికి కొంత దూరంలో మాత్రమే చేపలు పట్టగలరు.

హమాస్ దాడితో ఇజ్రాయెల్ కెరెమ్ షాలోమ్‌ను మూసివేసింది, చేపలు పట్టడాన్ని నిషేధించింది.

ఈ దిగ్బంధనాలను అధిగమించడానికి హమాస్ సొరంగాల నెట్‌వర్క్‌ను నిర్మించింది.

ఈజిప్ట్ నుంచి స్ట్రిప్‌లోకి వస్తువులను తీసుకురావడానికి హమాస్ వీటిని భూగర్భ కమాండ్ సెంటర్లుగా కూడా ఉపయోగిస్తుంది .

మిలిటెంట్లు ఆయుధాలను స్మగ్లింగ్ చేయడానికి, కనిపించకుండా తిరగడానికి కూడా సొరంగాలను ఉపయోగిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

గాజా

ఫొటో సోర్స్, REUTERS

నీటి కష్టాలు మరీ దారుణం..

గాజా జనాభాలో 95 శాతం మందికి స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేదు.

తీరప్రాంత జలాశయాల నుంచి సముద్రపు నీరు, మురుగునీరు చొరబడటంతో పంపు నీరు కలుషితమయ్యేవి. ఇవి తాగడానికి వీలు లేకుండా పోయేవి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి వ్యక్తికి రోజువారీ నీటి అవసరం కనీసం 100 లీటర్లుగా నిర్ణయించింది. గాజాలో సగటు వినియోగం 84 లీటర్లు.

అందులో 27 లీటర్లు మాత్రమే మానవ వినియోగానికి అనువైనవిగా పరిగణిస్తారు.

నీరు, విద్యుత్, ఇంధన సరఫరాలపై ఇజ్రాయెల్ ఆంక్షల ఫలితంగా తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని ఐరాస హెచ్చరించింది.

''నీటిని పొదుపు చేయాలని స్థానిక అధికారులు నివాసితులను కోరుతున్నారు. ఇంధనం లేకపోవడంతో మురుగునీటి శుద్ధి కర్మాగారాలు పనిచేయడం లేదు. దీంతో ప్రతిరోజూ 10 లక్షల గ్యాలన్ల ముడి మురుగు సముద్రంలోకి పంపింగ్ అవుతోంది'' అని ఐరాస పేర్కొంది.

గాజా

ఫొటో సోర్స్, REUTERS

విద్య, ఉద్యోగాల మాటేంటి?

చాలామంది గాజా పిల్లలు ఐరాస నిర్వహించే పాఠశాలల్లో చదువుతున్నారు. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంతో వీటిలో చాలావరకు నిర్వాసితులకు షెల్టర్లుగా మారిపోయాయి.

పాలస్తీనియన్ శరణార్థి ఏజెన్సీ యూఎన్ఆర్‌డబ్ల్యూఏ ప్రకారం గాజాలోని 278 పాఠశాలల్లో 71 శాతం "డబుల్ షిఫ్ట్" విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే ఉదయం కొంతమంది, మధ్యాహ్నం కొంతమంది విద్యార్థులు చదువుతారు.

2022లో అక్కడ సగటున తరగతిలో 41 మంది విద్యార్థులు ఉండేవారు. 2021లో 15-19 సంవత్సరాల వయస్సు గల వారి అక్షరాస్యత రేటు 98 శాతం.

పాలస్తీనియన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం గాజా ప్రపంచంలోని అతి పిన్న వయస్కులైన జనాభా గల ప్రాంతంగా ఉంది. ఇక్కడ దాదాపు 60 శాతం జనాభా 25 ఏళ్లలోపే ఉన్నారు.

గాజాలో 80 శాతం కంటే ఎక్కువ జనాభా పేదరికంలో ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగ స్థాయి ప్రపంచంలోనే అత్యధికం, 2022లో ఇది 45 శాతంగా ఉంది.

19- 29 మధ్య వయస్కుల్లోని 73.9 శాతం మందికి సెకండరీ స్కూల్ డిప్లొమా లేదా యూనివర్సిటీ డిగ్రీలున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)