హమాస్ బందీల కథలు: ‘నా భార్యాబిడ్డలను వాళ్లు ఎత్తుకు పోయారు’

భార్య డోరన్(మధ్యలో), ఇద్దరు పిల్లలు రజ్(5), ఆవివ్(3)లను మిలటెంట్లు ఎత్తుకుపోయారని గుర్తించిన యోని అషర్‌

ఫొటో సోర్స్, YONI ASHER

ఫొటో క్యాప్షన్, తన భార్య డోరన్(మధ్యలో), ఇద్దరు పిల్లలు రజ్(5), ఆవివ్(3)లను మిలిటెంట్లు ఎత్తుకుపోయారని గుర్తించిన యోని అషర్‌

ఇజ్రాయెల్‌పై మిలిటెంట్ గ్రూపుల దాడి తరువాత హమాస్ తమ వారిని బందీలుగా పట్టుకుపోయిందని పలు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

విదేశీయులు సహా అనేకమంది ప్రజలను గాజాలోకి బందీలుగా తీసుకువెళ్ళారని ఇజ్రాయెల్ మిలటరీ కూడా చెప్పింది.

మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లిన వారి కుటుంబాలు పడుతోన్న ఆవేదనపై బీబీసీ ప్రత్యేక కథనం..

‘ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా’

తన భార్య మొబైల్ ఫోన్‌ లోకేషన్ గుర్తించడం ద్వారా తన కుటుంబం గాజాలో ఉన్నట్టు యోని అషర్‌కు అర్థమైంది.

మిలిటెంట్లు దాడులు చేసినప్పుడు ఆయన భార్య డోరన్, ఇద్దరు పిల్లలు రజ్ (5), ఆవివ్ (3)లు గాజా సరిహద్దులో ఉండే సమీప బంధువులతో కలిసి ఉన్నారు.

‘‘శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో నా భార్యతో చివరి ఫోన్ కాల్ మాట్లాడాను. హమాస్ టెర్రరిస్టులు ఇంట్లోకి ప్రవేశించారని ఆమె చెప్పింది’’ అని యోని బీబీసీకి చెప్పారు.

‘‘వాళ్లొక హై సెక్యూరిటీ ఉన్న గదిలోకి ప్రవేశించిన తర్వాత కాల్ కట్ అయింది. ఆ తరువాత ఆమె మొబైల్‌ లోకేషన్‌ను ట్రాక్ చేయడం ద్వారా వారు గాజాలో ఉన్నట్టు తెలుసుకున్నాను.’’

తరువాత కొద్దిసేపటికే ఓ ట్రక్కు వెనుకభాగంలో జనాన్ని తరలిస్తున్న వీడియోలో తన కుటుంబం కూడా ఉన్నట్టు గుర్తించడంతో ఆయన భయపడినంతా జరిగినట్టయింది.

‘‘ఆ వీడియోలో నా భార్యను, నా ఇద్దరు కుమార్తెలతోపాటు నా ఇద్దరు చిన్న పిల్లలను గుర్తించాను’’ అని యోని చెప్పారు.

‘‘ వాళ్లు పెట్టబోయే నిబంధనలు, షరతులు ఏంటో నాకు తెలియదు. కానీ పరిస్థితి దిగజారిపోతోందని అర్థమవుతోంది’’ అన్నారాయన.

ప్రస్తుతానికి అందరిలానే తాను కూడా కుటుంబం కోసం ఆశగా ఎదురుచూడటం తప్ప యోని చేయగలిగింది ఏమీ లేదు.

‘‘నేను ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. దౌత్యవేత్తల మధ్య చర్చల్లో ఏదో ఒకటి జరగవచ్చనే నమ్మకం ఉంది. కానీ ఏం జరుగుతుందనేది తెలియకపోవడమే చాలా బాధగా ఉంది’’

తప్పిపోయిన హదాస్ ఇద్దరు పిల్లలు

ఫొటో సోర్స్, IDO DAN

ఫొటో క్యాప్షన్, తప్పిపోయిన హదాస్ ఇద్దరు పిల్లలు ఎరేజ్ (ఎడమవైపు), సాహర్(కుడి వైపు)

‘వాళ్ళు సజీవంగానే ఉన్నారని నమ్ముతున్నా’

శనివారం నాటి భయానక ఘటనలు ఇడో డాన్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో కనిపిస్తున్నాయి.

‘‘ఆమె వీడ్కోలు చెపుతోంది. మీ అందరినీ ప్రేమిస్తున్నాను. మేం ఇందులోంచి బతికి బయపటడతామో లేదో తెలియదు" అనే వాట్సాప్ సందేశాలను చూస్తూ ఇడో డాన్ ఏడుస్తున్నాడు.

ఆయన కజిన్ హదాస్ గాజా సమీపంలోని వ్యవసాయ ప్రాంతమైన నిర్జోలో నివసిస్తున్నారు.

ఆమె వైమానిక దాడుల ఆశ్రయం నుంచి తన కుటుంబానికి ఎప్పటికప్పుడు సమాచారమిస్తోంది.

రాకెట్ కాల్పలు జరగవచ్చనే సైరన్ హెచ్చరిక తరువాత ఆమె పరిగెత్తారు. గన్‌మెన్ అరబ్‌లో కేకలు వేయడం తెల్లవారుజామున తనకు వినిపించినట్టు ఆమె రాశారు.

‘‘ఇక్కడ ఏదో భయంకరమైన పరిణామం జరగబోతోంది’’అని పేర్కొన్నారు.

"ఇదేదో వినాశనంలా కనిపిస్తోంది. వారు అందరినీ చంపేస్తున్నారు’’ అని చెప్పారు.

‘‘9 గంటల ప్రాంతంలో ఆమె ఫోన్ డిస్‌కనెక్ట్ అయింది. ఫోన్ బ్యాటరీ అయిపోయింది’’

హదాస్ బతికి బయటపడ్డారు. కానీ రాత్రికల్లా ఆమె ఐదుగురు కుటుంబసభ్యులు తప్పిపోయారని స్పష్టమైంది.

హదాస్ ఇద్దరు పిల్లలు, ఆమె మాజీ భర్త, తండ్రి, ఆమె మేనకోడలు సహా 80 ఏళ్ళ తల్లి, ఇడో డాన్ అత్త కార్మెల్లా కనిపించకుండా పోయారు.

అసలేం జరిగిందనే విషయానికి సంబంధించిన ఆధారం ఓ వీడియో ద్వారా తెలిసింది.

ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో కనిపిస్తోంది.

ఇది ఎరేజ్ ప్రాంతాన్ని చూపుతున్నట్టుగా ఉంది. హదాస్ 12 ఏళ్ళ కుమారుడిని గన్‌మెన్ గాజాలోకి తీసుకువెళ్ళడం కనిపిస్తోంది.

‘‘వాళ్ళు బతికే ఉంటారనే ఆశ ఉంది’’ అని ఇడో చెప్పారు.

ఈయన టెలీఅవీవ్ సమీపంలో నివపిస్తున్నారు. కానీ ఈ ఘటనలకు ఆయన బాగా భయపడిపోయారు.

‘‘మా ఆంటీ మందులు వేసుకోవాలి. పిల్లలు ఎలా తింటారో ఏమిటో తెలియడం లేదు’’ అని చెప్పారు.

తమకు తెలిసిన వారి ద్వారా సమాచారాన్ని కనుక్కొనేందుకు ఈ కుటుంబం ప్రయత్నిస్తోంది.

ఇజ్రాయెల్ అధికారులు కూడా కొద్దిగా సాయం చేస్తున్నారు.

‘‘ ఈ దుస్థితికి నేను ఏ ఒక్కరినీ నిందించాలనుకోవడం లేదు’’ అని ఇడో చెప్పారు.

బందీలను విడుదల చేసే విషయమై చర్చలకు ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తుందని రిపోర్ట్స్ చెపుతున్నాయి.

‘‘వారిని ఈ ఘర్షణల నుంచి వదిలేయండి.’’ అంటూ తన కుటుంబసభ్యల విడుదల గురించి హమాస్‌ను ఇడో అభ్యర్థించాడు.

‘‘ఇక్కడ ఉల్లంఘించడానికి యుద్ధ నియమాలేవీ లేవు. కనీసం యుద్ధానికైనా నియమాలు, నైతిక విలువలు, పరిమితులు ఉంటాయి’’ అన్నారాయన.

 నోమి సాగీ

ఫొటో సోర్స్, NOAM SAGI

ఫొటో క్యాప్షన్, తన తల్లి 75వ పుట్టినరోజు నాటికి లండన్‌ వస్తుందని ఎదురుచూస్తున్న నోమి సాగీ

‘అది హర్రర్ సినిమాలా అనిపించింది’

గాజా సరిహద్దుకు 400 మీటర్ల దూరంలోని తన 74 ఏళ్ళ తల్లి ఇంటి ముందునుంచి పాలస్తినీయా మీడియా ప్రసారాలు మొదలు పెట్టినప్పడు నోమి సాగీ గుండె ఆగినంత పనయింది.

శనివారం మధ్యాహ్నం ఇజ్రాయెల్ దళాలు ఆడా సాగీ ఇంటిలోకి ప్రవేశించాయి.

సైనికులకు రక్తపు మరకలు కనిపించాయి, కానీ ఆ వృద్ధురాలి జాడ తెలియలేదని నోమీ సాగీ చెప్పారు.

అరబిక్ ను బోధించే తన తల్లి కిడ్నాప్ అయిన వారిలో ఉండి ఉంటారని ఊహిస్తున్నట్టు నోమి సాగీ బీబీసీ రేడియో 4 కు చెప్పారు.

నోమి సాగీ లండన్‌లో నివసిస్తున్నారు.

‘‘ఆమె సేఫ్ రూమ్‌లో ఉన్నారనుకున్నా. కానీ ఆమె అక్కడ లేరు’’ అని చెప్పారు.

‘‘ ఆమె మృతుల జాబితాలో లేరు. గాయపడినవారి లిస్టులోనూ లేరు. ఈమె నివసించే ప్రాంతం ఓ చిన్నకమ్యూనిటీ. మొత్తంగా 350 మంది ఉంటారు. వీరంతా ఒకరికొకరు తెలుసు’’ అని అన్నారు.

వృద్ధులు, యువకులను అపహరించారని ఈ కమ్యూనిటీ రిపోర్ట్ చేసిందని, తన తల్లి ఆచూకీకి సంబంధించిన సమాచారమేదీ లేదని సాగీ చెప్పారు.

తన తల్లికి ఇటీవలే తుంటి రిప్లేస్‌మెంట్ జరిగినందున ఎక్కువ దూరం పరిగెత్తలేదన్నారు. ఈ దాడి అంతా హర్రర్ సినిమాను తలపిస్తోందన్నారు.

‘‘యూకేలోని అందమైన గ్రామీణ ప్రాంతాలలో హాయిగా మీ జీవితం మీరు గడుపుతున్నప్పుడు, మీ ఇంటి నుంచి మిమ్మల్ని బలవంతంగా బయటకు లాక్కొస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి’’ అన్నారు సాగీ.

‘‘ ఇది అబద్ధంలానూ, అమానవీయంగాను అనిపిస్తుంది. ఇలాంటివి జరుగుతాయా అనే విషయం కూడా ఆలోచించలేం. యుద్ధంలోనైనా కొన్ని నియమాలు ఉంటాయి. కానీ ఓ 20, 30 సంవత్సరాల యువకులు ఓ వృద్ధురాలితో పాటు ఆమె ఇరుగుపొరుగు వారిని బయటకు లాక్కురావడం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తోంది ’’ అన్నారు సాగీ.

తన తల్లికి మందుల అవసరం ఉందని ఆమె గురించి భయపడుతున్నాని నోమీ సాగీ చెప్పారు.

ఆయన భార్య మిచెల్ కూడా బీబీసీతో మాట్లాడుతూ తన అత్తగారికి అలర్జీలు ఉన్నాయన్నారు.

‘‘మందులు లేకుండా ఆమె ఎంతకాలం ఉండగలరో మాకు తెలియదు.’’ అని మిచెల్ చెప్పారు.

తన తల్లి 75వ పుట్టినరోజు నాటికి లండన్‌ వస్తుందని ఎదురుచూస్తున్న వేళ ఇలా జరిగిందని సాగి తెలిపారు.

తన తల్లిని మరోసారి చూడగలుగుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

షారోన్ లిఫ్‌షిజ్
ఫొటో క్యాప్షన్, షారోన్ లిఫ్‌షిజ్

‘ఏదీ మిగల్లేదు’

ఆడా సాగీలానే వృద్ధులైన తన తల్లిదండ్రులను కూడా గాజా సమీపంలోని అదే కమ్యూనిటీ నుంచి తీసుకుపోయారని షారోన్ లిఫ్‌షిజ్ చెప్పారు.

షారోన్ లిఫ్‌షిజ్ కూడా లండన్‌లోనే నివసిస్తున్నారు.

‘‘వారు (మిలిటెంట్లు) ప్రజలు బయటకు వచ్చేందుకు ఇళ్ళు తగులబెట్టారని చెపుతూ ప్రజలు దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి రక్షణ గదులలో తలదాచుకున్నారు’’ అని ఆమె వివరించారు.

‘‘ ఆ ప్రాంతమంతా అస్తవ్యస్తమై పోయింది. ఏదీ మిగిలినట్టుగా కనిపించలేదు’’

ఆడా సాగీ లానే లిఫ్‌షిజ్ తండ్రి కూడా అరబిక్ మాట్లాడతారు.

వైద్య అవసరం ఉన్న పాలస్తినీయులను ఆస్పత్రులకు తరలిస్తూ ఆయన తన విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు.

ఆయనకు మానవత్వంపై నమ్మకం ఉంది. అందరితో కలిసి పనిచేయాలని నమ్మేవారని లిఫ్‌షిజ్ చెప్పారు.

ఇజ్రాయిల్, పాలస్తీనా విడిపోయాయని చెప్పడానికి చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇరు పక్షాలు కూడా అవతలి వారు మనుషులే అన్న విషయాన్ని గుర్తించాలి.

‘‘నాకు శాంతిపై నమ్మకం ఉంది. నా తల్లిదండ్రులు క్షేమంగా తిరిగొస్తారనే విశ్వాసం ఉంది’’ అని లిఫ్‌షిజ్ చెప్పారు.

జర్మన్ పర్యాటకురాలు షనీ లౌక్

ఫొటో సోర్స్, SHANI LOUK'S INSTAGRAM

ఫొటో క్యాప్షన్, జర్మన్ పర్యాటకురాలు షనీ లౌక్

‘కారులో అపస్మారకంగా..’

హమాస్ మిలిటెంట్లు గాజా బోర్డర్ వద్ద విరుచుకుపడి, మ్యూజిక్ పార్టీ చేసుకుంటున్న వారిపై కాల్పులు జరిపారు.

ఆ సమయంలో జర్మన్ పర్యాటకురాలు షనీ లౌక్ అక్కడ జరుగుతున్న ఉత్సవానికి హాజరయ్యారు.

షనీ లౌక్ ను బందీగా తీసుకువెళ్ళాకా ఆమె వీడియోను చూసినట్టు తల్లి రికార్డా చెప్పారు.

దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ కిడ్నాప్ చేసిన పర్యాటకుల బృందంలో తన కుమార్తె కూడా ఉందంటూ రికార్డా తన 20 ఏళ్ళ కుమార్తె ఫోటోను చూపుతూ సోషల్ మీడియాలో చెప్పారు.

‘‘మాకో వీడియో పంపారు. గాజా స్ట్రిప్ చుట్టూ తిరుగుతున్న కారులో నా కుమార్తె అపస్మారకంగా పడి ఉండటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

దీనికి సంబంధించి మీరు మాకేదైనా సహాయం చేయండి.. లేదా సమాచారాన్ని ఇవ్వండి’’ అని ఆమె విజ్ఞప్తి చేశారు.

మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరైన మరో యువతి కూడా కిడ్నాప్ అయి ఉండవచ్చని బీజింగ్‌లోని ఇజ్రాయిల్ ఎంబీసీ చెప్పినట్టుగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా పత్రిక రిపోర్ట్ తెలిపింది.

ఈమెను ఇజ్రాయెల్లో పుట్టిన చైనీయురాలు నోవా అర్గామనిగా భావిస్తున్నారు.

ధృవీకరించని ఓ వీడియో ఫుటేజ్‌లో పాతికేళ్ళ అమ్మాయిని మిలిటెంట్ల మోటారుబైక్ పై తీసుకువెళుతున్న దృశ్యం భయం గొలుపుతోంది.

‘‘నన్ను చంపకండి’’ అని ఆ యువతి వేడుకుంటోంది.

‘మా అమ్మమ్మ అక్కడే ఉంది’

‘ఆమె ఓ మంచి అమ్మమ్మ. ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో ఉంటుంది. చాలా సరదా మహిళ’ అంటూ తన 85 ఏళ్ళ అమ్మమ్మ గురించి యఫ్పా అడార్ గురించి అద్వా అడార్ వర్ణించారు.

‘అక్కడ ఉన్నది మా అమ్మమ్మే’అంటూ గోల్ఫ్ కారులో గాజా వీధులలో ఊరేగింపును చూసి తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.

తన అమ్మమ్మ గురించి భయపడుతున్నట్టు స్కైన్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడార్ చెప్పారు.

ఆమె దగ్గర మందులు లేవని, ఆమె ఎంతకాల బతికి ఉంటుందో తనకు తెలియదని చెప్పారు.

ఇజ్రాయెల్‌పై దాడులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

థాయ్ కార్మికుల కిడ్నాప్

గాజా సరిహద్దు వద్ద మిలిటెంట్లు భీకరదాడులు చేసిన ప్రాంతంలో పనిచేస్తున్న థాయ్ కార్మికులనూ కిడ్నాప్ చేశారు.

తమ దేశానికి చెందిన 11 మంది కనిపించడం లేదని థాయ్‌లాండ్ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.

మిలింటెంట్లు బందీలుగా తీసుకుపోయినవారిలో తన భర్త అన్చాఅంక్వే కూడా ఉన్నట్టు, అతను రెండేళ్ళుగా అవకాడో క్షేత్రంలో పనిచేస్తున్నాడని వనిడా మార్సా బీబీసీ థాయ్‌కు చెప్పారు.

వారాంతంలో హమాస్ విడుదల చేసిన వీడియోలో ఆయన కనిపించారు. ఆ వీడియోలో ఉన్నది కచ్చితంగా ఆయనే అని ఆమె తెలిపారు.

‘‘ఆయనతో మాట్లాడేందుకు బ్యాంకాంక్ సమయం 02:00 నుంచి ప్రయత్నిస్తున్నాను. కానీ, కుదరడం లేదు. మా అమ్మాయి నిద్రపోయేముందు మేము ఆయనతో మాట్లాడాం’’ అని వనిడా మార్సా చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆహారం, నీరు, కరెంటు, ఇంధనం అందక దారుణమైన పరిస్థితుల్లో గాజావాసులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)